Previous Page Next Page 
ఎండమావులు పేజి 5

                                 


    వదిన గారు ఇట్లా ఎందుకు మాట్లాడు తున్నదో శ్రీ లక్ష్మికి అర్ధంకాలేదు. తనేమయినా పొరపాటున అన్నదేమోనని ఎంత ఆలోచించినా శ్రీలక్ష్మి మనస్సుకేమీ తట్టలేదు.
    "అది కాదమ్మా వదినా. మీ అమ్మగారు స్నానానికి నన్ను కూడా పిలిస్తే ఏం పోయింది చెప్పు. ఏ వయస్సులో ఉండ వలసిన సుఖ సంతోషాలు ఆ వయస్సులో లేక పోయినా ఈ పర్వదినాలో స్నానం కూడా మీతో కలిసి చేసే యోగం నాకు లేదా" అన్నది గౌతమి.
    శ్రీలక్ష్మికి అర్ధమయింది. తనను కూడా స్నానానికి పిలవలేదనే కోపం కామాలు.
    "ఈ కార్తీక మాసంలో మాతో బాటు ప్రతి నిత్యమూ నువ్వు రావటంలేదు కదు వదినా. ఎందుకని వస్తావో రావోనని అమ్మ చెప్పలేదు. ఈ చిన్న విషయానికి అంత పట్టింపెందుకు వదినా. నీ బట్టలు కూడా ఇవ్వు బుట్టలో సర్దుతాను" అన్నది శ్రీలక్ష్మి.
    "అంతహోదా నాకు అక్కర్లేదమ్మా అయోగ్యతే ఉంటే మీ అన్నయ్య ఉద్యోగమే చేస్తూ ఉండే వారు. కాక పోయినా ఉద్యోగం లేని వాళ్ళకి ఇంత కన్న గౌరవ మర్యాదలు ఎందుకుంటాయి. కనీసం వితంతువైన నీకున్న అధికారం కూడా ఈ ఇంట్లో నాకు లేదు." అంటూనే వెళ్ళింది గౌతమి.
    ఒక్క బాణం శ్రీలక్ష్మి గుండెల్లో నుంచి దూసుకు పోయింది. గౌతమి తత్వం శ్రీలక్ష్మికి బాగా తెల్సు. ఎప్పుడూ ముఖంతో కోపమూ, అశాంతి తాండవిస్తూ ఉంటయ్యి, ఏ మాటన్నా ఆవిడకు తప్పుగానే తోస్తుంది. అంచేత ఎవ్వరూ గౌతమిని ఏమీ అనరు. కొంత మందయితే పలక రించరు కూడా. గౌతమి ఇంటరు ప్యాసయింది. తన వైవాహిక జీవితం మూడు పూలూ, ఆరుకాయలుగా వెళ్ళిపోవాలని ఆశించింది. ఆవిడ మనస్సు కోరికల పుట్ట. ఆ పుట్టలో నుంచి అనేక రకాలయిన పాములు బుసలు కొడుతూ వస్తయ్యి. ఒక్కొక్క వ్యక్తి మీద ఒక్కొక్క పాముని వదుల్తూ ఉంటుంది. కాని కాలానుగతంగా ఎదుటి వారి చేతులో ఆ పాములు చచ్చిపోతూనే ఉంటయ్యి. ఆ పాములన్నీ అట్లా చచ్చిపోతున్నా ఏ జోక్యమూ కలిగించుకోకుండా ఊరుకో లేదు.
    గౌతమి ఎప్పుడూ సంఘర్షణ పడేది శ్రీలక్ష్మి తోనే. శ్రీలక్ష్మి ఎంత తప్పుకు తిరుగుతున్నా గౌతమి ఏదో ఒక పుల్ల విరుపుమాట అంటూనే ఉంటుంది.
    గౌతమి వెళ్ళాక శ్రీలక్ష్మి తన పక్కమీద పడుకుంది. రాత్రంతా ఆలోచనలతోనే నిద్రపట్టలేదు. అనవసరమైన ప్రస్థావన చేసి ఆమె హృదయంలో లేనిపోని కలత కలుగజేసింది గౌతమి. ఆమె అన్న మాటలు చెవుల్లో ఇంకా ప్రతి ధ్వనిస్తూనే ఉన్నయ్యి.
