ఆమె అతనివైపు తిరిగింది.
"నాకో అనుమానమొస్తుంది."
"చెప్పండి" అన్నట్లు చూసింది.
"మన పెంపకంలో లోపం ఉందంటావా? లేకపోతే ఈ జనరేషనే అలా ఉందంటావా?"
విశారద మృదువుగా నవ్వింది. "మీకూ, ఈ జనరేషన్ కీ తేడా ఇరవై రెండేళ్ళు. ఇంతలో ఇంత మార్పు వస్తుందంటారా?"
"మరి మనం పెంచటంలోనే లోపం ఉందంటావా?"
"తెలీటం లేదు."
"పిల్లల్ని కేవలం తండ్రి కదా అన్న అహంకారంతో కాకుండా వాళ్ళకూ మనసూ, వ్యక్తిత్వమూ ఉంటుందన్న ఉద్దేశంతో ఫ్రెండ్స్ లా పెంచాను. అది నా బలహీనత అంటావా?"
"మీ బలహీనత అని అనుకోవటంలేదు. మీ మంచితనమే అనుకుంటున్నాను."
"పోనీ నీ అభిప్రాయం ప్రకారం మంచితనమే. అది వీక్ నెస్ అయి ఉండవచ్చుగా."
"ఇప్పుడు ఏమంత ప్రమాదం జరిగిందని మీరివన్నీ అనుకుంటున్నారు?"
"వాళ్ళు నువ్వనుకున్న పద్దతిలో ప్రవర్తించలేదని బాధ పడుతున్నావుగా!"
"మన మనుకున్నట్లు ప్రవర్తించనంత మాత్రాన చెడుగా ఎందుకు తీసుకోవాలి? వాళ్ళు కొంత స్వతంత్రంగా ఉంటారు. స్వతంత్రంగా ఆలోచిస్తారు. నిర్భయంగా ఉంటారు. దాన్ని గురించి చెడుగా ఎందుకు తీసుకోవాలి? నా పిల్లలు రత్నాలు."
"నా పిల్లలు అంటావేమిటి? మన పిల్లలు అను."
"నా పిల్లలు వేరు మీ పిల్లలు వేరు ఉంటారేమిటండీ? అలా ఒక్కోసారి మాట వచ్చేస్తూ ఉంటుంది.
రాజాచంద్ర ఆమెవంక చూశాడు. బెడ్ లైట్ వెలుతురులో ఆమె తెల్లని గుండ్రని ముఖం, మెరిసే కళ్ళు... చాలా అందంగా కనిపించింది. చెయ్యి ఆమె చుట్టూ వేసి దగ్గరకు లాక్కుని పసిపిల్లాడిలా ఆమెలో ఒదిగి కళ్ళు మూసుకుని పడుకున్నాడు. కాసేపట్లో నిద్రపట్టేసింది.
సరిగ్గా ఆ ఇంటికి ఎదురింట్లో ఇంకో కుటుంబం కాపురముంది. ఆ కుటుంబం యజమాని పేరు అర్ధనారిశ్వరరావు. పేరుకు అర్దానారిశ్వరుడేగాని మనిషి చాలా అహంభావంతో, కోపంగా,దర్పంగా ఉంటాడు. మెయిన్ బజారులో ఆటోమొబైల్ బిజినెస్ ఉంది. ఒకటి రెండు స్కూటర్ కంపెనీలకు కూడా ఏజెన్సీ ఉంది.
ఆఫీసులో కాని ఇంట్లోకాని ఆయన ఎప్పుడూ ఎవరితోనూ చిరునవ్వుతో మాట్లాడదు. చాలా కోపంగా, సీరియస్ గా, ధుమధుమలాడుతూ ఉంటాడు. ఆయనకు ఇతరులతో ప్రేమగా, జాలిగా ఉండటం పట్ల నమ్మకం లేదు. ప్రేమ ఓ బలహీనత అంటాడు. జాలి ఓ వ్యసనం అంటాడు.
ఆ ఇంటి హాల్లో గోడకు ఓ హంటర్ తగిలించి ఉంటుంది. దాని పక్కనే దివంగతుడైన అయన తండ్రి జగదీశ్వరరావు పెద్దసైజు ఫోటో ఒకటుంది. ఇంటికొచ్చినవారు ఆ హంటర్ ని చూసి, దాని ప్రస్తావన తీసుకొస్తే-
"అదా? దానికో చరిత్ర ఉంది" అని చెప్పుకొచ్చేవాడు.
