Previous Page Next Page 
నిరాశలో నిండు గుండె పేజి 52

   
    "హలో నేను రేఖను......ఆ, ఇదంతా కాన్ఫిడెన్షియల్ సర్!....... ఒక చిన్న ఇన్ ఫర్ మేషన్..... మనవాళ్ళే!.....భయం లేదంటున్నాగా!..... సాంబశివంగారు మీ ఇంటికి వచ్చేది దేనికి?....ఆ! ఇంతాచేస్తే ఇదా?...." ఫోన్ పెట్టేసి పకపక నవ్వసాగింది రేఖ.    
    "మోహన్ గారూ! సాంబశివంగారు ఇక్కడ్నుంచి వైజాగ్ కు వెళ్లేది ఎవరో పిల్లకోసంట! పాపం, ఆయనకు ఇక్కడున్న పిల్లలు చాలలేదు కాబోలు! బొంబాయికి కూడా ట్రంక్ కాల్ బుక్ చెయ్యనా?"    
    మోహన్ కు రేఖలో నమ్మకం పూర్తిగా నశించి పోయింది. అయిన ఆ విషయం బయట పెట్టదలచుకోలేదు. ఏమో ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో?    
    "చెయ్యండి!" అన్నాడు.    
    బొంబాయి కాల్ వచ్చేసరికి నాలుగు గంటలు పట్టింది.    
    "రేఖను మాట్లాడుతున్నాను.....! చిన్న హెల్ప్! సాంబశివంగారు అక్కడికి వచ్చేది దేనికి?..... వాట్? నిజంగా!..... ఛా! ఛా! ఎవరికీ చెప్పను. థాంక్యూ!"    
    ఫోన్ పెట్టేసి భయం భయంగా చూసింది రేఖ__    
    "సాంబశివంగారికి బొంబాయిలో స్మగులర్స్ తో ఏదో సంబంధం ఉందిట సార్! అదేదో సరిగ్గా తెలియదుట! మీరు స్వయంగా వెళ్ళి కనుక్కోవలసిందే!"    
    రేఖ నాటకమాడుతోందనీ, తనను తప్పుదారి పట్టించాలని చూస్తోందనీ అర్ధమయిపోయింది మోహన్ కి.    
    ఆ ఊళ్ళో ఉన్న ఇంటిని గురించి అడగలేదు. తనకు ఆ విషయం తెలిసినట్లు రేఖకు తెలియనియ్యలేదు.    
    "సరే! వెళ్ళొస్తాను. థాంక్యూ వెరీమచ్!" అని వెళ్ళిపోయాడు......    
    అప్పటికి తెల్లవారుజాము నాలుగు గంటలయింది. ఎలాగో మోహన్ ని రాత్రంతా తనగదిలో ఉంచగలిగింది. కానీ ఏం సాధించగలిగింది? ట్రంక్ కాల్ వచ్చేలోగా కబుర్లలో పెట్టాలనుకుంది. కాని మోహన్ వచ్చిన తల అయినా ఎత్తకుండా పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాడు. పట్టరాని అక్కసుతో ఉడికింది రేఖ. ఆ ఉడుకు చల్లార్చుకోవాలి! అందుకు ఉపకరణం ప్రసూన.
    పనికట్టుకొని ప్రసూన దగ్గరకు వచ్చింది రేఖ.    
    "అబ్బా! రాత్రంతా నిద్రలేదు. మోహన్ గారితోనే సరిపోయింది" అంది బద్దకంగా.    
    ఉలికిపడింది ప్రసూన.... రేఖ మనసు పొంగిపోయింది.    
    "అఫ్ కోర్స్! ఆయనతో కాలం చాలా కులాసాగా గడుస్తుంది అనుకో! అయిన బడలిక తప్పదుగా! కొన్ని కొన్ని సుఖమైన బాధలు__" అంటూ కన్ను గీటుతూ నవ్వింది.    
    ప్రసూన మాట్లాడలేదు___ తల ఎత్తలేదు. కానీ ఆవిడ మనసులో ఎలాంటి అగ్ని పర్వతాలు పగిలి ఎంత లావా సుడులు తిరుగుతోందో రేఖ ఆలోచించగలదు.    
