"లేదు లేదు నిజమే చెప్తాను. ఇంతకీ ఈ ఆలోచన అసలు బావుందా?"
ఆమెకి నిజంగానే బావుంది. ఇలాంటి చిన్న చిన్న సరదాలే మనుష్యుల్ని దగ్గిరచేసేది, ముఖ్యంగా భార్యాభర్తల్ని.
ఆమె తలూపింది.
అతడు దిండు సర్దుతూ ఆవులించి, "ఇక పడుకుందామా- నిద్రొస్తుంది గుడ్ నైట్" అన్నాడు. ఆమె తెల్లబోయింది. కానీ అరక్షణంలో సర్దుకుని, రెండో దిండు సరీగ్గా వేస్తూ "గుడ్ నైట్" అంది.
ఆమె ఇంకా పూర్తిగా పడుకోకుండానే అతడు సుడిగాలిలా చుట్టు ముట్టి ఆమెని తనవైపు తిప్పుకుంటూ "చెప్పు ఇప్పుడు సరీగ్గా ఏమీటాలోచిస్తున్నావ్?" అన్నాడు.
ఆమె ఈసారి నిజంగా విస్తుపోయింది. ఇంత నాటకీయంగా తనని బుట్టలో పడేస్తాడనుకోలేదు. కోపంగా, "ఇప్పటికిప్పుడే అనుకుని వెంటనే అడిగెయ్యడమేనా?" అంది.
"మనం అనుకున్న దానిలో ఆ రూల్ లేదు. కావాలంటే వచ్చేసారి నుంచీ, రోజుకి ఒకసారే అలా అడగాలని కండిషన్ పెట్టుకుందాంలే. ఇప్పుడు మాత్రం చెప్పక తప్పదు."
ఆమె సిగ్గుపడింది. కానీ అతడు వదిలిపెట్టేలా కనిపించలేదు. ఆమె తలవంచుకుని "అమ్మయ్య ఇక హాయిగా నిద్రపోవచ్చు కదా అనుకున్నాను" అంటూ చిన్నగా అరిచింది.
"గిల్లటం నాకూవచ్చు. చెప్పుమరి నిజం చెప్పు" అన్నాడతడు.
"నేను ఏమనుకున్నానో మీకు తెలుసు."
"అలా తప్పించుకుంటే కుదర్దు. చెప్పాలి."
"సరే! ఎప్పుడని మీ ప్రశ్న! మీరు గుడ్ నైట్ అన్నప్పుడా? ఏమిటాలోచిస్తున్నావ్- అని అడిగినప్పుడా?" లాజికల్ గా అడిగింది.
"గుడ్ నైట్ అన్నప్పుడు."
"చెవిలో చెపుతాను."
"కుదర్దు. పైకి చెప్పాల్సిందే."
"మన అగ్రిమెంటులో అలాలేదు" నిష్కర్షగా అంది.
"సరే-చెప్పు" మెట్టు దిగొస్తున్నట్టు అన్నాడు.
ఆమె తటపటాయించి, ఇక తప్పదన్నట్లుగా సర్వశక్తులూ కూడ గట్టుకుని, అంతలోనే మళ్ళీ సిగ్గు ముంచుకురాగా దాన్ని అతికష్టంమీద పక్కకినెట్టి అతడి చెవి దగ్గరకి మొహంచేర్చి నెమ్మదిగా చెప్పింది తనేమనుకుందో.
అతడు ఫక్కున నవ్వేడు. ఆమె కషోలాలు ఎర్రబడగా "అలా నవ్వితే ఇకముందేమీ చెప్పనంతే" అంది.
"సరే సరే నవ్వన్లే....ఇక ఇప్పుడు చెప్పు రెండోది."
"రెండోదేమిటి?"
"ఏమిటాలోచిస్తున్నావ్ అన్నప్పుడు- ఐమీన్ అన్న తరువాత సరీగ్గా సమయానికి ఏమి ఆలోచిస్తున్నావ్?"
"మీరంత వెంటనే అడుగుతారనుకోలేదు. చాలా సులభంగా బుట్టలో పడిపోయానే అనుకున్నాను. ఇంకా..." ఆమె చప్పున ఆపుచేసింది.
