Previous Page Next Page 
సిగ్గేస్తోంది! పేజి 5

  

     కండక్టర్ ఆమెకి టికెట్ ఇస్తూ వుండగా అది ఆమె చేతిలోంచి జారి కింద పడిపోయింది.
   
    ధరణి వంగి టికెట్ తీస్తూ ఉండగా ఆ దృశ్యం ఆమె కంటపడింది.
   
    పక్కసీట్లో కూర్చున్నవాడు, ధరణి ముందు నిలబడ్డ కాలేజీ అమ్మాయి హిప్స్ మీద చెయ్యేసి నిమురుతున్నాడు. ఆ అమ్మాయి ఎంత జరిగినా అతనూ తన చెయ్యి ముందుకు పోనిస్తున్నాడు. అప్పటివరకూ ఆ అమ్మాయి ముఖంలో కనపడుతున్న బాధా, అవమానం ఎందుకో ధరణికి అర్ధమైంది! టికెట్ తీసుకుని లేచి నిలబడింది.
   
    ఆ అమ్మాయి వెనకాల నిమురుతున్న అతని చెయ్యి ఎవరి కంతా పడటంలేదు. అతను మహదానందం పొందుతూ అప్పుడప్పుడు నొక్కి వదుల్తున్నాడు.
   
    ధరణి ఆ అమ్మాయి భుజంమీద చెయ్యి వేసింది.
   
    ఆ అమ్మాయి అదిరిపడి వెనక్కి చూసింది. ఆ అమ్మాయి కళ్ళనిండా నీళ్ళున్నాయి.
   
    "బాత్ రూంలోకి రాకు మమ్మీ, నాకు సిగ్గు" అన్న తన తొమ్మిదేళ్ళ కూతురు గుర్తొచ్చింది ధరణికి.
   
    ఆడపిల్ల ఎంతో అపురూపంగా, కన్నతల్లి ముందుకూడా బహిర్గత పరచడానికి సిగ్గుపడుతూ దాచుకునే ప్రైవేట్ పార్ట్స్ ని ఈ వెధవలు నిస్సంకోచంగా, అదేదో పబ్లిక్ ప్రాపర్టీలా ఎంత నిర్భయంగా తాకి ఆనందిస్తారూ! ఎవరూ నోరిప్పి అడగలేరనేగా? అనుకుంది.
   
    ధరణి ఆ అమ్మాయి చెవిలో సన్నటి స్వరంతో - "నువ్వు నా ప్లేస్ లోకి రా, నేను అక్కడ నిలబడతాను" అంది.
   
    ఆ అమ్మాయి వెంటనే ఒప్పుకుంది.
   
    ధరణి ఆ ప్లేస్ లోకి రాగానే వాడు కాసేపు ఆగాడు. ఆ తర్వాత నెమ్మదిగా తన అలవాటైన పని మొదలు పెట్టాడు.
   
    ధరణి వెనక్కి తిరిగి అతని వైపు చూసి నవ్వింది.
   
    అతను కాస్త ఖంగుతిన్నా, వెంటనే సర్దుకున్నాడు.

    "ఈ సంచీ కాస్త పట్టుకుంటారా?" అంటూ అతని ఒడిలో పెట్టింది.
   
    అతను సంచీ పట్టుకునే ధరణి వెనకాల చెయ్యివేసి నిమిరాడు.
   
    ధరణి అతనివైపు బాగా జరిగి "ఎక్కడ వర్క్ చేస్తారూ? బాగా చూసినట్లుందే!" అంది.
   
    అతను తను ఎక్కడ వర్క్ చేస్తున్నాడో చెప్పాడు. ధరణి ఫాస్ట్ నెస్ చూసి హుషారుగా జేబులోనుండి కార్డు తీసి అందిస్తూ "ఎప్పుడు కలుసుకుందాం?" అని అడిగాడు.
   
    "త్వరలోనే .... వీలైతే ఈ వేళే!" కార్డు పర్సులో పెట్టుకుంటూ అంది.
   
    ధరణి వెనకాల నిలబడ్డ కాలేజీ అమ్మాయి ధరణినే ఆశ్చర్యంగా చూస్తోంది.
   
    ధరణి ఆ అమ్మాయి చెవిలో నెమ్మదిగా చెప్పింది. "ఇంకొకసారి కట్టుకున్న భార్యని కూడా అడక్కుండా ముట్టుకోవడానికి భయపడేట్లు చేస్తాను వెధవని!"
   
    "ఏం చేస్తారూ?" ఆ అమ్మాయి ఆసక్తిగా అడిగింది.
   
    "కేసు పెడ్తాను. సాక్ష్యం చెప్పడానికి వస్తావా?" అడిగింది ధరణి. ఆ అమ్మాయి కళ్ళల్లో భయం రెపరెపలాడింది.
   
