3
పాసింజర్ ట్రైన్ చిన్నచిన్న కుదుపులతో తగుమాత్రం వేగంతో పరిగెడుతుంది.
ఫస్టుక్లాస్ కంపార్టుమెంట్ కూపెలో శ్వేతబిందు బెర్తుమీద పడుకుని వుంది. ఆమె తలదగ్గర కిటికీ ప్రక్కగా ప్రదీప్ కూర్చున్నాడు.
ఉన్నట్టుండి ట్రైన్ పెద్దకుదుపు ఇచ్చింది.
"అబ్బా!" అన్నది బిందు కొంచెం బాధగా.
ప్రదీప్ ఆమెవంక ఆదుర్దాగా చూస్తూ "బిందూ! ఏమిటి? ఏమన్నా నొప్పి కలిగిందా?" అన్నాడు.
ఆమె నవ్వటానికి ప్రయత్నిస్తూ "లేదులెండి. ఒక్కక్షణం అదోలా అనిపించింది" అన్నది.
"కారులో వస్తే రోడ్డంతా గతుకులమయమని రైలుప్రయాణం పెట్టుకున్నాను. ఇదీ అలాగే తగలబడింది" అంటూ కొంచెం యివతలకు జరిగి ఆమె కడుపుపై చెయ్యివేసి మృదువుగా రాస్తూ "చెప్పు.... నిజంగా నొప్పి కలిగింది కదూ" అన్నాడు.
ఆమె అతని చేతిని పట్టుకుని గుండెలమీద పెట్టుకుని వ్రేళ్ళు మృదువుగా సవరిస్తూ "గర్భిణీస్త్రీకి చిన్నచిన్న నొప్పులుండవా?" అంది.
"ఎవరికైనా వుండవచ్చు కాని, నీకు వుండకూడదు."
"ఏమిటమ్మా నా గొప్ప."
"నా భార్య కావటమే."
"అదా సంగతి! ఈ కాస్త కుదుపుకే ఇంత కంగారుపడుతున్నారే? రేపు రియల్ పెయిన్స్ వస్తే ఎలా నిగ్రహించుకుంటారండీ?"
"నీ బదులు నొప్పులు నేను పడతాను."
ఆమె కిలకిలమని నవ్వి "ఒకపని చేస్తే అలా జరిగేది" అంది.
"ఏ పని?"
"చెప్పను"
"ఉహు, చెప్పాల్సిందే."
సిగ్గుతో ఆమెముఖం ఎర్రబడింది. "ఎలాగండీ" అంది.
"అదేంకాదు. చెప్పాల్సిందే."
ఆమె యిబ్బందిగా ముఖంపెట్టి "ఇలా వంగండి. చెవిలో చెబుతాను" అన్నది.
అతనామె ముఖంమీదకు వంగాడు. ఆమె అతని చెవిలో గుసగుసగా చిన్న చిన్న మాటలు చెప్పింది.
"ఏయ్! చిలిపి" అని ఆమె బుగ్గమీద చిన్న చిటిక వేసి "ఈసారి... అలా చేద్దాం."
"ఏయ్! రౌడీ."
"ఎలాగూ రౌడీ అన్నావు కాబట్టి కొంచెం రౌడీవేషం వేయక తప్పదు"
* * *
రైలు చిన్న పల్లెటూరి స్టేషనులో ఆగి మళ్ళీ బయలుదేరింది.
"మీకు పాప కావాలా? బాబు కావాలా?"
ప్రదీప్ నవ్వాడు. జవాబు చెప్పలేదు.
"ఎందుకు నవ్వారు? ఎడ్యుకేటెడ్ అయివుండికూడా చాలా రొటీన్ ప్రశ్న అడిగాననా?"
"కాదు. ఈ రోజుల్లో అబ్బాయికి, అమ్మాయికి తేడాలేదు. ఎవరైనా సరే గొప్ప వరప్రసాదం కావాలి."
క్షణంపాటు ఆమెముఖంలో భయం కదలాడింది. స్టేషన్ రాకముందు యిద్దరూ కొంచెం దూరంగా జరిగి కూర్చున్నారు. శ్వేతబిందు అతని దగ్గరగా జరిగి "నాకు చాలా భయంగా వుందండీ" అంది.
ప్రదీప్ గుండె కలుక్కుమన్నట్లయింది. "ఎందుకు?" అన్నాడు.
"నాకు.... ఏదన్నా జరుగుతుందని."
"బిందూ! నువ్వలా లేనిపోని ఊహలు తెచ్చుకుంటే నేను భరించలేను."
"అలా ఆలోచించటం నాకూ యిష్టం కాదండీ. కాని ఎంత వద్దనుకున్నా పదే పదే అనిపిస్తుంది."
