"అలా అని చెప్పాడా"
"చెప్పడమేమిటి మేడమ్. లెటర్ లో స్పష్టంగా విశ్వనాథని వుందిగా పైగా మీరుకూడా ముద్దుగా 'విశ్సు' అని పిలుస్తుంటారటగా" అతను కూడా ఇందాక 'విశ్సు' అని అడ్రస్ చేసింది ఆమెను ప్లీజ్ చేయాలనే అన్న విషయం చెప్పలేదు వెంకట్రావ్.
మరో కొత్త విషయం వింటున్నట్టుగా అడిగింది కృషి "లెటరేమిటి"
"అదే మేడమ్ ఈ రోజు సాయంకాలం ఆరుగంటలకి ఉస్మానియా యూనివర్శిటీ ఆడిటోరియంలో ఐక్యూ కాంపిటీషన్ వుందిగా. దానికి అటెండ్ కమ్మని 'కోలా' కంపెనీ వాళ్ళు రాసింది"
ఆమె భ్రుకుటి ముడిపడింది.
"అసలా ఆ కాంపిటీషన్ కి ఆయన అటెండ్ కావడం మీకిష్టం లేకనే ఛాలెంజ్ పేరిట మీరాయన్ని అరెస్ట్ చేయించిన విషయమూ ఆయన చెప్పేశాడు."
ఈ అభియోగమూ ఆమెకు నచ్చలేదు. "మరి నాకెందుకు ఇష్టం లేదో అదీ చెప్పాడా"
"ఆయనలాంటి జీనియస్ లు పోటీల్లో పాల్గొంటే పైకొచ్చే యువతకి అవకాశం ఉండదన్నారటగా..."
చిర్రెత్తుకొస్తున్నా నిభాయించుకుంది. అతనో జీనియస్ అవునో కాదో గాని ఖచ్చితంగా ఈ పోలీసాఫీసరు మాత్రం ఫూలని బోధపడిపోయింది.
అతని పేరు నిజంగా విశ్వనాధేనా లేక ఏదో ఉత్తరాన్ని చూపించి తెలివిగా తప్పించుకున్నాడా.
ఆలోచిస్తూ కారు దగ్గరికి వచ్చింది.
అతడి ఐక్యూ స్థాయి ఏదయినా గాని డబ్బు ఇచ్చో లేక సమయస్ఫూర్తిని ప్రదర్శించో చాలామందితో మాత్రం సులభంగా ఆడుకోగలుగుతున్నాడు.
ఇంటికి తిరిగివచ్చిన కృషి అతడిపై ఆసక్తిని ప్రదర్శించడం అనవసరం అనుకుంటూనే సాయంకాలం దాకా గడిపింది.
ప్రత్యేకించి ఓ వ్యాపకం అంటూ లేకపోవడం కృషి ఎంత అసహనానికి గురిచేసింది అంటే యూనివర్శిటీకి వెళ్ళకుండా వుండలేకపోయింది.
అతడ్ని చూడాలని కాదు.
విశ్వనాథ్ అతడవునో కాదో తెలుసుకోవాలని.
అంతకు మించి ఐక్యూ కాంపిటీషన్స్ పై ఆమెకున్న ఆసక్తి కూడా అప్పటికి ఆమెను ప్రేరేపించింది.
* * * *
"డియర్ ఫ్రెండ్స్" యూనివర్శిటీ ఆడిటోరియంలోని ప్రేక్షకులను ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నాడు. 'కోలా' కంపెనీ ప్రతినిధి "సాప్ట్ డ్రింక్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న పోటీ ఇది గత మూడు సంవత్సరాలుగా కోలా క్విజ్ కింగ్ గా ఛాంపియన్ షిప్ కాపాడుకుంటున్న యూనివర్శిటీ విద్యార్ధి రాజేంద్ర ఈ రోజు మరో ఛాలెంజ్ ఎదుర్కోబోతున్నాడు. ఇద్దరి మధ్యా జరుగుతున్న ముఖాముఖీ పోటీలో గెలిచిన వ్యక్తి ఛాంపియన్ షిప్ ట్రోఫీ తో బాటు ఇరవై వేల రూపాయల క్యాష్ ప్రైజ్ సాధించగలుగుతాడు. ఇప్పుడు ఇద్దరు యువకుల్నీ మీకు పరిచయం చేస్తున్నాను. మిస్టర్ రాజేంద్ర...డిఫెండింగ్ ఛాంపియన్"
సుమారు ఇరవై రెండేళ్ళ వయసున్న రాజేంద్ర ఉత్సాహంగా డయాస్ పై అడుగుపెట్టగానే విద్యార్ధుల చప్పట్లతో అభిమానమో లేక పని గట్టుకుని ఏర్పాటు చేయబడిన బృందమో రాజేంద్రకి అనుకూలంగా నినాదాలు ప్రారంభించారు.
