Previous Page Next Page 
ఈనాటి శకుంతల పేజి 5

    విమల ప్రవర్తన అనసూయకు భయంగా ఉంది 'కానీ పాతికేళ్ళన్నా నిండకుండా జీవితమంతా సన్యాసినిలా గడపడం సాధ్యమేనా? అలా గడపమని తాను శాసించగలదా? సంఘనీతికి అతీతంగా మనసులు ఉరకలు వేస్తూనే ఉంటాయి. అలా అని సంఘనీతిని ధిక్కరిస్తే ఫలితం ప్రత్యక్షంగానే ఉంది కదా?'    
    కూతుర్ని మందలించలేక, "విమలా! నీ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ శకుంతలను మరిచిపోకు. నీకూతురికీ నువ్వే అన్యాయం చెయ్యకు అంది.    
    ఉలిక్కి పడింది విమల గాభరాగా శకుంతలను దగ్గిరకు తీసుకుంది 'అది చాలు!' అనుకుంది బాధగా అనసూయ.    
    ఆ రోజూ బస్ స్టాప్ లో నిలబడి చుట్టూ చూస్తూంటే, శ్రీధర్ శర్మ కనిపించాడు. అతడు అక్కడ అంతకుముందు నుంచే ఉన్నట్లున్నారు స్ట్రీట్ లైటు పడే చోట నిలబడి ఏదో మేగజైన్ చదువుతున్నాడు.పుస్తకంలో లీనమయి పోయాడు. తనను గమనించటం లేదు. 'అబ్బ! ఏం శ్రద్ద!'
    చదవటం పూర్తయ్యాక మేగజైన్ మడిచి విమలను చూచి "హలో! అని  విమల దగ్గిరగా వచ్చి, "సారీ! మిమ్మల్ని చూడలేదు. ఏదైనా చదవటం మొదలు పెడితే, అందులో లీనమయి పోతాను."    
    "మంచిదేగా!"    
    "ఇదేమిటి! ఇవాళ బస్ స్టాప్ లో ఒక్కరూ లేరేం?"    
    "అరె? చాలామంది ఉండాలే? కొంపదీసి బస్ వెళ్ళిపోయిందా?"    
    విమల గడియారం చూసుకుంది తొమ్మిదిన్నర సిగ్గుతో ఆమె ముఖం ఎర్రబడిపోయింది. శ్రీధర్ ముఖం పైనున్న ట్యూబ్ లైట్ ని మించి వెలిగిపోయింది.    
    "ఫరవాలేదులెండి! మిమ్మల్ని మీ ఇంటిదగ్గర ఆటోలోదింపేస్తాను.    
    గతుక్కుమంది విమల. ఆమె నావరించిన మైకపు తెర తొలిగింది. 'ఏమిటది? ఎటు పోతున్నాను?' అని తనలో తాను తర్కించుకుంది. లజ్జతో వంచిన తల ఎత్తకుండా. "వద్దు నా పొరపాటుకి ప్రాయశ్చిత్తంగా మరో అరగంట నిలబడతాను. పదిగంటల ప్రాంతంలో మరోబస్ ఉంది" అంది.    
    "అయితే, మీ ప్రాయశ్చిత్తంలో నన్నూ భాగం పంచుకోనిస్తారా? జరిగిన పొరపాటులో నాకూ భాగం ఉంది మరి!"    
    "రోడ్డుమీద నిలబడటానికి కాదు__మీపక్కన నిలబడటానికి విషయం ఒకటే అయినా, భావంలో బోలెడు తేడా ఉంది."    
    విమల నవ్వింది 'ఎంత బాగా మాట్లాడతాడూ!' అనుకుంది.    
    "ఎంత అందంగా ఉందా నవ్వు!" అనుకున్నాడు అతడు.    
    "నాదొక చిన్న అభ్యర్ధన?"    
    "చెప్పండి!"    
    "మీరు మా ఇంటికి రావాలి."    
    ఆమె కనుబొమలు ముడిచి తీక్షణంగా చూసింది. అతడు నవ్వి, "మిమ్మల్ని మా అమ్మకి పరిచయం చేస్తాను" అన్నాడు. ఆమె స్థిమిత పడింది. కానీ అంతలో ఏదో భయమూ కలిగింది. శ్రీధర్ శర్మ అంటే అతడొక్కడే కాదు. అతడి వెనుక తల్లీ, తండ్రీ మొదలైన కుటుంబం ఉంటుంది. ఆ వెనుక సంఘం ఉంటుంది.    
