Previous Page Next Page 
గోరువెచ్చని సూరీడు పేజి 7

    "పద్నాలుగు మంది"    
    "రైట్ మెజిషియన్ ఆఫ్ ఐరన్ అనే టైటిల్ గల వ్యక్తి ఎవరు?"    
    రాజేంద్ర వెంటనే చెప్పడం ప్రారంభించాడు. "రాట్ ఐరన్ తో సుమారు మూడు వందల మీటర్ల పొడవున్న ఈఫిల్ టవర్ ని నిర్మించిన ఫ్రెంచ్ ఇంజనీర్ అలెగ్జాండర్ గుస్తాల్ యీఫెల్ ని మెజీషియన్ ఆఫ్ ఐరన్ అంటారు."  
    "వెరీ కరక్ట్. నౌ....ఇట్స్ యువర్స్ టర్న్ మిస్టర్ విశ్వనాథ్...ఓ మనిషికుండే ఎముకలెన్ని?"    
    వెంటనే జవాబు చెప్పలేదు విశ్వనాథ్. "బాల్యంలోనా, యవ్వనంలోనా."    
    క్విజ్ మాస్టర్ కంగారుపడటాన్ని గమనించింది కృషి.    
    విశ్వనాథ్ ప్రశ్నకి ఎగతాళిగా ఓ మూల నుంచి విద్యార్ది బృందం కేకలు పెడుతుంటే విశ్వనాథ్ రియాక్టు కాలేదు. క్విజ్ మాస్టర్ ప్రశ్నకి జవాబులా అన్నాడు. "ఏ మనిషికైనా బాల్యంలో వుండేవి మూడువందల ఎముకలు. కాని వయసు పెరిగేకొద్దీ తొంభై నాలుగు ఫ్యూజయి యవ్వనంలో అడుగుపెట్టేసరికి రెండు వందల ఆరుదాకా మిగులుతాయి."  
    సాలోచనగా తల పంకించాడు క్విజ్ మాస్టర్ "యూ ఆర్ రైట్ మిస్టర్ విశ్వనాథ్. నిజమే నా ప్రశ్న ఇంకా క్లియర్ గా వుండాల్సింది."  
    కేవలం కృషి మాత్రమే అసంకల్పితంగా చప్పట్లు కొట్టి తలతిప్పి తనవేపే అంతా చూస్తుంటే యిబ్బందిగా కదిలింది క్షణం పాటు.   
    "సిగ్గుతో మొహం ఎర్రబడడం అంటే మీకు తెలుసుగా...దానికి శాస్త్రీయమైన కారణం చెప్పండి"    
    "ఇది పుట్టుకతో వచ్చే రియాక్షన్ కాదు. రెండు నుంచి నాలుగేళ్ళ వయసు మధ్యలో అలవడే రిఫ్లెక్స్ యాక్షన్. ఏదన్నా అవమానం జరిగినప్పుడు మెదడు నెర్వ్ సిగ్నల్స్ పంపుతుంది. పెస్టయిడ్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఆ రసాయనం మొహానికి సంబంధించిన బ్లడ్ వెస్సెల్స్ పై పనిచేసి మొహం ఎర్రబడేట్లు చేస్తుంది" ఇందాక తన మొహం ఎరుపెక్కిన క్విజ్ మాస్టర్ ముఖ కవళికల్ని గమనిస్తూ చెప్పాడు విశ్వనాథ్.    
    "నౌ మిస్టర్ రాజేంద్ర...నెలకి సగటున ఓ మనిషి జుట్టు పెరిగే పొడవెంత?"    
    "పది మిల్లీ మీటర్లు"    
    "రైట్ మెదడులో ఎక్కువ భాగం శరీరంలోని ఏ అవయవాన్ని నియంత్రించటానికి ఉపయోగించబడుతుంది."    
    "బొటనవేలుని"    
    "రైట్ నౌ మిస్టర్ విశ్వనాథ్- సీజర్ కి సిజేరియన్ కి గల సంబంధం ఏమిటి?"    
