24
సాంబశివం తనముందు ఉంచిన ఖరీదైన చీర, జాకెట్టు చూసి బిత్తర పోయింది ప్రసూన.
"తీసుకో! అని నీ కోసమే!" ముద్దు ముద్దుగా అన్నాడు సాంబశివం. ఇటీవల అతనెప్పుడూ ఎక్కువగా ఆమెతోనే ఉంటున్నాడు.
"నాకా! ఎందుకు?"
"నా కోసం!"
"అంటే?"
బెదిరిపోతూ భయంగా అడిగింది ప్రసూన.
"ఏ మనిషికైనా సరే, బ్రతకటానికి ఒక ఆధారమంటూ ఉండాలి! నీ కోసమే బ్రతుకుతున్నాను నేను-నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు-లలిత ఉంది - లలిత కోసం ఏం చెయ్యడానికైనా సిద్దంగా ఉన్నాను- ఏదైనా వదులుకోగలను- కాని లలితకేమీ అక్కరలేదు. నేనే అక్కరలేదు-లలితను పొందగలిగే స్థాయికి ఈ జన్మలో నేను ఎదగలేను. రాధమ్మ ఉంది. అడవిమాలోకం....అధి......నా రక్తం పీల్చే జలగ..... నాకున్నది నువ్వే సూనా! నువ్వొక్కదానవే! నన్ను బ్రతకనియ్యి....నీ మనసులో అభిమానం ఉన్నా లేక పోయినా, కనీసం నటించు......లేదులే! నటించక్కరలేదు-నాకు తెలుసు. నేనే కాదు- ఏ మనిషైనా నీ అభిమానం గుర్తించగలడు-నువ్వు నన్ను బ్రతికించగలవు సూనా! బ్రతకనియ్యి- నన్ను బ్రతకనియ్యి. క్రుంగిపోయి ఆత్మహత్య చేసుకునే రకం కాదు నేను. ఎక్కడికక్కడ బ్రతకాలనుకునే మనిషిని"
ప్రసూన ఆ చీర, జాకెట్టు తీసుకుని జాగ్రత్తగా దాచింది.
"నన్ను బ్రతకనియ్యి సూనా! నన్ను బ్రతకనియ్యి" అంటోన్న సాంబశివాన్ని చూస్తే ప్రసూనకి ఏడుపు వచ్చింది.
ఒక్కక్షణం ప్రసూన కనబడకపోతే "సూనా! సూనా!" అని తల్లడిల్లిపోతున్నాడు సాంబశివం.
"నేను ఎలాంటి దశలోనుండి ఎలాంటి దశలోకి వచ్చానో తెలుసా సూనా! నువ్వు ఊహించలేవు-నేను సుఖపడి నా వాళ్ళని సుఖపెట్టాలనుకున్నాను- ఏరీ నా వాళ్ళు? నువ్వున్నావు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు"
సాంబశివం ధోరణి ప్రసూనకు జాలీ, భయముకూడా కలిగించేది. ఎందుకంటే లలిత కోసమూ, సుశీల కోసము ఇంతగా బాధపడుతోన్నా అతని దైనందిన ప్రవర్తనలో మాత్రం ఏ మార్పు రాలేదు. త్రాగుడు మరింత ఎక్కువైంది. ఆడవాళ్ళతో గడపడమూ మానలేదు- రాత్రిళ్ళు మాత్రం కుమిలి కుమిలి పోతాడు. ఎలాంటి దశలోనయినా సాంబశివం తన జోలికి రాకపోవడంతో ప్రసూన భయం చాలావరకు తగ్గింది. ఏమీ ఆశించకుండా పవిత్రంగా తను ప్రేమించేటంత ఉదాత్తత సాంబశివంలో ఉందా? ఒక మనిషిలో పైకి కనిపించే స్వభావం మరుగున ఎన్ని పొరపాట్లు ఉంటాయో! ఒక్క సాంబశివంలోనే తనకు ఎన్ని మూర్తులు కనిపిస్తున్నాయి?
సాంబశివం ఇచ్చిన చనువుతో ఇల్లంతా ఎన్నో విధాల గాలించింది ప్రసూన.....ఎక్కడా ఏ విధమైన ఆధారమూ దొరకలేదు-సాంబశివం గదిలో అసలు ఏమీ లేవు చివరకు డబ్బు కూడా లేదు-అతని పర్సులో ఎప్పుడూ రెండు మూడు వందల రూపాయలుంటాయి. అంతే!
చిరంజీవి చూపించిన ఇంటికి కూడా వెళ్ళింది. సర్వెంట్ క్వార్టర్స్ లో ఒక తోటమాలి ఉన్నాడు- వాడికి కళ్ళు సరిగా కనబడవు. చెవులు వినిపించవు- మూర్ఖుడి లా ఉన్నాడు. వాడితో మాట్లాడి ప్రయోజనం లేదు. ఇంట్లోనూ ఏమీ లేవు- వాడి సామానులు తప్ప!
తనను అంతగా నమ్మి ప్రాణంగా చూసుకుంటున్న సాంబశివాన్ని ఇలా వంచించటం ప్రసూనకు కొంచెం కష్టంగానే ఉంది. కానీ, మోహన్ ముందు తన నిజాయితీని నిరూపించుకోవాలనే తహ తహ ముందు మిగిలినవన్నీ మరుగున పడిపోయాయి. ఒక సంఘద్రోహాన్ని అరికట్టాలనే సంకల్పమూ లేకపోలేదు-పరమేశ్వరి గారితో కలిసి కూలిపేటలో పని ప్రారంభించిన దగ్గరనుండీ, ఆ దౌర్భాగ్యుల నికృష్ట జీవితాలను తలుచుకోలేకపోతోంది ప్రసూన .... పరమేశ్వరి కున్నంత రాజకీయ, సాంఘిక పరిజ్ఞానం, గుండె నిబ్బరమూ, లేకపోయినా, తనకు చేతనయినదంతా కడదాకా చెయ్యాలనే సంకల్పించుకుంది ప్రసూన.
సాంబశివం పర్సనల్ ఫోన్ మోగింది-ఆ ఫోన్ సాధారణంగా సాంబశివం తప్ప ఎవరూ తియ్యరు-ఆ రోజు సాంబశివం తలనొప్పితో పడుకున్నాడు- "సూనా!" అని కలవరిస్తోంటే ప్రసూన కూడా అక్కడే ఉంది-సాంబశివాన్ని లేపడం ఎందుకని ప్రసూన తనే ఫోన్ అందుకుంది. "హలో!" అనటానికి ఒక క్షణం ఆలశ్యం చేసింది. ఈలోగా అవతలివైపునుంచి ఎవరిదో కంఠం వినిపించింది.
"వంద-మూడు వేలు.....పది.....అయిదువేలు అయిదు .... అయిదువేలు .... ..."
ప్రసూనకు అయోమయంగా తోచి "హలో!" అంది- అవతలివైపు కొన్ని క్షణాలు నిశ్శబ్దం..... తరువాత ఎవరిదో కంఠం "సాంబశివం ప్లీజ్" అంది... అప్పటికే సాంబశివం లేచి ఫోన్ దగ్గిరకు వచ్చేశాడు.
అక్కడే ఉన్న ప్రసూనకు కూడా వినపడనంత గుస గుసలతో ఏదో మాట్లాడాడు.