"ఇడియట్!" మనసులో కసిగా తిట్టుకుంది. అలా ఎన్నో ఫోటోలు రకరకాల ఫోజుల్లో ఇద్దరూ తీయించుకున్నారు.
శ్యామ్ ను ఏదో పనిమీద మరొక ఊరికి రేఖ తనే పంపించింది. అతను వెళ్ళగానే అద్భుతమైన ప్రేమలేఖలు రాసేది. శ్యామ్ తన్మయుడై తన పైత్యం అంతా గుమ్మరిస్తూ ఉత్తరాలు రాసేవాడు. ఇలా కొంతకాలం గడిచాక నెమ్మదిగా పెళ్ళి ప్రస్తావన తెచ్చింది రేఖ.
"ఛీ! ఛీ! నేను నిన్ను పెళ్ళి చేసుకుంటానా?" అన్నాడు శ్యామ్.
చాచి లెంపకాయ కొట్టాలనిపించింది రేఖకు.
"అదేమిటి శ్యామ్! నేను నీకు తగనా?" అంది గారాబంగా.
శ్యామ్ వేళాకోళంగా నవ్వి "నీకు పెళ్ళి ఏమిటి?" అన్నాడు.
"ఏం? నేను అందరిలాంటి ఆడదాన్ని కానా?"
"కావు. అందరికీ ఆనందాన్ని అందించటానికి పుట్టిన దానివి........"
"చాల్లేమాటలు! నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నీకేం తెలుసు?"
"నేను మాత్రం నిను తక్కువ ప్రేమిస్తున్నానా?"
"అందుకే పెళ్ళి చేసుకోమంటున్నాను"
"పదిమందిలో తిరిగే నిన్ను పెళ్ళి చేసుకోనా?"
"ఏం? వందమందితో తిరిగే నీకు కూడా పనికిరానా?"
"నా సంగతి వేరు........"
"ఏమిటి, ఆ వేరు!? నీలాంటి చవటను నేను కాను.......అదేనా?"
"నోర్ముయ్!"
"చాల్లే! పెళ్ళి అనగానే, పెత్తనం చెలాయించబోకు! ఆ మాటకొస్తే పెళ్ళి అయ్యాక కూడా నామీద పెత్తనం చెయ్యనియ్యను....."
"ఇప్పుడు నిన్ను పెళ్ళి చేసుకోబోయేది ఎవరు?"
"నువ్వే!"
"ఒక్కనాటికీ చేసుకోను!"
"పదిమంది పెద్దల యెదుట వైభవోపెతంగా నిన్ను పెళ్ళి చేసుకుంటాను. నా సంగతి తెలియదూ?"
బెదిరి చూశాడు శ్యామ్.
విరగబడి నవ్వింది రేఖ.
ఆ మరునాడే ఫోటోల కాపీలు, ఉత్తరాల కాపీలు జనార్ధన్ ముందుకు తెచ్చింది.
అవన్నీ పరిశీలించాడు మోహన్.
"లాభం లేదండీ! సాంబశివం రేఖకు అండగా ఉంటాడు. అతనికి చాలా పలుకుబడి ఉంది. మనం అల్లరి పడటం తప్ప ప్రయోజనం ఉండదు"
"ఇంత బ్రతుకూ బ్రతికి......." బాధగా అన్నాడు జనార్ధన్.
"బాధపడకండి......ఇదీ ఒకందుకు మంచిదేనేమో!"
జనార్ధన్ ఉలికిపడి 'ఏమన్నావ్!' అన్నాడు.
"ఆలోచించండి! ఇది పెళ్ళికాదు...... ఒక రకంగా రేఖకు మొగుడిగా ఉండే ఉద్యోగం! ఇంతకంటే మంచి ఉద్యోగం శ్యామ్ కు దొరికే అవకాశం ఎలాగూ లేదు. పైగా గాడి తప్పి చెయ్యి దాటిపోతున్నాడు. మీరూ, నేనూ కూడా అదుపులో పెట్టలేక పోతున్నాం! రేఖ గడుసుతనంలో, తెలివితేటల్లో నాకు నమ్మకముంది, కనీసం తన పరువు ప్రతిష్టల కోసమైనా శ్యామ్ ను దారిలో పెట్టుకుంటుంది."
'లక్షణంగా మంచి పిల్లను ఎవరినైనా పెళ్ళిచేసుకుని....'
"పోనిద్దురూ! ఒక అమాయకురాలి బ్రతుకు నాశనం చేసే పాపంనుండి తప్పించుకున్న వాళ్ళమయ్యాము."
జనార్ధన్ గతుక్కుమన్నాడు. కానీ ఏమీ మాట్లాడలేక పోయాడు.
రేఖకూ, శ్యామ్ కూ మహా వైభవంగా పెళ్ళి జరిగింది. పెద్దమనుష్యులూ, బంధువులూ, స్నేహితులూ, అందరూ వచ్చారు. ఒకరి ముఖం ఒకరు చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూనే వధూవరులపైన అక్షింతలు జల్లారు.
ప్రసూన రేఖ దగ్గరకు వచ్చి ప్రజంటేషన్ అందించి "కంగ్రాట్యులేషన్స్" అంది.
రేఖ సిగ్గుపడుతూ నవ్వి "శ్యామ్ నన్ను తప్ప ఎవరినీ చేసుకోనని పట్టుబట్టాడు. ఏం చెయ్యను? ఎన్ని ఆఫర్స్ వచ్చినా వదిలి, ఇతణ్ణి పెళ్ళిచేసుకున్నాను......" అంది.
పక్కనే ఉన్న శ్యామ్ నవ్వాడు.
ఆ రాత్రి శ్యామ్ తో "శ్యామ్! ఇంకమీదట ఈ డాన్స్ లూ, ఈ హోటళ్ళూ, ఇవన్నీ మానేసి ప్రశాంతంగా పవిత్రంగా బ్రతుకుదామని అనుకుంటున్నాను. ప్రస్తుతం నా దగ్గరున్న డబ్బుతో ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దాం?" అంది ప్రాధేయపడుతున్నట్లు!
శ్యామ్ నవ్వి "భలేదానివే! నువ్వు డాన్స్ లు మానడానికి వీల్లేదు. ఇంతకంటే మంచి వ్యాపారం ఎక్కడ ఉంటుందీ?" అన్నాడు.
రేఖ శ్యామ్ ను ఒక్క తోపుతోసి ముసుగుపెట్టి పడుకుంది.