    "వితంతువైన నీకున్న అధికారం కూడా నాకు లేదు" అన్నది గౌతమి. ఎవరు ఎవరికి అధికారి. భర్త భార్యకు అధికారా? తండ్రి తల్లికి అధికారా! ఆడుబడుచు వదినగారికి అధికారా? అత్తగారు కోడలుకి అధికారా! ఈ ఇంట్లో అవ్వేమీ లేవే అదిగాక తనని వితంతువని నొక్కి చెప్పటం ఎందుకు? తాను వితంతువుగా పుట్టిల్లు చేరటం తన నేరమూ? రెవిన్యూ ఇనస్పెక్టరు చేస్తూ క్యాంపు నుంచి సైకిలు మీద వస్తూండగా లారీకి గుద్దుకుని తనభర్త అకస్మాత్తుగా పోవటం తన నేరమా? తలుచుకుంటే గుండె చెరువై పోతుంది. తనకు పూలంటే, అందులోనూ మల్లెపూలంటే, ఎర్ర గులాబీలంటే ఎంతో ఇష్టం ఆ పూలు తల్లో తురుముకున్న వాడు తనను తానే మర్చిపొయ్యేది. తనకోసం, తనను సంతోషపర్చటం కోసం ఆ రోజున క్యాంపు నుంచీ వస్తూ పెద్ద పూల పొట్లాం సంచీలో ఉంచి తీసుకొస్తున్నారు. అకాల మృత్యువు వారిని పొట్టన బెట్టు కొని కూడా, జీవితాంతం తనని కుమిలి, కుమిలి ఏడవ మన్నట్టుగా సంచీలోని ఆ పూల పొట్లం అట్లాగే రోడ్డు పక్కన పడి ఉన్నది. ఆఖరు సారిగా ఆయన చేతిమీదగా తెచ్చిన పూల పొట్లాం ఆ తీరుగా, తనను జీవితాంతం వెక్కిరిస్తూ వెళ్ళి పోయింది. అదీ తన తప్పేనా?
    ఆ రోజున తన స్వామి వస్తారని కళ్ళు కాయలు కాసేటట్లుగా ఎదురు చూసి అర్ధరాత్రి దాటినా రాకపోయేసరికి ఇంక రారనుకుని నిరాశతో కన్నుమూసింది. భళ్ళున తెల్లవారింది. పిడుగులాంటి వార్త. ఈ మహాసృష్టిలో తన భర్తకు శాస్వతంగా స్థానం లేకుండా పోయింది. తన ముఖం మీద కుంకుమకు స్థానం లేకుండా పోయింది. భర్త చావుతో అత్తవారింట్లో ఏ మాత్రం స్థానం లేకుండా పోయింది. కొడుకు బ్రతికి ఉన్నంత వరకే తను వారి కోడలు. ఆయన పోయాక తనకు ఆ ఇంట్లో ఎంత మాత్రమూ ఎవ్వరూ చోటివ్వలేదు. ఇంత సువిశాల ప్రపంచాన్ని, ఇన్నిరకాల జీవరాసులని, మానవకోటిని సృష్టించిన సృష్టి కర్త తనకు ఎక్కడా స్థానం లేకుండా చేశాడు.
    ఇదంతా తను కావాలని చేసుకున్నదా, వితంతువుగా వచ్చి పుట్టింట్లో తనకు స్థానం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో చేసిందా? అంత నీచత్వమైన ఉద్దేశ్యం ఏ హైందవ స్రీకీ ఉండదే? ఈ పుట్టింట్లో అధికారం కోసం తన జీవితంలో ఎప్పుడూ ఆశించలేదే? అందరికీ స్వార్ధ రహితమైన సేవచేస్తూ, వృద్దాప్యంలో తల్లి దండ్రులకూ, వారితోపాటు మిగతా వారికీ ఇంత ఉడకేసి పెడుతూ చేదోడుగా ఉంటున్న తనకా అధికార కాంక్ష?
    ఈ విధంగా ఆలోచించుకునే సరికి శ్రీలక్ష్మికి పట్టరాని దుఃఖం పొంగి పొర్లు కొచ్చి అభిమానంతో నెత్తి బాదుకుంది శ్రీలక్ష్మి. అభిమన పూరిత మైన నిరాశా మేఘాలు ఆమె ముఖంలో దట్టంగా కమ్ముకుని వర్షించినయ్యి.
    గడియారం ముళ్ళు తను చూస్తుండగానే నాలుగున్నర దగ్గర చేరినయ్యి. జీవితమే ముళ్ళ గడియారం. ఆలోచనలే నిముషాలూ, సెకండ్లూ, స్థిత పజ్ఞత్వంతో కూడిన నిశ్చయాభిప్రాయాలే గంటలు, సహృదయతతో చేసే మన చేష్టలే గడియారపు ముళ్ళు. దైవచింతతో మనం చేసే ప్రార్ధనలే గంటలు కొట్టటం.
    నాలుగున్నర కాగానే శ్రీలక్ష్మి కళ్ళు తుడుచుకులేచింది. కుండపోతగా కుర్శిన వర్షానంతరపు శ్రావణ మాసంలోని నీలాకాశంలా ఉంది శ్రీ లక్ష్మి మనస్సు.
    
                                *    *    *

           

    తల్లితో కూడా నదికి స్నానానికి వెళ్ళింది. మళ్ళీ తనంతట తానుగానే వచ్చి అత్తా, ఆడబిడ్డలతో కలిపి తనూ స్నానానికి వెళ్ళింది గౌతమి.
    అరటిదొన్నెల్లో ఆవునేతి దీపాలు వెలిగించి ముగ్గురూ నదిలో వదిలి పెట్టారు. జ్వాజ్వల్య మానంగా వెలుతురూ ప్రవాహ వేగాన ఒకదాని పక్కన మరొకటిగా మూడు దుప్పలూ వెళ్ళివయ్యి. మధ్యలో ఏదో కర్ర ముక్క అడ్డుకుని గౌతమి వదలిన దీపకళికల అరటి దొన్నె పోలేదు.
    అక్కడక్కడే సుళ్ళు తిరిగి ముణిగి పోయింని.
    "వదిలి పెట్టిన దీపాలన్నీ భగవంతునీ సన్నిధికి చేరవు" అనుకుంది శ్రీలక్ష్మి మనస్సులో.
    "ఈ సంసార సాగరంలో నా జీవన జ్యోతి కూడా ఇట్లాగే సుళ్ళు తిరుగుతుంది కామాలు" అనుకుంది గౌతమి.
    వీళ్ళకు కొద్ది దూరంలోనే స్వాతి కూడా తన దీపకళికల దొన్నె వదిలి పెట్టింది. నిర్మలంగా, నెమ్మదిగా ఏ వొడుదుడుకులూ లేకుండా తెల్లగా బంతి పువ్వులా వెలుగుతున్న ఆ దీపాల దొన్నె ఆ స్వామి దగ్గరకే వెళుతున్నది అన్నట్లుగా ఆ నదీ ప్రవాహంలో పయనించింది.
    ఎవళ్ళూ ఒకరి నొకరు చూసుకోలేదు.
    ఇంటికొచ్చాక గౌతమి అత్తగారితో అన్నది "ఆ కార్తీక దీపాలన్నీ ఆ పరమాత్ముని సన్నిధికే వెళతయ్యా" అని.
    అత్తగారేమీ సమాధానం చెప్పలేదు. ఆవిడకు కోడలు సంగతి తెలుసు. శ్రీలక్ష్మి అన్నది.
    "వెళతయ్యి వదినా, మన మనస్తత్వాల్ని బట్టే, మనం చేసే పాప పుణ్యాల్ని బట్టే వెళతయ్యి మధ్యలోనే కొండెక్కే దీపాలు కొన్ని, సుళ్ళు తిరిగి సుడి గుండాల్లో ముణిగి పోయేవి కొన్ని"

 Previous Page Next Page