Previous Page Next Page 
మంచు పర్వతం పేజి 5

 

         అలాంటి సియారాం గుంపుని అంత చాకచక్యంగా వైజయంతి ఎదరించిన తీరు పోలీస్ సర్కిల్స్ లో దుమారాన్ని లేపలేదు. కారణం ఒక స్త్రీ విజయాన్ని అంత త్వరగా ఎవరూ అంగీకరించకపోవడమే. పైగా సియారాం తప్పించుకుపోవడం ఆమె ఓటమిగా చాటించారు.
   
    దాడిలో ఆమెతోపాటు పాల్గొన్న ఆమె సిబ్బందికి మాత్రమే తెలుసు ఆమె నిజస్వరూపం! ఆమె ఎంత తెలివితేటలు గలదో అంత ధైర్యం కూడా ఆమెలో వుందనీ, ఆమెలో ధైర్యం పిరికివాళ్ళలో కూడా ధైర్యాన్ని కలుగచేస్తుందనీ అర్ధమయింది వాళ్ళకు.
   
    ఈ రోజు ఆమె భభీరామ్ మీద దాడి జరపడానికి నిశ్చయించుకుంది. అందుకే ఈ రోజు ఉత్సాహంగా ప్రయాణం చేస్తున్నారు. షంగార్ నదీతీరం చేరుకునే సరికి సాయంత్రం ఆరయింది. అక్కడే విడిది చేశారు. ఉదయం నది దాటి ప్రయాణం సాగిద్దామంది వైజయంతి. నదిని దాటాక అంతా కచ్చా రోడ్డు జీపులు లేకుండా రాత్రిళ్ళు ప్రయాణం చెయ్యడం కష్టం'.
   
    ఆ రాత్రి ఆమె నిద్రపోలేదు. అక్కడికి ఇరవై కి.మీ. దూరంలో వుంది హరీనా గ్రామం. భభీ రామ్ స్వంత ఊరది.
   
    ఇద్దరు ఇన్ స్పెక్టర్లతో పాటు సివిల్ డ్రెస్ లో హరీనా గ్రామం చేరుకుందామె. భభీరామ్ ఆ ఊరు వచ్చే అవకాశాలేమయినా వున్నాయేమో తెలుసుకోవాలి అని ఆమె ఉద్దేశ్యం.
   
    ఊరు కాస్త మధ్యస్థంగా వుంది. దాదాపు పదివేల జనాభా వుండవచ్చు. బాగా అభివృద్ధి పొందుతున్నట్లు సూచనగా చాలా డాబా యిళ్ళు కనిపిస్తున్నాయి. మంచి హోటళ్ళున్నాయి. ముఖ్యంగా అందరి మొహాల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
   
    ఆ ఊళ్ళోనే వున్న ఓ గూఢచారిని కలుసుకున్నారు వాళ్ళు అతడు చెప్పిన మాటలకు ఆమె అత్యంత ఆశ్చర్యంతో స్థాణువై నిలబడిపోయింది.
   
    దాదాపు వంద బందిపోటు దొంగతనాలకు నాయకత్వం వహించి ఇరవైమంది పోలీసుల హత్యలకు కారణభూతుడయిన భభీరామ్ ఆ ఊరి ప్రజలకు భగవంతుడు. తమ ప్రాణాలయినా అర్పిస్తారుగాని భభీరామ్ గురించి ఒక్క విషయమైనా బయటపెట్టరు. ఆ ఊరికి అతనో రాబిన్ హుడ్. పేదల రక్తమాంసాలతో పునాదులు వేసుకుని మేడలు కట్టిన వాళ్ళందర్నీ ఏదో ఒక రకంగా దోచి, కష్టపడి పనిచేసే కూలీలకు పంచి పెడతాడు.
   
    అతడి క్షేమాన్ని గురించి భయపడేవాళ్ళకు అతడిచ్చే జవాబు "చెమటోడ్చి పనిచేసే కార్మికుణ్ణి కొల్లగొట్టేవారున్నంతకాలం నాలాంటి భభీరామ్ లు వుంటూనే వుంటారు. నేను కాకపోతే నాలాంటి మరొకడు" అని.
   
    అతడు వస్తున్నాడంటే పండగ చేసకుంటారక్కడివాళ్ళు. అతడున్న కాసేపూ కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అందుకే అతడి ముఠామీద ఆ ఊళ్ళో దాడిచేయడం అవివేకం.
   
    వైజయంతి క్యాంపుకి తిరిగి వచ్చింది.
   
    మనసెందుకో కలచినట్లనిపిస్తోంది.
   