"ఊ - ఇంకా?"
"ఏదో వుంది. తడబడుతున్నావు."
"ఏమీలేదు! నిజంగా."
"అబద్దాలు చెప్పకూడదని మన మధ్య అగ్రిమెంటు వుందని మర్చి పోయావా?"
ఆమె ఆగి నెమ్మదిగా అంది- "ఈయనకి చాలామంది ఆడవాళ్ళతో పరిచయం వుండి వుంటుంది. లేకపోతే ఈ రకమైన స్పాంటేనియటీ రాదు అనుకున్నాను.
"మైగాడ్? నాకెవరూ పరిచయం లేరు."
"ఏమో మరి నాకనిపించింది! అవతలివాళ్ళ బెరుకు పోగొట్టటానికి మనం ఏదైనా చెయ్యాలంటే ముందు వాళ్ళదగ్గర మనకి బెరుకుపోయే అనుభవం వుండి వుండాలి కదా."
"ఒహో! నువ్వు నిజంగా సైకాలజీ స్టూడెంట్ లాగానే వున్నావే" అని నవ్వి, "రాష్ట్రంలో మంచి పేరున్న క్రికెటర్ని మామూలు ఫాన్స్ వుంటారు కదా! అంతకుమించి పెద్ద పరిచయాలు ఏమీలేవు" అన్నాడు.
"నేనడగలేదు. ఏమిటాలోచిస్తున్నావు అని అడిగితే చెప్పానంతే."
"కనీసం తెలుసుకోవాలని కూడా అనిపించటంలేదా?"
ఆమె ఇబ్బందిగా చూసి "మొదటిరోజే ఈ సంభాషణా" అంది.
"సరే ఇంకేం మాట్లాడాలో నువ్వే చెప్పు."
"ఇంకేవైనా సరే-"
"క్రికెట్ తప్ప ఇంకేమీ రాదు."
"పోనీ అదే చెప్పండి వింటాను."
23. 45. 07 Hrs.
అతడు చూపుడువేలు ఆమె మెడక్రింద పెట్టి, ఆ బొటనవేలు అర్ధ చంద్రాకారంలో పెట్టుకుని కుడినుండి ఎడమకి తిప్పుతూ "నేను లెఫ్ట్ హాండర్ని ఇదిగో ఇలా తిప్పుతే లెగ్ స్పిన్ అంటారు. ఇటువైపు తిప్పితే ఆఫ్ స్పిన్ అంటారు. వేగంగా బౌల్ చేసేవారు బంతిని ఇదిగో ఇలా పట్టుకుంటారు. గుగ్లీ అని వేరే వుంది. ఆగు చెయ్యి లాగెయ్యకు. గుగ్లీలో మనం అవతలివాడిని గమ్మత్తుగా మోసం చేస్తాం. ఇటువైపు బంతిని తిప్పినట్టు నటించి చివరి క్షణంలో ఇదిగో అలా తిప్పేస్తామన్న మాట.....సరీగ్గా ఇప్పుడేం అనుకుంటున్నావో నేనే చెపుతాను. టేబుల్ మీద అన్ని వస్తువులుండగా వాటితో డిమాన్ స్ట్రేట్ చెయ్యొచ్చుగా నన్ను ఇబ్బంది పెట్టటం దేనికి - అఫ్ కోర్స్ కాస్త బాగానే వుందిగానీ.....అనుకుంటున్నావు కదా!"
"నాకేం బావోలేదు. అసలు నేనదేం ఆలోచించటం లేదు."
"మరేం ఆలోచిస్తున్నావు?"
"ఇప్పటికయినా చెయ్యి తీస్తారా?" కోపంగా అంది. జాకెట్ మీద వున్న అతని చేతిని తోసేస్తూ.
"ఊఁ తీశాను చెప్పు" అన్నాడు కాస్త దూరంగా జరిగి.
"నేను నిజంగా ఆ సమయానికి కార్ల్ మార్క్స్ గురించి ఆలోచిస్తున్నాను" అంది.
