Previous Page Next Page 
సుహాసిని పేజి 5


    "ఈ మాటే క్రిందటి వారం అన్నావు.... మరి ఈ వేళెందుకు పోశావుట...."

    "క్రిందటి వారం అన్నానా, ఏమో డెబ్భై ఏళ్ళు మీదికొస్తున్నాయి. మతిమరుపు జాస్తి అవుతోంది...."

    "బామ్మకేం మతిమరుపు లేదు తాతయ్యా! నాలుగేళ్ళ క్రితం మేమెవ్వరం యింట్లో లేనప్పుడు నువ్వు బామ్మచేత జీన్సు వేయించావుటగా.... అది నిన్న రాత్రి దాకా గుర్తుంది" అందామె.

    "మీ యిద్దరికీ నేనంటే ఆటగా వుంది__" అంటూ నాయనమ్మ అక్కడ్నించి విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపోయింది.

    "నేను దానిచేత జీన్సు వేయించడమేమిటీ__ నాకూ మతిమరుపు పెరిగినట్లుంది__" అన్నాడు తాత సాలోచనగా.

    "బాగా ఆలోచించు. నాలుగేళ్ళ క్రితం....ఆదివారం....మేమందరం చిరంజీవి సినిమాకి బయల్దేరాం. బామ్మ రానంది. నువ్వూ రానన్నావు మేము వెళ్ళేక బామ్మ చిరంజీవి సినిమాల్లో ఆడెవరో, మగెవరో తెలియరని తిట్టింది. అప్పుడు నువ్వు బామ్మని బలవంతం పెట్టి తమ్ముడి జీన్సు తొడిగించావు. నిలువుటద్దంలో తన్ను తాను చూసుకుని బామ్మ సిగ్గుపడింది. అదంతా ఆ తర్వాత నువ్వు నాకు చెప్పావు...."

    "నువ్వు చెబుతూంటే అంతా జరిగినట్లే వుంది. ఒకటొక్కటిగా గుర్తుకొస్తున్నాయి. మీ నాయనమ్మ వయసు జీన్సు వేసుకోగానే సగానికి సగం తగ్గిపోయిందంటే నమ్ము" అంటున్న తాత మనసులో జీన్సులో నాయనమ్మ మెదుల్తోంది.

    "గుర్తుకొచ్చిందా? జరగనివన్నీ జరుగుతున్నాయని నమ్ముతున్నావంటే నీకు నిజంగా మతిమరుపు పెరిగినట్లే లెక్క__" అందామె.

    "అంటే?" అన్నాడు తాత.

    "ఇదంతా యిప్పటికప్పుడు నేను కల్పించి చెప్పాను."

    "ఎంత జాణవే నువ్వు__" అంటూ తాత నవ్వసాగాడు.

    అప్పుడే అక్కడికి నాయనమ్మ తన కొడుకును వెంటబెట్టుకుని వచ్చింది. "ఏమిటీ అంతా కలిసి మా అమ్మనాటపట్టిస్తున్నారుట. వయసులో పెద్దదన్న జ్ఞానముండక్కర్లేదు" అన్నాడు కొడుకు.

    "వెళ్ళి వాళ్ళకీ వీళ్ళకీ పితురీలు చేసుకునే వాళ్ళు పెద్దవాళ్ళవుతారా? బామ్మ చిన్నపిల్ల కాబట్టే అంతా ఆటలు పట్టిస్తున్నారు. అయినా బామ్మకంత వయసేముంది? జీన్సు వేసుకుంటే నాకంటే చిన్న పిల్లలా వుంటుంది" అంది మనుమరాలు.

    ఒక్కసారిగా అక్కడ నవ్వులజల్లు కురిసింది. ఆ జల్లును ఉధృతం చేయడానికి మొత్తం యింట్లోని సభ్యులందరూ వచ్చారు. వారెవరంటే__

    తాతయ్య దక్షిణామూర్తి, నాయనమ్మ పార్వతమ్మ, కొడుకు కోదండపాణి, కోడలు సుభద్ర, మనుమడు గిరిధర్, మనుమరాలు హాస....

    చివరి యిద్దరి వయసులూ పదహారు, పంతొమ్మిది.

    వాళ్ళ పరిచయాలేమిటంటే....

