Previous Page Next Page 
నిరాశలో నిండు గుండె పేజి 53

   
    తెల్లబోయాడు మోహన్ .. కన్నీళ్లు నిండిన రేఖ ముఖంలో కనీ కనిపించని చిరునవ్వు మెరిసింది - మోహన్ కు సమస్తమూ అర్ధమయిపోయింది. ఆలోచనలో పడ్డాడు.....    
    "ఆయన నాకు రాసిన ఉత్తరాలు, మేమిద్దరమూ కలిసి తీయించుకున్న ఫోటోలు అన్ని నా దగ్గిర ఉన్నాయి లీగల్ గా నాకున్న బలగం కూడా సామాన్యమైనది కాదు. అయినా పరువుగల ఆడపిల్లలు కోర్టుల కెందుకు ఎక్కుతారు చెప్పండి! తప్పనిసరి అయితే తప్పదనుకోండి! అబ్బ! తలచుకుంటేనే ప్రాణాలు పోతున్నాయి."    
    శ్రోతలలో ఎవరూ మాట్లాడలేదు.    
    "మాది ఆత్మాను బంధమనుకున్నాను. పవిత్రమైన మాంగల్యం ఈయన నా మెడలో కడతారని మనసారా నమ్మాను. ఇప్పుడేం చెయ్యను? ఆత్మహత్య చేసుకోవాలని ఉంది. మహా పాపమని సందేహిస్తున్నాను."    
    మళ్ళీ ఏడ్చింది రేఖ.    
    "ప్రస్తుతం మీరు ఇంటికి వెళ్ళండి. తర్వాత మేము ఆలోచించుకుని మీకు కబురుచేస్తాము."    
    "అలాగే! మీ మాట ఎప్పుడు కాదన్నాను నేను? కానీ ఒక్క విషయం! నేను ఆశక్తురాలినయి ఇలా ఏడుస్తున్నానని అనుకోకండి. మర్యాదకోసం పాకులాడుతున్నాను...."    
    రేఖ లేచి జనార్ధన్ పాదాలకు నమస్కారంచేసి వెళ్ళి  పోయింది.    
    రేఖ సామాన్యసంసారుల ఇంటిపిల్ల-పెద్దకుటుంబం. తండ్రి సంపాదన ఏ మూలకూ వచ్చేదికాదు-తన ఇంటికి వచ్చే స్నేహితులతో రేఖ స్నేహాన్ని ఒక రకంగా తండ్రి తనే ప్రోత్సహించేవాడు-తల్లి  చూసీ చూడనట్లు ఊరుకునేది - రేఖ అయినా ఈ విషయాన్ని పెద్దగా మనసుకు పట్టించుకునేది కాదు-రేఖ డాన్స్ నేర్చుకుంటానని అన్నప్పుడు తండ్రి అభ్యంతరపెట్టలేదు- రేఖను పెద్ద సినిమా స్టార్ చెయ్యాలని తండ్రి సంకల్పం-కానీ, రేఖ సినిమా స్టార్ కాలేకపోయింది- హోటల్ డాన్సర్ గా స్థిరపడిపోయింది-తన సంపాదనలో మూడువంతులు ఇంటికే పంపిస్తుంది రేఖ-వాళ్ళందరూ రేఖ కిచ్చే గౌరవమూ, చూపించే మర్యాద ఇంతా, అంతాకాదు. కానీ, అదంతా చాలాకృత్రిమంగా అనిపిస్తుంది రేఖకు-వాళ్ళందరూ వాళ్ళలో వాళ్ళు చూపించుకునే ప్రేమ తన మీద లేదేమోననిపిస్తుంది.....తన విలువ అంతా తన డబ్బు మీద ఆధారపడి ఉంది. ఆ డబ్బే లేని నాడు తనెక్కడ?    
    శీలము, పవిత్రత.....ఇలాటి మాటలకు రేఖ మనసులో ఏనాడో విలువలు నశించిపోయాయి- తానేదో పతిత నయిపోయానని రేఖ ఏనాడూ బాధపడలేదు. అంతకంటే రేఖను బాధించేది, తన దగ్గిరకు వచ్చే సరసుల ప్రవర్తన.    
