Previous Page Next Page 
బొమ్మా - బొరుసూ పేజి 5


    "ఉహు అదేమీలేదండి! నేనూ అందులో ఓ మెంబర్ని అంతే! మీ దగ్గరనుంచి ఆర్టికల్ తెచ్చే బాధ్యత మాత్రం నాకు అప్పజెప్పారు. ఎందుకంటే మీరు మా సిస్టర్ ఫ్రెండ్ కదా!"
    హేమ నవ్వేసింది. "సరే! నేనిప్పుడే మొఖం కడుక్కొని వస్తానుండు" అనేసి లోపలకు నడవబోయిందామె.
    "నేనికవెళ్తానండి మరి!" లేచి నిలబడుతూ అన్నాడతను.
    "అయిదు నిమిషాలాగు చంద్రకాంత్! నేనూ ఉషాదేవి వాళ్ళింటికి వెళ్ళాలి. ఇద్దరం కలసి వెళదాం" అనేసి వెళ్ళిపోయిందామె.
    మళ్ళీ అక్కడే కుర్చీలో కూర్చుండిపోయాడు చంద్రకాంత్.
    "మీవరకట్న నిషేధసంఘం ఏం చేస్తుందోయ్? అసలు ఆ సంఘం ఎందుకు పెట్టినట్లు మీ వాళ్ళు?" అడిగాడు రామరాజు.
    "వరకట్నం తీసుకోవడం నీచమయినపని అని తెలియజెప్పడమే మా ఆశయం సార్! అంతేగాకుండా వరకట్నం తీసుకోము అనే యువకులందరినీ ఓ చోటకు చేర్చి అలాంటికట్నాలు లేని వివాహాలు జరిపించాలని ప్రయత్నం" బట్టీపట్టినట్లు అప్పజెప్పాడు చంద్రకాంత్. "ఓహో! అయితే మీ సంఘం సభ్యులెవరూ కట్నాలు తీసుకోరన్నమాట అంతేనా?" "అవునండీ".
    "మరి రేపు మీ అక్కయ్య వసుంధరకి కట్నం ఇవ్వకుండానే పెళ్ళి చేస్తారా?"
    చంద్రకాంత్ తడబడ్డాడు. "అది మాకు సంబంధం లేదండీ! మా సిస్టర్ మా సంఘంలో మెంబర్ కాదు...."
    హేమరడీ అయి బయటికొచ్చింది. "పద చంద్రకాంత్ వెళ్దాం...." అంటూ గేటు దగ్గరకు నడిచింది.
    రామరాజుతో "వస్తానండీ" అని చెప్పేసి తనూ ఆమె వెంబడిబయల్దేరాడు చంద్రకాంత్.
    హేమతోపాటు నడుస్తోంటే మనసంతా ఆనందంతో పొంగిపొరలుతోంది చంద్రకాంత్ కి ఆమె అంటే ఎంతో అభిమానం అతనికి. ఆ అభిమానం ఎందుకేర్పడిందో తనకేతెలీదు ఆమెతో మాట్లాడాలనీ, ఆమెతో కబుర్లు చెప్తూ షికార్లు చేయాలనీ, ఆమె నవ్వుతూంటే తనివితీరా చూడాలనీ విచిత్రమయిన కోరికలు! నిజానికి 'సావనీర్' కోసం ఆమెని ఆర్టికల్ అడగమని ఎవరూ చెప్పనేలేదు తనకి. తనే ఆమెతో మాట్లాడాలి, ఆమెను చూడాలి అన్న కోరికతో 'సావనీర్' ని అడ్డుగా పెట్టుకొనివచ్చేడక్కడికి.
    "రేపు ఉదయం వసుంధరనోసారి రమ్మని చెప్పరాదూ?" అంది హేమ అతనివంక చూసి.
    "చెప్తానండీ!".
    "లేదా, నువ్వెలాగూ రేపు సాయంత్రం ఆర్టికల్ కోసం వస్తానంటున్నావుగా! అప్పుడు తీసుకురా!"
    తనతో పాటు అక్కయ్యని తీసుకురావడం అనేది చంద్రకాంత్ కి నచ్చలేదు. ఆమెతో పాటు వస్తే తనను మరీ చిన్నపిల్లాడిలాచేసి మాట్లాడుకొంటారు వాళ్ళిద్దరూ. అది తనకిష్టంలేదు. తన అక్కయ్య వసుంధరా హేమా ఇద్దరూ ఇంచుమించుగా ఒకటే వయసు వాళ్ళు అంటే తనకంటే అయిదేళ్ళు పెద్దవాళ్ళు. ఆ విషయం పదే పదే హేమకు గుర్తుకురావడం తనకు సహించదు.
