Previous Page Next Page 
ఖజురహో పేజి 6


    కాంచన చిరునవ్వు నవ్వి "ఇంత పని పెట్టుకుని ఎలా పడుకోమంటావమ్మా?" అంది.
    
    సంధ్య ఆశ్చర్యంగా తల్లి భుజాలమీద చేతులు వేసి- "పనా....?" అంది.
    
    కాంచన కళ్ళు పెద్దవి చేసి "నీకోసం, నాన్నగారి కోసం ఎదురుచూస్తూ కూర్చోవడమేగా నా పని! అది మానేస్తే ఇకనేను బ్రతకడం ఎందుకూ?" అంది.
    
    సంధ్య ముందుకి వంగి తల్లి నుదుటిమీద మృదువుగా ముద్దు పెట్టుకుంది. ఎన్నో ఏళ్ళుగా విసుగూ విరామంలేకుండా తల్లి చేస్తున్న పని అది. ఎక్కువగా నడవకూడదు, మాట్లాడకూడదు, ఆలోచించకూడదు. ఏపని చేసినా ఆమె సున్నితమైన గుండె ఆగిపోతానని మొరాయిస్తుంది. అందుకే ఆమెని పువ్వుకన్నా సున్నితంగా చూసుకుంటాడు ఆమె తండ్రి జయచంద్ర!
    
    'కార్డియో మయోపతీ!' ఆమెని ఎలాగైనా ఆ రక్కసి బారినుండి కాపాడుకోవాలని జయచంద్ర చెయ్యని ప్రయత్నం లేదు. తన గుండెని తీసి ఆమె గుండె స్థానంలో అమర్చడానికైనా అతను సిద్దమై ట్రాన్స్ ప్లాంటేషన్ గుండె విషయంలో అంత సులభం కాకపోవడం వలనా, రిస్క్ ఎక్కువ కాబట్టి, ఉన్నన్ని రోజులైనా ఆమె తన కళ్ళముందు తిరిగితే చాలని మనసుకి నచ్చచెప్పుకున్నాడు అతను.
    
    ఆమె జబ్బు విషయం కార్డియోమయోపతీ అని డాక్టరు చెప్పినప్పటినుండీ ఆ ఇంట్లో ఓ రకమైన వాతావరణం ఏర్పడిపోయింది. సంధ్య స్కూల్ నించి వచ్చాక తోటి పిల్లలతో ఆడుకోవడం మానేసింది. తల్లి దగ్గరే కూర్చుని ఆమెతో స్కూల్ సంగతులు చెప్పటం, తల్లికి ఇష్టమయిన సంగీతం ఆమెతో కలిసివినడం అలవాటు చేసుకుంది. సంధ్య తండ్రి బిజినెస్ పనులమీద బయట వూళ్ళకు వెళ్ళాల్సొచ్చినప్పుడు తప్ప మిగతా అన్ని వేళలా కాంచన మంచంమీదే కూర్చుని ఆమెతో కార్ద్సు ఆడుతూనో, కబుర్లు చేపుతూనో గడిపేవాడు. అలా ఆ ముగ్గురూ తమ చుట్టూ ఓ వృత్తం గీసుకుని అందులో ప్రపంచాన్ని చూస్తూ గడపడం మొదలుపెట్టారు.
    
    "నేనూ.....నాన్నగారూ, అమ్మా" సంధ్య మాటల్లో ఇవే మాటలు తరచూ దొర్లుతూ వుంటాయి.
    
    అంతపెద్ద ఇల్లున్నా ఆ ముగ్గురూ ఎక్కువగా ఒకే గదిలో గడుపుతుంటారు. ఆ ఇంటిని మెయింటెయిన్ చేయడానికి అవసరమైన నౌకర్లని చూస్తూ సంధ్య "డాడీ! ఇంత ఇల్లు మనకెందుకు? మూడు గదులు చాలవా? ఒకటి నీ ఆఫీసు పనికీ, రెండు మనం పడుకోడానికి, మూడు వంట చేసుకోడానికి" అని అమాయకంగా అడుగుతుండేది.
    
    జయచంద్ర బదులుగా నవ్వి కూతురు తలని గుండెలకి అదుముకుంటాడు. తను సంపాదించే ఈ డబ్బూ, ఆ డబ్బువల్ల అమరే అరమసౌఖ్యాలూ తనకుగాని, తన కూతురుకిగాని, భార్యకిగానీ అవసరంలేదని అతనికి తెలుసు ఆ ముగ్గురికీ కావల్సింది ఒక్కటే. అది.....ప్రేమ దారానికి గుచ్చబడిన పూసల్లా ఆ ముగ్గురూ కలిసిన హారమే తన ఇల్లు అని అతని నమ్మకం! కానీ డబ్బు సంపాదించడం అనే వ్యాపకం లేకపోతే తనేం చెయ్యాలి? పిచ్చెక్కిపోతుంది. అందుకే అతను పగలూ, రాత్రీ వ్యాపార వ్యవహారాల్లో మునిగి తేలుతుంటాడు.
    
    "ప్రొద్దుట డాడీ ఫోన్ చేశారు" అంది కాంచన.
    
    సంధ్య వెంటనే చిన్నపిల్లలా-
    
    "హే..." అని అరిచి "ఏమన్నారూ? నా గురించి ఏం అడిగారూ?" అంది.
    
    కాంచన కూతురి ఆత్రుతని చూసి నవ్వుతూ-అంతా నీ గురించే అడిగారు. సంధ్య కొత్త కాలేజీకి వెళ్ళిందా....? నేను లేనని ఒంటరితనం ఫీలవుతుందా? ఎవరినైనా ఫ్రెండ్షిప్ చేసుకోమనూ....అస్తమాను చదవవద్దనూ....ఇలా అన్నీ నీ గురించే" అంది.
    