    "ఎందుకలా అయిపోయారు? వెంకటేశ్వరా కాలనీలో మా ఇల్లు, సీతాపతిశర్మగారి అబ్బాయిని ఇంటి నంబరు 198/2/1-ఎ. కావాలంటే, వివరాలన్నీ విచారించి ఆ తర్వాతే రండి."    
    "మీ నాన్నగారు ఏం చేస్తుంటారు?" మాట తప్పిస్తూ అంది.'    
    "డెప్యూటీ కలెక్టర్ గా పనిచేసి రిటైరయ్యారు. ప్రస్తుతం మా కాలనీలో ఒక వెంకటేశ్వరాలయం కట్టిస్తూ దాని యాజమాన్యం వహిస్తూ చందాలు పోగు చేస్తుంటారు."    
    ఆ మాటలు వింటూంటే, విమల గుండె దడదడ కొట్టుకుంది. ఆమెకు తెలియకుండానే, నిరాశాపూరితమైన నిట్టూర్పు వెలువడింది.    
    "కానీ, మా అమ్మకూ, నాన్నగారికీ నేనొక్కన్నే కొడుకుని నేను కోరినది ఏదీ వాళ్ళు కాదనరు_ అది వాళ్ళకెంత కష్టంగా ఉన్నా సరే!"    
    'మీరు ఏం కోరుతున్నారు?' అని అడగలేకపోయింది విమల. చెప్పటానికి సంకోచించాడు శ్రీధర్ శర్మ.    
    "మీరు ఆదివారం మా ఇంటికి రండి ఆమ్మతో మాట్లాడాక అమ్మ ఒప్పుకొంటే, మీ ఇంటికి వస్తాను."    
    "ఆల్ రైట్!"    
    కొంతసేపు ఇద్దరూ ఏమీ మాట్లాడలేకపోయారు. ఇద్దరికీ విషయం అర్ధమయింది. విమల తానే మౌనం చేదిస్తూ "మీఇంటి వివరాలు చెప్పండి" అంది.    
    శర్మ తల్లి పూజల గురించీ, పూజలమధ్య కోపంవస్తే పనివాళ్ళను పెట్టే చీవాట్లు గురించీ, తండ్రి సావకాశంగా కూచుని ఇంటికొచ్చే వర్తకులతో చేసే బేరాల గురించీ, తమాషాగా నవ్విస్తూ చెప్పాడు. అంతలో బస్ వచ్చింది సాధారణంగా బస్ కోసం పది నిముషాలు వెయిట్ చేయాలన్న విసుక్కునే విమలకు అరగంట తర్వాత వచ్చిన రెండో బస్ 'అప్పుడే వచ్చిందా?' అనిపించింది బస్ ఎక్కుతున్న విమలకు వీడ్కోలు చెపుతూ, "ఆదివారం వస్తాను" అన్నాడు.    
    ఆదివారంనాడు ఉదయమే లేచి తలంటు పోసుకుంది విమల. తెల్ల జార్జెట్ చీర కట్టుకుని ఆర్టిఫిషియల్ ముత్యాల దండ వేసుకుంది. తెల్ల బోయి చూసిన తల్లితో శర్మ వస్తున్న సంగతి చెప్పింది. అతని అభిప్రాయం కూడా సూచనగా మాటల మధ్య అందించింది.    
    తల్లి మాట్లాడలేదు. విమల తలవంచుకుని "అతడు వచ్చి నీతో మాట్లాడతానని అన్నాడు. నీ యిష్టం. ఏం మాట్లాడతాడో మాట్లాడు. నువ్వు వెళ్ళమంటేనే అతనితో వెళ్తాను. నీ కిష్టంలేనిపని ఒక్కనాటికీ చెయ్యను" అంది.    
    తల్లి మాట్లాడకుండా వంట గదిలోకి వెళ్ళింది. ప్రతి ఆదివారం పగలు కూడా విమల తల్లికి వంటలో సాయపడుతుంది. సాయంత్రం ప్రతి రోజూ ఇద్దరూకలిసే వంటపని చేస్తారు. తల్లి రావద్దన్నా విమల ఊరుకోదు.    
    ఆరోజు తన చీర మాసిపోతుందని వంటలోకి వెళ్ళలేకపోయింది విమల అలాగని వెళ్ళకుండా ఉండలేకపోయింది. వంటగది గుమ్మం దగ్గిర నిలబడి, "అమ్మా! నేను వంటలోకి రానా?" అంది.    
    తల్లి వెనక్కు తిరిగి నవ్వి, "వద్దులే! ముఖానికి పౌడరు ఎక్కువయింది. తుడుచుకో!" అంది.

 Previous Page Next Page