"నా ఉద్దేశ్యం - ఎవరన్నా వస్తే ఆయనకి చెప్పటం కోసమే నువ్విక్కడ నియమించబడ్డావని...! ఆ పని మాత్రమే నువ్వు చేయాల్సింది. అలా చెయ్యని పక్షంలో నీమీద క్రమశిక్షణ చర్య తీసుకోవలసి ఉంటుంది."
ఫ్యూన్ అర్ధంకాక అయోమయంగా చూసి "మీ పేరు?" అన్నాడు. అతడు నవ్వి- చేతి ఉంగరం తీసి యిస్తూ, "వెళ్ళు ఆంజనేయా! లోపల ఇచ్చిరా...." అన్నాడు. "ఇదే విజిటింగ్ కార్డు"
ఫ్యూన్ లోపలకెళ్ళి చెప్పేసరికి పార్థసారధి "నో....నో.... ఇప్పుడెవర్నీ చూడను. రేపు రమ్మను" అన్నాడు. ఫ్యూన్ ఉంగరాన్ని అతడి ముందు టేబిల్ మీద పెట్టి "ఇదేనటసార్! ఆయన విజిటింగ్ కార్డు" అన్నాడు. పార్థసారథి మొహంలో ఆశ్చర్యం చోటుచేసుకుంది. ఉంగరాన్ని చేతిలోకి తీసుకుని చూశాడు. దాని మీద టి.యస్. అని వుంది. ఇదేదో తేల్చుకోవాలని- 'రమ్మను' అన్నాడు. రెండు నిమిషాల తరువాత ఆ వృద్ధుడు పార్థసారథి ఎదురు సీట్లో ఆసీనుడై వున్నాడు.
"ఎవరు మీరు? ఏం కావాలి?" మొహం చిట్లిస్తూ విసుగ్గా అడిగేడు పార్థసారథి. ప్రాక్టికల్ జోకు వేసే వాళ్ళంటే చిరాకు అతనికి.
"నా పేరు టి.యస్.... అ ఆ ఇ ఈ సంఘం ప్రెసిడెంట్ ని అ ఆ ఇ ఈ అంటే అనాధల్ని ఆపదల్నుంచి ఇవతలికి ఈడ్చే సంఘం".
పార్థసారథి చేతిలోంచి ఉంగరం జారి బల్లమీద పడింది. విస్మయంగా అతడివేపు చూసి- "ఏం కావాలి మీకు?" అన్నాడు.
టి.యస్. నవ్వి "అసలు విషయానికి డైరెక్టుగా వస్తాను" అన్నాడు. "మీ ఆఫీసులో ఈ రోజు ఇంటర్వ్యూలు జరిగాయి. ఖాళీ పోస్టులు నాలుగు. అయితే ఈ నాలుగు పోస్టులకీ ఇప్పటికే నలుగురూ భర్తీ అయిపోయారు. రికమండేషన్లున్న కాండేట్లు.... నా కాండేట్ కి ఉద్యోగం కావాలి" తాపీగా అన్నాడు వృద్ధుడు.
పార్థసారథి బెల్ కొట్టి "మీరిక వెళ్ళొచ్చు" అన్నాడు.
వృద్ధుడు కదల్లేదు. "మీరు బెల్ కొట్టారు, అర నిమిషంలో వస్తాడు. అతణ్ణి వెళ్ళిపోమనండి. నేను చెప్పేది అతను వింటే మీ మీదున్న గౌరవం దూదిపింజలా ఎగిరిపోవచ్చు" అన్నాడు. అంతలో ఫ్యూన్ లోపలికి వచ్చాడు. వెళ్ళిపోమన్నాడు పార్థసారథి.