    "ఏది న్యాయం? ఏది ధర్మం? చట్టానికి లోబడి జరిగే అన్యాయాలన్నీ బయటకు రావు. ఒకవేళ బయటపడినా వాళ్ళ పలుకుబడికి హరించి పోతుంది. కల్తీ వ్యాపారం చేసి ప్రజలను స్లోపాయిజన్ తో చంపేవాడికి రాజకీయ నాయకుల మద్దతుంటుంది. కల్తీ మందులతో అమాయక ప్రజల ప్రాణాలు తీసేవాడు చట్టం చేతిలోంచి బయటపడగలడు. రుజువులూ, సాక్ష్యాలూ రికార్డుల్లోంచి మాయమయిపోతుంటాయి. వాటిని ఎదిరించినందుకే తనకీ ప్రాంతానికీ ట్రాన్స్ ఫరయింది. బందిపోట్లని ముద్రపడ్డ వాళ్ళందర్నీ కేసేమిటో కూడా విచారించకుండా హత్య చేసేస్తే తనకు మంచి పేరొస్తుంది. ఆ రకంగా రాజకీయ నాయకుల మద్దతున్న వ్యాపారస్తులకి ఎంతలాభం కలుగుతుంది. ఎంత స్వార్ధం!"
   
    ఆలోచిస్తుంటే ఆమెలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఏదో ఒకటి చెయ్యాలి. ఎన్ కౌంటర్ల పేరుతో జరిగే మారణహోమాలు ఆగాలి. వాళ్ళు న్యాయంగా చట్టానికి లొంగిపోయే ఉపాయాలు చూడాలి. అదంతా సులభమయిన పనికాదు. కానీ ప్రయత్నం చేయకుండా ఓటమి కెప్పుడూ ఒప్పుకోదు వైజయంతి.
   
    తన ఆశయాన్ని మర్నాటి దాడిలోనే అమలు జరపాలనుకుంది.
   
                             *    *    *
   

    షంగార్ నది అవతలివైపున మైన్ పురికి పది కిలోమీటర్ల దూరంలో విడిది చేశారు కరమ్ వీర్ సింగ్ పటాలం. వైజయంతి కూడా వస్తున్నదని తెలియగానే మరో బెటాలియన్ కూడా తరలించాడు కరమ్ వీర్. భభీరామ్ తనకే చిక్కాలి అని అతడి ఆశ.
   
    ఉదయం ఆరుగంటలకు రెండు ప్రక్కలనుంచీ భభీరామ్ గుంపుని ముట్టడించాలని అవతలివాళ్ళకు ఆదేశాలిచ్చింది వైజయంతి. వాళ్ళు పయాణిస్తున్న మార్గం గురించి అరగంట కొకసారి తెలుపుతూ వుండమని చెప్పింది. ఇన్ స్పెక్ట్రర్లందరి దగ్గరా వైర్ లెస్ సెట్లున్నాయి.
   
    "త్వరపడి ఫైరింగ్ చేయకండి. సాధ్యమయినంతవరకూ వాళ్ళను ప్రాణాలతో పట్టుకోవాలి. కావలసినన్ని స్మోక్ బాంబ్స్, టియర్ గ్యాస్ షెల్స్ వెంటతీసుకురండి. వాళ్ళ ఉనికి ఎవరికీ ముందుగా తెలిసినా రెండో వాళ్ళకు తెలియచేద్దాం. అప్పుడు ఒక్కసారిగా నాలుగువైపుల నుంచీ చుట్టుముడదాం" వైర్ లెస్ లో చెప్పింది.
   
    "అలాగే మేడమ్! కాని వాళ్ళే ముందుగా ఫైరింగ్ చేయడం మొదలు పెడితే?" అని అడిగాడు కరమ్ వీర్ అట్నుంచి వైర్ లెస్ లో మరో రాష్ట్రానికి చెందిన వాళ్ళు తనకు ఆదేశాలివ్వటం అతడికి కచ్చగావుంది. కాని ఏమీ అనలేడు. ఆమె ర్యాంక్ తనకన్నా పెద్దది. తన బాస్ దగ్గర పర్మిషన్ తీసుకువచ్చింది. అయినా ఓ స్త్రీ తనకు ఆజ్ఞలివ్వటం సహించలేకపోతున్నాడు.
   
    "వాళ్ళు కాల్పులు మొదలుపెడితే దద్దమ్మలా కూర్చోమని నేననడం లేదు. కాని కాల్పులు ముందుగా మననుంచి మొదలవకూడదు. సివిల్ లిబర్టీస్ ని గుర్తుపెట్టుకోండి. ఏ మాత్రం మనలో పొరపాటు కనిపించినా ఏకిపారేస్తారు" (పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ సంఘం గురించి పోలీసు ఆఫీసర్లు కూడా భయపడతారు. ఆ భయాన్ని వాళ్ళలో కలగచేయాలని ఆమె ఉద్దేశ్యం.) తను అతడికంటే పెద్ద ఉద్యోగి కాబట్టి తన మాటలు వింటున్నాడతడు అని ఆమెకు తెలుసు.
   
