ఇలాంటి సంఘటనలెన్నో.....
తన్ను అమితంగా గౌరవించిన వ్యక్తీ ఒక్కడే! డివిజనల్ మేనేజర్.
"మూర్తీ! నిన్నూ సీట్లో ఎందుకు వేశానో తెలుసా? మరీ అసహ్యముగా తయారయిన అవినీతికి ఆనకట్ట వేయడానికి! నువ్వెలాంటి వాడివో నాకు తెలుసు. అందుకే నిన్ను ఎన్నుకున్నాను."
మరికొద్ది రోజుల్లో తనకూ మిగతా సిబ్బందికీ మధ్య సంబంధ బందావ్యాలు మరింత క్షీణింఛిపోయినాయి.
ఆఖరికి తనకు ఎంతో కాలంగా ప్రాణమిత్రుడుగా వున్న శర్మ కూడా తనకు దూరంగా మసలటం గమనించేసరికి తను కలవరపడ్డాడు.
తను ఆదరిస్తున్న సిద్దాంతం తప్పా, రైటా అన్న అనుమానం కలిగింది.
ఒకరోజు కావాలని తను శర్మ యింటికి వెళ్ళాడు.
తనను చూడగానే తనెందుకు వచ్చాడో శర్మకు అర్ధమయ్యింది.
"నువ్వు చేస్తున్నది తప్పని నేను అనటం లేదు రామచంద్రమూర్తి! కానీ మనం ఏర్పరుచుకున్న ఆశయాలూ, అభిప్రాయాలూ, సిద్దాంతాలూ యివన్నీ ఎవరి కోసం! కానీ వాటివల్ల మన చుట్టుపక్కలున్న వారందరికీ యిబ్బంది కలుగుతుంటే యింక వాటివల్ల ప్రయోజనం ఏమిటి? వాళ్ళందరూ కూడా సమాజంలో భాగమే కదా!"
'అయితే నన్నేం చేయమంటావ్! నేనూ అందరిలా అవినితీకి స్వాగతం పలకనా?"
"అలా అని నేను చెప్పను! కానీ మన పద్దతులు వాటినిద్వేషించే వారి మీద రుద్దే బదులు మనం మధ్య నుంచి పక్కకు తప్పుకోవటం ఉత్తమమని నా అభిప్రాయం.'
తనకు శర్మ మాటల్లోని అంతరార్ధం బోధపడింది.
నిజమే! ఇంత చిన్న విషయం ఇంతకాలం తనకెందుకు తట్టలేదా అన్న ఆశ్చర్యం. ఆ మర్నాడే డివిజనల్ మేనేజర్ ని కలుసుకుని తనను ఆ సీట్ నుంచి బదిలీ చేయమని కోరాలని నిశ్చయించుకున్నాడు. కానీ అప్పటికే ఆలస్యమయింది.
ఆ రోజే తనమీద కుట్ర జరిగింది.
తన ఆఫీసర్లు, తోటి సిబ్బంది -----అందరూ కలిసి పన్నిన పన్నాగానికి తన ఉద్యోగం బలయిపోయింది.
తన సీట్ దగ్గర కొచ్చి కూర్చున్న కాంట్రాక్టర్ హటాత్తుగా కొన్ని వందనోట్లు తీసి తన టేబుల్ సొరుగులో వేశాడు.
"మీరు మాకు చేసిన సహాయానికి చిరుకానుక సార్" అన్నాడు చిరునవ్వుతో. తనకు ఎక్కడ లేని కోపం వచ్చింది.
"నేను నీకేమీ చేయలేదు. నాకీ డబ్బు అవసరం లేదు. తీసుకెళ్ళు" ఇంకోసారిలాంటి పిచ్చి పనులు చేస్తే బయటకు గెంటిస్తాను. జాగ్రత్త "అంటూ ఆ నోటు సొరుగులో నుంచి తీసి అతనికివ్వబోతుంటే, బిలబిల మంటూ వచ్చారు అవినీతి నిరోధక శాఖ వాళ్ళు.
"మీరు లంచం తీసుకోవటం ప్రత్యక్షంగా చూశాం. రామచంద్రమూర్తిగారూ! దయచేసి మీరు వున్నచోట నుంచి కదలకండి. మీ ఆఫీసర్గారొచ్చాక మీ చేతులు నీళ్ళలో పెడతాము. ఈ డబ్బు మీరు తీసుకున్నట్లయితే ఈ నీళ్ళు రంగు మారుతుంది.
అంతా నిమిషాల్లో జరిగిపోయింది.
సిబ్బంది, ఆఫీసర్లూ అందరూ తనకు వ్యతిరేకంగానే సాక్ష్యం చెప్పారు.
అదేరోజు తను సస్పెండ్ అయ్యాడు.
తనకు బాధ కలిగించింది తను సస్పెండ్ అవటం కాదు.
అంతవరకూ తనను ఆకాశాని కేత్తేసిన డివిజనల్ మేనేజర్ తన విషయం ఏమాత్రం పట్టించుకోకపోవటం.
అతను తల్చుకుంటే తనమీద వచ్చిన అవినీతి కేస్ రద్దయిపోయేది.
కానీ అతనికి తలచుకోవటం అలవాటు లేదు.
రెండోసారి తనకు అనుమానం కలిగింది.
తనేన్నుకున్న మార్గం సరయినదేనా? తను వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాక సస్పెన్షన్ ఆర్డర్స్ కాన్సిల్ అయ్యాయి. కాని తనమీద కేస్ మాత్రం ఎటూ తేలలేదు.
రామచంద్రమూర్తిని చూసి కూడా చూడనట్లు తలలు తిప్పుకుంటూన్నారందరూ.
రామనాధం గట్టిగా అరుస్తున్నాడు.
ఒరే రాములూ! అడ్డమయినవల్లనూ ఆఫీస్ లోపలకు రానీయవద్దనీ ఓసారి చెప్పానా? ఏమిటీ జనమంతా? బయటకు పంపెయ్.
రామచంద్రమూర్తికి తెలుసు. ఆ మాట తననుద్దేశించే!
శర్మ చిరునవ్వు నవ్వుతూ పలుకరించాడు.
"ఈసారి చాలా రోజులకొచ్చావేం సంగతి! ఇంకెక్కడయినా జాబ్ దొరికిందా?"
"ఇంతకుముందు ఒక జాబ్ పార్ట్ టైం చేసేవాడిని. ఇప్పుడు పుల్ టైం చేస్తున్నాను."
అందరి తలలూ ఆశ్చర్యంగా తనవేపు తిరగటం తెలుస్తూనే వుంది.
"ఏమిటా జాబ్?" ఆశ్చర్యంగా అడిగాడు శర్మ.
"మా ఆవిడకు భర్త గా వుండటం. అదివరకు ఈ ఆఫీస్ పనిలో రోజుకి కొద్దిసేపే ఆమెకు భర్త ఉద్యోగం చేయడానికి వీలయ్యేది."