Previous Page Next Page 
పెంకుటిల్లు పేజి 5


    ఇదంతా జనసందోహం మధ్య నుంచి నడుస్తూ ఆలోచిస్తున్నాడు. లజ్ కార్నర్ దాకా వచ్చాక తెలివిలోకి వచ్చిపడ్డాడు. రాయపేట మొదలు నుంచి యింత దూరం యింత సులభంగా నడిచి వచ్చినందుకు కలిగిన ఆశ్చర్యం ఆలోచనల్లో పడి అసలు ప్రదేశం దాటి యెక్కువ దూరం పోనందుకు కలిగిన సంతోషంతో మిళితం చేస్తూ అతను కుడివైపు సందులోకి నడిచాడు.

    ఆ సందు అంతా చీదరబాదరాగా వుంది. ఎప్పుడూ అటువైపు రాణి కారణంచేత తడుముకుంటూ తనకు కావలసిన యింటికోసం చూస్తూ నడవసాగాడు. యాభయి గజాలన్నా నడవకముందే అతనికి కావలసిన ఇల్లు వచ్చింది. ప్రకాశరావు వెళ్ళేసరికి ఆ ఇంటి చుట్టూ వాతావరణమంతా నిశ్శబ్దంగా వుంది. గేటుకిరుప్రక్కలా వున్న పూల మొక్కలు కమ్మని వాసనలను వెదజల్లుతున్నాయి. సంకోచిస్తూ లోపలికి నడిచాడు.

    పురాతనంగానే కనబడుతున్న ఆ ఇంటి వసారాలో నాలుగయిదు కుర్చీలు వేసి వున్నాయి. లోపలకు వెళ్ళేందుకు ఒకే ద్వారం. తలుపులు వేసి వున్నాయి. సంశయాత్మకంగా ఒకటి రెండు నిముషాలు నిలబడి "బాబాయ్!" అని పిలిచాడు మెల్లగా. ఈ పిలుపుకు వెంటనే సమాధానం లేదు. కొంచెంసేపు ఎదురుచూసి మళ్ళీ పిలిచాడు. ఈసారి జవాబుకు తలుపులు తెరుచుకున్నాయి. పదహారేళ్ళ అమ్మాయి. అమాయకత్వంతో నిండిన తన సుందర వదనారవిందం యివతలకు పెట్టి "నువ్వా ప్రకాశరావు అన్నయ్యా!" అంది.

    "బాబాయి వున్నారా అమ్మా!" అన్నాడు ప్రకాశరావు.

    "పిలుస్తాను కూర్చో" అని ఆ అమ్మాయి లోపలకు వెళ్ళిపోయింది. ప్రకాశరావు అక్కడున్న ఒక కుర్చీలో కూర్చున్నాడు. చలిగాలి వీస్తోంది. మబ్బు బాగా పట్టి వుండటం వల్ల అప్పుడే చీకటి వ్యాపిస్తున్నట్లుగా తమాషాగా వుంది.

    ప్రకాశరావుకి ఇటువంటి వాతావరణం చాలా యిష్టం. ఎంత చలికాలంలో అయినా దుప్పటి కప్పుకునే అలవాటు అతనికి లేదు. చల్లగాలి అనుభవిస్తూ కొంతసేపూ కూర్చున్నాడు.

    ఇంతలో ఓ నడివయస్సు వ్యక్తి లోపల్నుంచి వస్తూ "ఏంరోయ్ ప్రకాశం, ఏమిటిలా దయచేశావు?" అంటూ యెదురుగుండా యింకో కుర్చీలో కూర్చున్నాడు.

    "పని వుండి వచ్చాను బాబాయ్" అన్నాడు ప్రకాశం ముక్తసరిగా లాంఛనప్రాయంగా మాట్లాడడం అతనికి చాతకాదు. అలావాటు లేదు.

    జేబులోంచి సిగరెట్ పెట్టెతీసి అందులోంచి సిగరెట్ తీసి నోటిలో పెట్టుకుంటూ "నువ్వు కాల్చవుగా" అన్నాడు ఆయన.

    "అలవాటు లేదు."

    "అలవాటున్నా తప్పులేదు. మీలాంటి కుర్రాళ్ళకున్న మిగతా అలవాట్లకన్నా ఇదేమంత చెడ్డదికాదు. సరే మనం అసలు విషయంలోకి వద్దాం. పని వుండి వచ్చానన్నావు? ఆ మాట నువ్వు వేరు చెప్పాలా నాయానా! పని లేకపోతే యిక్కడికి వచ్చే తీరిక లేదని నాకు తెలుసు" అని కొంచెం ఆగి, "సరే, అది ఎలాంటి పని?" అని అడిగాడు మెల్లగా సిగరెట్ కాలుస్తూ.

