ఆమె అరుణాంచితమయిన అధళాలు తెల్లనఆవుతున్నాయి మరి కొద్ది క్షణాలలో తన బ్రతుకు ఆసాంతమవుతుందన్న బాధ, తన శరీరం మాంస ఖండాలుగా మారిపోతుందన్న పరివేదన ఆమె మనసుని పట్టి పిండుతున్నాయి.
ఆ విచిత్ర ప్రాణి కదలికలలోని ఆంతర్యాన్ని గ్రహించేంత వరకూ తాను నిశ్చలంగా ఉండిపోవడం మంచిదని భావించింది మాలతి. అలాగే ఎత్తయిన శిలావేదిక మీద చైతన్య విహీనమయిన మృత శరీరంలా పడివుంది.
శరీరమైతే నిశ్చలంగా ఉండిపోయింది కాని మనసులో ఆలోచనలు అగ్నిశిఖల్లా అవుతున్నాయి. ఈ విచిత్ర మానవుడు తనను తీసుకురావటంలోని ఆంతర్యమేమిటి? అసలు యిలాతీసుకు రావటం వెనుక ఏదయినా ఆలోచనఉన్నదా? ఇది అనాలోచితమా? యాదృచ్చికమా?
ఆమె మనసు డోలాయమానంగా అయింది. అతడు గుహలోకి వెళ్లిపోయినాడు. బహుశా తను చంపేందుకు ఏదయినా ఆయుధం తీసుకురావాలని అయివుండవచ్చు. తను పారిపోయేందుకు యింతకన్నా అవకాశం తిరిగి రాకపోవచ్చు. అటువంటి ఆలోచన కలగగానే చివాలున లేచి కూర్చుందామె.
ప్రతి క్షణమూ సంశయాస్పదంగా గడుస్తోంది నిశ్శబ్దం.
భయంకరమయినదిగా మారుతోంది. వల్లమాలిన చలి ఎముకల్ని కొరికేస్తోంది. 'దారి చిక్కని చీకటిలో పారిపోయినా ఎక్కడికి పోవాలి? ఎలా పోవాలి? అలా అయినా చావు తప్పదేమో!
ఒక వంక నుయ్యి. మరొకవంక గొయ్యి. పారిపోవాలంటే చలిరాక్షసి! ఉండిపోవాలంటే రాక్షసుడిని తలపించే మానవాకృతి? ఎలా అయినా తుది క్షణాలు సమీపించుతున్నాయన్నది నిశ్చయమవుతోంది. ఆ తుది క్షణాలలో తనను కంటికి రెప్పలా కాచుకుంటున్న తండ్రి జ్ఞాపకం వొస్తున్నాడు. మరుక్షణం మనో పటలం మీద ప్రత్యక్షమవుతున్నాడు మాధవ!
"మధూ! సాహసోపేతమయిన బ్రతుకు దారిని ఎన్నుకున్నాను. అనుక్షణం మృత్యువుకు అత్యంత సమీపంలో పయనించే మౌంటేనీరింగ్ నా హాబీ అయింది. నీతో ఉన్న క్షణాలలో బ్రతుకుమీద మమకారం అధికాధీకంగా అవుతుంది. కాని బాహాటంగా ఉన్న క్షణాలలో ఈబలహీనత నన్ను వెన్నాడుతుంది- చదువు, పెళ్ళి, పిల్లలు యింతకన్నా ఆడదాని బ్రతుకులో మరొక అర్ధం ఉండకూడదా? అన్న ఆలోచనలు నన్ను వశీకరించు కుంటాయి. నేను మరొక వైపుకు లాగివేయబడుతున్నాను. దీని పర్యవసానం ఎలాంటిదో నాకు తెలియదు. కాని నాకు భవితవ్య మంతా నీతోపంచుకోవాలని ఉంటుంది" అన్నది తను ఒకసారి.
మధు చిత్రంగా నవ్వాడు. అలా నవ్వుతున్నప్పుడు అతని పెదవులు ఎంతో అందంగా వొంపు తిరుగుతాయి ముఖం ఉజ్వలంగా కాంతివంతంగా అవుతుంది. కన్నులు తారకల్లా తరలిస్తాయి. అతని కన్నుల్లో అనంతమైన ఆకాశ ముఖమంతా రూపె త్తిన ఆకర్షణ.
