ఆలోచనలతోనే అతడు స్నానం పూర్తిచేశాడు. క్యారియర్ కుర్రవాడు హోటల్ నుంచి భోజనం తెచ్చాడు. అతడు డైనింగ్ టేబిల్ ముందు కూర్చొన్నాడు. పొడవాటి డైనింగ్ టేబిల్. నలుగురైదుగురు పిల్లలున్న కుటుంబానికి సరిపోయే టేబిల్. ఒక మూల ఒంటరిగా అతడు. మౌనంగా భోజనం చేస్తున్నాడు. అతడి మొహంలో ఏ భావమూ లేదు. కానీ జాగ్రత్తగా గమనించితే అతడి నుదుటి ముడతల్లో ఒక విధమైన గాంభీర్యంతో కూడిన విషాదం కనిపిస్తుంది.
అతడు భోజనం పూర్తిచేసి బట్టలు మార్చుకొని తయారయ్యేసరికి తొమ్మిదినరయింది. కార్లో అయిదు నిముషాల డ్రైవ్.
అతడు రేడియో స్టేషన్ చేరుకొనేసరికి పావుతక్కువ పది కావొస్తుంది. పూలషర్టబ్బాయి- పాడయిన స్కూటర్ దగ్గిర వంగునే, మసిచేతుల్తో విష్ చేశాడు.
....పార్ధసారధి తన ఛాంబర్ లోకి రాగానే ప్రోగ్రామ్ చార్ట్ చూశాడు.
పన్నెండింటికి ఎయిర్ పోర్టుకి వెళ్ళాలి.
ప్రధానమంత్రి ఆగమనం.... రెండింటికి పబ్లిక్ మీటింగ్.... అయిదున్నరకి 'ఫార్మ్' ఓపినింగ్.... ఆరున్నరకి కారులో ప్రయాణం.... రెండు వందల మైళ్ళ దూరంలో వున్న రేడియో స్టేషన్. పురోహితులు పెట్టిన ముహూర్తానికి ప్రారంభోత్సవం....
ఇదంతా రేడియోలో కవర్ చెయ్యాలి. అతడికి అంతలో ప్రొద్దున్న విషయం గుర్తొచ్చింది. ఫ్యూన్ ని పిలిచి మెమో పాడ్ మీద ఓ పేరు వ్రాసి "ఇతడ్ని రమ్మను" అని చెప్పాడు.
ఐదు నిమిషాల తర్వాత ఓ కుర్రవాడు వచ్చేడు. ఇరవై ఏళ్ళుంటాయి. బెల్ బాటమ్ వేశాడు. కళ్ళల్లో బెదురు కనబడుతోంది.
"పుష్పవిలాపంలో మొదటిభాగం ఏదో తెలీదా?"
అతడు మాట్లాడలేదు.
"జంధ్యాల తెలుసా ఎవరో?"
అతడు తటపటాయించి 'తెలుసు' నన్నట్టూ అస్పష్టంగా తలూపేడు.
"ఎవరు?"
"అడవిరాముడు, వేటగాడు చిత్రాల రచయిత".
పేపర్ వెయిట్ తీసి కొడ్డామన్నంత కోపాన్ని బలవంతం మీద ఆపుకొని "నేను అడుగుతున్నది పాపయ్య శాస్త్రి గురించి" అన్నాడు.
మౌనం.
"రికార్డు పెట్టేటప్పుడు ఏది మొదటిభాగమో, ఏది రెండవ భాగమో చూసుకోనక్కరలేదా? తప్పు వ్రాసి వుందే అనుకో...."
మళ్ళీ మౌనం.
"వెళ్ళు, ఇంకెప్పుడూ ఇలా జరగనివ్వకు" ఇంగ్లీషులో అన్నాడు. పదకొండుంపావు అవుతుండగా అతడు లేచి, బయట వరండాలోకి వచ్చాడు.
క్రింద లాన్ లో గుంపులు గుంపులుగా జనం.
రేడియో స్టేషన్ లో ప్రోగ్రామ్ లు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళ కోసం వేసిన కుర్చీలు ఏ మూలకీ సరిపోవు- అందువల్ల గార్డెన్ లో చేరుతూ వుంటారు.
అయితే ఆ లాన్ లో వున్న వాళ్ళంతా కేవలం రేడియో స్టేషన్ లో పని వున్నవాళ్ళు కారు. మామూలు తోటకన్న ఇక్కడే బావుంటుందని వచ్చే జంటలు కొన్ని.
వరండాలో వున్న అభ్యర్ధుల్ని చూశాక జ్ఞాపకం వచ్చింది - ఆ రోజు ఇంటర్వ్యూ లున్నాయని.
