Previous Page Next Page 
యుగాంతం పేజి 5

  

      "అక్కర్లేదు" అన్నదామె. "నువ్వు నాప్రక్కనంటే నాకు డబ్బు అక్కర్లేదు. ఏమీ అక్కర్లేదు."
   
    అతడీసారి నిజంగా నవ్వాడు. "షేక్ స్పియర్ నుంచీ ఈ కాలం రచయితల వరకూ అదే వ్రాస్తూ వచ్చారు."
   
    ఆమె రోషంగా - "నేను నీకు మరీ కలల్లో బ్రతికే ఆడపిల్లలాగా కనిపిస్తున్నానా" అన్నది. అతడు ఆమెవైపు ఆరాధనగా చూసేడు.
   
    "చాలా సమస్యలు- కట్నం, ఉద్యోగం, అత్తల కష్టాలు, ప్రేమ, కోరుకున్న వాడు దొరక్కపోవటం, ఇన్ని కష్టాల్లో బ్రతకటం కంటే ఆడపిల్ల కలల్లో బ్రతకటమే మంచిది."
   
    "మిగతా ఆడపిల్లల సంగతి నాకు తెలీదు. నేను మాత్రం నిన్నే వివాహం చేసుకొంటాను. ఆరు మూడైనా మూడు ఆరైనా సరే! అందుగ్గానూ నా ఆస్థి సర్వస్వం వదిలి వచ్చేస్తా ఇంకొక్కమాట కూడా వినను. అలా వచ్చేసినందుకు నేను ఆ తర్వాత ఎప్పుడూ భవిష్యత్తులో చింతించను."
   
    అతడు తిరిగి నవ్వబోయాడుగానీ, ఆమె మొహంలో కనబడుతూన్న అదోవిధమైన దీప్తిని చూసి కదిలిపోయి, "మాలతీ" అన్నాడు. ఆమె కూడా తన ఉద్వేగానికి సిగ్గుపడి "సారీ" అన్నది.
   
    "ఎందుకు" అన్నాడతను. "మనిషిలో ఆ మాత్రం సెన్సిటివ్ నెస్ ఫీలింగ్ లేకపోతే బ్రతకడం అనవసరం. నీకు తెలుసా మాలతీ? నేను చచ్చిపోకుండా ఈ వ్యధాభరిత జీవితం ఇలా అనుభవిస్తున్నానంటే దాని వెనుకున్న ఒకే ఒక కారణం నువ్వే. ఫ్రస్టేషన్, ఫ్రస్టేషన్. యువకులలోనూ, యువతులలోనూ, ముసలివాళ్ళలోనూ అందర్లోనూ నిరాశే. అంతా బ్రతకటానికి మాత్రం ఒక కారణం వుంటుంది. ఏదో ఒక కారణం - అంతే. అలా.... నేను బ్రతకటానికి కారణం నువ్వు."
   
    ఆమె మాట్లాడలేదు.
   
    ఇద్దరూ మౌనంగా నడవసాగేరు. నిశ్శబ్ధమే మాట్లాడుతూంది ఆర్ద్రంగా.
   
    "బాగా చీకటిపడింది. ఇక వెనుదిరుగుదామా" అన్నాడతను. పైర్లమీద నుంచి వచ్చే గాలి ఆహ్లాదంగా వుంది. దూరంగా ఓ రెండెడ్లబండి చప్పుడు చేసుకొంటూ వెళ్తూంది. "ఊరికి చాలా దూరం వచ్చేశాం...."
   
    ఇద్దరూ వెనుదిరిగారు, వెనుదిరుగుతూంటే ఆమె ఆగి, "రమణా!" అంది.
   
    "ఊఁ......" అన్నాడు.
   
    "నేను......నేను ఒకసారి నీ చేతిని నా చేతుల్లోకి తీసుకోనా - ఒకేసారి....."
   
    అతడు ఆమె వేపు నెమ్మదిగా తల తిప్పేడు. నెమ్మదిగా స్వరమే కానీ దృఢంగా అన్నాడు- "వద్దు" ఆమె హర్ట్ అయి "ఏం?" అంది.
   
