"అద్దాలమేడలో బ్రతికే నీలాంటి అమ్మాయికి కొన్ని సమస్యలలోతు అర్ధం కాదు"
"పెసిమిస్ట్ పరిస్థితులకి నెగెటివ్ గా రియాక్టయి మోసగాడవుతాడు. ఆప్టిమిస్ట్ అలా బ్రతకడాన్ని అయిష్ట పడుతూ అవసరమైతే ఆటో నడిపి పొట్టపోసుకుంటాడు."
ఫకాల్న నవ్వాడు.
"ఎందుకా నవ్వు"
"నేను ఆటోయే నడుపుకుంటే మీలాంటి అందమైన అమ్మాయి పరిచయమయ్యే అవకాశం వుండేదికాదుగా"
అతడేమిటో ఆ వ్యక్తి ఆలోచనలేమిటో పూర్తిగా అర్ధం కాక ఇక అతడితో మాట్లాడే పనిలేనట్టు "ముందు కారు దిగు" బింకంగా.
"పెనాల్టీ చెల్లించు"
"దేనికి" నివ్వెరపోయింది కృషి.
"నిన్న పోలీసులకి అప్పచెప్పినా నా పరువు తీసినందుకు."
"నీకో పరువు దానికో పెనాల్టీ"
"వెయ్యి రూపాయలు అనవసరంగా నష్టపోయాను కృషి. మర్యాదగా ఆ డబ్బిచ్చేయ్" కృషి రెచ్చిపోయింది "ఇవ్వకపోతే"
రెండు క్షణాల పాటు రెప్పలార్పకుండా చూసాడు "ఏం చేసేదీ చెప్పమంటారా కృషి. అటు చూడండి. అక్కడున్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓ వారగా ఆపివున్న ఈ ఇంపోర్టెడ్ కారుని పదినిముషాలుగా చూస్తున్నాడు. ఇక్కడ పార్క్ చేయకూడదని తెలిసినా ఎవరో పెద్దింటి అమ్మాయిగా భావించి మిమ్మల్ని అడగలేక చాలా మధన పడుతున్నాడు..."
కానిస్టేబుల్ చూపులు ఇంచుమించు అలాగే కనిపిస్తుంటే కోపాన్ని అదిమి పెడుతూ అంది "అయితే"
"ఇప్పుడు మీరు వెయ్యిరూపాయలు ఇవ్వకపోతే నేను మీ వేలెట్లోని డబ్బుని బలవంతంగా తీసుకు వెళతాను. అదిగో గట్టిగా అరుస్తాననకండి. ఒకవేళ అరిచాక బస్ స్టాపులో వున్న జనం కాని కానిస్టేబుల్స్ కాని పరుగెత్తుకొస్తే నన్ను ఓ దొంగని చెప్పగలరా....
"ఎందుకు చెప్పలేను"
"అప్పుడు ఇరుక్కునేది మీరే" ఓ అద్భుతమైన తర్కాన్ని ప్రయోగించాడు. "అవును కృషి దొంగే అయితే పది నిముషాల పాటు కారు డోర్స్ మూసుకుని ఎందుకు కూర్చున్నారూ అంటూ వాళ్ళు ప్రశ్నిస్తారు. బోయ్ ఫ్రెండ్ తో ఏదో రాచకార్యం వెలగబెట్టాలని కాకపోతే ఇంతసేపు గుసగుసలేమిటబ్బా అంటూ బుగ్గలు నొక్కేసుకుంటారు. అది మీకెంత డెలికేట్ గా వుండేదీ మీరు కాకపోయినా నేనూహించగలను."
ఆమె కూడ ఊహించేసిందేమో ఆవేశంగా వేలెట్ లోని వెయ్యి రూపాయలు తీసి అతడి మొహంపై గిరాటేసింది బహిరంగంగా జరుపుతున్న దోపిడీ ఎంత నిదానంగా మాట్లాడగలుగుతున్నాడు.