అసిస్టెంట్ డైరెక్టరూ, ఇంకో ఇద్దరూ కలిసి ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.
సారధి ఆ రూమ్ లోకి వెళ్ళాడు. ఇంటర్వ్యూలు జరుగుతున్న రూమ్.
పొడవాటి టేబుల్ చుట్టూ ముగ్గురు మెంబర్లు కూర్చుని వున్నారు. ఒకవైపు అభ్యర్ధి కుర్చీ వుంది.
సారధిని చూసి అసిస్టెంట్ డైరెక్టర్ లేచి నిలబడబోయాడు. అతడు కూర్చోమన్నట్టు సైగచేసి, సారధి కూడా ఒక కుర్చీ లాక్కొని కూర్చొన్నాడు.
మెంబర్లు ప్రశ్న లడుగుతున్నారు. ఆమె సమాధానాలు చెబుతోంది.
"భారతదేశంలో మొట్టమొదటి రేడియో బ్రాడ్ కాస్ట్ ఎప్పుడు జరిగింది?"
"1942 లో మద్రాసు ప్రెసిడెన్సీ రేడియో క్లబ్ ద్వారా."
సారధి ఆమెవైపు అభినందిస్తున్నట్టు చూశాడు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ గురించి ఆమాత్రం తెలుసుకొని వచ్చేవాళ్ళు చాలా తక్కువ.
ఆమె తలవంచుకొని కూర్చొని వుంది, చేతి గోళ్ళవేపు చూస్తూ. ఆమెకి ఇరవై రెండేళ్ళుంటాయి. మొహంలో లేతదనం పోలేదు.
"రేడియో చరిత్ర గురించి మీకేం తెలుసు?"
ఆమె ఆ ప్రశ్న అర్ధంకానట్టు చూసింది. నిజానికి ఆ ప్రశ్న సారధికే అర్ధం కాలేదు. అతడు విసుగ్గా మెంబరుకేసి చూశాడు. అభ్యర్ధిని కంగారు పెట్టే శాడిస్టు మనస్తత్వం కొంతమంది ఇంటర్వ్యూ చేసే మెంబర్లకుంటుంది.
"చరిత్ర అంటే తెలీదా- హిస్టరీ" నవ్వేడు మెంబరు.
ఆమె గొంతు విప్పింది. ఎక్కడా తడుముకోకుండా స్వచ్చమైన ఇంగ్లీషులో చెప్పడం ప్రారంభించింది.
"1924 లో ప్రారంభించబడిన రేడియో కంపెనీ, చాలా నష్టాన్ని పొంది 1927 లో మూతపడింది. తరువాత ప్రారంభించబడిన కంపెనీలు కూడా నష్టపోవడంతో ప్రభుత్వమే ఈ పనిని శాశ్వతంగా ఆపుచేద్దామా అని ఆలోచించింది. అయితే మరి రెండు సంవత్సరాలలో రేడియోలు కొనుక్కున్న వాళ్ళు 1600 మందికి పైగా అవటంతో కొంచెం లాభం కనబడింది.
....భారతదేశంలో రేడియోలు పెరగడానికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్. 1934 లో 1600 రేడియోలు, పదహారు సంవత్సరాలలో 5,46,319 చేరుకున్నాయి. ఈ సమయంలో రేడియో సిలోన్ స్థాపించబడి కమర్షియల్ గా గొప్ప విజయం సాధించింది. మనకన్నా వాళ్ళు ఎక్కువ పాపులారిటీ పొందడం ఆల్ ఇండియా రేడియో యాజమాన్యానికి కంగారు పుట్టించింది. ఆ కారణంగా 1957 లో.... 'వివిధ భారతి' జన్మించింది. దాన్నే ఆకాశవాణి పంచరంగీ ప్రోగ్రాంగా వివరిస్తారు. ఒకప్పుడు చిన్న పెట్టుబడితో స్థాపించబడిన రేడియో ఇప్పుడు మనిషి జీవితంలో ఒక భాగంగా రూపు సంతరించుకొంది. అయితే దీని వెనక యాభై సంవత్సరాల చరిత్ర వుంది...." చరిత్ర అన్నపదాన్ని నొక్కి పలుకుతూ....! ఆమె చెప్పటం పూర్తికాగానే ఆ గదిలో నిశ్శబ్దం కూడా అదోలాంటి సంతృప్తిని పొందింది. ఆ గదిలో నలుగురు శ్రోతలూ క్షణంపాటు మౌనం వహించారు. 'దీన్నే స్పెల్ బౌండ్ అంటారేమో' అనుకున్నాడు సారధి.
