Previous Page Next Page 
ఆఖరి ఘడియలు పేజి 5


    అతను చిల్లరిచ్చాడు. తనకు "థాంక్స్" చెప్తుందేమోనని ఆమె వేపు చూశాడు భవానీశంకర్. కాని ఆమె బస్ లో ఏ మూల చూసినా కనిపించే కుటుంబ నియంత్రణ పబ్లిసిటీ బోర్డులు చూస్తోంది.
    బస్ విజయనగర కలనీ చేరుకుంది.
    స్మితారాణి బస్ దిగి నాలుగడుగులు వేసి ఎందుకో అనుమానం వచ్చి వెనక్కు తిరిగి చూసింది. తన వెనుకే నింపాదిగా నడుస్తూ వస్తోన్న భవానీశంకర్ ని చూసేసరికి ఆమె కోపం ఆగలేదు.
    "హు! అనుకుందోసారి.
    భవానీశంకర్ గతుక్కుమన్నాడు కొంపతీసి , తనీమే వెంటపడుతున్ననని అనుకోవడం లేదు కదా౧ నిజానికి ముందు అదే అనుకున్నా అలాంటి ఆలోచనలు బస్ లోనే కాన్సిల్ చేసుకున్నాడతను.ఎందుకంటే క్షణక్షణానికి ఆమెకు తన మీద కోపం పాదరసంలా పాకిపోవటం అతని కిష్టం లేకపోయింది.
    మెయిన్ రోడ్ వదలి సందులోకి తిరిగేసరికి ఆమెకు అనుమాన నివృత్తి అయిపొయింది. తప్పకుండా ఈ రౌడీ తన వెంటపడుతున్నాడు. అయితే వెంటపడే రౌడీల బారి నుండి తప్పించుకోవాలనే మనస్తత్వం కాదామేది. అంచేత అతని కేలాగయినా బుద్ది చెప్పాలన్నా కోరిక ఆమెలో బలంగా నాటుకు పోయింది.
    భవానీశంకర్ సందు తిరిగి టక్కున నిలబడిపోయాడు.
    ఆ అమ్మాయి వెళ్ళే సందులోకే తనూ వెళ్ళాల్సి రావటం కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. దానికి తోడు ఆమె తననో రౌడీ వెధవని చూచినట్లు ఉండుండి వెనక్కు తిరిగి చూడటం - ---ఈ పరిస్థితుల్లో తనా ఆమెను  ఓవర్ టేక్ చేసి నడవడం ఉత్తమ మనిపించింది. ఆప్పుడిక తనాఆమెను వెంబడిస్తున్నాడన్న అనుమానం ఆమె కుండదు.
    అడుగుల వేగం పెంచాడతను. ఆ విషయం గమనించిందామె.
    ఆ సందులో ఉండుండి ఓ సైకిల్ వెళ్ళటం తప్పిస్తే వేరే జన సంచారమే లేకపోవటంతో స్మితారాణి అతనిమీద కొత్త అనుమానాలు ప్రారంభమయ్యాయి. కొంపతీసి నడిరోడ్డు మీద పిచ్చి వేషాలు వేయడు కదా . ఈ రోజుల్లో ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆమెకు చాలా అనుభవాలు చెప్పాయ్. ముఖ్యంగా సినిమాల్లో యేదయినా హీరో హీరియిన్ల అల్లరీ వ్యవహారం చూస్తె మర్నాడే దానిని కాలేజీ రోడ్ల మీద , ఇతర చోట్లా అమలు చేయటానికి కుర్రకారు ప్రయత్నించటం చాలాసార్లు జరిగింది.
    భవానీ శంకర్ ఆమెకు సమీపంగా వచ్చేశాడు.
    స్మితకు టెన్షన్ పెరిగిపోతుంది.
    అతను తనమీద చేయి వేయటం గానీ, లేక తనను చూసి విజిల్ వేయటం గానీ చేస్తే మాత్రం వెంటనే వీలయినంత ఫోర్సుతో అతని చెంప పగలగొట్టాలని నిర్ణయించుకుని సంసిద్దమయిపోయింది.