    ప్రకాశం వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. తరువాత తలవొంచుకుని, అతి కష్టంమీద నోరు పెగుల్చుకుని అన్నాడు: "డబ్బులేక చాలా యిబ్బందిగా వుంది. ఇంటికి రాస్తే....."

    బాబాయి వెంటనే అందుకుని "ఎందుకు యిబ్బందిగా వుండదు? కాస్త పచ్చగా వున్నవాడిని చూస్తే అందరికీ ఇలాగే యిబ్బందులు వస్తూంటాయి నా సహాయం అడగటానికేనా ఇప్పుడు నువ్వు వచ్చింది" అన్నాడు కటువుగా

    ప్రకాశం తెల్లబోతూ "ఊ" అన్నాడు.

    "ఈ మాట అడిగేందుకు నీకు ఎందుకు సిగ్గువేయటం లేదురా? నన్నందరూ స్వార్థపరుడి క్రింద జమ కడుతున్నారుగా. నేనేదో మిమ్మల్ని మోసం చేసి ఇక్కడ బావుకుంటున్నానని భావిస్తున్నారుగా. ఒక్కమాట అడుగుతాను. ఇవ్వాళ్ళ డబ్బు అవసరం వచ్చింది కాబట్లే ఇలా వచ్చావు. లేకపోతే ఈ ఇంటిమొహం చూసి ఎన్నాళ్ళయింది?" అని ఆయన రెట్టించాడు.

    ఆయన ప్రతిమాటకూ ప్రకాశరావు దగ్గర జవాబు వుంది. చెప్పగలడు. చెప్పాలని భావించాడు కూడా. కాని అతనికిప్పుడు తీరిగ్గా జవాబు చెప్పే ఓపికలేదు అతనిలో సహనం చచ్చిపోయింది.

    ఒకళ్ళని గురించి మంచీ చెడ్డా ఆలోచించుకునేటప్పుడూ, అనుకునేటప్పుడూ కాస్త ముందూ వెనకా చూచుకోవాలిరా అబ్బాయి."

    ఆయన ఇంకా ఏదో చెప్పుకుపోతున్నాడు. కాని ప్రకాశం వినిపించుకోకుండా లేచి నిలబడి "వస్తాను బాబాయ్," అని గిరుక్కున వెనక్కి తిరిగాడు. కాని అంతలోనే "ఆగు" అన్నాడాయన వెనక నుంచి.

    ప్రకాశరావు వెనక్కి తిరగకుండానే తటస్థంగా నిలబడిపోయాడు.

    "ఈ పదిహేను రూపాయలు తీసుకువెళ్ళు"

    ఇహ అతనికి బాబాయిగారింట్లో వుండవలసిన అవసరంగానీ, అతని మాటలు వినవలసి వచ్చిన అవసరంగాని లేదు. జవాబుకూడా చెప్పకుండా బయటకు వచ్చేశాడు, ఆ పదిహేనూ ఆయనకే వదిలిపెట్టి.

    అతనికిప్పుడు బాబాయిమీద కసిగా లేదు. తనని తాను అంతగా నీచపరచుకున్నందుకు తనమీద తనకే చాలా అసహ్యంగా వుంది. ఈ విశాలమైన పృథ్విలో ఎందుకు బ్రతుకుతున్నాడో అతనికి ఆ క్షణంలో  అర్థం కాలేదు.

    అతనికి ఈసారి నడవడం కష్టంగా  వుంది. పట్టుతప్పిపోతున్నట్టుగా వుండి కాళ్ళు అతని స్వాధీనంలో వుండకుండా తప్పించుకుంటున్నాయి. ప్రక్కన నడుస్తున్న మనుషుల మాటలూ, కార్ల చప్పుళ్ళూ కలలో జరుగుతున్నట్లుగా తోచసాగాయి. తను ఏ వైపు పోతున్నదీ కూడా అతను విస్మరించాడు. వళ్ళంతా చల్లగా మంచులా అయిపోసాగింది.

    అతను ఎంతసేపటికో ఎలాగో గదికి చేరుకునేసరికి నలువేపులా చీకట్లు క్రమ్ముతున్నాయి. హాల్లో లైటు వెలుగుతోంది. గది దగ్గరకు పోతూంటే అతని మనోపథంలో వరుసగా తల్లి, తండ్రి, పరిహసిస్తున్న బాబాయీ, నవ్వుతున్న శంకుతలా వరుసగా గోచరించారు. ద్వారం దగ్గర నిల్చుని గది తాళం తీయాలని ప్రయత్నిస్తున్నాడు. కాని చేతులు వొణుకుతున్నాయి.

