రాధక్కూడా నవ్వొచ్చింది.
అంతలో దూరంగా బస్ రావటం కనిపించింది. మరో నిమిషంలో అది వచ్చి స్టాప్ లో ఆగింది.
"వెళ్ళొస్తాను తాతగారూ!"
"మంచిదమ్మా - బెస్ట్ ఆఫ్ లక్ యువర్ ఇంటర్వ్యూ."
ఆమె ఎక్కగానే బస్ కదిలింది.
అతడు అటువైపు ఓ క్షణం సాలోచనగా చూస్తూ నిలబడ్డాడు- రేడియో స్టేషన్ డైరెక్టర్ సారధికి- ఈ అమ్మాయి విషయం ఎవరి ద్వారా చెప్పించాలా అని.
అరగంటలో రాధ దిగవలసిన స్టాపు చేరుకుంది.
విశాలమైన మైదానంలో- చెట్లమధ్య - నిస్తేజంగా వున్న పెద్ద భవనం. పెద్ద పెద్ద గేట్లు. ప్రహరీగోడ దగ్గిర "ఆకాశవాణి....రేడియో కేంద్రము" అని వుంది. 'ఈసారన్నా ఉద్యోగం వస్తే భగవంతుడా- ప్లీజ్-' అనుకొంది.
ఆమె రోడ్ క్రాస్ చేసి అటువైపువెళ్ళి, రేడియో స్టేషన్ లోకి ప్రవేశించబోతూ దృష్టి దేనిమీదో పడి, చటుక్కున ఆగింది.
రోడ్ కి ఒక పక్క ఎండలో, స్కూటర్ దగ్గిర వంగుని పూల షర్టబ్బాయి దాంతో కుస్తీపడుతున్నాడు. అతడి పక్కనే విస్తరిలో పదార్ధాలూ స్కూటర్ తాలూకు సైడుప్లేట్లూ, ప్లెగ్గూ, కిట్ బాక్సూ పడి వున్నాయి.
రాధకి నవ్వొచ్చింది. తలవంచుకుని స్టేషన్ కార్యాలయంలోకి నడిచింది.
4
"వందేమాతరం..... వందేమాతరం" అని ప్రారంభం అయింది రేడియో.
ఆల్ ఇండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ పార్ధసారధి బ్లాంకెట్ లో అట్నుంచి ఇటుతిరిగేడు. అంతకు ముందురోజు రాత్రి పదకొండింటివరకూ మరుసటిరోజు ప్రారంభం అవబోయే రేడియో స్టేషన్ విషయంతోనూ, ప్రధాని ఆగమనం కోసం చేసే ఏర్పాట్లతోనూ సరిపోయింది. ఇంటికొచ్చి పడుకునేసరికి పన్నెండున్నర.
దూరంగా పక్కింట్లోంచి రేడియో లౌడ్ స్పీకర్ వాల్యూమ్ లో వినబడుతూంది. 'తెల్లవారిందన్నమాట' అనుకున్నాడు. విప్పిన కళ్ళు మంటబెడితే మళ్ళీ మూసుకొన్నాడు. కిటికీ అద్దాల్లోంచి ఒక సూర్యకిరణం ఏటవాలుగా పడతూంది.
అతడికి ఓ చిన్న కోర్కె కలిగింది.
ఓ అమ్మాయి....
ఇరవై రెండేళ్ళ వయసున్నది.
తలంటుకొని, ఆ ప్రభాత సమయాన, మంచి చీరె కట్టుకొని, తన పక్కన నిలబడి బెడ్ కాఫీ అందిస్తున్నట్టూ.
-'కాఫీ తీసుకొని... ఆమెను కాఫీతోపాటూ తీసుకొని....ముద్దుపెట్టుకుంటానా' అని ఒక్కక్షణం ఆలోచించేడు.... వద్దొద్దు. అలా చూడటమే చాలు.... అన్న భావన మళ్ళీ.
ఇంకో అనుమానం వచ్చింది.
తన స్థానంలో ఇంకో కుర్రవాడు వుంటే అతడు ముద్దు పెట్టుకోకుండా వుండటం గురించి ఆలోచించేవాడా? కేవలం వయస్సు మీరటం వల్లనే తన ఆలోచన్లు ఇంత 'పవిత్రంగా' సాగుతున్నాయా?
అయినా వయసేం మీరిందని? ముప్పై ఏడు!
అతడు కళ్ళు మూసుకొని మళ్ళీ నిద్రపోవటానికి ప్రయత్నించేడు. మెలకువ రాగానే పక్కమీంచి లేవకుండా అలానే పడుకుంటే వచ్చే ఆలోచన్లు ఆ రోజంతా వుండే మూడ్ మీద తమ ప్రభావాన్ని చూపిస్తాయి.
అతడికి మాగన్నుగా నిద్ర పట్టింది.
మళ్ళీ మెలకువ వచ్చేసరికి ఎనిమిదిన్నర కావస్తూంది. ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. లేచి వాష్ బేసిన్ దగ్గిరకు వెళ్ళబోతూ రేడియో 'ఆన్' చేశాడు.
