Previous Page Next Page 
జీవనకలశం పేజి 5

                                 


    టేబుల్ లైటు దగ్గర మిత్రుడి వుత్తరం మళ్ళీ చదవటానికి కూర్చున్నాడు.
    "నిన్ను పెళ్ళిచూపులకి రమ్మన్నానుగాని పెళ్ళి చేసుకోమనలేదుగా అంత మునిగిపోయే అర్జంటుపని యేమిటీ అసలు రోడ్లు సర్వే చేయటం ఆ వెంకటేశ్వర్లుగాడి కిల్లీకొట్టులో బాతాఖానీ కొట్టటం అదేగా ముంచుకుపోయే పని"
    రాఘవరావు కాస్త గట్టిగానే అన్నాడు.
    అన్నగారు మాట్లాడే ప్రతిమాటకీ ఘాటుగా జవాబివ్వాలనే వుంటుంది మనస్సులో కాని జవాబు గొంతులోనే వుండచుట్టుకుపోతుంది.
    శ్రీలక్ష్మి "విజయచిత్ర" చదువుతూ కూర్చుంది.
    అన్నగారి మాటకి జవాబివ్వకుండానే వాసు వుత్తరం మడిచి కవర్లో పెట్టి దిండుకింద దాచేసి ఆవలిస్తూ పడుకున్నాడు.
    కాని వాసుకి నిద్రవచ్చేలా లేదు.
    ప్రియురాలి ప్రేమలేఖలా అన్నిసార్లు చదివావు. ఏమిటీ విశేషం
    వాసు నవ్వుతూ జవాబిచ్చాడు వదినగారికి.
    "వదినా ఇలాగే ఇంకా కొన్నిరోజులు ఇప్పుడు వెలువడే సాహిత్యం చదివేస్తున్నావంటే నువ్వే ఓ పెద్ద రచయిత్రివి అయిపోతావు"
    ఏం పరిహసిస్తావులేవయ్యా....నువ్వేం భయపడక్కరలేదు నేను ఈ జన్మలో కాదు. మరో పది జన్మలెత్తినా రచయిత్రిని కాలేను. నేనేమన్నా గొప్ప గొప్ప ప్రబంధాలూ గట్రా చదివావా పాడా....ఏదో కాలక్షేపం కోసం ఇవన్నీ చదవటం అలవాటయిందిగాని.
    "ఇప్పటి రచయితలూ" రచయిత్రులూ గొప్ప ప్రబంధాలేమీ చదవకుండానే పెద్దరచయితలయిపోతూంటే..."
    వాసు వదినని ఇలా వుడికించి ఆనందిస్తూ వుంటాడు అప్పుడప్పుడూ "నేను రచయిత్రిని తర్వాత అవుతానుగాని. నేను అడిగిన సంగతి దాటేసి మరోమాట పట్టుకున్నావ్" చెప్తేచెప్పు. లేకుంటే హాయిగా వెళ్ళి పడుకుంటాను"
    "చెప్పానమ్మా తల్లీ.... కూర్చో" అంటూ తనూ లేచి కూర్చుని చెప్పటం మొదలు పెట్టాడు.
    మన విశ్వం వున్నాడే వాడిప్పుడు పెద్ద "హీరో" అయిపోయాడు.
    "నిజంగా.... ముఖం ఏం బాగుంటుందీ...తలకు మాసిన యే డైరెక్టర్ తీసుకున్నాడబ్బా ఇతన్ని"
    ఆశ్చర్యంగా అడిగింది శ్రీలక్ష్మి.
    "అబ్బ....హీరో అంటే సినిమా హీరోయేనా .....కాదు జీవితంలో హీరో.....బాంబే వెళ్ళి ఎలా సంపాదించాడోగాని వ్యాపారంలోకి దిగాడుట. కనీసం నెలకి ఓ రెండువెలు లాభం వస్తోంది అందాజుగా అంటూ రాశాడు."
    "పెట్టుబడికి సొమ్ము ఎలా వచ్చిందీ రాశాడా?"
    "అది నువ్వడక్కూడదు. నేను చెప్ప గూడదు...
    "నువ్వు చెప్పకున్నా నేను తెలుసుకోలేనూ. లాటరీలోనైనా రావాలి... రేస్.... లోనైనా గెల్చి వుండాలి. లేకుంటే దొంగనోట్లయినా అచ్చు వేస్తూ వుండాలి. లేకుంటే ఈ రోజుల్లో డబ్బెలా వచ్చి పడుతుంది బాబూ లక్షాధికారి కావటం మాటలా?
    వదిన చాలా తెలివిగానే ఆలోచిస్తుందే అనుకున్నాడు వాసు.    
    "నా కింక నిద్రవస్తోంది బాబూ" అంటూ లైటుతీసి తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది.
    అన్నా, వదినల మాటలు నన్న సన్నగా విన్సి స్తున్నాయి.
    భార్యా భర్తలు అలా మాట్లాడుతూవుంటే వినకూడదు అనుకుని చెవుల్లో వేళ్ళు దూర్చి దుప్పటి క్రిందనించి పైకి ముసుగుపెట్టేశాడు. అసలే గాలి లేనందువల్ల వుక్కపోసి చెమటతో వళ్ళంతా తడిసిపోతూ వుంటేకూడా చెవుల్లో వుంచిన వేళ్ళుగాని బిగించి కప్పుకున్న దుప్పటి కాని కాస్తకూడా కదిలించకుండా అలాగే బిగపట్టుకుని పడుకున్నాడు వాసు.