    రాత్రి తెల్లవార్లూ, తనను 'దేవత' అని పూజించే వాళ్ళు......'అందాల రాశి' అని అపురూపంచేసే వాళ్ళు.....'డార్లింగ్' అని ముద్దుచేస్ వాళ్ళు.....అందరు....అందరూ.....తెల్లవారి తన ముఖం చూడరు. తను ఎక్కడ  పలకరిస్తుందో నని భయపడిపోతారు-వాళ్ళ భయమే కాని తను పలకరించదు. అలా పలకరిస్తే వాళ్ళు మళ్ళీ తన దగ్గరకు రారని తెలుసు. తనను వాడుకుని తనవల్ల ఆనందాన్ని పొంది తనతో పరిచయం పరువునష్టంగా భావించేవాళ్ళను చూస్తే రేఖకు కసితో మనసు రగులుకుపోయేది! కానీ, వాళ్ళను తనేం చెయ్యగలదు? ఏం చెయ్యలేదు సరికదా, వాళ్ళకు మరింత ఆనందాన్నే కలిగిస్తోంది.    
    ఎవరినైనా పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన ఇటీవల రేఖకు కలిగింది. పెళ్ళిచేసుకుని పవిత్రంగా బ్రతకాలని కాదు- మొగుడినంటూ ఒకణ్ణి పెట్టుకుంటే జీవితానికి ఒక స్థిరత్వ ముంటుందని.    
    రేఖ ఎన్ని విధాలుగానో ప్రయత్నించింది. పెళ్ళి చేసికోవటానికి కొందరు ముందుకు రాకపోలేదు- కానీ, వాళ్ళంతా పెళ్ళయి, భార్యాపిల్లలున్న వాళ్ళే! భవిష్యత్తు రేఖ ఊహించుకోగలిగింది. పెళ్ళి పేరుతో తనను శాశ్వతంగా బంధించుకుంటాడు. అనుమానాలతో ఇల్లు కదల నివ్వడు. ఇప్పటి స్వేచ్చ, సౌఖ్యము, సంపాదన, ఏవీ ఉండవు-పోనీ, బహిరంగంగా తనను భార్యగా అంగీకరిస్తాడా, అంటే అదీ అనుమానమే! ఎందుకొచ్చిన పెళ్ళి అది!    
    మోహన్ లాంటివాడు తనను పెళ్ళి చేసుకుంటే! ఎంత అదృష్టం! తన బ్రతుకు మొత్తం అతనికి నివేధించుకోదూ!    
    ఆ అదృష్టం ప్రసూనది! ఎవరు ఎన్ని చెప్పినా మోహన్ ప్రసూనను ప్రేమించక మానడు.    
    తన దగ్గరకు వచ్చేవారందరూ ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడైనా రహస్యంగా కెమేరాలు ఉన్నాయేమో నని పరీక్షిస్తారు. ఎన్నడూ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒక్క ఉత్తరమైనా రాయరు. ఇంతాచేసి ప్రేమకబుర్లు మాత్రం తియ్యతియ్యగా ఎన్నైనా చెపుతారు. చాలామంది తమకు రేఖను ఉంచేసుకోవాలని ప్రయత్నించారు. అంతటి రసికురాలు రేఖ.    
    ఎవరినైనా పెళ్ళి చేసుకోవాలని అనుకుంటోన్న రేఖ దృష్టి శ్యామ్ మీద పడింది.    
    శ్యామ్ లో రూపమూ, చదువూ, సంస్కారమూ ఏమీలేవు___ కానీ 'ఫలానివారి కొడుకు'గా పరువు ప్రతిష్టలున్నాయి. అయినా శ్యామ్ మాత్రం తనను పెళ్ళిచేసుకుంటాడా? దౌర్భాగ్యం! ఎందుకూ పనికిరాని చవటకు కూడా తను లోకువే!    
    రేఖ తెలివైనది. ఎందుకైనా మంచిదని ముందుగా పెళ్ళి ప్రస్తావన తేలేదు.    
    "శ్యామ్! మనం ఫోటో తీయించుకుందామా!" అంది మురిపిస్తూ. లోలోపల కాదంటాడనే అనుకుంది.    
    "ఓ యస్! దానికేం! బయలుదేరు."    
    దర్జాగా అన్నాడు.

 Previous Page Next Page