వస్తూన్న ప్రోగ్రామ్ అయిపోయినట్టూంది-
"ఆకాశవాణి.... కేంద్రం. ఇప్పుడు మీరు పుష్పవిలాపం వింటారు. రచన జంధ్యాల, గొంతు ఘంటసాల".
సారధి మొహం చిట్లించేడు. గొంతేమిటి- గొంతు. ఈ అనౌన్సర్స్- ముఖ్యంగా యువవాణికి వచ్చేవాళ్ళు ఏదో కొత్తదనం చూపించాలనే తాపత్రయంతో చేసే ప్రయోగాలు చాలా ఇబ్బందికరంగా వుంటాయి. ఒకోసారి జి.వి.రావు పాడిన పాట అంటుంటారు. 'ఎవరా' అని ఆలోచిస్తూ వుంటే అంతలో ఘంటసాల వేంకటేశ్వరరావు స్వరం వస్తూంది.
అతడు దాన్ని గురించి అంత పట్టించుకోలేదు. అతడికి పుష్పవిలాసంలో వుండే ఆర్ధ్రత అంటే యిష్టం. పక్కనే వున్న ఈజీచైర్ లో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. నేనొక పూలమొక్కకడ నిల్చి..... అన్న ఎత్తుగడ అతడికి చాలా ఇష్టం.
రికార్డుమీద 'పిన్' చేస్తున్న శబ్దం గరగర- తరువాత పద్యం మొదలైంది.
పార్ధసారధి కళ్ళు తెరిచి విసుగ్గా ట్రాన్సిస్టర్ వైపు చూసేడు. రికార్డు రెండోవైపు పెట్టారెవరో.... అతడో క్షణం ఆగాడు. క్షమాపణల్తో పాట సరిగ్గా వస్తుందనుకున్నాడు. రాలేదు. అది పూర్తయ్యాక రెండోవైపు (నిజానికి మొదటివైపు) వచ్చింది.
పార్ధసారధి నిస్పృహతో తల విదిలించాడు. రికార్డు మీద ఏదైనా వుండొచ్చుగాక, పుష్పవిలాపంలో మొదటి భాగం ఏదో, రెండో భాగం ఏదో తెలియనివాళ్ళు కూడా తన ఆఫీసులో పని చేస్తున్నారంటే అంతకన్నా అవమానం ఇంకొకటి లేదు. ఇంక రేపట్నుంచి ఉత్తరాలొస్తాయి. ఫలానా రోజు, ఫలానా గంటలకి రికార్డు తప్పుగా వేసేరని.
అలా వ్రాస్తే ఫర్లేదు.
"నిద్రపోతున్న అనౌన్సరూ- మేలుకో" అని ఒకరు హెడ్డింగ్ పెడ్తారు. "రికార్డు పెట్టేముందు ఏది మొదటి భాగమో చదివే అలవాటు లేదా?" అని ఇంకొకరు వ్రాస్తారు. ఉత్తరాల మీద ఉత్తరాలు.... అతడికి ఆశ్చర్యంగా వుంటుంది. ఇంతమంది జనం ఇంత శ్రద్ధగా రేడియో వింటున్నారన్న విషయం తలంపుకొస్తే.అతడికి అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యస్వామి మాటలు జ్ఞాపకం వచ్చేయ్. "మన స్టాఫ్ కెంత బుద్ధిలేదో, ఈ శ్రోతలకి అంత బుద్ధిలేదోయ్, చిన్న తప్పు జరిగిందే అనుకో- దానికి పదిహేను పైసలు ఖర్చుపెట్టి మనకి ఉత్తరం వ్రాయాలా? మన తప్పు మనకి తెలీదూ" అంటాడు. ఆయన రాటుదేలిపోయాడు- వయసు ఏభై దాటుతున్నా స్టేషన్ డైరెక్టర్ గా ప్రమోషన్ రాక.
-తప్పు అనగానే అతడికి సంవత్సరం క్రితం జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చింది. ఇప్పటికీ అది నిన్నా, మొన్నా జరిగినదాన్లాగే వుంది.
ఆ రోజు-
రాత్రి ఎనిమిదింటికి అతడు ఏదో పుస్తకం చదువుకొంటూంటే ఫోన్ మ్రోగింది. ఎత్తి 'హలో' అన్నాడు.
"ఆల్ ఇండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ గారేనా?"
"ఔను"
"అయ్యా- మీ పేరు?"
విసుగ్గా "సారధి" అన్నాడు.
"మీ ఇంటినెంబరు తెలియక కొంచెం అవస్థ పడవలసి వచ్చింది. డైరక్టరీలో మీ నంబరు మారిపోయింది.... ఎంక్వయిరీలో కనుక్కొని చేస్తున్నాను. అయ్యా డైరెక్టర్ గారూ! మీ ఇంట్లో రేడియో వుందాండీ?"
సారధి ఉలిక్కిపడి "ఏమిటి" అన్నాడు.
