రచయిత చిరాగ్గా రాయుడి వంక చూసి- "రాయుడు గారూ! మీరు నిర్మాతే కావచ్చు. అంతమాత్రాన నా మెదడును శాసించలేరు. ఏ పిల్లా చూస్తూ చూస్తూ అలాంటి కుర్రాణ్ణి ప్రేమించలేదు. నాలాంటి రచయితలు అలాంటిది సహించలేరు. పరిస్థితులు....అవే ఆమెనీ వివాహానికి ప్రోత్సహించాయి. స్త్రీ త్యాగమూర్తి. తల్లిదండ్రుల కోసం ఆమె ఏమైనా చేయగల్గుతుంది. నాకు స్వాతంత్ర్యం ఇవ్వండి. పరిస్థితులను ఇంకా ఒలపరుస్తాను. ఆఖరికి వారి వివాహం కూడా జరిగేలా చేస్తాను. ఆ తర్వాత మంచి సస్పెన్సు ప్రేక్షకులు ఓ కంటిలో కన్నీరు కారుస్తూనే - మనసులో ఉత్కంఠతో బిగుసుకుపోతారు. ఇంతవరకూ కనీ వినీ ఎరుగని కొత్త కథ. హీరోయిన్ వివాహం జరిగేక కూడా విలన్ బారినుంచి ఎలా తప్పించుకుంటుంది?....ఒక్క నిముషం నన్ను కూడా ఆలోచించనివ్వండి..." అన్నాడు.
"ఆలోచించడం అంటే ఇంగ్లీషు సినిమాలు గుర్తు తెచ్చుకోవడమేకదా! ఆ పని తర్వాత చేద్దువుగాని! ప్రస్తుతం నేను చెప్పేది శ్రద్దగా విను. నేను చెబుతున్నది కథ కాదు, వాస్తవం. ఆ అమ్మాయీ ఊళ్ళోనే ఉంది. ఆమె పేరు సుహాసిని. ఆమె పెళ్ళి చేసుకోబోయే కుర్రాడి పేరు ప్రభాకరం సుహాసిని అందానికి నిర్వచనీయమైతే. ప్రభాకరం కురూపితనానికి ప్రతిరూపం. అతడామెకు స్వయాన బావ. అతడామెను ప్రేమించేడో లేదో తెలియదు. కానీ ఆమె మాత్రం అతన్ని మనసారా ప్రేమిస్తోంది. అతడు లేకపోతే తన తన జీవితం లేదనుకుంటోంది. ఒక ఫిలిం ప్రొడ్యూసరుగా నేనిది భరించలేకపోతున్నాను. ఇది ఆపాలి ఆపాలంటే ఏంచేయాలో రచయితగా ఆలోచించి నువ్వు నాకు ఉపాయం చెప్పాలి!" అన్నాడు రాయుడు.
రచయిత ఆశ్చర్యంగా రాయుడివంక చూసి, "ఆ అమ్మాయీ అబ్బాయీ ఇష్టపడి పెళ్ళి చేసుకుంటూంటే మధ్య మీకెందుకు?" అన్నాడు.
"బాగుందయ్యా! మన సినిమాల్లో ఇలాంటి పెళ్లిళ్ళెప్పుడేనా చేశామా? సినిమాల్లో అలాంటి పెళ్ళిళ్ళు చేయించిన నేను ఈ పెళ్ళి ఎలా జరుగనిస్తాను?" అన్నాడు రాయుడు.
ఆ విషయమై రచయితకూ, రాయుడికి కాసేపు వాదన జరిగింది. రాయుడు చేసేపని తమకు కాని వాళ్ళ ఇంటి వ్యవహారంలో జోక్యం చేసుకోవడమని అన్నాడు. రచయిత వెయ్యి అబద్దాలాడైనా ఓ పెళ్ళి జరిపించమని సామెత. అలాంటప్పుడు ఏ ఆటంకమూలేని పెళ్ళి చెడగొట్టాలనుకోవడం చాలా అన్యాయం అని కూడా రచయిత ఆయనకు చెప్పాడు.
రాయుడు సాలోచనగా, "నువ్వు చెప్పిందీ నిజమే! కానీ ఆ ప్రభాకర్ నడవడిక కూడా మంచిది కాదని నా అనుమానం చూస్తూ చూస్తూ ఆ పిల్లను వాడికి కట్టబెట్టలేము. ఈ వ్యవహారంలో నేను కలుగజేసుకోక తప్పదు" అన్నాడు.
"అయితే ఓ పనిచేద్దాం. ముందు ప్రభాకరం నడవడిక గురించి ఆరా తీద్దాం మీ అనుమానాల్లో సబబుంటే అప్పుడు నేను కథ తయారు చేస్తాను. లేకుంటే మాత్రం మీరు మరో రచయితనుచూసుకోవలసి ఉంటుంది" అన్నాడు రచయిత.
"నాకా అవసరం రాదులే! అన్ని సినిమాలకులాగే దీనికి నువ్వే రచయితవు" అన్నాడు రాయుడు.
ఆ తర్వాత నాలుగురోజులపాటు వాళ్ళు ప్రభాకరాన్ని జాగ్రత్తగా కనిపెట్టారు. దాంతో వాళ్ళకు తెలిసిపోయింది__ప్రభాకరానికి చాలా వ్యసనాలున్నాయని.