"ప్లీజ్ బిందూ! నీకు బెస్ట్ మెడికల్ ఎయిడ్ యిప్పిస్తాను. నువ్వు సుఖంగా వుండటానికి నా సర్వశక్తులూ ధారపోస్తాను."
"ఒకవేళ.... ఒకవేళ.... అలా జరిగితే....?"
"జరగదు. జరగదు. జరగదు. ముమ్మాటికీ జరగదు. జరగనివ్వను" ఆవేశంగా అని ఆమెను దగ్గరగా పొదువుకున్నాడు.
* * *
మర్నాడు ఉదయం తొమ్మిదిగంటలకల్లా రెడీ అయి "బిందూ! నువ్వుకూడా తొందరగా తెములు, డాక్టరు దగ్గరికి వెడదాం" అన్నాడు ప్రదీప్.
"అప్పుడే ఏమిటండీ. నిన్ననేగా వొచ్చింది ఊరినుంచి?"
"నో నో! నిన్ను చెకప్ చేయించి నెలరోజులైపోయింది. చూపించాలి."
"ఇవేళ కోర్టుకు వెళ్ళరా?"
"పదకొండు గంటలలోపల హాస్పిటల్ పని అయిపోతే వెళతాను. లేకపోతే ఎడ్ జర్నమెంట్ అడగమని ఓ ఫ్రెండ్ కి చెప్పాను."
"వాట్! లాయర్ ప్రదీప్ వాయిదా అడగటమా? ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదాలు అడగటం, నేను బలహీనంగా వున్నానని అనిపిస్తే, కోర్టు ట్రాన్స్ ఫర్ కు పిటీషన్ పెట్టటం- ఇలాంటి వెప్పుడూ జరగలేదే."
"ఇంతకన్నా ఇంపార్టెంట్ లేదు. అందుకని...."
"అందుకని.... లాయర్ ప్రదీప్ లో కొంచెం స్వార్ధం ప్రవేశించిందన్నమాట."
"ఇది స్వార్ధంకాదు మేడం, అవసరం."
శ్వేతబిందు నవ్వి ఊరుకుంది. యిహ అతన్తో తర్కించకుండా పది నిముషాల్లో చీర, జాకెట్టు మార్చుకుని వచ్చింది.
కొంతదూరం పోయాక నిస్సబ్ధాన్ని భంగపరుస్తూ "ఇదేమిటి? డాక్టరు మాలతి క్లినిక్ ఇటుకాదు" అన్నదామె.
"మనం శ్రీలక్ష్మి హాస్పిటల్ కు వెడుతున్నాం. మాలతి దగ్గరకు కాదు."
"ఎందుకని?"
"రాత్రి.... రైల్లో నువ్వుపడ్డ ఆందోళన నేను మరచిపోలేను. నీకు బెస్ట్ మెడికల్ ఎయిడ్ ఇస్తానని వాగ్దానం చేశాను."
"మాలతికూడా గొప్ప డాక్టరేకదా!"
"కావచ్చు కాని శ్రీలక్ష్మి హాస్పిటల్ దేశంలోని పెద్ద పెద్ద హాస్పిటల్స్ తో పోటీ చేస్తున్నది. అక్కడ లేటెస్టు ఎక్విప్ మెంట్స్ అన్నీ వున్నాయి."
శ్వేతబిందు ముఖంలో అసంతృప్తి కనిపించింది. "కొత్తచోటు, నాకలవాటు లేదండీ."
"కొత్తచోటేమిటి? ఒకటి రెండుసార్లు వెళితే అదే అలవాటయిపోతుంది."
"మాలతి అంటేనే నాకిష్టమండీ. మనకెంతో కావలసిన వ్యక్తి."
"నాకూ ఇష్టమే. మనకెంతో కావలసిన వ్యక్తి అని నేనూ నమ్ముతాను. కాని నాకు కావాల్సింది సెంట్ పర్సెంట్ సేప్టీ."
"ఈ సంగతి ఆమెకు తెలిస్తే నొచ్చుకుంటుందేమోనండీ."
"ఆమె మన మనసుల్ని అర్ధం చేసుకున్నదయితే నొచ్చుకోదు. అర్ధం చేసుకోకుంటే నేను కేర్ చెయ్యను."
"మీరు చాలా మొండివారు" అన్నదామె నిస్పృహగా.
అతను నవ్వి వూరుకున్నాడు. మాలతి అంటే అతనికత్యంత ఆదరాభిమానాలు, గౌరవం వున్నాయి. కాని బిందుమీద అతనికున్న ప్రేమ, ఆందోళన, అతడ్ని మొండివాడిగానే చేశాయి.
* * *