    "సీజర్ రోమన్ చక్రవర్తి. తల్లి కడుపుని కోసి బిడ్డను తీయడాన్ని సిజేరియన్ అంటారు.    
    సీజర్ పుట్టింది అలానే కాబట్టి ఈ ఆపరేషన్ కి సిజేరియన్ అనడం ఓ చరిత్రగా మారింది. అంతకుమించి లాటిన్ భాషలో CAEJARE అంటే TO CUT అన్న అర్ధం కూడా వస్తుంది"    
    అవసరానికి మించి జవాబు చెబుతున్న విశ్వనాథ్ విషయంలో ఆసక్తికన్నా అసహనం ఎక్కువైనట్టు చూసాడు క్విజ్ మాస్టర్. "అనూహ్యమైన షాక్ మూలంగా ఒక్క రాత్రికే జుట్టు తెల్లబడటం గురించి మీరు వినే వుంటారు. ఇదెలా సాధ్యం."    
    "నిజానికి అనుకోని షాక్ తో జుట్టు తెల్లబడదు. నల్ల వెంట్రుకలన్నీ రాలిపోయి వాటి మరుగున వున్న తెల్లవెంట్రుకలు మాత్రం మిగులుతాయి. ఇది సైన్స్ చెప్పే సత్యం."    
    "రైట్- నౌ మిస్టర్ రాజేంద్ర ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రోడ్డుపై మనం వాడే 'తారు'ని కనిపెట్టిందెవరు."    
    "స్కాట్ లాండ్ కి చెందిన ఇంజనీర్ పద్దెనిమిదో శతాబ్దంలో పుట్టిన జాన్ లాడెన్ మెక్ ఆడమ్"    
    "రైట్...ఇంతవరకూ అసాసినేషన్ లో ప్రాణాలు కోల్పోయిన బ్రిటీష్ ప్రదానులెంతమంది. ఎవరెవరు?"    
    "1812 మే పదకొండవ తేదీన హౌసాఫ్ కామన్స్ లాబీలో అసాసినేట్ చేయబడిన ప్రధాని ఒక్కరే. అతని పేరు స్పెన్సర్ పర్సినల్"    
    "వెరీ కరెక్టు - మిస్టర్ విశ్వనాథ్....స్త్రీలకి ఓటు హక్కు నిచ్చిన మొదటిదేశం ఏది, ఏ సంవత్సరంలో?"   
    "న్యూజిలాండ్...1893లో"    
    "రైట్....దేశంలో ఆడపిల్ల పెళ్లి ఓ సమస్య అయితే అమ్మాయి పుట్టకముందే పెళ్ళి కుదుర్చుకునే సాంప్రదాయం గల ఓ ప్రాంతం వుంది. అది ఏది?"    
    "ఆస్ట్రేలియాకి చెందిన మెలివిల్లి దీవిలోని ప్రజల్లో వున్న ఆచారమది. ఓ యువతికి పెళ్ళి జరుగుతున్న సమయంలోనే పుట్టబోయే ఆడపిల్లని కోడలుగా చేసుకునేట్టు కాంట్రాక్టులు రాసుకుంటారు."    
    పోటీలో మొదటి ఏభై నిముషాలు పూర్తికావటంతో క్షణం ఆగాడు క్విజ్ మాస్టర్.    
    క్విజ్ మాస్టర్ అసిస్టెంట్ స్కోర్ తెలియచేసింది.    
    "మిస్టర్ విశ్వనాథ్ నూరుశాతం స్కోర్ చేసి నూరు మార్కులతో మొదటి స్థానంలో వున్నారు. ఒక ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయిన మిస్టర్ రాజేంద్ర స్కోర్ తొంభై మార్కులు."    
    ఓ మూల రాజేంద్ర బృందం మినహా ఆడిటోరియం మొత్తం చప్పట్లతో అభినందించింది విశ్వనాథ్ ని.    