    తాళంచెవి ఎక్కడ వుంచుకున్నాడో కూడా గ్రాహ్యం కావటం లేదు కళ్ళు చీకట్లు క్రమ్ముతున్నాయి. హృదయం అట్టడుగు నుంచీ బాధ వివిధ విధాలుగా, తెరలు తెరలుగా చుట్టూకుంటూంది. చివరిసారిగా తన శక్తినంతా ఉపయోగించి తాళం తీయాలని ప్రయత్నించాడు కాని పూర్తిగా విఫలుడు కావల్సివచ్చింది. కళ్ళు బాగా తిరుగుతున్నాయి. క్రిందికి ఒరిగిపోసాగాడు. తలుపులు పట్టుకుని నిలదొక్కుకుందామని ప్రయత్నించాడు. సాధ్యంకాలేదు. గభాలున క్రింద పడిపోయాడు.

    కాని ఆ సమయంలో అతనికి దెబ్బ తగలకుండా యెవరో ఆదుకున్నారు. అతని తల ఒకస్త్రీ ఒడిలో వుంది. మీదకు వంగి ఆ స్త్రీ అతని ముఖంలోకి ఆతృతగా చూస్తోంది.

    అతని కష్టం మీద కళ్ళు తెరిచిన ప్రకాశరావు ఆమె ఎవరో గుర్తించాడు. మరుక్షణంలో అతని కళ్ళు మళ్ళీ బరువుగా మూతలుపడి పూర్తిగా బహ్మస్మృతిని కోల్పోయాడు.

   

                                  5

    కార్తీక మాసంలో ఒకరోజు తెల్లవారుఝామున ముసలమ్మగారు కృష్ణాస్నానానికి పోతూ "నువ్వుకూడా రాకూడదటే" అనడిగింది, అప్పుడే ఆవలిస్తూన్న ఛాయను చూసి.

    దుప్పటి పూర్తిగా మీదకు లాక్కుంటూ ఆ పిల్ల "నాకు చలేస్తుంది. బామ్మా!" అంది.

    "అయ్యో విడ్డూరమా! చలేమిటి చలి! నాకు లేని చలి నీకు ఎక్కడ్నుంచి వచ్చిందట" నోరు నొక్కుకుని "సరే నేను చెప్పేదాన్నీ నువ్వు వినేదానివీనా? ఆ రోజులు ఎప్పుడో పాయినాయి". అని అక్కణ్ణుంచి వెళ్ళిపోయిందావిడ.

    శారదాంబ పడుకుని ఈ మాటలన్నీ వింటూనే వుంది. అత్తగారు వెళ్ళిపోయాక చిన్న కూతుర్ని ఒక్కసారి గట్టిగా  కావలించుకుని ముద్దు పెట్టుకుని లేచి వంటింట్లోకి వెళ్ళింది. పదినిమిషాలలో ముఖం కడుక్కుని వచ్చి కుంపటి రాజేసింది.

    ఇంకా పాలు రాలేదు. కాఫీ కాయాలి. తరువాత భోజనాది కార్యక్రమం, మళ్ళీ మధ్యాహ్నం కాఫీ. ఏది వున్నా లేకపోయినా ఈ ఇంట్లో అన్నీ సక్రమంగా జరిగిపోవాల్సిందే.

    కుంపటి మీద నీళ్ళు పెట్టి పాలమనిషి వస్తుందేమో చూద్దామని బయటి గుమ్మం దగ్గరకు  వచ్చింది. పిన్నా పెద్దా చాలామంది బారులుతీర్చి కృష్ణ స్నానానికి పోతున్నారు. ముచ్చటగా వున్న ఆ దృశ్యాన్ని చూస్తూ కొంచెం సేపు నిల్చుంది. తర్వాత ఏదో గుర్తుకురాగా గబగబా లోపలికి పోయి నీళ్ళు తీసికొనివచ్చి గేటుముందు చిమ్మి, చిన్న ముగ్గు వేసింది. తను వేసిన ముగ్గువంక తనివితీరా చూసుకుంటుండగా వెనకనించి పాలమనిషి వచ్చి "అమ్మగారూ" అని పిలిచింది. శారద ఉలిక్కిపడి "వచ్చావుటే" అంది.

    పాలు పోయించుకున్నాక కుంపటిముందు విసురుతూ కూర్చుని ఆలోచించసాగింది.