"గుడ్" అన్నాడు వృద్ధుడు. "నా కాండేట్ కి ఉద్యోగం ఇవ్వగలిగేది మీరే అని తెలిసిన తరువాత మొత్తం అ ఆ ఇ ఈ సంఘం మీ కార్యకలాపాల్నీ, మీ గతజీవితాన్నీ శోధించింది. ఈ రెండు రోజులూ మీ ఇంట్లో జరిగిన ప్రతి విషయమూ పబ్లిక్ సినిమాలోలా మా వాళ్ళు చూశారు. మీ ఒంటరితనం- మీ దినచర్యా- అంతా. కొంచెం మంచినీళ్ళు తాగొచ్చా?" అని జవాబు కోసం ఎదురు చూడకుండా ఆగి, మళ్ళీ మొదలు పెట్టాడు-
"సరిగ్గా పన్నెండు సంవత్సరాల క్రితం నవంబర్ ఆరున మీకు పెళ్ళైంది. మీ భార్య పేరు నిర్మల. ఆమెకి మీకన్నా ముందే ఒక ఫ్రెండ్ వున్నాడు. మీకు నవంబరు పన్నెండున శోభనం అయింది. ఆ రాత్రి మీరు ఘోరంగా ఫెయిలయ్యారు. 'అదేమిటి? అలాక్కాదు. ఆ మాత్రం తెలీదా- పెద్ద మగాళ్ళు!' అని మీ భార్య అనటం ఆ రాత్రి మీరు ఫెయిలవ్వడానికి కారణం. సున్నితమైన మీ మనస్తత్వం మీద ఆ మాటలు ఎంత విపరీతంగా పని చేసాయంటే- ఆ తర్వాత జరిగిన మీ మూడేళ్ళ వైవాహిక జీవితంలోనూ ఆమెకు మీరు చేరువ కాలేకపోయారు. స్త్రీ దగ్గిరకి చేరుకొనే కొద్దీ ఆ మాట గుర్తొచ్చి టెన్షన్ తో ఏమీ చేయలేనేమోనన్న బెదురుతో మీరు ఏమీ సాధించలేకపోయేవారు. ఆ తర్వాత మూడు సంవత్సరాలకి మీ భార్య పురిటిలో చచ్చిపోయింది. అయినా దానికి మీరంతా బాధపడలేదు. కారణం- ఆమె కడుపుకి కారణం మీరు కాదని మీ ఇద్దరికీ తెలుసు. మొత్తానికి మీరు జీవితంలో, మొగవాళ్ళ నేమంటారో తెలీదు కానీ- ఆడవాళ్ళని కన్నె అంటారు. అలా వుండిపోయారు".
పార్థసారథి మొహం ఎర్రగా కందిపోయింది. పళ్ళు బిగించి- "నా డైరీలన్నీ చదివేరా" అన్నాడు. టి.యస్. తలూపి "క్షమించండి. మేం యింకా చాలా చేశాం. మీరు స్త్రీ పట్ల అనాసక్తులుకారు- కేవలం భయంవల్లే మీరు శక్తిని కోల్పోయారు; 'అందుకని మీరేం చేస్తారు' అన్న అనుమానం మా కొచ్చింది. రాత్రిళ్ళు కూడా మిమ్మల్ని గమనించేం- మీరేం చేస్తారో తెల్సా?"
"ఏం చేస్తాను?"
టి.యస్. చెప్పాడు. "మాస్టర్ బేషన్...."
అతడి కింది పెదవిలో పన్ను కసుక్కున దిగింది. మొహం తెల్లగా పాలిపోయింది. చేతులు పైకెత్తి అరచేతుల్తో మొహాన్ని కప్పుకొన్నాడు వణుకుతూ. టి.యస్.కి అతడిని చూస్తే జాలేసింది. "ఇవన్నీ మీకు చెప్పి మిమ్మల్ని బాధపెట్టాలన్నది మా ఉద్దేశ్యం కాదు" అన్నాడు. "మాకు కావల్సింది ఉద్యోగం అంతే."