    "ఇప్పుడు..." క్విజ్ మాస్టర్ వాసు అన్నాడు రాజేంద్రని చూస్తూ "ముందు వివరించిన నిబంధన ప్రకారం మీకు అయిదు నిముషాలు కేటాయించి పది ప్రశ్నల్ని అడగబోతున్నాను. పోగొట్టుకున్న పది మార్కుల్ని కాంప్లెమేట్ చేసుకుంటారని భావిస్తూ క్వశ్చన్ ని ప్రారంభిస్తున్నాను"    
    రాజేంద్రలో మునుపటి ఉత్సాహం లేదు. సీరియస్ గా విశ్వనాథ్ వేపు చూశాడు.    
    ఇదేమీ పట్టించుకొనట్టు విశ్వనాథ్ ఆడిటోరియంలోకి చూస్తున్నాడు ఎవర్నో వెదుకుతున్నట్లుగా.    
    ఆ క్షణాన విశ్వనాథ్ గెలుపుని కోరుకోవడం కృషిలో అనాలోచితంగా జరిగిన చర్య కావచ్చు. కాని ఇందులో నిజాయితీ వుంది. ముందు ఓ మోసగాడిలా అనిపించినా ఇప్పుడు వచ్చిన మార్పుతో దానిని ఆకతాయితనంగా భావించాలని మనసు ఉబలాట పడుతోంది. అదికూడా కాదు ప్రేక్షకుల నుంచి అతడి మేధస్సుకి పెద్ద రెస్పాన్స్ లేకపోయినా అతడు సాగిస్తున్న ఒంటరి పోరాటానికి తనైనా అండ నిలవాలనిపిస్తూంది. అంతే.    
    "మిస్టర్ రాజేంద్రా- ఎల్ సాల్వడార్ కరెన్సీ పేరు"    
    "కోలన్స్"  
    "థాయ్ లాండ్ భాష పేరు"
    "థాయ్"    
    "హంగరీ రాజధాని"    
    "బుడాపెస్ట్"    
    "గ్రీక్స్ సిటీ ఆఫ్ సర్ గా పిలిచే లెబనాన్ సిటీ"    
    "బాల్ బెక్"    
    "జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ నాయకుడెవరు"    
    "అమానుల్లాఖాన్"    
    "ఏభై సంవత్సరాలపాటు ప్రపంచానికి దూరంగా ఒంటరితనంలో గడిపి ఈ మధ్యనే చనిపోయిన నటి పేరు"    
    "గ్రేటా గార్బో"    
    "మనిషి కిడ్నీ సగటున నిముషానికి ఫిల్టర్ చేసే బ్లడ్ ఎంత?"    
    "వన్ పాయింట్ త్రీ లీటర్స్"    
    "గ్రీక్ వేదాంతి ప్లేటో భార్య పేరు?"    
    "ప్లేటో అవివాహితుడు"    
    "ప్లేటో లాగే పెళ్లి చేసుకోని ప్రముఖ ఫ్రెంచ్ దార్శనికుడు"    
    "జీన్ పాల్ సార్త్రే"    
    "సిగ్మండ్ ఫ్రాయిడ్ భార్య పేరు?"    
    "మార్తా బెర్నేస్"    
    ఆడిటోరియం కరతాళ ధ్వనులతో నిండిపోయింది రాజేంద్ర పది ప్రశ్నల్ని నూరు శాతం ఆన్సర్ చేసిన సందర్భంగా.    
    "కంగ్రాట్స్ మిస్టర్ రాజేంద్ర. పది ప్రశ్నలకి సరైన జవాబులు చెప్పి మొత్తం నూట తొంభై మార్కుల్ని స్కోర్ చేశారు" క్విజ్ మాస్టర్ రాజేంద్రని అభినందిస్తూ విశ్వనాథ్ వేపు చూసాడిప్పుడు. "నౌ ఇట్స్ యువర్ టర్న్ మిస్టర్ విశ్వనాథ్. భార్యకాక సిగ్మండ్ ఫ్రాయిడ్ ని అమితంగా ప్రభావితం చేసిన యువతి ఎవరు?"    