    "ఒద్దులే!" ధరణి సంచీ తీసుకుని బస్ దిగిపోయింది.

    ధరణి వెనకాలే ఆ రౌడీ కూడా దిగాడు.
   
    ధరణి సరాసరి ఎదురుగుండా ఉన్న పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళడం చూసి అక్కడే ఆగిపోయాడు. ఆ తర్వాత జరగబోయేది కొంత ఊహించి వెనక్కి తిరిగి పరుగు లంకించుకున్నాడు.
   
                                       4
   
    "మమ్మల్ని రక్షించలేనప్పుడు ఎందుకు సార్ మీకు రక్షకభటులన్న పేరూ? ఈ డిపార్టుమెంట్ మీద ఎంతో ఆశ పెట్టుకుని వచ్చి కంప్లెయింట్ ఇచ్చే సామాన్యుల గోడు పట్టించుకోకపోతే అసలు ఇన్ని పోలీస్ స్టేషన్ లెందుకూ? మీకింత హంగూ ఆర్భాటం ఎందుకూ? స్వయానా బాధింపబడిన నేను వచ్చి కేసు పెడతానంటే, కేసు రాసుకోవడానికి ఆధారాలూ, సాక్ష్యాలూ అడుగుతారేమిటి?" ధరణి ఆవేశంగా అడిగింది. ఇన్ స్పెక్టర్ ఆమెకి అడ్డు పడలేదు. బెల్ కొట్టి కానిస్టేబుల్ రాగానే మంచినీళ్ళు తెప్పించాడు. అవి ధరణి ముందుకు జరిపి "మంచినీళ్ళు తాగండి. మీరు చాలా ఆవేశంలో ఉన్నారు" అన్నాడు.
   
    "ఆవేశం కాదు 'ఆక్రోశం! ఈ వ్యవస్థలో ఆడపిల్లగా పుట్టిన నేరానికి ఎవడు మా శరీరాలతో ఆదుకున్నా, ఆనందించినా ఊరుకోవాలా? ఇది అన్యాయం అని మేము ఎదిరిస్తే' సపోర్ట్ చేసి మా తరపున పని చెయ్యడానికి ఒక్క చట్టం కూడా లేదా?" బాధగా అంది ధరణి.
   
    ఇన్ స్పెక్టర్ ఆమెతో శాంతంగా "చూడమ్మా మీ శాంతి భద్రతల్ని పరిరక్షించడానికి, మీ ఆస్తుల్ని ఎవరైనా అన్యాయంగా సొంతం చేసుకుని వాడుకుంటూ ఉంటే ఏక్షన్ తీసుకోవడానికే మా డిపార్ట్ మెంట్ ఉంది!" అన్నాడు.
   
    "దేర్ యూ ఆర్!" ధరణి టేబుల్ మీద అరచేత్తో కొడ్తూ అంది. "మా ఆస్తుల్ని కాపాడే బాధ్యత మీదే కదా!"
   
    "ఔను!" అర్ధంకానట్లుగా చూస్తూ అన్నాడు ఇన్ స్పెక్టర్.
   
    "అవి ఎవరూ అక్రమంగా వాడుకోకుండా చూసే బాధ్యత కూడా మీదే కదా!" అడిగింది ధరణి.
   
    "మీరేం చెప్పదల్చుకున్నారూ?" సీరియస్ గా అడిగాడు ఇన్ స్పెక్టర్.
   
    "అదే చెప్పదల్చుకున్నాను. బస్ లో నా ఆస్తిని వాడు అన్యాయంగా వాడుకున్నాడు. నా శరీరంలోని అన్ని అవయవాలూ న్యాయంగా నాకే చెందుతాయి కదా! నా హిప్స్ మీద చెయ్యేసి వాడు నా పర్మిషన్ లేకుండా తడిమితే నేరం కాదా? అందుకు నేను కేసుపెడ్తే మీరు ఏక్షన్ తీసుకోరా అని అడుగుతున్నాను. మీ పక్కింతాయన్ మీ పర్మిషన్ లేకుండా మీ ఇంట్లోకి వచ్చి మీ బెడ్ రూంలో కాసేపు పడుకొని వెళ్తూ ఉంటే చూస్తూ ఊరుకోగలరా? స్పర్శా, స్పందనా లేని అచేతనామైన వస్తువుల్ని వాడుకుంటేనే మీరు భరించలేరు కదా. మరి మా శరీరంలోని ఫీలింగ్స్ మాటేమిటీ? మేమెంతో పవిత్రంగా చూసుకునే మా శరీరాన్ని తాకీ, నొక్కీ సుఖాన్ని పొందుతున్నవాడు శిక్షార్హుడు కాదా?" నెమ్మదిగా అయినా వాడిగా ఉంది ఆమె స్వరం.
   
    ఇన్ స్పెక్టర్ విక్రం సాలోచనగా చూశాడు.
   