    "దీనికి ఇక అంతం వుండదు మాలతీ. హృదయంలో ఉప్పెనలా పొంగే ఆత్మీయతని ప్రదర్శించటానికి చెయ్యి స్పృశించటమే అవుట్ లెట్ అయితే అదికూడా కొంతకాలానికి సరిపోదు. అది అక్కడితో ఆగదు కూడా. ఆత్మవంచన ప్రారంభమవుతుంది. కొంతకాలం ఆగుదాం. నాకు ఉద్యోగం దొరికితే...." అని నవ్వేడు.
   
    ఆమె నవ్వలేదు. ఆలోచిస్తూంది. మనిషినైతిక విలువల కర్ధం కొద్దికొద్దిగా మారిపోతుంది. ఈ దౌర్భాగ్యపు ప్రపంచంలో స్వచ్చమైన ప్రేమకూడా వ్యవస్థ నిర్మించిన అసమానతల్లోపడి కాలుష్యమయిపోతోంది. తన తండ్రి ఇల్లూ, కారూ, ఫ్రిజ్ అన్నీ అమ్మి ప్రేమికులకి పంచిస్తే..... అప్పుడొచ్చింది ఆమెకి నవ్వు తన అబ్సర్డు ఆలోచన్లని తల్చుకొని! అయినా ఇందులో అబ్సరిటీ ఏముంది? ప్రేమకన్నా ఆకలి దారుణమైంది.
   
    తమ వందెకరాల్నీ పంచి వందమంది కిచ్చేస్తే? నిర్భాగ్యులకీ-పేదలకీ.....
   
                                            *    *    *
   
    "మాదిగోడికి పొలమేమిట్రా? మన ఇట్టరీలో ఏదన్నా చూసినావా అది?" మున్సబు చుట్ట పీకి, "థూ" అని ఉమ్ముతూ అన్నాడు. రాజయ్య మాట్లాడలేదు.
   
    భూషణం చెయ్యి మీసం మీదికిపోయింది. కడుపులోంచి క్రితం రాత్రే మున్సబుతో కలిసి కొట్టిన మందు త్రేన్పుగా వస్తూంది. "ఎల్లెల్లు. ఏదో ఆయనిచ్చింది తీసుకొని - వచ్చేసుకో, పొ-" మళ్ళీ అన్నాడు మున్సబు. "ఇంకో రెండు గింజలు ఎక్కువ కావాలంటే భూషణాన్ని అడిగి తీసుకోరాదట్రా. పొలం నాదనడం దేనికీ......?" కరణం అన్నాడు. రాజయ్య వాళ్ళవైపు చూశాడు.
   
    మునసబు, భూషణం, కరణం.
   
    వెనక్కి తిరిగి తనవాళ్ళవైపు చూసేడు.
   
    అవతలి వాళ్ళందరూ మాట్లాడగలిగిన వారు మాట్లాడుతున్నారు. ఇవతలి వాళ్ళు వినటం తప్ప ఇంకేమీ చేతకానివాళ్ళు వింటున్నారు మధ్యలో తను అన్యాయం జరిగినవాడు.
   
    భూషణం కళ్ళు ఎర్రగా వున్నాయి తాగీ తాగీ.
   
    తన కళ్ళూ ఎర్రగానే వుండొచ్చు రాత్రంతా ఏడ్చీ ఏడ్చీ.
   
    కోపమొచ్చినా ఎర్రబడతాయట కళ్ళు, తెలీదు. జీవితం మొత్తం మీద కోపం వచ్చిందెప్పుడు? ఎప్పుడైనా కోపం తెచ్చుకొందామన్నా - దానికి వీలు కలిగించగలిగే పెళ్ళాం-పెళ్ళయిన రెండేళ్ళకే వెళ్ళిపోయింది. "ఏమంటావురా!" మున్సబు అడిగేడు.
   
    "ఆ పొలం మా తాతల్నాటిది దొరా?"
   
    "నిజమేరా, మీ తాత నాకు తెల్సుగదా! భూషణంగారి తాత దగ్గర పన్జేసేవాడు. మీ తాతకి ఆ బంజరు రాసిచ్చింది ఆయనేరా!"
   