పార్థసారథి తేరుకోవదానికి అయిదు నిమిషాలు పట్టింది. "చెప్పండి మీ కాంటేడ్ ఎవరు?" అని అడిగాడు. టి.యస్. నవ్వి, "ఆ కాండేట్ ని తరువాత ద్వేషంతో మీరు బాధపెడితే.... సారీ చెప్పను. నాలుగు పోస్టులకీ మెరిట్ కాండేట్లు తీసుకోండి- నా కాండేట్ నలుగుర్లోనూ ఒకరవుతారని నాకు నమ్మకం వుంది" అని సీట్లోంచి లేచి, "నా ఉంగరం" అన్నాడు.
పార్థసారథి అందించిన ఉంగరాన్ని అందుకుంటూ, "వెళ్ళొస్తాను" అంటూ టి.యస్. చెయ్యి ముందుకు సాచి "మనం శత్రువులం కాముగా!" అన్నాడు.
"కాము"
"గుడ్!"
* * *
"హా.... ఆ ఆ ఆచ్" అంటూ తుమ్మింది రాధ. తరువాత నవ్వి- "వీరనారిలా చెరువులో దూకకపోయినా బావుండేది బామ్మా" అన్నది.
"రెండు మిరియాలడిగి తెస్తానుండు పక్కింట్లో" అంది బామ్మ.
"పిచ్చి బామ్మా. బియ్యం అడిగేం- బొగ్గులడిగేం- ఉప్పులడిగేం- డబ్బులడిగేం. ఇప్పుడు మిరియాలడిగితే- వీళ్ళు నెససిటీస్ నుంచి లగ్జరీస్ కి వెళ్ళారనుకారూ!" అని మళ్ళీ నవ్వి "యాంటీబయోటిక్స్" అన్నది.
"ఏమిటీ-"
"చాలా ఖరీదైన పదంలే బామ్మా- నీకు అర్ధంకాదు"
"ఏం అర్ధమో ఏమో, నిన్ను ఓ అయ్య చేతిలో పెడితే నాకింకేం అఖ్కర్లేదు."
"పెడుదూకాన్లే బామ్మా! శేఖరం రానీ!"
బామ్మ చప్పున వంగి- "శేఖరం ఎవరే? ఎక్కణ్ణుంచి వస్తాడు?" అన్నది. రాధ కుట్ర పన్నుతున్నదాన్లా అంతే రహస్యమైన కంఠంతో- "వస్తాడు బామ్మా! ఇంకో నవలలోంచి ఎగిరొస్తాడు. నా పేరు జయంతి అని మార్చుకుంటాను." అంది.
'జయంతెవరే'.... అని అడగబోతూంటే పోస్ట్ మాన్ కవర్ తెచ్చి ఇచ్చాడు. ఇంటిగలాయన ఇచ్చిన నోటీసేమో అనుకుంటూ వణుకుతూన్న చేతుల్తో విప్పింది. సగం చదివి "బామ్మా!" అని ఒక్క కేకపెట్టింది. బిడియంతో, భయంతో ముణగదీసుకున్న పక్షి ఒక్కసారి ఎగిరినట్టూ- స్వేచ్చగా.... ఆకాశంలోకి.....
"దిస్ అగ్రిమెంట్ ఎంటర్డ్ ఇన్ టు విత్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా- ప్రెసిడెంట్... ప్రె....సి....డెంట్....."
"నీకెందులో కావాలమ్మా ఉద్యోగం?"
"ప్రసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీసులో స్వామీ."
"ఎక్కడొచ్చిందే ఉద్యోగం-?"
"స్టేషన్లో బామ్మా!"
"ఏ స్టేషనే - రైల్వేస్టేషనా?" అమాయకంగా అడిగింది బామ్మ.
