Previous Page Next Page 
లీడర్ పేజి 6

    "అమ్మా రమణా!" అన్న పిలుపు వినిపించింది.    
    ఊరు కాని ఊరులో ఇంత ఆప్యాయమైన పిలుపేమిటి ఆశ్చర్యంగా వెనుదిరిగి చూసింది రమణ.    
    ఎదురుగుండా వెన్నేటి  సత్యనారాయణగారు, ఆమె తండ్రికి సహాధ్యాయీ, ఆప్తమిత్రుడూ, శ్రీహరిరావుకి జైలు మేటూ, గురుతుల్యుడూ అయిన వ్యక్తి "నేనీ రాత్రికే ఆఖరి బస్సులో రామచంద్రాపురం వెళుతున్నాను నాన్నాగారికేం చెప్పమంటావు?" అనడిగారు.    
    "అంతా సవ్యంగా జరుగుతోంది. మేమందరం క్షేమం! అని చెప్పండి" అందామె నిబ్బరంగా.    
    "నువ్వూ, పిల్లా తిరిగి వచ్చెయ్యాలనుకుంటే, కూడా...." అనబోతుండగా-    
    "మావయ్యగారూ!" అని అడ్డుపడిందామె.    
    "కష్టమో, సుఖమో అయనతోటే నాన్నగారితో చెప్పండి" అంది చాలా స్థిరంగా.    
    అయనకింక నోరు పెగల్లేదు, "జాగ్రత్తమ్మా!" అని చెప్పి వెళ్ళిపోయారు ఆ చీకట్లోనే.    
    ఆ రాత్రికా గెస్ట్ హౌస్ లో వసతి దొరికింది. మర్నాడు ప్రొద్దుటే బయలుదేరి వెళుతుండగా మాస్టారుగారు గుమ్మంలో నిలబడి కనిపించారు. వెనుకగా అయన తల్లిగారు! అన్నపూర్ణలా ఆదరించి, అన్నం పెట్టిన తల్లి! శ్రీహరిరావు గుసగుసగా భార్యతో చెప్పాడు. "ఆవిడే మాస్టారుగారి తల్లి!"    
    రమణ చేతులు జోడించింది. ఆవిడక్కడ నుండే కళ్ళతో ఆశీర్వదించారు. ముందుకు సాగిపోయారు. నాలుగడుగుల దూరంలో ఇద్దరు పోలీసులు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.    
    బృందం అంతా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ తరువాత మజిలీ వైపు సాగిపోయారు.    
                                     *    *    *    *    
    ఎన్నో చిన్న చిన్న మజిలీలు తర్వాత విశాఖపట్టణం చేరారు. అక్కడ 'టర్నర్' సత్రంలో బసచేశారు, వైజాగులో ఆయనకి లెక్క లేనంతమంది శిష్యులు, అయన ప్రసంగాలకోసం ఏర్పాట్లు జరిగిపోయాయి,
    తండోపతండాలుగా జనం వచ్చారు. అయన ప్రసంగాలకి పరపశులై, చాలామంది విద్యార్ధులు తమనికూడా ఆయనతోబాటు యాత్రలో పాల్గొననివ్వమని అర్ధించారు. కానీ ప్రయాణం అంతా చాలా కఠినమైన నియమాలతోనూ, కష్టమైన బాటల్లోనూ సాగుతుంది కాబట్టి, ఆయన వారిని ప్రోత్సహించలేదు.    
    విశాఖపట్టణం నుండి విజయనగరంవేపు బయలుదేరారు.    
    విజయనగరంలో ఓ సత్రంలో బస.    
    శ్రీహరిరావుకి విజయనగరం చూడగానే తన కాలేజీ రోజులు గుర్తొచ్చాయి, చిన్నప్పటినుండీ విద్యాభ్యాసం మీదున్న మక్కువకొద్దీ తను మేనమామగారింట వుండవలసి వచ్చింది. ఒకరి మాటకి కట్టుబడి వుండడం, ఒకరు చెప్పినట్లు తన కిష్టంలేని పనులు చెయ్యడం ఆయనకి సరిపడని విషయాలు కాని విద్యమీదున్న ఆసక్తికొద్దీ ఆయన మేనమామ మాట ఎప్పుడూ జవదాటలేదు. అయన కూతుర్నిచ్చి పెళ్లిచేసినప్పుడు కూడా అది తన బాధ్యతగా ఎంచి పెళ్ళి చేసుకున్నాడు. కానీ, విజయ నగరం కళాశాలలో చేరాకా, ఆయన మనసు ఒక్కొక్క రెక్కే విప్పుకుని, స్వేచ్చా విహంగమై స్వాతంత్ర్యం కొరకు కొట్టుకోసాగింది. అటువంటి సమయంలోనే 'మహాత్ముడు' పిలుపు నివ్వడం, ఈయన స్వాతంత్ర్యోద్యమంలోకి అడుగుపెట్టడం జరిగింది. అయన స్వేచ్చాజీవి. శృంఖలాలు ఆయనకిష్టం వుండవు. తనకి బంధాలువేసి ఆపాలని చూసేవారిని ఆయన చాలా దూరంగా వుంచుతారు. తన ధ్యేయంవైపు అడుగులు వేస్తుండగా, వెనక్కి లాగేవారిని ఆయన అసహ్యించుకుంటారు. ఈ విషయాలని రమణ చాలా బాగా అర్ధం చేసుకుంది. అందుకే రమణంటే ఆయనకి చాలా ప్రేమ!    