ప్రభాకరం నైట్ క్లబ్బులో జూదమాడటమేకాక, ఆడవాళ్ళతో కూడా గడుపుతాడు. రచయిత ప్రభాకరాన్ని చూడగానే - "కాస్త కనుముక్కు తీరున్న ఆ పిల్ల వీణ్ణి పెళ్ళాడతాననదు" అన్నాడు. అతని దురవ్యసనాలు చూడగానే రచయితకు ఇంకా అసహ్యంవేసింది. సుహాసినిని చూడగానే రచయితకు ప్రభాకరంపట్ల ఏర్పడిన అసహ్యం సుహాసిని పట్ల జాలిగా మారిపోయింది.
"ఇప్పుడు మనమేం చేయాలో నువ్వేచెప్పు" అన్నాడు రాయుడు.
"నిజంగానే ఈ పెళ్ళి ఆపాలి!" అన్నాడు రచయిత.
"ఎలా అపాలను కుంటున్నావో కూడా చెప్పు!" అన్నాడు రాయుడు.
"నేనే వెళ్ళి ఆ అమ్మాయికి ప్రభాకరం అసలు రూపం వివరిస్తాను" అన్నాడు రచయిత ఆవేశంగా.
"చూడుబాబూ! ఆవేశం అనర్ధదాయకం. నీమాటలు వినగానే ఆ పిల్ల సాచి లెంపకాయ కొట్టవచ్చు. అందువల్ల అది పద్దతి కాదు" అన్నాడు రాయుడు.
రచయిత ఆలోచనలో పడ్డాడు. కాసేపు చర్చలు జరిపేక ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రభాకరం దురలవాట్లు గురించి సుహాసినిని హెచ్చరించాలి. అందుకు మగవారికి బదులు ఎవరైన ఆడపిల్లయితే మంచిది.
ముందు రాయుడు తన చెల్లెలి కూతుర్ని పంపుదామనుకున్నాడు. కానీ రచయిత అందుకు ఒప్పుకోలేదు.
"ఆ అమ్మాయి మీ మేనకోడల్ని ఒకే ఒక్క ప్రశ్న వేస్తుంది. నా బావ గురించి నీకెలా తెలుసూ? అని. దీనికామె ఏం సమాధానం చెబుతుంది? చెప్పగలిగిన పిల్లనే మనం పంపించాలి" అన్నాడు రచయిత.
"అలాంటి పిల్ల ఎక్కడుంటుంది?" అనడిగాడు రాయుడు.
"ప్రభాకరం రాత్రిళ్ళు ఎక్కడైతే తిరుగుతాడో అక్కడ!"
క్షణాలమీద వాకబు చేసి సూర్యముఖిని కలుసుకున్నారు.
సూర్యముఖ అసలు పేరు అది కాదు, క్లబ్ డ్యాన్సరుగా ఆమె పెట్టుకున్న పేరు అది రచయితలకు కలంపేరు లాగే క్లబ్ డ్యాన్సర్ కీ, స్టేజి పేర్లుండాలి. అప్పుడు వారి ఆకర్షణ పెరుగుతుంది. అని సూర్యముఖ అభిప్రాయం.
"నీ పేరు స్టేజీకి బాగానే ఉంటుంది. కానీ సినిమాలకు ఈ పేరు బాగుండదు మరోటి ఆలోచించుకోవాలి" అన్నాడు రాయుడు.
"ఏదో ఓ రోజున ఓ ప్రొడ్యూసర్ నాకు కనపడక పోతాడా అన్నది నా ఆశ. నా ఆశ నిజమైతే తెరపేరు కూడా సిద్దంగానే ఉంది. జయముఖి! ఒక్క అవకాశం నాకు దొరికితే ఆ తర్వాత నేనే నిలదొక్కుకోగలను" అంది సూర్యముఖి.
రాయుడు సూర్యముఖిని పరీక్షగా చూసి, "నువ్వు బాగున్నావు! సినిమా డ్యాన్సరులాగ కాక నాజూకుగా కూడా ఉన్నావు. నేను తలచుకుంటే నీకు సినిమాల్లో అవకాశం కూడా రాగలదు" అన్నాడు.
"సినిమా డ్యాన్సర్లను ప్రేక్షకులు దూరం నుంచి చూస్తారు. కానీ మా సంగతి అలా కాదు. మా అందం, చందం, హొయలు, వగలు అన్నీ ప్రేక్షకులు ఎంత దగ్గర నుంచైనా చూడొచ్చు. మాలో ఏం తేడా వచ్చినా కప్పుకోవడం కష్టం. మా నృత్యం కూడా బాగుండాలి. ఈ ఊరి మొత్తానికి నాకులా నృత్యం చేసేవారు లేరు" అంది సూర్యముఖి.
"సినిమాల్లో నాట్యం చేయడానికి - అందముంటే చాలు. నాట్యం రానక్కర్లే..." అని - "నీకు ప్రభాకరం తెలుసు కదూ!" అన్నాడు రాయుడు.
"ఏ ప్రభాకరం?" అంది సుహాసిని.
"నిన్ను కలుసుకొనే వాళ్ళలో ఎక్కువ డబ్బిచ్చేవాడూ, పరమ వికారంగా ఉండేవాడూ ఎవరో గుర్తు చేసుకుంటే ప్రభాకరం గుర్తు కొస్తాడు" అన్నాడు రాయుడు.