                             *    *    *

    మాలతి పనిచేసే సినీమా హాలులో "జగజ్జట్టీలు" రిలీజైంది. వుదయం మ్యాట్నీనించే విపరీతమైన రద్దీగా వుంది. క్యూలోని జనాన్ని పోలీసులు అదుపులో వుంచలేక పోతున్నారు.
    టిక్కెట్లు ఇవ్వడం. డబ్బు తీసుకుని చిల్లర ఇవ్వడంలో చాలా జాగ్రత్తగానే వుంది మాలతి పోలీసులు వారిస్తూన్నా వెనక్కి తగ్గని ప్రజావాహిని వెల్లువలా విరుచుకుపడింది.
    ఓ గంటసేపు ఏం జరుగుతున్నదో అర్ధం కాలేదు.
    రాళ్ళ వర్షం కురిసి అద్దాలతలుపులు ముక్కలు ముక్కలైనాయి. అదనపు పోలీసు సిబ్బంది ఆ రంగంలో ప్రవేశించగానే జనం చెదరిపోయారు. బైట గొడవ జరుగుతున్నా పోలీసులు అదుపులోకి తేగలిగారు?
    మాలతి భయంతో బిగుసుకుపోయిది. తన జీవితంలో యెప్పుడూ ఇంతమంది జనం పోగవటంగాని వాళ్ళా క్షణంలో యెంత అల్లరికి పాల్పడేదిగాని ఎరుగదు. తను తిరిగి సురక్షితంగా ఇల్లు చేరుకుంటుందని అనుకోలేదు.
    సినిమా మొదలవటంతో జనం గోలతగ్గి ప్రశాంతపడింది కాస్త.
    డబ్బు లెక్కపెట్టుకుంటూనే కెవ్వుమంది మాలతి.