    "రాసిచ్చింది వెనక్కి తీసుకుంటే ఎట్టనయ్యా?"
   
    "రాసివ్వటం అంటే ఏకంగా రాసిచ్చినా డేందిరా! మూడు సంవత్సరాలకి కౌలు కిచ్చినాడు."
   
    "బంజరు భూమి అది. దాన్ని మా తాత వదిలేసిండు. మా నాయన వదిలేసిండు. నేను దున్నిన మూడేళ్ళనుంచి అది పండుతోంది. ఇప్పుడు తీసుకుంటానంటే ఎట్టనయ్యా?"
   
    "మూడేళ్ళయిపోయింది కద. ఇదిగో ఈ కాగితం చూడు!" మాసిన కాగితం మీద మరకల ఇంకు.
   
    ముప్పై సంవత్సరాల క్రితం వ్రాసిందా? మూడు నెలలక్రితం సృష్టించిందా?
   
    "న్యాయమంటే న్యాయమే. కాగితాన్నీ, కాగితంమీద వ్రాసిందాన్నీ నువ్వు కాదనలేవు గదా. ఇది నీ సంతకమే. అంటే అదే.....ఏలుముద్ర అనుకో.....దాన్నీ కాదనలేవు కదా!! చూడు రాజయ్యా, ఈ చెట్టుక్రింద కూర్చొని నేనెన్నో తీర్మానాలు చేసిన, న్యాయాలు చెప్పినా, నువ్వూ యినుకో ఆ పొలం భూషణం స్వాధీనం చెయ్యి కావాలంటే ఆడికిందే పన్జెయ్యి. ఆ పొలం నువ్వేదున్ను. పండించు. నీ కూలి తీస్కో ఆయన మంచాయన. మేం అందరం చెప్పినాం కాబట్టి వొప్పుకుంటుండు."
   
    'పన్జెయ్యి, దున్ను, పండించు, కూలి తీస్కో పండించింది ఆయనకియ్యి. ఆయన మంచాయన. కూలి యివ్వటానికి ఒప్పుకుంటాడు'.
   
    రాజయ్యకి నవ్వూ, ఏడుపూ రాలేదు చచ్చినోడు తగలపడ్తూంటే బతికున్నోడు స్మశానంలో కూచుంటే కలిగే స్థితి. చేతులు కట్టుకొని అన్నాడు-
   
    "ఏదయినా సెబ్దామన్నానాకు ఎక్కువ బాస రాద్దొరా! అయినా సెప్పాలికదా. సెప్తే నాయం జరుగద్దనికాదు. సెప్పకుండా సెడిపోయానన్న బాధ. ముందు ముందు ఆ బాహ నాకు లేకుండా వుండేందుకన్నా అది సెప్పాలి. ముప్పైయేళ్ళ క్రితం మూడేళ్ళకి భూమి రాసిచ్చినాయన మరింతకాలమూ దాన్నెందుకు అడగలేదంట.....? అడుగుతున్నానని నారాజవకయ్యా! ఇదిగో యీ సేతుల్చూడు ఈటిల్తో దున్నినా, ఆ పొలము తడిసింది నీళ్ళతో కాదయ్యా, నా సెమటతో ఇప్పుడిప్పుడే అది కాసింత కనికరించి గింజల్ని రాలుత్తాంది......మీరీ కాగితము సూపించినారు. అది మా తాత రాసిందట అల్ల తాతకి! సచ్చినోడు ఎట్టానూ రాడు. సావలేక బతకలేక శవాల్లా బతుకుతున్న మాలాటి వోల్లకి సాచ్చం సెప్పటానికి దేవుడు కూడా దాక్కుంటాడు."
   
    కరణం కదిలేడు, అసలింతసేపు వీడ్ని మాట్లాడించటం ఏమిటీ అన్నట్టు మునసబువేపు చూసేడు.
   
    "ఈ సంతకం నీదే కదయ్యా!" దీనికేం చెప్తావన్నట్టు మున్సబు అడిగేడు రాజయ్య నవ్వాడు.
   