    "మీ ఇంట్లోనూ ఆడపిల్లలుంటారు సార్. ప్రొద్దుట లేస్తే బస్సుల్లో, సినిమాహాళ్ళల్లో, రేషన్ షాప్ క్యూల్లో ఎన్నోచోట్ల వాళ్ళూ ఇలాంటి అవాంఛనీయమైన సంఘటనలు ఎదుర్కొంటూనే ఉంటారు. కానీ సిగ్గూ, భయం, అవమానం అనే ఫీలింగ్స్ వల్ల నోరు మెదపరు. నాలా ప్రతివాళ్ళూ ఆలోచించి ఇటువంటి మదాంధులమీద ధ్వజమెత్తడం మొదలు పెడితే మీ పోలీస్ స్టేషన్లు రైల్వే ఫ్లాట్ ఫారాల్లా కిక్కిరిసిపోతాయి!" అంది ధరణి.
   
    విక్రం ఆమెకో తెల్లకాయితం ఇస్తూ "కేసూ, అతని వివరాలు రాసి ఇచ్చి వెళ్ళండి" అన్నాడు.
   
    ధరణి కృతజ్ఞతగా చూసి కాగితం అందుకుంది. ఒక అయిదు నిముషాల్లో వ్రాయటం పూర్తిచేసి, అతడికి అందించి వెళ్ళిపోయింది. విక్రం వేరే పనిలో పడిపోయాడు.
   
    గంట తరువాత ఇంటికి బయల్దేరబోతూంటే ఆ కాగితం మళ్ళీ కనబడింది. అయితే అతడిలో ముందున్నంత కసీ, దీక్షా లేవు. ఆవేశం తగ్గిపోయింది.
   
    ఒక క్షణం ఆగాడు. పోలీసుని పిలిపించి ఆ కుర్రాడిని తెప్పించవచ్చు. కాని ఏమని కేసు పెడ్తాడు?
   
    ఒకమ్మాయి సాక్ష్యం మీద, అందులోనూ ఆమె ప్రతివాది అయినప్పుడు, కేసు నిలవటం కష్టం ఇదే సంభవమైతే, ప్రతివారూ వచ్చి, "ఫలానా బస్ లో ఫలానావారు నన్ను ఇలా చేశారు కేసు పెట్టండి" అని కంప్లయింట్ ఇవ్వొచ్చు. ఎలా నిలుస్తుందీ కేసు? పోలీసులు రైడ్ చేసి రెడ్ హాండెడ్ గా పట్టుకుంటే అది వేరు.
   
    అతడు వాచీ చూసుకుని, యధాలాపంగా ఆ కాగితాన్ని క్రింద చెత్తబుట్టలోకి జార్చేసి, అక్కణ్నుంచి ఇంటికి బయల్దేరాడు.
   
    ఆమె కాగితం పూర్తిచేసి ఇస్తూ అన్న చివరి మాటలు మాత్రం అతని చెవుల్లో మ్రోగుతూనే వున్నాయి.
   
    "ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ ఆ దేవతలు కూడా ఇక్కడ కొలువుంటే, ఎవడు పీతాంబరం లాగుతాడో, ఎవడు ఇంకేం చేస్తాడో అని పారిపోయినట్లున్నారు. దయచేసి వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం ఎవరు చేసినా సహకరించండి. మనది పుణ్యభూమి కదా!"
   
                                                  *    *    *
   
    ఇంటిముందు మోటార్ సైకిల్ ఆపి దిగుతున్న ఇన్ స్పెక్టర్ విక్రంకి భార్య ఎవరిమీదో పెద్దగా అరవడం వినిపించింది. అతను బైక్ స్టాండ్ వేసి ఆశ్చర్యంగా చూస్తూ గేటు తీసుకుని లోనికి నడిచాడు. అతని భార్య శాంత ఎప్పడూ అంత పెద్దగా అరవడం అతను వినలేదు.
   
    శాంత పోర్టికోలో నిలబడి "ఛీ! ఇంకొకరి సొత్తు అప్పనంగా అనుభవించడానికి సిగ్గుండాలి. మా వారిని రానివ్వండి. మీ పని చెప్తాను. దొంగతనం కేసు పెట్టించి జైల్లో తోయిస్తాను" అని అరుస్తున్నధల్లా, భర్తని చూసి, "వచ్చారా, రండి....అసలు వీళ్ళేమనుకొంటున్నారో ముందు తెలుసుకోండీ!" అంది. ఇరుగుపొరుగు ఇళ్ళ వాళ్ళు బైటే నిలబడి వినోదంగా చూస్తున్నారు. విక్రం అటూ ఇటూ చూస్తూ "ఛ! వీధిలో నిలబడి ఆ అరుపులేమిటి? అందరూ ఇటే చూస్తున్నారు. అసలేమయిందీ?" అన్నాడు.

 Previous Page Next Page