    "మిన్నా..... ఫ్రాయిడ్ భార్య మార్తా చెల్లెలు."    
    "రైట్ పదిహేనేళ్ళ వయసులో ఇంట్లో నుంచి పారిపోయి ద్రాక్షతోటలో పని చేయడంతో పాటు అంట్లు తోమేవాడుగా, ఆటోమెకానిక్ గా పనిచేసిన ఓ వ్యక్తి అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు" క్విజ్ మాస్టర్ ప్రశ్న పూర్తి కాలేదు జవాబు చెప్పాడు విశ్వనాథ్.    
    "లిండా జాన్సన్"    
    "గాంధీని పెళ్ళి చేసుకునేసరికి కస్తూరిబాయి వయసెంత?"    
    "పదమూడేళ్ళు"    
    "సిఫిలిస్, తలనొప్పిలాంటి రుగ్మతలతో జీవితమంతా బాధపడిన ఫ్ర్రెంచి రచయిత ఎవరు?"    
    "మెపాసా"    
    "షెర్లాక్ హోమ్స్ రచయిత సర్ ఆర్ధర్ కానస్ డోయల్ పోస్టులో పోగొట్టుకున్న తొలి రచన పేరు."    
    నిశ్శబ్దంగా వుండిపోయాడు విశ్వనాథ్.    
    ఒకటి రెండు మూడు.....ఇరవై సెకండ్లు గడిచాయి.    
    కృషిలో టెన్షన్ ఉధృతమైంది.    
    ముఫ్ఫై సెకండ్లు పూర్తయిన సూచనగా బజర్ మోగగానే 'ది నెరేటివ్ ఆఫ్ జాక్ స్మిత్' అన్నాడు క్విజ్ మాస్టర్.    
    రాజేంద్ర రిలాక్స్ డ్ గా చూశాడు. అతడి అభిమానుల్లో ఉత్కంఠ అధికమైంది. విశ్వనాథ్ మరో ప్రశ్నకి జవాబు చెప్పకపోతే చాలు రాజేంద్ర గెలుస్తాడు.   
    "మార్క్ ట్వయిస్ అసలు పేరు?"   
    "సామ్ క్లెమెన్స్"    
    "అబ్రహం లింకన్ సెక్రటరీ పేరు?"    
    "కెన్నడీ"    
    "కెన్నడీ సెక్రటరీ పేరు?"    
    "లింకన్"    
    "ఎలక్షన్ తో అవసరం లేకుండా మూడేళ్ళు అమెరికా ప్రెసిడెంట్ గా వున్న వ్యక్తి?"    
    "గెరాల్డు ఫోర్డ్"    
    "ది లాస్ట్ క్వెశ్చనాఫ్ ది క్విజ్ కాంపిటీషన్" చెప్పాడు క్విజ్ మాస్టర్ వాసు విశ్వనాథ్ ని తదేకంగా చూస్తూ "కళ్ళకేదో మబ్బు కమ్మిన్నట్టుంటాది. నిదరల్లె నా వొల్లు నీరసిస్తున్నాది. తెలుగులో ఓ ప్రముఖ జానపద గీతంలోని పంక్తులివి.....ఆ గీతం రాసిన కవి ఎవరు."    
    జవాబు చెప్పలేదు విశ్వనాథ్.    
    ఆలోచిస్తున్నట్టుగా కళ్ళుమూసుకున్నాడు.    
    గెలుపూ ఓటములు నిర్ణయించే ఆఖరి ప్రశ్న అది.    
    విశ్వనాథ్ లో చలనం లేదు...    
    అప్పటికే ఇరవై అయిదు సెకండ్లు గడిచాయి. జవాబు చెప్పటానికి మిగిలింది అయిదు సెకండ్లు మాత్రమే.

 Previous Page Next Page