    రోజూ ఇలాగే గడుస్తుంది. తెల్లవారుఝామునే లేస్తుంది. అందరికీ కాఫీలు ఇవ్వటం. దానితోనే ఎనిమిదై వూరుకుంటుంది. తరువాత మడి గట్టుకుని వంట పనికి పూనుకోవాలి. అందరి భోజనాలు అయేసరికి పన్నెండు దాటుతుంది. అప్పుడు వో గంటసేపు నడుం వాలుస్తుంది. ఏమయినా బుద్దిపుడితే  ఎవరితోనైనా మాట్లాడడానికి పోయినా అప్పుడే మధ్యాహ్నం మూడు అయేసరికి కాఫీలు, తరువాత మామూలే. ఇలానే ఈ సంసారంలో ఇన్ని రోజులు గడిచాయి. సాధారణంగా జరిగిపోయిన రోజుల్ని గురించి ఆమె ఆలోచించుకోదు. ఆలోచించుకుంటే ఆమె నయనాలు నీళ్ళతో నిండిపోతాయి. తన జీవితంలో ఏం చూసింది? ఏం చేసింది? తను చేసినంతవరకూ ఆమెకు ఒక్కటే కనిపించింది. కొంతమంది జీవుల్ని ఈ భూమిమీదకు తెచ్చి వదలిపెట్టింది. వాళ్ళలో కొంతమంది బ్రతికారు, కొంతమంది చచ్చిపోయారు. బ్రతికిన వాళ్ళు ఏం అనుభవిస్తున్నారు? ఇది ఆమెను  రోజూ కలవర పెట్టే విషయం. తమ కడుపున పుట్టిన వాళ్ళకి తాము ఏం సహాయం చేయగలిగారు? వాళ్ళ కోర్కెలు ఏమి తీర్చగలిగారు? తాము స్వంతంగా ఎవరిని ప్రయోజకులుగా చేయగలిగారు?

    అష్టకష్టాలుపడి ఇంతవరకూ ఒక కుమారై వివాహం చేయగలిగారు. అది ఏదో మాదిరిగా కాకినాడలో జీవిస్తోంది. దానిమానాన అది బ్రతుకుతోంది. ఇహ పెద్దకొడుకు నారాయణ విషయం. వాడి కిప్పుడు పాతికేళ్ళు వచ్చాయి. ఇంకా పెళ్ళి చేయలేదు. వాడిదంతా అదో వింత తత్వం బాధల్ని బాధగా పరిగణించడు. ఆపాయాలని ఎదుర్కొనే నిమిత్తం ఉపాయాలని వెదుక్కోడు కాని అప్పుడప్పుడూ తను అనుకుంటుంది. సరిగ్గా  బ్రతకాలంటే ఇటువంటి వింత తత్వపు మనుషులే అవసరం యేమో. లేకపోతే ఆయనగారి అద్భుత ప్రవర్తకి ఈ ఇంట్లో ఎటువంటి పేచీలు జరిగేవో! ఆ విషయం అలా వుంచి రెండోవాడు ప్రకాశం విషయం  గుర్తువచ్చేసరికి ఆమె మనసంతా అల్లకల్లోలం అయి కడుపులో ఏదో దేవినట్లు అయిపోతుంది. స్వయంగా మద్రాసు నగరాన్ని చూడకపోయినా  అక్కడ జీవితం ఎంత ఖరీదైందో అప్పుడప్పుడూ ఎవరెవరో చెప్పుకునే మాటలు విని ఉంది. తాము పంపించే డబ్బు అక్కడో మనిషికి ఎంత తగ్గించుకున్నా అయ్యే ఖర్చులో పోల్చి చూస్తే ఎన్నో వంతు. మరి అక్కడ ప్రకాశం ఏ విధంగా గడుపుతున్నాడో? ఎంతో అవసరం అయితే గాని డబ్బు పంపమని రాయడు మొన్న రాశాడు. ఎంత యిబ్బంది పడివుంటాడు? ఏదీ రాకపోయేసరికి ఎంత చిన్న బుచ్చుకుంటాడు. అక్కడ వాడికి వేళకి సరియైన తిండి వుంటుందని యెలా నమ్మకం?

    ఎంత ఆపుకుందామన్నా ఆమె కళ్ళనుంచి నీళ్ళు యెడతెగకుండా ప్రవహించాయి.

    "ఎందుకమ్మా ఏడుస్తున్నావు?"

    అప్పుడే నిద్ర లేచి లోపలికి వచ్చిన రాధ తల్లి ఏడుస్తుండడం చూసి ఆశ్చర్యంతో ప్రశ్నించింది.

    శారదాంబ ఉలిక్కిపడి చీరె కొంగుతో నీళ్ళు తుడుచుకుని "ఏడవటం కాదమ్మా. పొగ కళ్ళలోకి పోయేసరికి...." అంది.

    "కాని రాధ అటువంటి జవాబులు నమ్మి వూరుకునే స్వభావం గల పిల్లకాదు. వెంటనే "ఎందుకమ్మా, పొద్దున్నే అబద్ధాలు చెబుతావు?" అంది.

    కుమారై అన్న మాటకు శారదాంబ కొంచెం కోపం తెచ్చుకున్నట్లు నటించి "చాల్లే, ఈ మధ్య మాటకు మాట జవాబు చెప్పటం బాగా అలవాటు చేసుకున్నావు" అంది.

 Previous Page Next Page