రాయన్న కెవ్వున అరిచినంత పనిచేసి "మైగాడ్! మొదటిరోజు శోభనం సరీగ్గా అర్దరాత్రి అవుతూండగా అందర్నీ వదిలేసి కార్ల్ మార్క్స్ గురించి ఆలోచించటమా?" అన్నాడు.
"కారల్ మార్క్స్ ఏమన్నాడో మీకు తెలుసా?"
"ఏమన్నాడు?"
"బలీయమైన ప్రేమానుబంధాన్ని ఏర్పరిచే మహత్తరమైన శక్తి కేవలం 'అనుభూతే' అన్నాడు. 'సోమరితనం, నిస్సహాయత ప్రేమానుబంధాన్ని ఏర్పరచలేవు. జీవితాన్ని ఆనందించదల్చుకుంటే, అన్నిటికన్నా ముందు నువ్వు ఆస్వాదించగల శక్తి అలవర్చుకోవాలి. అలాటి శక్తి రావాలీ అంటే నువ్వు నీ చుట్టూవున్న వ్యక్తుల నుంచీ పరిసరాల్నుంచీ ప్రేరణ పొందగలిగి వుండాలి' అన్నాడు. నాకీ కొటేషన్ అంటే చాలా ఇష్టం. కంఠతా వచ్చు వ్యక్తి వ్యక్తితో చుట్టూవున్న ప్రకృతితో మనకుగల సంబంధం, కాల్పనికతతోకాక స్వంత ఆలోచనతో, ఇష్టతతో, స్పష్టమైన రూపంలో, వాస్తవిక రూపంతో కూడుకున్నదై వుండాలి. వ్యక్తపరిచే ప్రేమతో ప్రేరణ కలిగించలేనివారు ప్రేమించటానికి అనర్హులు. వాస్తవికతకు తట్టుకోలేని ప్రేమ నిరర్ధకమైనది-"
అతడు విస్పారిత కళ్ళతో ఆమెవైపు చూస్తూ "నువ్వు చాలా తెలివైన దానివి" అన్నాడు.
"నా తెలివితేటలు ప్రదర్శించుకోవటానికి ఈ కొటేషన్ చెప్పలేదు. నువ్వేమిటి ఆలోచిస్తున్నావ్ అని అడిగితే - మన మధ్య అగ్రిమెంటు వుంది గాబట్టి నేను ఆలోచిస్తున్నది నిజాయితీగా చెప్పానంతే."
"కార్ల్ మార్క్స్ ఇంత లోతయిన ప్రేమపూరిత అనాలిసిస్ ఇచ్చాడని నాకు తెలీదు" అన్నాడతను.
ఆమె నవ్వి "మీకేకాదు చాలామంది మార్క్సిస్టులకే తెలీదు" అంది.
"టైమెంతయింది?"
ఆమె ఖాళీ చెయ్యి చూసుకుని "నేను వాచీ పెట్టుకోలేదు" అంది.
అతడు గదిలో గడియారం కోసం వెతికి అది లేకపోవటంతో విసుగ్గా "వీళ్ళకి అసలు బుద్దిలేదు. గదిలో గడియారం పెట్టకపోతే ఏదెప్పుడో ఎలా ప్లాన్ చేసుకుంటాం?" అన్నాడు అతడు అన్నదేమిటో ఆమెకి క్షణం తరువాత అర్ధమైంది.
ఆమె నవ్వాపుకుని "తెల్లవారుఝామున మూడింటికి పంపు వస్తుంది. అయిదింటి వరకూ నీళ్ళ శబ్దం వినిపిస్తుంది. నీళ్ళాగిపోయిన గంటకి ఆరవుతుంది" అంది సూచన ఇస్తున్నట్టు.
"చూశావా? భుజాలమీద తెలివైన తల వుండాలి అందుకే" అన్నాడు.
"......లేకపోతే కనీసం భార్యన్నా తెలివైనదై వుండాలి - ఎందుకని అడగవేం?"
"ఎందుకు?" అంది.
"ఆ తల మన భుజాలమీద వుంటుంది కాబట్టి."