    దక్షిణామూర్తి లాయరు. డబ్బుకంటే న్యాయాన్నే ఎక్కువగా నమ్ముకోవడం వల్ల సంపాదన అంతంతమాత్రం. ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిచేసి వున్నదంతా పోగొట్టుకున్నాడు. కాస్త ఆలస్యంగా పుట్టిన కొడుకును బియ్యే చదివించాడు. అతడి కోసం ఇల్లు మాత్రం మిగిల్చాడు. లాయర్ గా మంచి సరుకున్నవాడని పేరున్న పదేళ్ళనుంచి ఆయన ఎవరికీ లాయరు సలహా కూడా యివ్వడంలేదు. ఆ వృత్తి ఆయనకంత జుగుప్స.

    కోదండపాణి దక్షిణమూర్తి చాటుబిడ్డ. ఆయన పేరుతోనే ఎలాగో ఆ వూళ్ళోనే ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఇప్పుడు చేతికొచ్చేది నెలకు రెండు వేలు. వున్న ఇద్దరు పిల్లల్నీ చదివిస్తూ ఇంటికొచ్చే ఆడపడుచుల్ని ఆదరిస్తూ గుట్టుగా సంసారం గడుపుకొస్తున్నాడు.

    పార్వతమ్మ, సుభద్ర ఆ యింట్లో సుఖశాంతులకు మూలకారణం. ఎలాంటి సమస్యనయినా ఆడది సహకరిస్తే అతిసులభంగా పరిష్కరించవచ్చుననడానికా ఇల్లో ఉదాహరణ. వాళ్ళిద్దరూ విడివిడిగా ఎంత మంచివారో కలిసినప్పుడు అంతే మంచివాళ్ళు. ఆ యింట్లో అత్తాకోడళ్ళున్నారని చూస్తే తప్ప విని తెలుసుకునేందుకు లేదు.

    గిరిధర్ ఇంటర్ ఫైనలియర్ చదువుతున్నాడు. క్లాసులో మొదటి మూడు స్థానాలకూ దిగాడు. తను చాలా గొప్పవాడయి ఆ యింటినో భవనంగా మార్చి, దాసదాసీ జనంతో నింపి అందరినీ సుఖపెట్టాలని కలలు కంటూంటాడు. ఆ కలలు కనడం తగ్గిస్తే చదువుకునేందుకు మరికాస్త సమయం చిక్కుతుందని అతడి అక్క వేళాకోళం చేస్తూంటుంది.

    హాస బియ్యే ఫైనలియర్ లో వుంది. ఆమె అందానికీ, చిరునవ్వుకీ ఓ అవినాభావ సంబంధం. ఎలాంటి చిక్కు పరిస్థితుల్లోనైనా సరే నవ్వుతూ వుండాలని ఆమె సిద్ధాంతం. ఆమె దిగులుగా వుండగా ఎప్పుడూ ఎవ్వరూ చూడలేదు. ఆ యింట్లో ఆమె కారణంగా ఎప్పుడూ నవ్వుల జల్లు కురుస్తూంటుంది. 

    అందుకే తాత ఆమెను నవ్వులరాణి అంటాడు. ఆ పేరుకు చుట్టుపక్కలా, ఆమె కాలేజీ స్నేహితురాండ్రులోకూడా అంతో ఇంతో ప్రచారం వచ్చింది.

    ఇప్పుడా యింట్లో ఆమె తన పేరును సార్ధకం చేసుకుంటోంది.

    నవ్వులయ్యేక, "ఏం ఊహలే తల్లీ నీవి! ఈరోజు మీరెవ్వరూ బైటకెళ్ళకండి. మీ తాతగారు నిజంగానే జీన్సనగలరు...." అంది పార్వతమ్మ.

    హాస నవ్వుతూనే "ఈ రోజు కాకపోతే రేపు తప్పించుకోలేవు" అంది.

    సుభద్ర నవ్వాపుకునేందుకు నోరు నొక్కుకుంది.

    "తప్పించుకోకేం! మీ తాతగారికి డెబ్బై అయిదు. మతిమరుపు జాస్తి. ఈ రోజుకి గండం గడిస్తే చాలు...."

    "నా వయసు డెబ్బయ్ అయిదేమిటి? డెబ్బై మూడే...." దక్షిణామూర్తి సవరించాడు.

    "మీరిద్దరూ తేల్చుకుని మీమీ వయసులెంతో సాయంత్రానికల్లా నాకు చెప్పండి. నాక్కాలేజీకి టైమవుతోంది"

    అంది హాస అదోలా నవ్వుతూ.

    "కాలేజీకి వెడతానంటూ ఆ నవ్వేమిటే?" అన్నాడు తాతగారు.

    "కాలేజీకి వెళ్ళాక యిక నవ్వడానిక్కుదరదు" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది హాస.