"థాంక్స్ మిస్ కృషి ఆడపిల్ల కలల్లోకి చొచ్చుకురాగల అందగాడివయ్యుండీ నీకీ డబ్బు వ్యామోహం ఏమిటీ అన్నది బహుశా మీ మొహంలోని ఎక్స్ ప్రెషన్ కి అర్ధమనుకుంటాను. దానికి నా జవాబు ఒక్కటే డబ్బునే ఓ అస్త్రంతో ప్రపంచాన్నే గెలిచేయగలనన్న థియరీ నమ్మే మనిషిన్నేను."
క్షణంపాటు కేరక్టర్ విషయంలో తనూ 'గ్రాండ్ పా' లాంటివాడ్నే అన్న విషయాన్ని సగర్వంగా వ్యక్తం చేసి కారు దిగి వెళ్ళిపోయాడు థూర్జటి.
స్థాయీ భేదం తప్ప ఇద్దరి ఆలోచనల్లో ఒక్కటే.
తాతయ్య విషయంలో అనుసరించే స్తబ్దత ఈ వ్యక్తితో ఎందుకు పాటించాలనే అనుకుందో లేక ఇత దారుణంగా ఓడించిన ఈ వ్యక్తికి శాశ్వతంగా బుద్ది చెప్పాలనుకుందో కారుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషనుకి పోనిచ్చింది.
నిజానికి తానెవరన్నది స్పష్టంగా తెలియచెప్పి అటు థూర్జటిని విడిచి పెట్టిన పోలీసులకి ఇటు థూర్జటికి బుద్ది చెప్పటం కష్టం కాదు.
పది నిముషాలలో కారు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆగింది.
కారు దిగిన కృషిని చూస్తూ ముందుకు ఊరికి వచ్చాడు యస్సై. నిన్న థూర్జటి ని అరెస్ట్ చేసిన వెంకట్రావ్.
"గుడ్ మార్నింగ్ మాడమ్" చాలా వినయాన్ని ప్రదర్శించాడు యస్సై. "మీరిద్దరూ లవర్స్ అన్న విషయాన్ని దాచేసి మిమ్మల్ని భలే ఫూల్స్ ని చేసేసారు. బహుశా జరిగిందానికి క్షమాపణలు చెప్పటానికి వచ్చారనుకుంటాను."
"వ్వాట్" దిభ్రాంతిగా చూసింది కృషి.
"మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు" సీరియస్ గా అంది కృషి.
ఆమె ముఖకవళికల్ని చూస్తూ చాలా ఇబ్బంది పడిపోయాడు యస్సై వెంకట్రావ్. "ఏదో తొందరపాటులో వివరాలు అడక్కుండా మీ బోయ్ ఫ్రెండ్ ని అరెస్ట్ చేశామే అనుకోండి. అంతమాత్రం చేత ఇండియన్ పోలీసులంతా ఫూల్సని మీరు తేల్చేయడం న్యాయం కాదు."
వచ్చింది థూర్జటిని ఎలా వదిలిపెట్టారో తెలుసుకోవడానికైతే ఇక్కడ మరోటి వింటూంది ఆమె.
"నిజమే...." తన తప్పిదాన్ని ఒప్పుకుంటున్నట్లుగా చెప్పాడు యస్సై వెంకట్రావ్. "రూల్ ప్రకారం మీ దగ్గరనుంచి ముందు రిటెన్ కంప్లెయింట్ తీసుకోవాలి. ఆ తర్వాతే నేరస్తుడ్ని స్టేషన్ కి రప్పించి పరిశోధన ప్రారంభించాలి. కాని నా పొరపాటెక్కడంటే మీరు చెప్పగానే రియాక్టయిపోవడం, మీ మాటమీద విశ్సుగార్ని అరెస్ట్ చేయడం..."
"విస్సు ఎవరు..."
