Previous Page Next Page 
ఆత్మజ్యోతి పేజి 51

   

        రాధమ్మగారు ఆగింది. ఏదో అవ్యక్తమైన ఆవేశంతో కంఠంలోని నరాలన్నీ ఉబ్బాయి. సరోజిని పాలిపోయిన ముఖంతో వింటూ కూర్చున్నదల్లా "ఏమిటా ఉత్తరం?" అన్నది సందేహిస్తూ.
   
    "మధ్యగదిలో అల్మారాలో పుస్తకాల క్రింద పెట్టాను. తీసుకురా" అన్నది రాధమ్మగారు భారంగా.
   
    సరోజిని లేచివెళ్ళింది. మొన్న తల్లికి ఏదో ఉత్తరం రావటం ఆమె చూసింది. ఎప్పుడోగాని ఆమెకు ఉత్తరాలు రాకపోవటంవల్ల-అడుగుదామనుకుంటూనే మరిచిపోయింది.
   
    కూతురు ఉత్తరం తీసుకురాగా - "చదువు" అంది రాధమ్మగారు.
   
    సరోజిని కంపిస్తూన్న చేతులతో విప్పి చదవసాగింది.
   
చి||సౌ||రాధమ్మకు
   
    మీ అన్న దీవించి వ్రాయునది :-
           
        నీ ఉత్తరం అందినది. నువ్వంటే నాకు అభిమానమని నీకు తెలుసు. కాని ఏ విషయాన్ని గురించి ముభావంగా ఊరుకుందామనుకున్నానో అదే - తప్పనిసరిగా అభిమానాన్ని చంపుకుని నీకు రాయవలసి వస్తోంది. మన యిద్దరకూ మనస్సుల్లో దాన్నిగురించి క్షుణ్ణంగా తెలుసు. రాధా! నువ్వు నా చెల్లెలివిగాదు. ఒక వంటవాని కూతురువి. అయినా నేను నీకే లోటూ చెయ్యలేదు. ఆ విషయం సావిత్రికి కూడా నేను నోరు విడిచి ఎప్పుడూ చెప్పలేదు. ఇతరత్రా తెలుసుకుంటే - అది నా తప్పుకాదు. నీకేలోటూ చెయ్యనని చెప్పాను కాని.....వియ్యమందటానికి వస్తేమాత్రం నేను సుముఖుడ్ని కాను. నీ ఆరాటం కొద్దీ రాశావు కాని నేనుమాత్రం మీ సరోజిన్ని శివుడికి చేసుకోవటానికి సిద్దంగా లేను. నీకు కోపం వస్తుంది. నేను చాదస్తుననీ, పిరికి వాడ్ననీ అంటావు. నీ యిష్టం. మనసులో శంకలు లేకుండా వుడేందుకై నిష్కపటంగా రాస్తున్నాను. సరోజినికి మంచి వరుడిని చూసి పెళ్ళి చేసే బాధ్యత నాది. ఖర్చుకూడా నేనే భరిస్తాను విడమరిచి రాశాను. ఉంటాను.
   
                                                                                                                                                                       మాధవరావు.
   
    సరోజినీ కపోలాలు కోపంతో ఎర్రబడ్డాయి. "ఈ మనుషులు" అంటూ యిటుతిరిగి త్రుళ్ళిపడింది.
   
    "అమ్మా! ఎందుకు ఏడుస్తున్నావు? మామయ్య మాటలకా?" అంటూ విచారగ్రస్తమైన ముఖంతో తల్లి ప్రక్కన కూర్చుంది.
   
    రాధమ్మగారు కూతుర్ని దగ్గరకు తీసుకుని "అదికాదు సరూ. నాకు నిజానికి ఈ లోకంలో ఓ అన్నయ్యంటూ వున్నాడు. కళ్ళెదురుగా వున్నా అతనికి మటుకు ఈ సంగతి తెలియదు. ఆ వేదన దుస్సహంగా వుంది" అంది రుద్దకంఠంతో.
   
    సరోజిని  విషాదంగా "ఏడవకే అమ్మా! ఎందుకొచ్చిన అన్నయ్య నీకు? హృదయంలేని స్వార్ధపరుడు, ఛాందసుడు" అంది.
   
    రాధమ్మగారు కళ్ళు తుడుచుకుని తీవ్రంగా ఆలోచిస్తూ ఊరుకుంది "ఏమిటే అమ్మా ఆలోచిస్తున్నావ్?" అనడిగింది సరోజిని.
   
    "మనం ఇంకా ఏ లోకంలో వున్నామా అని?" అంది రాధమ్మగారు లోతుగా. "ఏవో సంస్కరణలు జరిగాయంటారు. ఇదేనా -? చదువుకున్న వాళ్ళలోకూడా యింత కిరాతకత్వమా? సరూ! ఆడది పరిస్థితులకు భయపడి, లాభంలేదనుకుని బయటపడదుగాని ప్రతి స్త్రీకూడా కొన్ని విషయాలగురించి విప్లవాత్మకంగా ఆలోచిస్తుంది. వంటయింటిలోంచి బయటకు రాని స్త్రీ కూడా.
   
