Previous Page Next Page 
రెండోమనసు పేజి 5


    నర్సరాజు ఇంటి బయటే నిలబడి తనకోసం ఎదురు చూస్తూ కనిపించాడు. "ఇప్పుడే అనుకుంటున్నాను . ఇంకా రాలేదే మిటా అని."
    "ఇల్లు చూసి అడ్వాన్స్ ఇచ్చి అప్పుడు మీ ఇల్లు వెతుక్కుంటూ చేరుకునే సరికి ఈ వేళయింది. " అన్నాడు చలపతి.
    "ఓహో అప్పుడే ఎడ్వాన్స్ ఇచ్చేశావన్నమాట."
    "ఆహా! మీరే చెప్పారుగా! అద్దె కాదు -ఇల్లు ముఖ్యం అని -" నవ్వుతూ అన్నాడు ఇద్దరూ లోపలకు నడిచారు.
    ఒకే ఒక్క గది అది. ఆ గది మధ్యనే ఓ కర్టెన్ ఉంది కర్టెన్ వెనుక వంట సామాను కనబడుతూ ఉంది.
    "రాజ్యం! గెస్ట్ వచ్చేశాడు ముందు 'టీ' కొట్టుమా ఇద్దరికీ - " అన్నాడు నర్సరాజు. అతని భార్య కర్టెన్ వెనుక నుంచీ రెండు కప్పుల్ల్లో 'టీ' తీసుకొచ్చి టీపాయ్ మీద వుంచింది. నాలుగు కుర్చీలూ, ఓ పక్కగా మంచం ఉందా గదిలో. ఇంకే సామానూ లేదు. ఉన్న వాటికీ చోటు కూడా లేదు.
    "మా మిసెస్ రాజ్యలక్ష్మి!" పరిచయం చేశాడు నరసరాజు.
    "నమస్తే --నా గురించి మావారు మీకు చెప్పారో లేదో రెడీగా వుండడీ! భోజనం అవగానే మిమ్మల్నీ ఇంటర్యూ చేస్తాను."
    చలపతి ఆశ్చర్యపోయాడు . నర్సరాజు గట్టిగా నవ్వేశాడు.
    చచ్చావ్ ఫో! మా ఆవిడ గురించి నేను చెప్పటం మర్చిపోయాను. ఆవిడో గొప్ప వ్యాస రచయిత్రి! అక్కడి కది చాలదన్నట్లు ఈ మధ్య ఎవరు కనబడితే చాలు వారిని ఇంటర్వు చేసేసి అదేదో పత్రికలో పబ్లిష్ చేసేస్తోంది. హైదరాబాద్ లో పత్రికల కేం కొదవలేదు! మన జీవిత చరిత్ర కూడా ఏదొక పత్రికలో సీరియస్ గా రాసేసుకోవచ్చు."
    "అంటే ఇప్పుడు నా ఇంటర్వ్యు కూడా ఏదొక పత్రికలో వచ్చేస్తుందా?"
    "ఫోటోతో సహా?"
    "తమాషాగా ఉందే! ఊరు పేరు , ఏదొక ప్రాముఖ్యత లేని వాళ్ళను ఎందుకలా ఇంటర్వ్యు చేయటం?"
    "ఆధునిక పోకడలు నాయినా? కోశ్చేన్లడగోద్దు. అడిగిన వారికల్లా ఇంటర్వ్యు లిచ్చేయటమే మన పని అన్నట్లు నీకు పెళ్ళి అవలేదు కదూ?"
    "ఊహూ ! ఇంకా లేదండీ!"
    'అంటే త్వరలో అవుతుందనా?"
    సిగ్గుపడ్డాడు చలపతి. ఏం చెప్పడానికీ తోచక చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.
    "అరె ! అలా సిగ్గుపడతావేమయ్యా? మావయ్య కూతురెవరైనా సిద్దంగా ఉందేమిటి?"
    "ఊహూ! ఎవ్వరూ లేరు."
    "ఎండుకడిగానంటే.....ఈ మావయ్య కూతుళ్ళున్నారు చుశావ్! మహాగొడవలే వీళ్ళతో . మనం ఎన్ని ఊహాలోకాల్లో విహరిన్చినా , ఎన్ని కళలు కన్నా , ఎంతమందిని ప్రేమించినా చివరకు పెళ్ళి మాత్రం ఈ మావయ్య కూతుళ్ళతోనే అవుతుంటుంది. సాధారణంగా అసలు ఈ మావయ్యలు మన మీద ఓ పెద్ద పగ దాచుకుని మనల్ని మర్డర్ చేయటానికి భయపడి ఇలా కూతుళ్ళను కని, పెళ్ళి చేసి పారేసి రివెంజ్ తీర్చుకుంటారన్నమాట. ఇంకో తమాషా కూడా చూశావా! మన నవలలూ, సినిమాలు, నాటకాలూ ఇవన్నీ కూడా మావయ్య కూతుళ్ళు చుట్టూతానే తిరుగుతుంటాయ్!"
    "అవును!" ఒప్పుకున్నాడు చలపతి.
    "అయితే నీకు మావయ్య కూతుళ్ళు ఎవరూ లేరంటావ్?"
    "లేరు....ఉన్నా పెళ్ళీడు కొచ్చినవారు లేరు."
    లోపల్నుంఛీ రాజ్యలక్ష్మి నవ్వడం వినబడుతుంది.
    అదిగో నా ప్రాణానికో మావయ్య కూతురు దాపురించింది ఆ కర్టెన్ వెనుకాల"
     వాళ్ళావిడను చూపిస్తూ అన్నాడు నర్సరాజు.