"మా నాన్నగారికి మా అమ్మతో పెళ్ళి కుదిరినప్పుడు బంధువులూ, హితాషులూ ఆయన్ని భయపెట్టారు.ఆ అమ్మాయి అందంగానే ఉంటుంది, చాలా పెంకెదనీ, ససేమిరా ఒకరిమాట వినదనీ, ఆ అమ్మాయిని చేసుకుంటే ఆయన జీవితం నరకమైపోతుందనీ. 'అలాగా'అన్నారు మా నాన్నగారు. ఆ "పిల్ల నాకు నచ్చింది. చేసుకుంటే ఆ పిల్లనే చేసుకుంటా, చేసుకుని లొంగదీసుకుంటా" అన్నారు. పెళ్ళి జరిగిపోయింది. మొదటిరోజు రాత్రి గదిలోకి పంపించేటప్పుడు, ఇదిగో ఈ హంటర్ నీ లోపలకు తీసుకెళ్ళారు. 'ఏమిటది ?' అనడిగింది మా అమ్మ. ఒక్కసారి దాన్ని 'జుయ్'మనే శబ్దం వచ్చేటట్లు గాలిలో ఝుళిపించి 'హంటర్'అన్నారు గోడకు తగిలిస్తూ. 'ఇక్కడెందుకు శోభనం గదిలో' అంది. 'నేనెక్కడుంటే అక్కడ ఉంటుంది'అన్నారు. ఆమె ఏమీ మాట్లాడలేదు.ఆయనే మళ్లీ అన్నారు. నీకు తెలుసో తెలీదో నాకు చండశాసనుడనే బిరుదుంది. ఎవరైనాసరే నామాటకెదురు చెబితే ఒక్కసారే చెబుతాను. అప్పటికీ రెచ్చగొట్టారా? రెండో అవకాశమిస్తాను. అదీ వినిపించుకోక మంకుతనం చేశారా, మూడు అనటం నా హంటర్ గాల్లోకి లేచి వాళ్ళ ఒళ్ళు హూనం చెయ్యటం.... ఇలా గతంలో ఎంతోమంది రక్తాన్ని ఈ హంటర్ చవిజూసింది. ఇది చెప్పేది నీ గురించి కాదనుకో నువ్వంతవరకూ తెచ్చుకావని నాకు తెలుసు. నన్నెదిరించబోయిన వారి గురించి దాని జోలి నీకెందుకులే" అన్నారు.
మర్నాడాయన ఎక్కడెక్కడో తిరిగి గదిలోకి ఆలస్యంగా పన్నెండు గంటల కొచ్చారు. ఆమె శివాలెత్తినట్లు ఆగ్రహంతో ఊగిపోతుంది. 'ఏమిటిది? పెళ్ళయి పదిరోజులయినా కాలేదు. ఇవేళ మన రెండోరోజు అర్ధరాత్రిదాకా ఈ తిరుగుళ్ళేమిటి? నా కిలాంటివి నచ్చవు' అంది విసురుగా 'చూడూ! నీకు నచ్చటం నచ్చకపోవటం అనేది నా కనవసరం మన సంసారంలో అంతా నా ఇష్టప్రకారం జరుగుతూ ఉండాలి. అర్దరాత్రి వచ్చినా, అపరాత్రి వచ్చినా మాట్లాడటానికి వీల్లేదు' అన్నారాయన చలించకుండా. ఆమెలో సహజసిద్దమైన అహంభావం వల్ల ఆయన మాటలని లెక్కచెయ్యలేదు" నా దగ్గర ఈ ఆటలేమీ సాగవు. ఈ తిరుగుళ్ళూ, గిరుగుళ్ళూ నాకు నచ్చవు. వేళప్రకారం ఇంటికి రాకపోతే నేనూరుకోను" అంది. "ఒకటి" అన్నాడాయన. ఉలిక్కిపడి ఒక్కక్షణం ఊరుకుని, అహం ఆపుకోలేక 'ఈ తిరుగుళ్ళూ, గిరుగుళ్ళూ..." అంటూ మళ్ళీ అనబోతుంది. "రెండు" అన్నాడు గోడవైపు కదులుతూ. అంతే, కొయ్యబారిపోయి నట్లాగిపోయింది. నోరు మూతపడిపోయి, గుడ్లప్పగించి చూస్తూ నిలబడిపోయింది. అంతే, జీవితంలో ఎప్పుడూ మూడు అనిపించుకునే స్థితికి రాలేదు. ఆయన ఏం చెప్పినా, ఏం చేసినా కిక్కురుమనేది కాదు. అలా అని ఆయనా అమర్యాదగా ఎప్పుడూ చూడలేదు. చాలా ప్రేమగా చూసేవాడు. బోలెడు బంగారం చేయించాడు. ఆవిణ్ణి చాలా సుఖపెట్టాడు."
అర్ధనారీశ్వరరావుకు నలుగురు పిల్లలూ ఇద్దరాడపిల్లలూ, ఇద్దరు మొగపిల్లలు. నలుగురూ కూడా కాలేజీ చదువులకొచ్చారు. నలుగురిలో ఎవరూ తండ్రి ఎదుట నోరు మెదిపి ఎరుగరు. ఆయన భార్య రత్నాంబ ఎప్పుడూ బజారుకెళ్ళి ఎరుగదు. ఆయనకిష్టమైన చీరలు తీసుకొచ్చి 'ఇదిగో ఇది కట్టుకో అంటే కట్టుకునేది. "ఈ సినిమాకి వెడదాం రా" అంటే వచ్చేది.