    అసలు హేమకంటే తను అయిదేళ్ళు చిన్నవాడిలా కనిపించకుండా ఉండటానికి ఎన్నో తంటాలు పడుతున్నాడు తను. ఎత్తు మడమలున్న బూట్లు కొన్నాడు. రేజర్ తో నాలుగుసార్లు గడ్డం మొలవకపోయినా కోసుకుంటే గడ్డం దానంతటదే పెరుగుతుందని తన స్నేహితులుచెప్పారు. ఆ రోజు నుంచీ రోజుకి నాలుగుసార్లు గడ్డం చేసుకుంటున్నాడు. మరింత లావుగా కనబడటానికి ఎక్సర్ సైజ్ చేస్తున్నాడు. ఇవన్నీ ఆమె తనను చిన్నపిల్లవాడిగా జమకట్టకుండా ఉండటానికే ఆమె తననికూడా ఓ యువకుడిగా భావిస్తే చాలు తన జన్మ తరించిపోతుంది.
    "ఎందుకులెండి! ఉదయమే రమ్మని చెప్తాను!" అన్నాడు చంద్రకాంత్ త్వరత్వరగా.
    "సరే!" తలూపిందామె. ఇద్దరూ మార్కెట్ వరకూ వచ్చేశారు.
    "మరినేనిటు వెళతాను!" సందులోకి తిరుగుతూఅందామె." నేనూ ఉషాదేవిగారింటివరకూ వస్తాన్లెండి!" నవ్వుతూ అని ఆమెతోపాటే నడవసాగాడతను.
    "హేమగారూ! మీరంటే నాకెంతో ఇష్టం!" అని ఆమెతో ఓ సారి చెప్పాలని ఉంది. కాని ధైర్యం చాలడంలేదు. ఆమె ఏమంటుందోనన్నభయం!
    తన అక్కయ్య స్నేహితురాండ్రు ఎంతోమంది ఉన్నా ఆమె మీదే తనకు అంతటి ఇష్టం ఎందుదుకేర్పడిందో, ఆమె అభిమానం సంపాదించాలని ఎందుకనిపిస్తుందో ఆలోచిస్తే తనకు ఆశ్చర్యంగానే ఉంటుంది. "ఇదే ఉషావాళ్ళ ఇల్లు!" అంది హేమరోడ్డుపక్కనే ఉన్న ఓ మేడముందాగుతూ.
    "మరి నేవస్తానండీ! ఆర్టికల్ మాత్రం మరచిపోకండి!" అనేసి అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోయాడు చంద్రకాంత్.
    ఆమెకు నవ్వొచ్చింది అతనిని చూస్తుంటే తనకంటే అతనికెంతో అభిమానమన్న విషయం తనకు తెలుసు. అతను వసుంధరకున్న మిగతా స్నేహితురాండ్రెవరితోనూ మాట్లాడడు. వాళ్ళింటికెళ్ళడు. కానీ వారానికోసారయినా ఏదో ఒక పని కల్పించుకొని తన దగ్గరకు రాకమానడు. వచ్చాడంటే కనీసం ఓ గంటసేపయినా ఏదో ఒకటి మాట్లాడుతూ గడుపుతాడు.
    "హలో....." పలకరించింది ఉషాదేవి బయటికొస్తూ.
    "రక్షించావు నువ్వింకో రెండు రోజులు అక్కడే ఉండిపోతావేమోనని భయపడ్డాను...."
    "ఏమిటి విశేషం?" నవ్వుతూ లోపలకు నడిచి సోఫాలో కూర్చుంది ఆమె.
    "వచ్చే సోమవారం ప్రోసెషన్ ఒకటి ఆర్గనైజ్ చేద్దామని ప్రయత్నం. ఆ రోజు మన ఊరికి రాబోతున్న మంత్రిగారికి ఓ మెమొరాండం సమర్పించడం కూడా ఉంది. ముఖ్యంగా ఇదిపెరిగిపోతున్న వరకట్న దురాచారాన్ని నిరసించడానికే ఉద్దేశించబడింది. ఇందులో చాలా ఆర్గనైజేషన్ లు పాల్గొంటున్నాయ్. మనను కూడా అడిగారు. సరేనన్నాము. కాలేజీ గరల్స్ తలపెట్టిన కార్యక్రమం ఇదంతా!" గడగడ మాట్లాడుతూ చెప్పింది ఉషాదేవి.
    "ఓకే! అలాగే చేద్దాం!" వప్పుకొంటూ అందామె.
    "మనం మన సభ్యులందరికీ వెంటనే ఇంటిమేషన్స్ పంపించాలి. ఆఫీసు కెళదామా మరి?' అడిగిందామె వాచి చూసుకొంటూ.
    "పద!" అన్నదామె. ఇద్దరూ బయల్దేరి అక్కడికి దగ్గర్లోనే వున్న సుశీలమ్మగారి మేడకుచేరుకున్నారు. సుశీలమ్మ ఆ ఊళ్ళోని ప్రముఖురాలు. ఆ ఊళ్ళో ఏ సభ జరిగినా, సన్మానం జరిగినా, కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగినా ఆమె వుండాల్సిందే. ఎన్నో అనధికార సంఘాల్లో ఆవిడ సభ్యురాలు. ఆ ఊళ్ళోని లేడీస్ క్లబ్ కి ఆమె సెక్రటరీ! ఆమె భర్త వీర్రాజుగారు ఓ చిన్న సైజు జమీందారు. ఆయనకు వేటంటే అమితమైన పిచ్చి. ఆ పిచ్చివల్లే సుశీలమ్మ భర్త్తృహీన అయిపోయింది. ఓసారి వేటకెళ్ళి పొదలో దాక్కున్న చిరుతపులిని కాల్చారాయన తర్వాత దాన్ని ఆ పొదలోనుంచి బయటకు లాగుతోంటే అదిరివ్వున లేచి ఆయన్ని చంపి తినేసింది. అప్పటివరకూ తనుకాల్చిన గుండు దానికి తగల లేదన్న విషయం ఆయనకు తెలీదు. ఇది సుశీలమ్మ గతం.
    ప్రస్తుతం ఆమె మేడలోనే ఓ గదిలో 'విప్లవ నారీసమితి' కార్యాలయం వుంది అలాంటి కార్యాలయాలు ఆ మేడలో చాలా ఏర్పాటు చేసిందామె. ఉచితంగా ఆఫీసు లభించడంవల్ల ఆమె మీద గౌరవం ఏర్పడిపోయింది అందరికీ. హేమ ఆఫీసు పని చూసుకుని ఇంటికి తిరిగి వచ్చే సరికి రాత్రి ఎనిమిదయిపోయింది. భోజనం ముగించి తెల్లకాగితాలు ముందేసుకుని టేబుల్ లైట్ దగ్గర కూర్చుందామె సావనీర్ లో తను రాయబోయే ఆర్టికల్ ఎలా వుండాలో ఆమెకు తట్టడంలేదు.    
    స్త్రీ, తను స్త్రీ అవటంవల్ల ఈ సంఘంలో ఎదుర్కొంటున్న సమస్యలు రాయాలని కొద్దిసేపటి తర్వాత నిర్ణయానికొచ్చింది. వెంటనే రాయడం ప్రారంభించింది. మొదటి వాక్యంరాయడానికే గంట టైమూ, అరడజను తెల్లకాగితాలూ పాడయినాయి.
    అలాంటివి రాయడం తనకు రాదనికాదు. కాలేజీల్లోనూ, హైస్కూల్లో చదివేప్పుడూ మాగజైన్ కి కథలు రాసింది తను. వాటిని చదివినవారందరూ ఎంతో బాగా రాసిందని మెచ్చుకున్నారు. అవి ముఖప్రీతి మాటలు కాదు వారు నిజంగా ఫీలయిందేచెప్పారు తనకి. ఎటొచ్చీ చాలా రోజుల తరువాత ఇప్పుడు సావనీర్ కి రాయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అంతే!
    రాత్రి పదకొండయినా ఎటూ తేలటంలేదు. ఆమెకు నిద్రముంచుకొస్తోంది. కానీ చంద్రకాంత్ మర్నాడు సాయంత్రం వస్తే 'రాయలేదని' చెప్పడం తనకు చేతకాని పని అతను 'హర్ట్' అవుతాడు. అది తనకు ఇష్టంలేదు. తనకంటే అభిమానంతో అడిగినప్పుడు తన అభిమానం నిలబెట్టుకోవాలి.