    "మాటలు తిన్నగా రానిండీ! మిమ్మల్నేం బ్రతిమాల్లె దిక్కేవ్వడూ నన్ను చేసుకోండి అంటూ" లోపల్నుంచే అందామె.
    "నీ దుంపతెగ! నువ్వువింటున్నావా? నువ్వు వినటం లేదనుకున్నాను-"
    "మీకూ, మీ ఫ్రెండు కీ ఇప్పుడు భోజనం వడ్డించాలా? కంచాలు తిరగేసి నెట్టి మీద కొడతాను."
    "బాబోయ్ - పొరపాటయిపోయిందే"
    చలపతి నవ్వాగటం లేదు వాళ్ళ మాటలు.
    "అలా దారికి రండి...."అంది రాజ్యలక్ష్మి.
    "ఆ! సరే! ఇంతకు నీకు గాళ్ ప్రెండ్ ఎవరయినా ఉన్నారా?" అడిగాడు నర్సరాజు.
    చలపతి సిగ్గుపడ్డాడు. ఏమిటీ మనిషి? ఓ పక్క వాళ్ళావిడ వింటున్నా ఇంత బాహాటంగా అడిగేస్తున్నాడు?
    "ఎవ్వరూ లేరు..." అన్నాడు నెమ్మదిగా.
    "పోనీ ప్రేమా, గీమా అలాంటివి . అది లేకుండా ఈ రోజుల్లో ఎవరూ ఉండరులే! చెప్పు ఫర్లేదు ..."
    చలపతి అబద్దం చెప్పటం సయించలేదు. సావిత్రి సంగతంతా చెప్పెయాలనే ఉంది. కానీ రాజ్యలక్ష్మి వింటుందేమో అన్న సంశయం.
    "తర్వాత చెప్తాన్లెండి ....." అన్నాడు నెమ్మదిగా.
    రాజ్యలక్ష్మి చటుక్కున బయటికొచ్చింది.
    'అవును మరి! ఇక్కడయితే రహస్యం బయటపడిపోతుందని కదూ?" నవ్వుతూ అందామె.
    "అబ్బే! మీకు తెలీకూడదని కాదు! నాకు పరిచయం ఉన్నా అమ్మాయి ఒక్కర్తే! ఆ అమ్మాయి పేరు సావిత్రి. మా ఊళ్ళో మా ఇంటి పక్కనే ఉంటుంది."
    ఓహో గ్రంధసాంగుడివేనన్న మాట......"అందామె ఎగతాళిగా.
    "అబ్బే గ్రంధం ఏమీ లేదండి! అమ్మాయి అంటే నా కిష్టం! ఆ అమ్మాయికి కూడా నేనంటే ........ఇది.."
    "ఇదంటే?" చిలిపిగా అడిగిందామె.
    నర్సరాజు నవ్వేశాడు " ఇదంటే...అదేనే.....ఇంకా తెలీదు?" చలపతి నవ్వేశాడు.
    'అయితే ఇంక ఆలస్యం ఎందుకోయ్? శుభస్యశీఘ్రం! అదేదో త్వరగా కానిచ్చేయ్ మరి!"
    "నేనూ అదే అనుకుంటున్నానండీ........కానీ......."
    "కాని అన్నావూ! అయితే మనం రంగప్రవేశం చేయాల్సిందేన్నమాట! ఇంతకూ అ 'కాని' వెనుక కదేమిటి? మీ తరుపు వాళ్ళు కట్నం కోసం చూడడం లేక కులాల పట్టింపులు........."
    "కులాల తేడా ఉందిగానండీ గొడవ అది కాదు. నాకు తల్లిదండ్రులు లేరు. ఆ అమ్మాయికీ తల్లిదండ్రులు లేరు. అంచేత మా వాళ్ళు గానీ వాళ్ళ వాళ్ళు గానీ అంత తేలిగ్గా వప్పుకోరేమో నని...."
    నర్సరాజు ఆప్యాయంగా చలపతి భుజం తట్టాడు.
    "అంతా సవ్యంగానే జరుగుతుంది బ్రదర్! జరగదు అన్న అనుమానం వచ్చినప్పుడు నేనుండనే ఉన్నాను. కాకితో కబురంపితే చాలు! వచ్చి వాలిపోతాను! ఇలాంటి ప్రేమ పెళ్ళిళ్ళు వ్యవహారాల్లో నేను ఎక్స్ పర్టుని! ఎలాంటి గొడవలేలా ఎదుర్కోవాలో మనకు బాగా తెలుసు. కాలేజీ ఫైనలియర్లో ఉన్నప్పుడు నాలుగు లవ్ మారేజేస్ చేయించాను దగ్గరుండి! ఓ పెళ్ళిలో ఆఖరి నిమిషంలో పిల్ల తల్లితండ్రులు పోలీసుల్ని గుడికి తీసుకొచ్చేశారు. అయినా గానీ మా వాళ్ళందర్నీ వాళ్ళ కడ్డం నిలబెట్టి వెనుక అర్జంటుగా మూడుముళ్ల కార్యక్రమం లాగించేయించాను. ఆ తర్వాత ఇంకే ముందీ? ఆ అమ్మాయి తల్లిదండ్రులే అందరినీ డిన్నర్ కి ఆహ్వానించాల్సి వచ్చింది....."
    ఉత్సాహంగా చెప్పుకు పోసాగాడు నర్సరాజు.
    "ఇంక బడాయిలు ఆపి భోజనానికి లేవచ్చు!" అంది రాజ్యలక్ష్మి.

 Previous Page Next Page