    సంధ్యకి తండ్రి గుర్తుకురాగానే అప్రయత్నంగా కంటనీరు తిరిగింది. ఎక్కడి కెళ్ళినా ఏం చేస్తున్నా ఇదే ధ్యాస.....! అమ్మ ఆరోగ్యం గురించో, లేక తన ఒంటరితనం గురించో ఆలోచిస్తూ వుంటారు. అలా చెయ్యకూడదు. ఎవరినైనా తను స్నేహం చేసుకుని 'డాడీ ఐయాం హేపీ. మీరు మీ పని నిశ్చింతగా చూసుకోండి' అని చెప్పాలి అనుకుంది. అలా అనుకోగానే ఆమెకి చాయ గుర్తుకువచ్చింది. వెంటనే తల్లి కాళ్ళదగ్గర నేలమీద కూర్చుండిపోయి- "అమ్మా....మా క్లాసులో ఓ అమ్మాయి వుంది" అంది.
    
    "ఒక్క అమ్మాయే వుందా....?" కాంచన ఆటపట్టిస్తున్నట్టుగా అంది.
    
    సంధ్య బుంగమూతిపెట్టి- "పో అమ్మా.....అదికాదు.....ఆ అమ్మాయి ఎంత అందంగా వుందో తెలుసా? అసలింతవరకు అంత అందమైన వాళ్ళని ఈ ప్రపంచంలో నేను ఇద్దర్నే చూసాను" అంది.
    
    "ఇద్దర్నా?" ఆశ్చర్యంగా అడిగింది కాంచన.
    
    సంధ్య వెంటనే తల్లి ఒడిలో ముఖం దాచుకుని "అవును! ఒకరు మా అమ్మ, రెండోది ఆ అమ్మాయీ" అంది.
    
    ఆమె మాటలకి కాంచన పెద్దగా నవ్వేసి - "పిచ్చిమొద్దూ..... ఎంత అమాయకురాలివమ్మా..... ఈలోకంలో ఎలా బ్రతుకుతావో?" అంది.
    
    సంధ్య లేచి తల్లి మంచం దగ్గరున్న టేబుల్ మీద పెట్టిన ఫోటో ఫ్రేమ్ చేతుల్లోకి తీసుకుని- "ఈ అమ్మాయికన్నా అందమైన అమ్మాయి నా జీవితంలో తారసపడలేదు అని డాడీ ఎప్పుడూ అనరూ?" అంది.
    
    కాంచన కూతురి చేతిలోని తమ పెళ్ళి ఫోటో వంక నిర్వేదంగా చూసింది. ఇరవై ఏళ్లక్రితం భర్త పక్కన సిగ్గుగా, భయంగా, అంతకుమించి ఏదో సాధించానన్న గర్వంగా నిలబడి తీయించుకున్న ఫోటో అది. జీవితం ఎక్కడ ప్రారంభం అయిందీ అంటే.....జయచంద్రని కలిసిన మొదటి క్షణంలోనే అని కాంచన అభిప్రాయం.
    
    ఆమె జీవితానికో అందమైన ప్రారంభాన్నిచ్చిన దేవుడు ఆ ఆనందాన్ని కడదాకా కాపాడలేక నడిమధ్యలోనే చేతులు దులిపేసుకున్నాడు. తృప్తినిచ్చే ముగింపుని ఇవ్వలేకపోయాడు ఎందుచేతనో!
    
    కాంచన కళ్ళల్లో నీహారికలా తడి అలుముకుంది. ఆ మంచుతెరల మాటునుండి బయటికి వస్తున్న సూర్యుడిలా జయచంద్ర రూపం మసకమసగ్గా ఆమెకి కనబడుతోంది. ఫోటోని తడుముకుంటూ ఆలోచనల్లో పడిపోయింది.
    
    ఎన్ని ఉదయాలు, ఎన్ని అపరాహ్నాలు, ఎన్ని సాయంత్రాలు.... ఎన్నెన్ని సుందరమైన రాత్రులు అతనితో కలిసి పంచుకుందీ? ఎప్పుడూ అదే కొంటెతనం ఏకాంతంలో! ఎప్పుడూ అదే హుందాతనం ఎవరైనా వున్నప్పుడు ఆ స్పర్స, ఆ చూపు, ఆ నవ్వు, ఆ శబ్దం, ఆ మనిషి, ఆ పిచ్చిలో తను.....అబ్బా! ఎంత అనుభవించినా తనివితీరదేం? ఇన్ని ఇచ్చిన ఆ మనిషికి నేనేం ఇస్తున్నానూ? కాంచన గుండెల్లో సన్నగా ముల్లుతో పొడుస్తున్నట్టుగా నొప్పి మొదలై క్రమేణా ఎక్కువకాజొచ్చింది.
    
    "అమ్మా! హార్లిక్స్!" సంధ్య హార్లిక్స్ కప్పుతో వచ్చింది.
    
    కాంచన నొప్పిని దాచుకోడానికి ప్రయత్నిస్తూ- "అక్కడ పెట్టివెళ్ళమ్మా నాకు నిద్రొస్తోంది" అంది.
    
    సంధ్య వెళ్ళలేదు. తల్లి పెదవి మునిపంట నొక్కి పెట్టడం గమనించింది. "అమ్మా నొప్పిగా వుందా? డాక్టర్ గారికి ఫోన్ చెయ్యనా?" కంగారుగా అడిగింది.

 Previous Page Next Page