అతడు ఆమెవైపు పరిశీలనగా చూశాడు.
చాలా చిత్రమైన భావం.
కొందర్ని చూస్తే మొదటి చూపులో ప్రేమించాలనిపిస్తుంది. మరి కొందరంటే పూజ్యభావం కల్గుతుంది. కొందరికి అకారణంగా దూరం అవ్వాలనిపిస్తుంది. ఆమెని చూస్తూంటే అతడికి ఇవేమీ కావు- ముచ్చటేసింది.
అలాంటి కూతురుంటే బావుణ్ణన్న భావన. భావాలకీ- వయసుకీ సంబంధం లేదు.
"ఏం అమ్మాయ్! రేడియో స్టేషన్ కి వస్తున్నానని దాని చరిత్ర అంతా కంఠతా పట్టేవా?"
ఆ అమ్మాయి మాట్లాడలేదు.
"మీ హాబీస్ ఏమిటి?"
"చదవటం-"
"మీ అభిమాన రచయిత- రచయిత్రులెవరు?"
ఆ ప్రశ్న ఆ అమ్మాయిని కొద్దిగా యిరకాటంలో పెట్టి నట్టుంది, కొంచెం తటపటాయించింది. "అభిమాని అంటూ ఎవరూ లేరు. ఒక రచయిత రచన చాలా గొప్పగా వుండొచ్చు. ఇంకోటి పేలవంగా వుండవచ్చు."
గడ్డం క్రింద చెయ్యి పెట్టుకుని - సూటిగా ఆమెనే చూస్తున్నాడు సారధి. ఆమె గుండ్రటి మొహం.... అమాయకమైన కళ్ళూ - వీటినే కాదు-
ఆమె మొహంలో ఏదో పవిత్రత వుంది. అయితే బిగించిన పెదవులు ఏదో పట్టుదలని సూచిస్తున్నాయి. తాయిలం ముందు కూర్చొని, అడగటానికి అభిమానపడే చిన్నపిల్లలా కనిపించింది.
అతడికి జాలేసింది.
దేశంలో తెలివితేటలున్న వాళ్ళంతా ఎందుకూ పనికి రాకుండా పోతున్నారు.
మెంబరు మరో ప్రశ్న అడగటానికి సిద్ధమయ్యేడు. సారధి అతడివైపు విసుగ్గా చూశాడు, ఎలాగూ ఉద్యోగం ఇవ్వనప్పుడు ఎందుకు వేధించడం అన్నట్టు. అతడి భావాన్ని గ్రహించినట్టు అసిస్టెంట్ డైరెక్టర్ కుర్చీ వెనక్కివాలి, "మంచిది, వెళ్ళిరామ్మా!" అన్నాడు.
ఆమెలేచి, నమస్కరించి వెళ్ళబోతూంటే, ఒక మెంబరు పేర్ల లిస్ట్ పరిశీలిస్తూ, "నీ పేరేమిటన్నావమ్మాయ్" అని అడిగాడు.
"రాధ" వెనక్కి తిరుగుతూ అంది ఆమె.
* * *
పార్థసారథి తన ఆఫీసులో కూర్చొని ఆఖరిసారి తన ప్రోగ్రాం షీటు చూసుకొంటున్నాడు. ప్రధానమంత్రి వచ్చే విమానం ఇంకో అరగంటలో రాబోతోంది. విజిటర్స్ ఎవర్నీ లోపలికి పంపవద్దన్నాడు. సాధారణంగా స్టేషన్ డైరెక్టర్ ని 'ఆఫీసు' పనిమీద కలుసుకోవడానికి పెద్దగా విజిటర్స్ ఎవరూ రారు. కేవలం పబ్లిక్ రిలేషన్స్ నిలుపుకోడానికే అతడు చాలామందితో మాట్లాడవలసి వస్తుంది.
అతడి పి.ఏ. ఫోన్ చేసి ప్రధానమంత్రి విమానం ఢిల్లీలో బయల్దేరిందని చెప్పాడు. అతడి రూమ్ ముందు ఫ్యూన్ కునికిపాట్లు పడుతూ కూర్చొని వున్నాడు. ఓ చెయ్యి తట్టి లేపడంతో ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగా నిలబడి వున్న వృద్దుడ్ని చూసి మొహం చిట్లించాడు.
"స్టేషన్ డైరెక్టర్ ని కలుసుకోవాలి."
ఫ్యూన్ తల అడ్డంగా ఊపుతూ- "ఆయన ఇప్పుడెవర్నీ కలుసుకోరు" అన్నాడు.