"ఇంకా నయం- ఫైర్ స్టేషన్ అన్నావ్ కాదు బామ్మా. స్టేషనంటే... హా ఆ ఆచ్.... రేడియో స్టేషను- ఇప్పుడెళ్ళు బామ్మా. పక్కింటికి వెళ్ళి మిరియాలడుగు - దాంతో పాటూ పాలు కూడా".
"రేడియో స్టేషనా- అమ్మో చాలాదూరం కదే ఇక్కడికి"
"పది కిలోమీటర్లేగా. కడుపు పట్టుకుని వేల వేల మైళ్ళు ప్రయాణం చేస్తున్నాడు మనిషి. అయినా ఫర్లేదు బామ్మా! నా డియరెస్ట్ ఫ్రెండ్ జయ అందులోనేగా పనిచేసేది-"
* * *
"గుడ్ మార్నింగ్ డాక్టర్! నా పేరు జయ. పూర్తి పేరు జయవిజయ. ఈ కుర్రాళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్. అంతకన్నా వీళ్ళద్దరి పరిచయాలూ అనవసరం. పోతే నా సమస్య సస్పెక్టెడ్ ప్రెగ్నెన్సీ. నాలుగో నెల కడుపని అనుమానం. ముందు అవునో కాదో పరీక్షచేసి తేల్చాలి. ఆ తరువాత దానికి- అంటే నా ఉద్దేశ్యం ఆ కడుపుకి కారణం వీళ్ళద్దర్లో ఎవరో తేల్చి చెప్తే నా అబార్షన్ కయ్యే ఖర్చులు భరించేవాణ్ణి వుండిపొమ్మని, రెండోవాడ్ని పంపించెయ్యొచ్చు."
తను వింటున్నది కలో నిజమో తెలీక అచేతనంగా వుండిపోయాడు డాక్టరు. నిమిషం తర్వాత తేరుకొని ఆమె తాలూకు బాయ్ ఫ్రెండ్స్ వైపు చూశాడు- ఎందుకొచ్చినా పీడరా భగవంతుడా అన్నట్టు, ఆర్నెల్ల క్రితం చేసిన పనికి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నట్టు వున్నారు ఇద్దరు కుర్రవాళ్ళు.
"వీళ్ళ సంగతి తరువాత చెప్తాను. రేపు రమ్మన్నండి. ముందు మిమ్మల్ని పరీక్ష చెయ్యాలి-' అని డాక్టర్ అనగానే బ్రతుకుజీవుడా అంటూ వాళ్లు వెళ్ళిపోయారు. విజయ డాక్టర్ తో పాటు లోపలికి వెళ్ళింది. అయిదు నిముషాల తరువాత ఇద్దరూ బయటకొస్తూంటే డాక్టర్ అన్నాడు- "కంగ్రాచ్యులేషన్స్! మీ అనుమానం నిరాధారం"
విజయ నవ్వి- "థాంక్స్" అంది. "పాపం వాళ్ళిద్దరూ భయంతో చస్తూ వుంటారు. వెళ్లి చెప్తాను. బైదిబై మీ ఫీజు?" అన్నది.
"కొంచెంసేపు వుండి వెళ్ళండి. హాస్పిటల్ టైమ్ కూడా అయిపోయింది. పేషంట్లు ఎవరూ రారు"
ఆమె పెదవులమీద నవ్వు మాయమైంది క్షణంసేపు. క్షణంసేపే. మళ్ళీ అంతలోనే స్వభావసిద్ధంగా అది వచ్చి మొహానికి చేరుకుంది.
"ఎందుకు డాక్టర్?"
డాక్టర్ ఉత్సాహంగా ముందుకు వంగి, "కబుర్లు చెప్పుకుందాం" అన్నాడు.
"దేని గురించి?"
ఈ ప్రశ్న అతనూహించలేదు. కొంచెం దెబ్బతిని, "అబ్బాయీ, అమ్మాయీ దేనిగురించి కబుర్లు చెప్పుకుంటారూ- ఏదయినా సరే-" అన్నాడు.