    "తమకు కొన్ని అన్యాయాలు జరిగితేగాని ఎవరూ విప్లవాత్మకంగా ఆలోచించడం నేర్చుకోరమ్మా. సాధారణంగా అన్యాయం జరిగేది ఆడవాళ్ళకే. అందుకే ఈ భావాలు వారికెక్కవు" అన్నది సరోజిని సాలోచనగా.
   
    రాధమ్మగారు ఆశ్చర్యంగా "ఎంత బాగా చెప్పావు సరూ?" అన్నది.

    "ఇదన్నమాట చాలావరకూ ఆనాటి తన అవమానానికి కారణం" అనుకుంది సరోజిని. ఆమెకు ఆ కుటుంబంమీద మితిలేని కోపమూ, అసహ్యమూ కలిగాయి. తనకు తెలిసిన మరో రహస్యం వుంది. అది బయట పెడితే?  వారి జీవితాలు ఏంకాను? ఛీఛీ! వాళ్ళకు బుద్దిలేదని-ఈనాడు తను తల్లి జీవితచరిత్ర వింది. మొగవాడి వికృత దౌర్జన్యానికే తన అమ్మమ్మ గురైంది. తనూ గురి అయింది. ఈ భూమ్మీద దీనికి అంతు ఎక్కడ? తను మారాలి. ఇంక ఆ కుటుంబాన్ని గురించి తలచకూడదు. ఒకరిగురించి-సాధ్యమా? చూద్దాం.
   
    "ఈ విషయాలు నీ మనసులోనే పెట్టుకో సరూ!" అన్న తల్లి కంఠస్వరం వినిపించింది.

    సరోజిని ఆలోచనలనుంచి మేలుకొని "ఇది నా స్వవిషయంకూడా అమ్మా. ఈ హృదయాన్ని నువ్వే యిచ్చావు" అనుకుంది.
   
                             21
   
   రీక్షలు అయిపోయినై. చివరిరోజున రాస్తూ హాల్లోనే కళ్ళుతిరిగి పడినంత పనిచేశాడు శివనాథరావు. గదికి వచ్చాకా ఆ రోజంతా బాగా విశ్రాంతి తీసుకున్నాడు. ప్రాక్టికల్సు, ఓరల్సు యింకో నాలుగురోజులు పోయినాక గాని లేవు. మరునాడు నుంచీ, మళ్ళీ ఆ మూడురోజులూ కష్టపడి చదివాడు. అతని వంతు ఓరల్సు వచ్చేసరికి రాత్రి పది దాటింది. జవాబులు ధీమాగానే చెప్పి బయటకు వచ్చి "హమ్మయ్య" అని నిట్టూర్పు విడిచాడు. మిగతా స్టూడెంట్సంతా అతనిచుట్టూ క్రమ్మేశారు. "ఏమిటేమిటి?" అడిగారంతా. "ప్యాసవుతాను" అన్నాడు శివనాథరావు.
   
    మరునాడు రాత్రి బెజవాడ బయల్దేరాడు. తలనిండా ఎన్నో సమస్యలు. ప్రక్కవాళ్ళతో సులభంగా కలిసిపోయి, వాక్ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రయాణికుని చూస్తే అతనికి ఆశ్చర్యంగా వుంటుంది.
   
    ఇంట్లోకి పోగానే అతని పిన్ని ఎదురుగా వచ్చింది. ఎందుచేతనో ఆమె ముఖం కళావిహీనంగా వుంది. 'కులాసాగా వున్నావా శివా?' అన్నది పొడిగా.

    తల ఊపి మెట్లు ఎక్కి పైకిపోయాడు.
   
    మాధవరావుగారికి గుండెల్లో పోతూ వస్తోందిట తిరిగి. తనగదిలో మంచం మీద పడుకుని వున్నాడు. ఓ పదినిముషాల తర్వాత గదిలోకి వచ్చిన కొడుకుని చూసి - ముఖం వికసించగా 'పరీక్షలు బాగా రాశావా?' అనడిగాడు నీరసంగా.
   
    "ఆఁ"
   
    కొంచెం తటపటాయించి శివనాథరావు "మీకు ఒంట్లో..."
   
    ఆయన బాధగా కొత్తేముంది శివా? మళ్ళా వస్తోంది గుండెలో నొప్పి. ఈసారి ఎక్కువగా వస్తోంది నాకు చాలా.....అన్నాడు.
   
    శివనాథరావు మాట్లాడకుండా నిలబడ్డాడు.
   
    ఆ రాత్రి.....
   
    గాలివాన లేదు. ