"మీకూ ఒరియారాదా గురువుగారూ!" అన్నాడు ఈశ్వరరావు అనుమానంగా.
"మనది అభిమన్యుడి డిపార్టుమెంటు. అతనన్నది అర్ధమవుతుంది కానీ మనం చెప్పదల్చుకున్నది చెప్పడంచేతకాదు...." అన్నాడు రాజారావు.
"ఏమంటాడితను-"
"మనం అతని నిద్ర పాడు చేశామట!"
"కండక్టరు నిద్రపోతే ఎలా?
"అసలతను కండక్టరు కాదట. నల్లకోటు వేసుకున్న ప్రయాణికుడు..."
ఈశ్వర్రావుకిది వినగానే తెలుగులో కూడా మాటలు దొరకలేదు-ఏమనడానికీ!
వీళ్ళిద్దరివల్లా పని జరగలేదని గ్రహించి హిందీ పెద్ద మనిషి లేచి నల్లకోటును సమీపించాడు. ఆయనకూ ఒరియా రాదు. ఆయనను వారిద్దామని రాజారావు అనుకున్నాడుగానీ అతనికి హిందీలో మాటలు దొరకలేదు. ఈశ్వర్రావుమాత్రం "లేపనివ్వండి. మనకర్ధం కాని భాషలో ఎవరైనా తిడుతూంటే వినడం నాకు భలే సరదా-" అన్నాడు.
హిందీ పెద్దమనిషి చటుక్కున వెనక్కు తిరిగి "ఎందుకూ తిట్టడం?" అన్నాడు తెలుగులో రాజారావూ, ఈశ్వర్రావూ గతుక్కుమన్నారు. "మీకు తెలుగు వచ్చా?" అన్నాడు ఈశ్వర్రావు అప్రయత్నంగా.
"నాకు తెలుగు రావడమేంఖర్మ-నేను తెలుగువాణ్ని, ట్రయిన్లో హిందీ మాట్లాడటం బాగా అలవాటైపోయింది...." అన్నాడు హిందీ మాట్లాడిన తెలుగు పెద్దమనిషి.
"అయితే ఆ నల్లకోటు కండక్టరు కాదుట- ప్రయాణికుడట!" అన్నాడు రాజారావు. పెద్దమనిషి నవ్వేసి వెనక్కువచ్చి- "బండి ఖాళీగా కనబడుతోంది. కండక్టరు సంగతి తర్వాత చూడొచ్చు. ఈలోగా మనం మనకువచ్చిన బెర్తులు ఆక్రమించడం మంచిది-" అన్నాడు. మంచి సీను మిస్సయ్యా నన్నబాధ ఈశ్వర్రావు ముఖంలో కనబడింది.
ఆ వరసలో వున్న మూడు బెర్తుల్లో పై బెర్తు ఈశ్వర్రావు తీసుకున్నాడు. మధ్యది రాజారావు తీసుకున్నాడు. క్రిందది పెద్దమనిషి తీసుకున్నాడు అక్కడ కూర్చున్న ఇంకో ప్రయాణికుడు ఎదురుగా కాళీగా వున్న బెర్తు తీసుకున్నాడు.
భువనేస్వర్లో బయల్దేరిన అరగంటలోపల ట్రయిన్ ఖుర్దారోడ్ చేరుకుంది. కండక్టరుకోసం ఎదురు చూశాడు రాజారావు. కండక్టర్ ఎక్కలేదుకానీ మరి కొందరు ప్రయాణికులు ఎక్కి కాళీగా ఉన్న బెర్తులన్నీ ఆక్రమించుకున్నారు.
"నిజానికిది రిజర్వ్డ్ కంపార్టుమెంటు కాదుట. పొరపాటున కంపార్టుమెంటుమీద అలారాసి వుందట. అందుకే జనం ఇందులో ఆట్టే ఎక్కడంలేదు-" అన్నాడో ప్రయాణికుడు ఎవరినో కనుక్కునివచ్చి.
"అయితే మరీ మంచిది. కండక్టరు రాకపోతే నాకు అయిదున్నర మిగులు..." అన్నాడు హిందీమాట్లాడే తెలుగు పెద్దమనిషి హిందీలో.
"అయ్యా- అలా అనకండి. మేము రిజర్వేషన్ టికెట్లు కొనుక్కుని ఈ బండి ఎక్కాం! ఇది తప్పక రిజర్వేషన్ కంపార్ట్ మెంటు అయుండాలి..." అన్నాడు రాజారావు.
"సరేలెండి- ఎవరి అదృష్టం వాళ్ళది. డబ్బిచ్చినందుకు మీకు బెర్తు దొరికిందికదా- డబ్బివ్వకుండా మాకూ బెర్తు దొరికింది..." అన్నాడు హిందీలోమాట్లాడే తెలుగు పెద్దమనిషి.
"అలా అనుకోకండి. కండక్టరు ఎక్కాలని కోరుకుందాం-" అన్నాడు ఈశ్వర్రావు. లేదు డబ్బిచ్చి కొనుకున్న సదుపాయం కొంతమందికి డబ్బివ్వకుండా లభించడం అతనికి నచ్చలేదు. పైకి ఆనక పోయినా రాజారావుకి బాధగానే వుంది. కంపార్టుమెంటు నిండా జనంఎక్కేస్తారేమోనన్న భయంకూడా అతనికుంది.
బండి ఖుర్దారోడ్ వదిలిపెట్టిందికానీ కండక్టరు బోగీలో ఎక్కలేదు.
రాజారావు, ఈశ్వర్రావు, హిం మా తె పెద్దమనిషి కబుర్లలో పడ్డారు.
"ఎమర్జన్సీ ఎత్తేశారు. చూడండి ఎలాతయారయిందో! రిజర్వేషన్ కంపార్ట్ మెంటులో కండక్టరులేడు..." అన్నాడు హిం మా తె పెద్దమనిషి.
ఆయన ఇందిరాగాంధీని సపోర్టుచేస్తున్నాడని రాజారావు అనుమానించాడు కానీ కాసేపు మాటలాడేసరికి ఆయన దేశ పరిస్థితులు చూసి చలించి పోతున్న ఒక సామాన్య పౌరుడనీ ఇటు ఇందిరనుగానీ అటుజనతానుగానీ ఆయన అభిమానించడు లేదని అతను గ్రహించాడు. ఆయన వుద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నాడు. తన వ్యాపారపు పనులు చూసుకునేందుకు ఆయన వుద్యోగరీత్యా టూర్ వేసుకుంటాడట. ఎమర్జన్సీలో ఆయన చాలా ఇబ్బంది పడ్డాడట.
"వ్యాపారంకూడా ప్రజాసేవేకదండీ- వుద్యోగంచేస్తూ వ్యాపారం చూసుకుంటున్నానంటే నేను సమర్ధుడైన పౌరుడి నన్నమాట. తీరిక వేళను సద్వినియోగం చేసుకుంటున్నానన్న మాట. నాలాంటి పౌరులే దేశం నిండా వుంటే మన దేశం సకల సంపదలతో వర్ధిల్లుతుంది. అందువల్ల వ్యాపారస్తులకు ఎమర్జెన్సీ వుండకూడదు. అని కేవలం ప్రభుత్వ సంస్థలకే వర్తింపజేయాలి. ఉదాహరణకు రైల్వేలున్నాయనుకోండి..."అంటూ ఆయన వుపన్యాసం దంచేశాడు.