    ఎలాగో కష్టపడి రాయడం పూర్తిచేసిందామె. అదోసారి చదువుకుంటే ఆమెకి ఎంతో సంతృప్తి కలిగింది తన మనసులో వున్న భావాలన్నీ కాగితం మీద పెట్టగలిగిందిప్పుడు. త్వరత్వరగా ఆ చిత్తుప్రతిని మళ్ళీ చక్కని దస్తూరితో రాసి టైము చూసుకుందామె. తెలవారుజామున మూడయింది అప్పటికే కళ్ళు మంటలు పుడుతున్నాయి. మూసుకుపోతున్న కళ్ళతో మంచంమీద వాలిపోయింది ఆమె తిరిగి మెలకువవచ్చేసరికి ఉదయం తొమ్మిది దాటింది.
    పక్కింటావిడ పెరట్లో నూతి దగ్గర బట్టలు ఉతుకుతూంది. బండెడు బట్టలు! భర్తవీ, పిల్లలవీనూ! నాలుగయిదు గంటలపాటువాటితో సతమతమయిపోతుందామె. ఆమెను చూస్తుంటే మనసంతా జాలితోనిండిపోతుంది తనకి. తెల్లారు జామున అయిదింటి నుంచీ రాత్రి పదింటివరకూ మర మనిషి లాగా చాకిరీ చేస్తుంటుందామె. ఆమె భర్త మాత్రం ఉదయం ఎనిమిదింటికి లేచి తొమ్మిదివరకూ పేపరు చదివి పదింటికి ఆఫీసు కెళ్ళిపోతాడు. సాయంత్రం ఆఫీసునుంచి ఏ స్నేహితుడింటికోవెళ్ళి కాసేపు పేకాట ఆడి, రాత్రి తొమ్మిది గంటలకు ఇల్లు చేరుకొంటాడు. ఇంట్లో విషయాలేవీ పట్టించుకోడు అతనిని చూస్తూంటే వళ్ళు మండిపోతుంది తనకి. కేవలం ఇంటెడు పని చేయడానికే 'భార్య' ఉంది అన్నధోరణి గల అతనిలాంటి మగాళ్ళు తనింటిచుట్టూ ఎంతోమంది ఉన్నారు. తమాషా ఏమిటంటే వారి భార్యలు ఆ విషయం గురించి ఆలోచించరు, పట్టించుకోరు గనక ఎద్దు జీవితానికి అలవాటుపడిపోయారు.
    తనువారితో మాట్లాడినప్పుడల్లా వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. వారి ఆలోచనాధోరణిని నిరసిస్తూంటుంది. విదేశాలో 'స్త్రీ' పరిస్థితి వివరించి మనదేశపు స్త్రీలు ఎంత వెనుకబడిపోతున్నారో తేడా చూపుతుంది.    తన దగ్గర ఉన్నంత సేపూ తన మాటలు నిజమేనని వప్పుకొంటారువాళ్ళు. తాము ఎలాంటిదుర్భర జీవితం గడుపుతోందీ గ్రహిస్తారు. కానీ ఎవరిల్లు వారు చేరుకొన్నాక మళ్ళీ మామూలే! ఓ సారి తనకు వళ్ళుమండి వాళ్ళందరి పేర్లూ యథాతథంగా ఉంచి వాళ్ళ భర్తలు వారినెంత క్రూరంగా హింసిస్తోందీ ఓ వ్యాసం రాసి వార పత్రికకు పంపించింది. అది ప్రచురింపబడిన వెంటనే తమ పేటంతా పెద్దగాలి దుమారం చెలరేగింది. తమ జీవితాలిలా పేపరు కెక్కించడం తమకేమీ నచ్చలేదంటూ తమ నిరసన తెలియజేశారువాళ్ళు. కొద్ది రోజులు అసలు తనతో మాట్లాడడంకూడా మానివేశారు. సాయంత్రం నాలుగవుతుండగా చంద్రకాంత్ వచ్చాడు. వెంటనే తనురాసిన కాగితాలు తీసుకొచ్చి అతని కందించిందామె. "థాంక్యూ అండీ!" కృతజ్ఞతతో చూస్తూ అన్నాడతను.

 Previous Page Next Page