"మాలా! మరీ చిన్న పిల్లలా మాట్లాడకు. యువతీ యువకులు ఒకరివంక మరొకరు ఆకర్షితులుకావటం అతిసహజమయిన వయో ధర్మం. ఒకరి కోసం ఒకరు అంకితమయిపోవాలను కోవటం అనివార్యమయిన పరిణయం. ఆ పరిణామానికి ఫలితాంకం పెళ్ళి? అది జీవితాలకు ఒక మజిలీ?
అందాక నీవు రాగలవా లేదా అన్నది నాకెప్పుడూ సంశయా స్పదమయిన విషయమే.
ఎందుకంటే నీవు నీ జీవిత గమ్యం ఎక్కడో ఖచ్చితంగా నిర్ణయించుకోలేక పోతున్నావు ఆ నిర్ణయానికి నీవు రాగలిగేంత వరకూ నేను ఎదురు చూస్తాను. నీవు ఆ నిర్ణయానికి త్వరగా రాగలిగితే మరింత సంతోషిస్తాను" అన్నాడతను.
తాను అశక్తురాలై తల దించుకుంది.
"మధూ: ఒకవేళ ఈ సాహసయాత్రలలో నేను చనిపోతే ఏం చేస్తావు?" అని అడిగింది తాను. ఆ మాటకు దుఃఖం ముంచెత్తిన వానిలా అయిపోయాడు మధు.
"మాలా: అందుకే నీవు చిన్న పిల్లలా ఆలోచిస్తావని అన్నాను. జెవెఇథమ్ అతి సహజమయిన ధోరణిలో మనిషి ఆలోచనల్ని తన వెంటతీసుకుపోతుంది. అటువంటి దురదృష్టకరమయిన క్షణాలు ఎన్నటికి రావని నేను ఆశిస్తాను. ఒకవేళ అమావాస్యమయిన ఆ క్షణం ఎదురు అయితే ఏమవుతుందో నేనిప్పుడు ఊహించలేను.
మనిషి అనే మృగంమీద కాలమనే వేటకాడు అనుక్షణం విల్లు ఎక్కుపెట్టే ఉంచుతాడు. అల్లెత్రాటిని విడిచి బాణం ఎప్పుడూ దూసుకు వస్తుందో తెలియదు. అలా జరిగిన మరుక్షణం మనిషి బ్రతుకు ఆసాంతమవుతుంది. కాని బ్రతికి ఉన్నంత కాలం చావు గురించి దిగులు పెట్టుకోవటం, ఆ తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకోవటం తెలివి తక్కువ! నిన్ను నీవు ముందుగా అర్ధం చేసుకో.
"ఆ తరువాత నీవు ఏ దారినపయనించాలో తెలిసిపోతుంది" అన్నాడతడు. ఆ మాటల అర్ధమేమిటో గ్రహించులేనంత అమాయకురాలు కాదు తాను.
యౌవ్వనం మనసుమీద ముద్రించే రూపాలనించి, ఆలోచనలనించీ, ఆశలనించి వంచితురాలవుకావద్దన్న హెచ్చరిక అది. మనసుని ఈ వంకకు మరల్చుకోమని ఆజ్ఞాపించటం అయినా తాను ఈ ప్రయత్నాలు మానుకోలేదు.
ఎప్పటికయినా షెర్పాటెన్ సింగ్ లా మౌంటెనీరింగ్ లో సంచలనం సృస్టించాలన్న తపన ఇది: ఈ ప్రలోభంనించి దూరం కాలేకపోతోంది తను. పర్వతారోహకుల చరిత్రలో తెలుగువారి కీర్తి కేతనాన్ని ఎగురవేయాలన్న కోరికనించి బయట పడలేకపోతూంది.
దాని ఫలితాంశమే యిప్పటి ఈ స్థితి.
మాలతి కన్నులు చెమరించినాయి. తిరిగి తాను యిట్లు చేర గలగటం బహుశా అసంభవమే కావచ్చు. ఎంతసేపు గడిచిన గుహలోకి వెళ్ళిపోయిన ఆకృతి తిరిగిబయటకు రాలేదు రక్తం గడ్డకట్టే చలి రాను రాను మరింత ఉధృతమవుతూంది మరొక గంట అక్కడ బంగరుబయలులో తానుంటే మృత్యువు అనివార్యము అనిపిస్తోంది. ప్రమాదంలో తల మార్చాక యింకతాను భయపడటం అనవసరమనిపించింది. తనను తీసుకు వచ్చిన ప్రాణి వానర జంతువు అయివుంటే ఎంతసేపు బ్రతికి ఉండేందుకు అవకాశం లభించడు. అందునించి ఆమె లోని భయ విహ్వలత రవంత తగ్గి పోయింది. మానసికంగా స్వస్థత సమకూరింది.