    "అలాగే మేడమ్! మీరు చెప్పినట్లే చేస్తాం" హామీ యిచ్చాడు కరమ్ వీర్. ఆ రోజు దాదాపు ఇరవై అయిదు మైళ్ళు ప్రయాణం చేశారు వాళ్ళు. జీపులు, కార్లు ప్రయాణం చేయగలిగే మార్గం కాదది.
   
    అలా మూడురోజులు గడిచాయి. అటు యు.పి. బెటాలియన్ కీ, తమకి దూరం యాభై మైళ్లే వుందిప్పుడు. అంటే మధ్యలో ఎక్కడో వున్నారు బందిపోట్లు. బహుశా తమ సంగతి ఈపాటికి తెలిసిపోయి వుంటుంది కాబట్టి ఈ రాత్రికే పారిపోయే ప్రయత్నం చేస్తారు.
   
    ఆ ప్రాంతంలో నది పెద్ద మలుపు తిరిగింది. ఆ పక్కనే కొద్ది పొలాలు తప్ప దాక్కోవడానికి వేరే ప్రదేశం లేదు. వాళ్ళు నదిని దాటలేకపోతే చేతికి సులభంగా చిక్కుతారు. అందుకే రాత్రి రెండు బాచ్ లుగా విడదీసి ఒక బ్యాచ్ తో తను ప్రయాణం ముందుకు సాగించింది.
   
    అక్కడే ఆమె పొరపాటు చేసింది. పోలీసు ఫోర్స్ కంటే బందిపోట్లలో ప్రాణాలకు తెగించే ధైర్యం వుంటుంది. ఆమె అనుభవానికింకా ఆ విషయం రాలేదు. ఆ సమయానికే పల్లెవాసుల వేషాల్లో పగలే నదిని దాటుకున్నారు వాళ్ళు. ఒక బ్యాచ్ ని క్యాంపులో వదిలెయ్యడం ఆమె చేసిన మంచి పని. వాళ్ళు నదిని దాటేశారని తెలియగానే వెనక్కు తిరిగింది.
   
    ఆ పక్కనే లోయలో ఒక పొలంలో వున్నారు భభీరామ్ బృందం తన పటాలంతో వాళ్ళను ఎదిరించడం కాని పని. అందుకే ఆ రాత్రంతా ఆమె ఆ పొలం పక్కనే కాపలా కాసింది. తెల్లవారుజాముకు కరమ్ వీర్ పోలీసు బృందం వచ్చి కలిసింది.
   
    నాలుగు వందలమంది కానిస్టేబుల్స్ పొలాన్ని ఒక్క అడుగు వదలకుండా చుట్టుముట్టారు. దాడి మొదలయింది.
   
    ముందుగా లౌడ్ స్పీకర్లలో వాళ్ళను లొంగిపొమ్మని హెచ్చరించింది. భభీరామ్ నించి సమాధానం లేదు. అరగంట టైమిచ్చి స్మోక్ బాంబ్స్ ప్రయోగించారు. వాళ్ళు బయటకు రాలేదు.
   
    పోలీసులు పొలంలోకి చొచ్చుకుపోవడం మొదలయింది. అందరూ అప్రమత్తంగా కదులుతున్నారు. ఏ క్షణంలోనయినా బందిపోట్లు కాల్పులు జరపడం మొదలు పెట్టవచ్చు.
   
    అకస్మాత్తుగా పైకి లేస్తున్న ఓ తుపాకీ మీద పడ్డాయి వైజయంతి కళ్ళు మరో చెయ్యి తెల్లజెండాతో పైకి వచ్చింది. సంతోషంతో ఆమె హృదయం నాట్యం చేసింది. కాని ఆ ఆనందం పటాపంచలు కావడానికి క్షణం పట్టలేదు.
   
    ఉన్నట్టుండి ఒక పక్కనుంచి తుపాకీ పేలుళ్ళు వినిపించసాగాయి. అంతే! తుపాకీ పైకెత్తిన చెయ్యి లోపలకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎవరు ఎవరిమీద ఫైర్ చేస్తున్నారో తెలియని కన ఫ్యూజన్.
   
    దాదాపు రెండు గంటలసేపు సాగింది పోరాటం.
   
    బాగా తెల్లవారిపోయింది.

 Previous Page Next Page