    సంతృప్తిగా వెళ్ళిపోయింది. ఆ క్షణంనుండే ప్రసూన మనసు ఈర్ష్యతో రగులుకుపోతూనే ఉంది..... అవకాశం దొరకగానే అడిగేసింది.    
    ఆ అడిగిన తీరులో వ్యంగ్య ధోరణి మోహన్ కు కోపం తెప్పించింది.    
    "మొన్న రాత్రి నేను హోటల్ గదిలో ఉన్నమాట నిజమే! కానీ, నా మనస్సులో ఏ దురుద్దేశమూ లేదు!"    
    నిజం! ఒక రాత్రి అంత రేఖతో ఉన్నమాట నిజం! ప్రసూన మనసులో రైళ్ళు పరుగెట్టాయి కసిగా అంది. "అవును! మనం చేసే పనుల్లో నతా సదుద్దేశమే! ఎటొచ్చీ ఎదుటివాళ్ళ పనుల్లోనే లోకంలో నైచ్యమంతా కనిపిస్తుంది!"    
    మోహన్ ముఖం చూడకుండా తలత్రిప్పుకుని కనిపించిన రిక్షాలో ఎక్కేసింది.    
    జనార్ధన్ పిలుస్తున్నాడని మోహన్ కు కబురు వచ్చింది. ఒక్క క్షణం మోహన్ కు ఎంతో చికాకు కలిగింది. జనార్ధన్ ప్రత్యేకించి కబురు చేశాడంటే ఏదో శ్యామ్ కు సంబంధించిన విషయమే అయి ఉండాలి. వెళ్ళకూడదని  అనుకున్నాడు .....కానీ, మళ్ళీ ఏదో శక్తి తనను ఈడుస్తున్నట్లే బయలుదేరాడు.    
    మోహన్ వెళ్లేసరికి జనార్ధన్ ఇంట్లో రేఖ, శ్యామ్ కూడా ఉన్నారు. రేఖ ముఖం బాగా ఏడ్చి ఏడ్చి ఉన్నట్లు ఉబ్బి ఉంది. శ్యామ్ ఉదాసీనంగా ఉన్నాడు. జనార్ధన్ ముఖం మాత్రం సర్వం పోగొట్టుకున్న వాడి ముఖంలా కళా విహీనంగా ఉంది.....    
    మోహన్ రాగానే రేఖ రుమాలు ముఖాని కడ్డం పెట్టుకొని మరొక్కసారి ఏడ్చింది...... రేఖ ఏడుపు చూసి నిజంగా కంగారు పడ్డాడు మోహన్. ఇది సామాన్య విషయమయి ఉండదు__ జనార్ధన్ నీరసంగా మోహన్ ను చూచి "చూడు మోహన్! ఈ అమ్మాయి ఏదో అంటూంది!" అన్నాడు.    
    ఈ మాటలు వినగానే  రేఖ మరింత ఏడుపు ప్రారంభించింది మోహన్ మాట్లాడకుండా ఊరుకున్నాడు ఓదార్చే వాళ్ళు లేకపోవటంతో రేఖ తనంతట తనే ఊరుకోవలసి వచ్చింది. గద్గద స్వరంతో మోహన్ తో అంది.    
    "చూడండి! ఈయన..... అదే మీ శ్యామ్..... ఇన్నాళ్ళూ నన్ను గాఢంగా ప్రేమించానన్నారు. నే నే లోకమని అన్నారు. అమాయకురాలిని. అభమూ శుభమూ తెలియనిదాన్ని-ఈయన మాటలన్నీ నమ్ముకున్నాను- నా సర్వస్వం ఈయనకు అంకితం చేసుకున్నాను. ఇప్పుడు పెళ్ళి అనేసరికి వీల్లేదంటున్నాడు. పెళ్ళి కాకుండా ఈయనతో కలిసి తిరగటానికి నేను బజారు మనిషినా, మీరే చెప్పండి!"

 Previous Page Next Page