"వాడికి చిన్నప్పటినుంచి ఎక్కాలంటే భయమట. అందులో పదిహేడో ఎక్కం మరీనూ."
"అవును మరి పాపం?" అన్నారిద్దరూ అప్రయత్నంగా.
"ఈలోగా నేను చెట్టు దిగేసి గొడ్డలి తీసుకుని చెట్టు నరికిపారేశాను."
"వాడు మళ్ళా రాడా బాబాయ్?" అడిగాడు శంకూ అనుమానంగా.
"ఇంకెక్కడ వస్తాడు? చిక్కుడు చెట్టు నరికిపారేశంగా."
:కానీ దాని పక్కనే జామచెట్టు వుంది కదా?"
"రాక్షసులు జామచెట్లు ఎక్కారు."
"ఎందుకని?"
"వాళ్ళకో శాపం వుంది, జామచెట్టు ఎక్కితే రాళ్ళుగా మారిపోతారని ఎవరో ఓ ముని శాపం పెట్టాడట.
శంకు కు సీతకు ధైర్యం కలిగింది.
"అందుకే నేను జామ చెట్టు ఆకులూ కోసి నా దగ్గర పెట్టుకున్నాను." అన్నాడు సృజన్.
"ఒకవేళ రాక్షసుడు వచ్చినా వాడిని రాయిని చేసేస్తాడు - జామ ఆకులూ విసిరి! కదు బాబాయ్."
"అవున్రా!"
"ఇద్దరూ నిద్రలోకి జారిపోయారు.
సృజన్ స్కూటర్ కాలేజీ దరిదాపుల కొచ్చేసరికి స్వరూప్ రోడ్డు పక్కన నిలబడి చేయి ఊపాడు.
"ఏమిటిక్కడ నిలబడ్డావ్?" స్కూటర్ అతని దగ్గరకు తీసుకెళ్ళి ఆపి అడిగాడు.
"రంగాగాడి తమ్ముడికి చాలా సీరియస్ గా వుందటరా? నిన్ను పిల్చుకురమ్మన్నాడు."
"అరె పాపం! పద వెళదాం?"
ఇద్దరూ స్కూటర్ మీద రంగా ఇల్లు చేరుకున్నారు. ఇరుగ్గా వున్న సందులు, అపరిశుభ్రంగా వున్న వీధులు! ఇల్లు కూడా ఏ క్షణాన్నయినా కూలిపోయేంత పాతవి.
స్కూటర్ చప్పుడు వినగానే రంగా బయటికొచ్చాడు అతని ముఖం వాడిపోయి వుంది.
"మావాడికి హైఫీవర్! గవర్నమెంట్ హాస్పిటల్లో ఏవో మందులిచ్చారు గానీ తగ్గటం లేదు."
సృజన్ , స్వరూప్ ఇంట్లోకి నడిచారు.
ఇల్లు చాలా ఇరుగ్గా వుంది. ముందు గదిలో ఓ మూల దుప్పటి ముసుగు పెట్టుకొని వున్నడతని తమ్ముడు.
అతని చేయి పట్టుకుని చూశాడు సృజన్ వళ్ళు కాలిపోతోంది.
"పోనీ ప్రైవేట్ డాక్టరేవరికయినా చూపించకపోయావా?"
రంగా నవ్వాడు. "వాళ్ళడిగే పీజులు మేమెక్కడ కట్టగలం గురూ?"
చటుక్కున సృజన్ గుర్తుకొచ్చింది, రంగా తండ్రి చేసేది రైల్వేలో ఉద్యోగం. వాళ్ళకు రెండు పూటలా భోజనానికి కూడా చాలదు అతని సంపాదన.
"ఒరేయ్ - నేనిప్పుడే ఫోన్ చేసి మా ఫామిలీ డాక్టరునీ పిలిపిస్తా నుండు" అంటూ వెళ్ళి ఆ పక్కనే వున్న షాప్ నుంచి ఫోన్ చేసి తిరిగి వచ్చాడు.
"డాక్టరు గారు వస్తానన్నార్రా! కానీ యిల్లు తెలీదు కదా! అంచేత నువ్వే వెళ్ళి తీసుకురా! నీకు తెలుస్తుందా అయన డిఫెన్సరీ!"
"తెలుసురా! నీతో రెండు మూడు సార్లు వచ్చాను."
"నేను కాలేజీ నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ వస్తాన్లే!"
"సరే....."
స్కూటర్ స్టార్టు చేసి కొంతదూరం వెళ్ళాక మళ్ళీ వెనక్కు తిప్పి రంగా యింటి దగ్గర ఆపి .....హరన్ మోగించాడు. రంగా మళ్ళా పరుగుతో బయటికొచ్చాడు.
"ఏమిట్రా?"
"నువ్వొట్టి ఇడియట్ వి!" చిరాగ్గా అన్నాడు సృజన్.
"అయితే అయిండవచ్చు గానీ" ఇప్పుడు ఆ విషయం ఎందుకు?" నవ్వుతూ అడిగాడు రంగా.
"లేకపోతే ఏమిట్రా? డాక్టరు వచ్చి మందులూ అవీ రాస్తాడనుకో? అవి కొనడానికి డబ్బుందా నీ దగ్గర?"
"ఏదో మేనేజ్ చేస్తాన్లె రా! డాక్టర్ ని ఎరేంజ్ చేస్తున్నావు కదా? ఆ సహాయం చాలు!"
"అందుకే ఇడియట్ అన్నది నిన్ను! డబ్బు విషయంలో మొఖమాటపడవద్దని ఎన్నిసార్లు చెప్పాలిరా......ఇదిగో .....! ఈ రెండొందలూ తీసుకో! ఒకవేళ యింకా అవసరమయితే నన్ను మళ్ళీ అడుగు! సరేనా?
"అలాగేరా!" డబ్బు తీసుకుని జేబులో పెట్టుకుంటూ అన్నాడు రంగా.
సృజన్ స్వరూప్ తో బాటు మళ్ళీ కాలేజీ వేపు బయల్దేరారు.
"వదినా ! వదినా! కాలేజీ కెళ్ళాడానికి రడీ అయి వంట గదిలో కొచ్చాడు సృజన్.
"ఏమిటి?"
"అర్జంటుగా నాలుగొందలు కావాలోదినా! ఫీజ్ కట్టాలి."
"సుభద్ర నవ్వింది. "నీకు అప్పుడే మతిమరుపు వచ్చేసిందన్నమాట! నిన్నేగా ఇచ్చాను?"
"అదా......అది నిన్ననే ఖర్చయిపొయిందొదినా......! రంగాగాడి తమ్ముడికి టైఫాయిడ్ అని అనుమానపడుతున్నారు. మందులకీ - వాటికీ డబ్బు లేదంటే ఇచ్చాను."
సుభద్ర ఏమీ మాట్లాడలేదు. ఆమె మౌనం సృజన కీ యిబ్బంది కలిగించింది.
"మాట్లాడవేం వదినా? అలా ఇవ్వటం నీకిష్టం లేదా?" అసహనంగా అడిగాడు.
సుభద్ర నవ్వేసింది.