"నౌ" కోలా ప్రతినిధి అన్నాడు. "ఇరవై వేల రూపాయల పెట్టుబడితో పోటీకి సిద్దమైన ఛాలెంజర్ మిస్టర్ విశ్వనాథ్..."
ఉన్నట్టుండి ఆడిటోరియంలో నిశ్శబ్దం ఆవరించింది.
మసక వెలుతురులో ఓ మూల కూర్చున్న కృషి చూస్తుండగానే డయాస్ పైకి వచ్చాడు విశ్వనాథ్- కొన్ని గంటల క్రితం దాకా కృషి థూర్జటిగా అనుకుంటున్న వ్యక్తి.
ఒక మోసగాడిగా పరిచయమైన వ్యక్తి ఇప్పుడో మేధావిలా ఇలాంటి పోటీలో పాల్గొనటాన్ని ఆమె ఊహించలేక పోయింది.
ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ లేదు. అయినా అదేమే పట్టించుకోనంత నిశ్చలంగా తన సీటులో సెటిలయ్యాడు థూర్జటి అలియాస్ విశ్వనాథ్.
"దూరదర్శన్ లో తరచుగా క్విజ్ కాంపిటీషన్స్ నిర్వహించే వాసు ఇప్పుడు క్విజ్ మాస్టరుగా వ్యవహరిస్తారు"
క్విజ్ మాస్టరు వాసు స్కోర్ కౌంట్ చేసే ఓ అమ్మాయితో బాటు వేదిక పైకి వచ్చి ప్రేక్షకులకి నమస్కరించాడు.
చప్పట్లు కేకల్తో ఆడిటోరియం హోరెత్తిపోయింది.
"డియర్ ఫ్రెండ్స్" ప్రేక్షకుల్నే గాక పోటీలో పార్టిసిపేట్ చేస్తున్న రాజేంద్ర, విశ్వనాథ్ ల్ని ఉద్దేశిస్తూ అన్నాడు వాసు "క్విజ్ కాంపిటీషన్ లో చాలా నియమాలున్నా ఈ పోటీని స్పాన్సర్ చేసే కోలా కంపెనీ నిబంధనల ప్రకారం పోటీ డ్యూరేషన్ మొత్తం గంట యాభై నిముషాలలో చెరో అయిదు నిముషాలు ఒక్కొక్కర్నీ ప్రశ్నించడం జరుగుతుంది. ఒక్కో జవాబుకి నిర్దేశించబడిన మార్కులు పది. ప్రశ్న అడిగిన తర్వాత ఆలోచించడానికి వ్యవధి కేవలం ముఫ్ఫై సెకండ్లు మాత్రమే. ముఫ్ఫై సెకండ్లు వ్యవధి పూర్తి కాగానే ఆ అసిస్టెంట్ బజర్ నొక్కుతుంది. జవాబు చెప్పే అవకాశం రెండో వ్యక్తికి దక్కుతుంది. ఐ థింక్ అయామ్ క్లియర్...."
అంగీకారంగా తలలు పంకించారు రాజేంద్ర. విశ్వనాథ్ లు.
సరిగ్గా ఏడు గంటలకి రిస్ట్ వాచ్ చూసుకున్న క్విజ్ మాస్టరు వాసు పోటీ ప్రారంభిస్తూ రాజేంద్రతో అన్నాడు "ది ఫస్ట్ క్వెశ్చన్ ఈజ్ ఫర్యూ మిస్టర్ రాజేంద్ర...రిఫ్లెక్సాలజీ అంటే ఏమిటి?"
"ఇదో కొత్త వైద్య విధానం. కాలు లేక చేతి బొటనవేలుకి సంబంధించిన రిప్లేక్స్ భాగాల్ని వత్తి శరీర రుగ్మతల్ని నయం చేసే ప్రక్రియని రిఫ్లెక్సాలజీ అంటారు."
"రైట్...మిస్టర్ విశ్వనాథ్....రిఫ్లెక్సాలజీ గురించి పరిశోధించిన వ్యక్తి ఎవరు"
"అమెరికాకి చెందిన డాక్టర్ విలియం ఫిడ్జిగెరాల్డ్" టక్కుమని చెప్పాడు విశ్వనాథ్.