    "కాలేజీకి వెడితేనే ఆ కాసేపూ గడవదు నాకు. రేపొద్దున్న అత్తారింటికెడితే నాకేం తోస్తుంది?" అంటూ నిట్టూర్చాడు దక్షిణామూర్తి.

    "దీన్ని పెళ్ళాడే అదృష్టవంతుడీ వూళ్ళోనే వుంటే బాగుండును" అంది పార్వతమ్మ ఆశగా నిట్టూర్చుతూ.  


                                                                       5


    "అందంగా కనిపించే వాణ్ణి నమ్మకు. వాడి మనసు వికలత.

    అమాయకంగా కనిపించే వాణ్ణి నమ్మకు. వాడు మోసాల పుట్ట.

    బలహీనంగా కనిపించే వాణ్ని నమ్మకు వాడి బలం మరెక్కడో ఉంటుంది"

    ఏదో పుస్తకంలోంచి యీ మాటలు చదివి ఆగాడు రవీంద్ర.

    "ఇప్పుడీ పురాణమెందుకు నాయనా?" అన్నాడు రాజేంద్ర.

    "మన దేవేంద్రను చూడగానే యీ మాటలు గుర్తొచ్చాయి చెబితే స్వంత కవిత్వమనుకుంటాడని భయపడి పుస్తకంలోంచి చదివాను" అన్నాడు రవీంద్ర.

    "మాటలు పుస్తకం చదివేక గుర్తొచ్చాయా? గుర్తొచ్చాక పుస్తకం చదివావా?" అడిగాడు దేవేంద్రుడు.

    "తానోడి నన్నోడెనా అన్నట్లుంది. అందులో మర్మమేమిటో?" అన్నాడు రాజేంద్ర.

    "పుస్తకం రవీంద్ర చేతుల్లో వుంది. వీడి కళ్ళు పుస్తకంలో అక్షరాన్ని చూస్తున్నాయి. వీడన్న మాటలు మాత్రం నోట్లోంచి వచ్చాయి. పుస్తకం లోంచి కాదు"

    "హారినీ....ఇది నాకు తట్టలేదు...."

    రవీంద్ర మళ్ళీ పుస్తకంలోకి చూసి "కొందరిది విగ్రహపుష్టి. నైవేద్యనష్టి. బుర్రలో ఏమీ వుండదు" అనేసి పుస్తకం మూశాడు.

    "ఈ మాటలెక్కడున్నాయో చూపించు. అందులో అవి లేకుంటే నిన్ను పులుసులోకెముక లేకుండా తన్నగలను" అన్నాడు రాజేంద్ర.

    "ఏం నీకు చదవడం రాదా? పుస్తకం ఇక్కడే వుంది వెతుక్కో" అన్నాడు రవీంద్ర నిర్లక్ష్యంగా.

    రాజేంద్ర వెళ్ళి పుస్తకం తీశాడు. ఎనిమిది వందల పీజీల పుస్తకం అది. నిట్టూర్చి మళ్ళీ అక్కడే పెట్టేశాడు.

    "తెలివి తక్కువ వాళ్ళకు కోపం అచ్చిరాదు. నేను చెప్పినట్లు వింటేనే నీ బలం రాణిస్తుంది" అన్నాడు రవీంద్ర.

    రాజేంద్ర ఇంకా కోపంగానే "హు" అన్నాడు.

    "అందరికీ వినే మూడ్ వచ్చాకే అసలు విషయం చెబుతాను...." అన్నాడు రవీంద్ర.

    నెమ్మదిగా రాజేంద్ర శాంతించి "ఊఁ" అన్నాడు.

    "ఈ ప్రపంచంలో అన్ని జన్మలలోకీ విలువయినదీ, ఉత్తమమయినదీ మానవజన్మ. మనిషికి నాలుగు దశలుంటాయి. వాటిలో యౌవనదశ అత్యుత్తమమైనది. ఎందుకంటే మనిషి ఈ సృష్టిని ఆ దశలోనే ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతాడు. ప్రస్తుతం మనం ముగ్గురం ఆ దశలో ఉన్నాం" ఆగాడు రవీంద్ర.

    "ఊఁ" అన్నాడు రాజేంద్ర.

    "యౌవనం శాశ్వతం కాదు. అశాశ్వతమైన యీ యౌవన దశను సక్రమంగా, సంపూర్ణంగా వినియోగించుకుంటేనే ఆ తర్వాత వృద్దాప్యంలో నెమరువేసుకునేందుకు తీపి గురుతులంటూ వుంటాయి. వింటున్నారా?" అన్నాడు రవీంద్ర.

 Previous Page Next Page