                             *    *    *

    కిల్లీ కొట్టు వెంకటేశ్వర్లుతో బాతాఖానీ దంచుతున్న తమ్ముడిని "వాసూ" అంటూవచ్చాడు రాఘవరావు స్కూటర్ లో.
    అన్నగారిని చూస్తూనే హెడ్మాష్టర్ ని చూసిన విద్యార్ధిలాగా మెల్లగా దగ్గరకివెళ్ళారు.
    "ఇంటికి వెడదాం ఎక్కు" ఇంక అన్నగారి వెనుక కూర్చోక తప్పలేదు వాసుకి.
    "ఏదో అర్జెంటు కేసే" అనుకున్నాడు వెంకటేశ్వర్లు.
    వరండాలో నడుంమీద చేతులు పెట్టుకుని సాక్షాత్తూ మహాలక్ష్మి లాగా నిలబడి వుంది శ్రీలక్ష్మి. స్కూటర్ మీద వచ్చే ఆ అన్నదమ్ముల నిద్ధరినీ కనుల కరువుతీరా చూస్తూ:
    'అచ్చంగా రామలక్ష్మణుల్లా వున్నారు" అనుకుంది మనసులో.
    నిజంగానే ఆ యిద్దరూ ఒకే పోలికలో వుంటారు. రాఘవరావు వాసుకంటే కాస్త వయసులో పెద్దగనుక కొంచెం లావుగా కన్పిస్తాడు.
    "వాసూ నా పెళ్ళికి మీ అన్నయ్య అచ్చంగ నీలానే వుండేవారు. ఇప్పుడంటే బట్టతల అయిందనుకో.... నీ జుట్టుకంటే కూడా చాలా వత్తుగా వుండేది" అంటూవుంటుంది శ్రీలక్ష్మి.
    వదిన అలా అంటూంటే వాసుకి తగని సిగ్గుగా వుంటుంది. ఓ వైపు భయంగానూ ఉంటుంది. నేనూ అన్నయ్యంత అయితే లావుగా మారి బట్టతల అయి.... అచ్చంగా అన్నయ్యలా వుంటానా బాబోయ్ వద్దు వద్దు అనుకుంటాడు. అన్నయ్యలాంటి తన రూపం వూహించుకొనటానికే ఇష్టంలేక.
    స్కూటర్ దిగుతూనే వదినగారి పట్టుచీరె రాళ్ళనెక్లెసూ చూస్తూనే అన్నయ్య తనని ఎందుకు కట్టి పట్టుకువచ్చాడో అర్దమైంది వాసుకి.    
    ఇష్టంలేకున్నా బట్టలు మార్చుకుని తయారు కాక తప్పలేదు వాసుకి. మామూలుగా పాంటూ. షర్టూ వేసుకుని తయారైన తమ్ముడిని ఒక్కసారి చూసి "శ్రీ నీకు బొత్తిగా బుద్దిలేదు. వాడిఅవతారం ఆ బట్టలూ ఏమిటి. నువ్వన్నా చెప్పలేవు అంటూ పెళ్ళికొడుకు అన్నగార్ని అన్నట్లు "సూట్" వేసుకుని అద్దంలో మరోసారి తనని తను చూసు కుంటున్న భర్తని చూస్తూ అంది శ్రీలక్ష్మి.
    "కొంపతీసి మిమ్మల్ని చూసి పెళ్ళికొడుకు అనుకోగలరు. ఏమిటా ముస్తాబు. మూడుగంటల నించీ"    
    "ఎంత అసూయ? అయినా పక్కన అమ్మ గారిని నువ్వు వుండగా ఎవ్వరూ అనుకోలేరులే. ఒక వేళ అలా అనుకున్నారే అనుకుందాం పోయింది యేముందీ... వాసూ........ నేనూ యెలాగో ఒక..."
    "ఆ ఆ ....ఆగండి. నేను అంతవరకూ రానిస్తానా... అయ్యో మీ తెలివి తెల్లవారా...ఆయన నలభై నాలుగు సార్లా పెళ్ళిచూపులంటూ వెళ్ళి నచ్చక....నలభై అయిదోసారి ఓ అమ్మాయిని చూసి అంతలోనే మూర్చపోయి, లేచి ఆ పట్నం.....ఈ అమ్మాయినే చేసుకుంటా లేకుంటే ఆజన్మ బ్రహ్మచారిగా వుంటా" అంటూన్న భార్యని "ఆపు" అంటూ నీ పురాణం విప్పావంటే ఇక్కడే చేస్తావు ముఫ్ఫై మూడు పెళ్ళిళ్ళు, వెళ్ళు వెళ్ళి నీ అనుంగు మరిదిని నే చెప్పిన "సూట్" వేసుకుని అయిదు నిమిషాల్లో తయారుకమ్మను నేను వెళ్ళి "టాక్సీ తెస్తా" నంటూ "టై" మరోసారి సరిగా వుందో లేదో చూసుకుంటున్న భర్తని మరీ వుడికిస్తూ..."ఏం కలికాలమండీ.....పెళ్ళికొడుక్కి అన్న ముస్తాబుకు గంటన్నరా....అదే పెళ్ళికొడుకు అయిదు నిమిషాలూ." మాలతి మూడు వంకర్లు తిప్పింది శ్రీలక్ష్మి. "మాటలు చెప్పమంటే అంటూ భార్య అలంకరణని పరిశీలిస్తూ ఆ ముడీ కంచి పట్టుచీరా....అబ్బ.....ఎలా వున్నావో నలభై ఏళ్ల దానిలా. జడలేసుకుని పువ్వులు పెట్టుకుంటే యేం పోయిందీ"
    శ్రీలక్ష్మినే చూస్తూ తన పెళ్లినాటి విషయాలే గుర్తు వస్తూంటే అన్నాడు రాఘవరావు.
    "అయ్యో రామ ఆడవాళ్ళం ఎంత అస్వతంత్రులమైనా కట్టూబొట్టూలోకూడా మీ పెత్తన మేనా! ఇంక మీ ఆటలు సాగవు. ఈ నెల నుండీ మహిళా సమాజంలో చేరుతున్నాను. లక్షణంగా పెళ్ళికొడుకు వదినగారంటే కణుం రెవికా. కంచి పట్టుచీరా బర్మాముడి దానిమీద తట్టెడు చామంతి పూలూ ఆ బరువుకి ముడి వూడి పిన్నులు జారిపోతూవుంటే ఆడపిల్లవాళ్ళు ఆ పిన్నులు నొక్కడానికి కూడా సహాయపడవలసిందే. మనం మగపెళ్ళివారం గనుక..." అభినయిస్తూ చెప్తున్న భార్యని అమాంతం దగ్గరకి లాక్కున్నాడు రాఘవరావు.    
    భర్త అంత పని చేస్తాడని యే మాత్రం వూహించని శ్రీలక్ష్మి "అయ్యో ఏం పనీ ఆవతల వాసూ"
    టక్కున విడిచేశాడు.
    కాస్త దూరంగా వెళ్ళి భర్తని నాలిక బైట పెట్టి వెక్కిరించింది. శ్రీలక్ష్మి. అలా వెక్కిరిస్తున్న భార్యను వదిలి అసలు ఈ పెళ్ళి చూపులకి వెళ్ళబుద్ది కావటం లేదు. కాని తప్పదు ఇప్పటికే వాళ్ళు ఎదురుచూస్తూ వుంటారు. భార్యని చూస్తూ మెల్లిగా అన్నాడు.
    నాకే మస్కావేస్తావుగదూ వచ్చింతర్వాత....అప్పుడు చూద్ధువుగాని.... ఏం జరుగుతుందో "అని ఆ ముఖాన్ని ఒక్కసారి గంభీరంగా మార్చేసుకుని "వాడిది ఇంకా అయిందోలేదో చూడు. నేనెళ్ళి కారు తెస్తాను" అంటూ క్రిందికిపోయాడు రాఘవరావు.
    పిల్లలిద్ధరినీ పనిమనిషికి అప్పగించి భర్తతో మరదితో పెళ్ళిచూపులకి సిద్ధమైన శ్రీలక్ష్మి వాసుని యేడిపిస్తూ.
    "పెళ్ళికూతుర్ని ఇంటర్వ్యూ యెలా చెయ్యాలి అసలక్కడ ఎలా కూర్చోవాలి. వాళ్ళిచ్చే టిఫినూ కాఫీ కాస్త తిని ఎలా వదిలేయాలో అంటూ ఏకరువు పెట్టేస్తుంటే వాసు నవ్వుతూ.
    "పెట్టిన టిఫిను చస్తే వదలను. అంతా తినేసి ప్లేటు నాకేస్తాను. ఇంకా కావాలా అంటే 'వూ' అంటాను. నాకు వచ్చిన కోతి చేష్టలన్నీ చేసేస్తాను. చేసి తీరతాను. అన్నీ మీ ఇష్టప్రకారం చేస్తే. ఇంక నా యిష్టం చూపిస్తాను. నా కిప్పుడే పెళ్ళి వద్దు అని మొత్తుకుంటే విన్నారూ మీరిద్దరూ.... అందుకే..."