"మీ ఇంట్లో రేడియో వుంటే ఒకసారి పెడ్తారా? పెట్టి ఆ వివిధభారతిలో వస్తూన్న పాట కొంచెం వింటారా? అయ్యా- నాకు నలుగురు కూతుళ్ళు- ఇద్దరు కొడుకులు. ఇంటిల్లిపాదినీ అలరించే ఏకైక సాధనమైన రేడియో అందరూ కలిసి వినాలన్న కోర్కె మాది. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క ట్రాన్సిష్టర్ పెట్టుకుని వినేటంత డబ్బున్న వాళ్ళం కాము. అయ్యా వింటున్నారా! ఇదిగో ఈ పాట రాగానే మా రెండో కుర్రవాడు నవ్వుతున్నాడండీ. పెద్దది లేచి లోపలికి వెళ్ళిపోయింది. రెండోది వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూంది. మా ఆవిడ నా మొహం చూసి రేడియో కట్టెయ్యమన్నట్లు సైగ చేసింది. మరి అలా కట్టేస్తే, ఆ పాట నాకు అర్ధమైపోయినట్టు మా పెద్దకొడుక్కీ అర్ధమై పోతుందేమోనని భయం వేసి, పరుగు పరుగున పక్కింటికొచ్చి మీకు ఫోన్ చేస్తున్నాను." సారధి ఏదో అనబోయేటంతలో ఫోన్ పెట్టేశాడు.
సారధికూడా ఫోన్ పెట్టేసి, రేడియో దగ్గరికి వెళ్ళి, 'ఆన్' చేయబోయి, మళ్ళీ విరమించుకున్నాడు.
అనవసరం.
అందులో వచ్చేపాట ఎలాటిడో అతడు ఊహించగలడు.
....సినిమాలో వున్న ప్రతీ పాటనీ రేడియో ప్రసారం చెయ్యక్కర్లేదు. కొన్ని పాటలలో వాక్యాలు సినిమాలో సెన్సార్ చెయ్యబడినా, రికార్డుల్లో వుంటాయి. అయితే.... రేడియో ప్రసారం చెయ్యబోయే ముందు పాటల్లో ఆశ్లీలత వుందా లేదా అని చూస్తూ వుంటారు. ఒక కమిటీ ఏర్పడి, ఏ రికార్డుల్లో అలాటి అశ్లీలత వుందా అన్న పరీక్ష చేస్తూ వుంటారు. అశ్లీలత వున్నవి ఈ విధంగా రేడియోలో ప్రసారం జరగకుండా ఆపు చెయ్యబడతాయి.
అయితే ఒక పాటని ఈ విధంగా 'నిరాకరించడం' అంత సులభం కాదు. ఎన్నో వత్తిడులను, మరెన్నో 'వాటిని' తట్టుకోగలిగి వుండాలి.
ఇంత చేసినా ఇలాటి విమర్శలు తప్పవు.
తనకింకా నయం. టీ.వీ. స్టేషన్ డైరెక్టర్ కైతే, సాయంత్రం ఏడింటినుండి నరకం ప్రారంభం అవుతుంది. మొన్న పార్టీలో అదే చెప్పి గోల పెట్టాడు. ఒకరాత్రి టీవీ.లో ప్రోగ్రాం వస్తూవుండగా ఫోన్ చేసి, "మా కారు డ్రైవరుతో టీవీ. సెట్టు పంపుతున్నాను" అందట ఒకరాత్రి.
ఇతడు అమాయకంగా "ఎందుకు" అన్నాడు.
"మీ నెత్తికేసి బద్దలు కొట్టడానికి" అని ఫోన్ పెట్టేసింది. ఇది చెప్పగానే పార్టీలో అంతా ఒకటే నవ్వు.
.....కానీ ఈ కష్టాలు తప్పవు.
ఎంత టైము దేనికి కేటాయించాలో గవర్నమెంటే నిర్ణయిస్తుంది. ఉదాహరణకి జనవరి నెలలో ఒకరోజు ఉదాహరణగా తీసుకొంటే ఆ నెలలో మొత్తం 1036 గంటలా 16 నిమిషాల పాటు ప్రసారం జరిగింది. అందులో 792 గంటలు స్వంత స్టేషన్ ప్రసారాలు, 224 గంటలు బైట స్టేషన్ రిలేలు. వీటిని మరింత విడగొట్టి చూస్తే 23,840 నిముషాలు భారతీయ వాద్యసంగీతం, 700 నిమిషాలు పాశ్చాత్య వాద్యసంగీతం, 10,154 నిమిషాలు న్యూస్, యువకులకోసం 7,154 నిముషాలు, స్త్రీల కార్యక్రమాలు 1,430 నిముషాలు, దాదాపు 7000 నిముషాలు చర్చలు, రైతు సమస్యలు వగిఅరా, వగైరా. వీటిల్లోనే వయోజన విద్య, మద్యనిషేధం, సాంఘిక అత్యాచారం వగైరాలు. ఇన్నిటి మధ్యా ప్రజలకి ఆనందకరమైన ప్రోగ్రాములని చొప్పించటం అంత సులభమైన విషయం కాదు. దురదృష్టవశాత్తు ఈ విషయం చాలామందికి తెలీదు. వీటికి తోడు తమ చుట్టూ తిరిగే రచయితలూ, నటులూ....