    భావానీశంకర్ ఆమె పక్కకు వచ్చేశాడు.
    స్మిత చేయి స్ప్రింగ్ యాక్షన్ కి రెడీగా వుంది.
    హటాత్తుగా భవానీశంకర్  దృష్టీ ఎదురుగా వస్తున్న కారు మీద పడింది. క్షణాల్లో దానివేగం ప్రమాదకరంగా పెరిగిపోయింది.
    మిగతాదంతా కన్నుమూసి తెరిచే లోపల జరిగిపోయింది.
    అలా భయంకరంగా కారు తన మీదకు రావటం , స్మితను భవానీ శంకర్ చటుక్కున తనతో పాటు లాక్కుని కాంపౌండ్ వాల్ కి అతుక్కుపోవటం , కేవలం వెంట్రుక వాసిలో స్మిత పక్కనుంచీ కారు దూసుకుపోవటం ఆ ప్రమాదం గమనించని స్మిత చెయ్యి భవానీశంకర్ చెంపమీద బలంగా నాట్యం చేయటం ......
    ఇన్ని కార్యక్రమాలు కేవలం ఆ ఒక్క సెకండ్ లో జరిగిపోయాయ్.
    కొద్ది క్షణాల పాటు స్మిత ఆ షాక్ నుంచి కోలుకోలేక పోయింది. తనను ఆకారు డీ కొందనే అనుకుంది. తప్పించుకోడానికి కూడా కదల్లెనంత సమయంలో మీద కొచ్చేసిందది. భవానీశంకర్ తనను ఆ సమయానికి కాంపౌండ్ వాల్ మీదకు లాగకపోయినట్లయితే తను ఈ పాటికి ........
    నుదుటి మీద స్వేదబిందువు లోచ్చేసినాయ్ ఆమెకు.
    "టేకిల్ ఈజీ మిస్" అన్నాడు భవానీ శంకర్ చిరునవ్వు తో.
    "ఎంత రాష్ డ్రయివింగ్ ?" కూడబలుక్కుని అందామె కర్చీఫ్ తో చెమటలు తుడుచుకుంటూ. ఆమె చేతులింకా వణుకుతూనే ఉన్నాయ్.
    "ఇది మన రాజధాని నగరం ఫ్రెండ్ శరీరాల్లో రక్తం ప్రవహించే జనాభా కన్నా మందు ప్రవహించే జనాభా మిక్కుటంగా ఉన్న నగరం......."
    హటాత్తుగా స్మితకు తన చేయి ఇంకా అతని చేతుల్లోనే ఇరుక్కుని ఉన్నదన్న విషయం గుర్తుకొచ్చి ఒక్కసారి విసురుగా తన చేతిని లాక్కుంది.
    భావానీశంకర్ చిన్నగా నవ్వాడు. ఆమెకు పౌరుషం పొడుచుకొచ్చింది.
    "అక్కడికి నువ్వో పెద్ద హీరో ననుకొను! నువ్వు లేకపోయినా తప్పించుకునే దానిని -" అందామె రోషంగా. నిజానికామెకు అంత పెద్ద అబద్దం చెప్పాలంటే చాలా అనీజీగా వుంది కానీ తప్పదు- రౌడీలతో.
    "మీ స్టేట్ మెంటుని నేను శంకిస్తున్నాను మేడమ్-ఓ.కే. ఏదే మయినా ఇప్పుడు నేను ప్రదర్శించింది హీరోయిజం కాదు. రక్షించుకోవటం . రక్షించుకోవటం మరి హీరోయిజమనిపించుకుంటుందని నేననుకోను.'
    స్మిత మాట్లాడలేదు.
    మరోసారి "హు!" అని చరచరా అక్కడి నుంచి ముందుకు నడిచింది.
    

                                                            2

    భవానీశంకర్ కొద్ది క్షణాల పాటు గోడకు రాసుకుని చర్మం రేగిపోయిన తన పాదానికి జేబులో వున్న చాకుపీసుతో ఫస్ట్ యిడ్ చేసుకుని మళ్ళీ నడక ప్రారంభించాడు.
    ఇప్పుడతని ఆలోచనలు స్మిత మీద లేవు.

 Previous Page Next Page