                  
    శ్రీలక్ష్మి కళ్ళు తేలేసింది.
    "కొంపదీసి నిజంగానే ఇవన్నీ చేస్తావా వాసూ"
    "ఖచ్చితంగా చేస్తాను. "చెప్పులు వేసుకుంటూ అన్నాడు వాసు.    
    "అలా చేస్తే....ఇంటికి వచ్చింతర్వాత మీ అన్నయ్య నన్ను బ్రతకనిస్తారా" గుండెపట్టుకు కూలబడింది శ్రీలక్ష్మి.
    "శ్రీ......పెళ్ళివారు కారు పంపారు. ఆ పిల్ల మేనమామ ను కూడా వచ్చాడు. ఇందాకటినించీ వణుకుతున్నావుగా. ముగ్గురం వెళ్ళకూడదు. ముడిపడదు" అంటూ పదండి అంటూ భర్త తొందరచేస్తే మరోసారి అద్దంలోకి చూసుకుని కదిలింది శ్రీలక్ష్మి.
    అన్నగారి మీద కోపం వున్నా తలవంచి కారు ఎక్కడ తప్పలేదు వాసుకి.
    "గురూ పెళ్ళికూతురెలా వుంది." కోకోకోలా బాటిల్ త్రాగమని అందిస్తూ ప్రేమగా అడిగాడు వెంకటేశ్వర్లు.
    "పెళ్ళికూతురు ఎలావుంటే యేం. పదిహేను వేలు కట్నం. ఈ భాగ్యనగరంలో ఓ చిన్న మేడలో మా ఇంట అపరమాణిక్యంలా అడుగు పెట్టటానికి అనుజ్ఞ కోసం పరితపిస్తున్న ఆ కన్యారత్నం ఎలా వుంటుందని అడగవద్దు, నే చెప్పవద్దు.

 Previous Page Next Page