    "సిన్నప్పుడు బడిపంతులు మనూర్లో యిల్లిల్లూ తిరిగి పిల్లగాళ్ళందర్నీ సదువుకు రమ్మని పిల్చేవోడు, గుర్తున్నదా దొరా? మా నాయన అప్పుడప్పుడు 'నా కొడుకుని పంపితే ఏమున్నది పంతులూ, పన్నెండేళ్ళు నీ యిస్కూల్లో వుంచుకుని ఎనిమిదో కలాసుదాకా జెప్పిస్తావు. ఆ తరువాత జెపేంద్కు మీ దగ్గరేమీ వుండదు. జెప్పించుకొనేటంద్కు మా దగ్గరా పైసలుండవ్. అక్కడితో ఆగిపోతాడు. అంత పెద్దగా చదువు చదివిననాడు కాబట్టి ఆడితో మెరక దున్నించలేను. అంత కొద్దిగా సదివినాడు కాబట్టి సర్కారోళ్ళు ఉద్యోగం కూడా యియ్యరు. రొంటికీ సెడిపోతాడు'- అన్నాడు మా నాయన. 'చదువే ముఖ్యం' అన్నాడు పంతులు. పెపంచాన్ని సూసేటంద్కు సదువుకోవాల్నంట. అప్పుడే దేశం బాగుపడుద్దన్నాడు. నాకు బాగా గురుతు. దేశం బాగుపడేదంటే ఏదో తెలియకున్నా పంతులు సెప్పిన మాటలు మాత్రం బాగా యాదుకున్నాయ్. పోరగాళ్ళతో కలిసి యిస్కూలు కెళ్ళాలంటే గదో సర్దా. మా నాయన 'గద్సరే పంతులూ మావోడు కూలికెల్తే రెండు రూపాయల కూలి దొరుకుద్ది కదా, మరి నీతో పంపిస్తే ఏం దొరుకుద్ది?' అని అడిగిండు. నాటకాల్లో ఏసాలేసే పంతులు నాటకంలోలాగే 'ఇజ్ఞానము దొరుకుద్ది' అన్నాడు సప్పున. 'మాకిజ్ఞానము వద్దు బాబూ, ఇంత తిండి దొరికితే సాల'న్నాడు మా నాయన. 'స్కూల్లో యింతమంది సదువుతున్నట్టు సర్కారోడికి లెక్కలు సూపించాలి ఎట్లా?' గన్నడు పంతులు. 'మావోడు యిస్కోలు కొస్తున్నట్టు రాసుకో, ఆడ్ని కూలి కొదిలిపెట్టు' అన్నాడు నాయన. మీయందరిని యిట్ట నిలబెట్టి మాట్లాడుతున్నానని కోపము దెప్పించుకోకండయ్యా! ఇంతకీ నే సెప్పేది నాకు సదువు అంటలేదని. 'అ' కి'ఈ'కి తేడా తెల్వనోడి కాడ కాగితము బెట్టి 'నీకు సర్కారోడు ఎరువులు మంజూరు చేసిండు' అంటే ఒకసోట ఏంది దొరా..... ఎయ్యమన్న సోటల్లా ఏలముద్రలేస్తము నేనూ, ఈసోపూ, ఈరిగాడు ఇప్పుడా కాగితము సూపించి 'ఇదే నాయం?' అంటే ఏం జేస్తం? నాయం గదేనేమో అనుకుంటాము. అంతకన్నా ఏం జేస్తం? చెట్టుకింద కూర్చొని నివ్వెన్ని నాయాలు సెప్పినవ్. ఈ రోజు మళ్ళీ గదే సెబ్తున్నవ్. దాన్ని యినుకొని నేను నా ఇల్లు వదలి పెడ్త. ఉండేటంద్కు ఏ సెట్టో సూస్కుంట. ఈ సెట్టుకింద కూర్చొని నువ్వు సెప్పింది యినుకొని.....నేనూ ఇంకో సెట్టుకిందికి సేరిపోత....." అంటూ వెనక్కితిరిగేడు.

 Previous Page Next Page