"మీ బాయ్ ఫ్రెండ్"
ఇదంతా ఏమిటో ఆమెకు బోధపడకపోయినా థూర్జటి చాలా తెలివిగా పోలీసుల్ని ఫూల్స్ ని చేసి తప్పించుకున్నాడని అర్దమైపోయింది.
"అతనేం చెప్పాడు మీకు." సాలోచనగా అడిగింది.
"మీరు పుట్టింది ఇండియాలోనే అయినా పెరిగింది స్టేట్స్ లో అన్నాడు. మీ మధ్య తరుచుగా ఇండియన్ పోలీసుల తెలివి తక్కువ తనం గురించి వాగ్యుద్ధం జరుగుతుండేదని వివరంగా చెప్పేశాడు. ఈ దేశంలో పోలీసులు నిజాయితీ గురించి మేధస్సు గురించి నీకేం తెలుసని మొన్నెప్పుడో మిమ్మల్ని నిలదీసిన విషయమూ డిటైల్డ్ గా వివరించాడు."
"తర్వాత" ప్రశ్నార్ధకంగా చూసింది కృషి.
మొత్తం వివరాలన్నీ తన చేతనే ఆమె చెప్పించడం బొత్తిగా నచ్చలేదు యస్సైకి. "అసలు ఛాలెంజ్ చేసింది మీరేనన్నాడు"
"ఏ విషయంలో"
"పోలీసులు ఫూల్సని నిరూపించడంలో"
ఆమె నిశ్చలంగా చూసింది.
"అసలు మీరు మమ్మల్ని పిలవడమేమిటి, మీ బోయ్ ఫ్రెండ్ ని ఓ మోసగాడిగా మాకు చెప్పడమేమిటి, వెనక ముందూ చూడకుండా ఓ కోటీశ్వరుడికి కాబోయే అల్లుడ్ని మేం అరెస్టు చేయడమేమిటి. ఛఛ. మీ నమ్మకాన్ని నిజం చేసేసాను, తప్పు నాదే"
"అయినా కరెక్టు చేసుకున్నారుగా" థూర్జటి ఎంత తెలివిగా తప్పించుకుపోయింది మననం చేసుకుంటూ అంది కృషి. "మరి తను ఏ కోటీశ్వరుడికి కాబోయే అల్లుడో చెప్పాడా."
"మీరు ఉపాధ్యాయ గారి మనవరాలని తెలిశాక ఇక మీ తండ్రిగారితో మాకు పనేముంది చెప్పండి
నిర్విన్నురాలైంది కృషి.
"సరే." తదేకంగా చూస్తూ అందామె.
"ఛాలెంజ్ లో ఎవరు గెలిచినా మీకు శ్రమ కలిగించినందుకు కొన్ని ఫార్మాలిటీస్ పాటించటానికి డబ్బిచ్చాను మీకు అందజేయమని."
చక్కలిగిలి పెట్టినట్టు మెలి తిరిగిపోయాడు వెంకట్రావ్.
"సిగ్గుపడకండి. స్టేట్స్ లోనూ పోలీసులు ఇలాంటి ఫార్మాలిటీస్ ని కాదనరు."
"మరే. ఎక్కడయినా ఇంతే అనుకుంటాను మేడమ్" బోలెడంత సిగ్గుపడుతూ ఎంత తీసుకున్నదీ చెప్పకపోయినా మొత్తానికి డబ్బు తీసుకున్నట్టు పరోక్షంగా తెలియచెప్పాడు.
"అద్సరే..." చివరిగా అడిగింది కృషి.
"నా ఛాలెంజ్ ప్రకారం మిమ్మల్ని తప్పుదోవ పట్టించాను. కాని తన అసలు పేరు థూర్జటి అని చెప్పకుండా మరోటి చెప్పి ఆయన మిమ్మల్నెందుకు మిస్ లీడ్ చేసాడు?"
"థూర్జటా ఆయన అసలు పేరు విశ్వనాథ్ గా"