"రైట్ మిస్టర్ విశ్వనాథ్.... ఈ మధ్యనే చనిపోయిన ప్రభుత్వ అమెరికన్ రచయిత నేబాస్ మొదటి నవల ఏది?"
"1959లో అతడు రాసిన నవల ది సిన్నాఫ్ ఫిలిప్ ఫ్లెమింగ్"
"వండర్ ఫుల్" అభినందించిన క్విజ్ మాస్టర్ ఇప్పుడు రాజేంద్రని చూస్తూ అడిగాడు. "బ్రిటన్ లోని కొందరు వృద్ద మహిళల్లో ఇప్పటికీ వున్న ఓ మూఢనమ్మకం డిసెంబరు ఇరవై ఎనిమిదో తేదీన బట్టలు ఉతక కూడదని... కారణం ఏమిటో చెప్పగలరా?"
రాజేంద్ర ఉత్సుకతగా అన్నాడు. "హీరో చక్రవర్తి క్రీస్తు ఎక్కడో జన్మించాడన్న భయంతో మగ బిడ్డల్ని హతమార్చమన్నది డిసెంబరు ఇరవై ఎనిమిదో తేదీన కాబట్టి ఆ రోజున బట్టలు ఉతికే కుటుంబానికి చెందిన ఓ పురుషుడికి ప్రాణ హాని జరుగుతుందని ఇప్పటికీ వున్న మూఢ నమ్మకం."
విద్యార్ధులు చప్పట్లు కొడుతూంటే "యూ ఆర్ రైట్ మిస్టర్ రాజేంద్ర. వన్ మోర్ క్వెశ్చన్ టూ యు.బి.ఆర్ చోప్రా మహాభారత్ లో టెలికాస్ట్ చేయటానికి బిబిసి చెల్లించిన మొత్తం ఎంత" అడిగాడు రాజేంద్రని చూస్తూ.
నిశ్శబ్దంగా వుండిపోయాడు రాజేంద్ర.
పది సెకండ్లు గడిచేక "లక్ష పౌండ్ లు" అనేశాడు.
"రాంగ్"
ఆడిటోరియం ఆసక్తిగా గమనిస్తుండగా ముప్పై సెకండ్లు గడిచినట్లు బజరు మోగింది.
"ఇప్పుడు మీరు జవాబు చెప్పాలి మిస్టర్ విశ్వనాథ్" అన్నాడు క్విజ్ మాస్టర్ వెంటనే.
"డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పౌండ్లు"
"రైట్ మిస్టర్ విశ్వనాథ్" రెండు సెకండ్ల వ్యవధి తర్వాత అడిగాడు "తుమ్ములన్నవి మనిషికి సహజంగా వస్తాయి. ఎవరైనా తుమ్మితే మనం తెలుగులో అయితే నూరేళ్ళ ఆయుష్షు అన్తోఅ ఆశీర్వదిస్తాం. ఇంగ్లీషు లో అయితే 'బ్లెస్ యు' అంటాం. ఈ సాంప్రదాయానికి మూలం చెప్పగలరా?"
"పదిహేడో శతాబ్దంలో బ్రిటన్ లో ప్లేగు వ్యాధి మూలంగా వేలమంది ప్రాణాలు కోల్పోయారు"
ఆసక్తిని మించిన విస్మయంతో చూస్తూంది ఆడిటోరియంలో కూచున్న కృషి.
"ప్లేగు వ్యాధికి గురైన మనిషి తప్పకుండా చనిపోతాడనుకోటానికి కనిపించే ముఖ్యమైన సిస్టమ్ తుమ్మడం కాబట్టి ఈ వ్యాధికి గురైన ఏ వ్యక్తి అయినా తుమ్మగానే యిక మరణం తథ్యమని తెలిసిన వ్యక్తులు 'బ్లెస్ యు' అనేవారు. ఆ సాంప్రదాయం బ్రిటన్ పాలన ద్వారా మనకీ వచ్చింది."
పలచగా వినిపించాయి చప్పట్లు క్రమంగా విశ్వనాథ్ సైతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న సూచనగా.
"మిస్టర్ రాజేంద్ర తాజ్ మహల్ నిర్మాణానికి ప్రేరణగా చరిత్రలో మిగిలిన ముంతాజ్ కి షాజ హాన్ కి పిల్లలెంతమంది"