    ఆయన తన పాత రోజులు తలుచుకుంటూ కాలేజీవేపు నడిచారు. ప్రిన్స్ పాల్ శొంఠి పురుషోత్తంగారు! వారి గదిలోకి అడుగుపెడుతుండగా ఎందుకో ఒక్క నిముషం గగుర్పాటు కలిగింది. అది భయమో! పులకింతో అర్ధంకాలేదు.    
    ఆయన శ్రీహరిరావుని గుర్తించలేదు. "ఎవరూ?" అన్నారు.    
    "నా పేరు శ్రీహరిరావు. మీ పాత విద్యార్ధిని" అంటూ గుర్తుచేయ ప్రయత్నించాడు.    
    వయసు మీదపడడం వలననో, లేక అనేకమంది శిష్యులలో గుర్తు లేకనో అయన మొదట గుర్తుపట్టలేదు. శ్రీహరిరావు తన బృందం సంగతీ, తాము చేసే ప్రయాణం గురించీ చెప్తుండగా, ప్రిన్స్ పాల్ గారికి, ఆవేశంగా రంగస్థలం మీద దేశభక్తి గురించి లెక్చర్లిస్తున్న సన్నటి కుర్రవాడు గుర్తుకొచ్చాడు. ఆయన పెదవులమీద చిరునవ్వు మెరిసింది.    
    "నేను మీ కాలేజీ ఆడిటోరియం వాడుకోవచ్చునా? జనం రాకపోతే ఒక్క రోజుతోనే నా ఉపన్యాసాలు ముగిస్తాను" అన్నాడు అర్ధింపుగా.    
    ఆయన తలాడించి, "సాయంత్రం ఐదు దాటిన తర్వాత హాలు ఖాళీగా వుంటుంది. కాబట్టి ఉపయోగించుకోవచ్చు" అన్నారు.    
    అందుకాయన కృతజ్ఞతలు చెప్పుకుని, బయటకొచ్చేశాడు శ్రీహరి.    
    మొదటి రోజున జనం చాలా పలచగావచ్చారు. ఎటువంటి ప్రచారం, ఆర్భాటంలేదు. చాలా మామూలుగా అక్కడ కూర్చున్న పది, పన్నెండు మందికే తన ఉపన్యాసం ఇవ్వసాగారు. ప్రిన్స్ పాల్ గారు ఇంటికి వెళ్తూ, వెళ్తూ ఏం చెప్తున్నాడో చూద్డామన్నట్లు అటు వచ్చారు.    
    శ్రీహరిరావు మైకు పట్టుకుని తన సహజ వాగ్భటిమతో మతాన్ని గురించి, రాజకీయాల గురించీ, మానవ జీవితాన్ని గురించీ ఎన్నో విషయాలు అనర్గళంగా ప్రసంగిస్తుంటే, ఐదు నిమిషాలు నిలబడి వెళ్ళిపోదామని వచ్చినాయన మూడు గంటలు అట్టే నిలబడిపోయారు!    
    ఇతను, ఆ శ్రీహరేనా? ఎక్కడనుండి వచ్చింది ఈ జ్ఞానసంపద? ఇంత లేత వయసులో జీవితంమీద ఇంత అవగాహనా? అని ఆశ్చర్యంతో స్థాణువై పోయారు.    
    మర్నాటికి జనం ఇసుక వేస్తే రాలకుండా వచ్చారు. ఆ విధంగా ఉపన్యాస సప్తాహం అంటే ఏడురోజులు దిగ్విజయంగా జరిగాయి.    
    ఎనిమిదో రోజున, సభలో శ్రీహరిరావుకి కాలేజీ తరపున సన్మానం ఏర్పాటయింది.    
    ప్రిన్సిపాల్ గారు స్టేజ్ మీదికి రాగానే, శ్రీహరిరావు లేచి పాదాభి వందనం చేసాడు. అయన వెంటనే పొదివిపట్టుకుని లేవదీసి నీళ్ళునిండిన కళ్ళతో, జనాన్నుద్దేశించి, "ఈకుర్రవాడు 'ఏమిరా శ్రీహరీ?' అనిపించుకుని నాచేత, ఇక్కడ చదువుకుని, ఈనాడు మళ్ళీ 'ఏమండీ శ్రీహరిరావు గారూ!' అనిపించుకునే పరిస్థితుల్లో మన కాలేజీకొచ్చి మనకి తెలియని ఎన్నో విషయాలమీద అనన్య సామాన్యమైన ప్రతిభతో ఉపన్యసించడం మన కాలేజీకే గర్వకారణం,  నా కెంత ఆనందంగా వుందో వ్యక్తం చెయ్యడానికి నాకు మాటలు చాలవు" అంటూ గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు. అనంతరం, ఖద్దరు శాలువా కప్పి, పుష్పమాలవేసి కాలేజీ నుండి ఒక 'పర్సు' బ్రెజెంట్ చేసారు.

 Previous Page Next Page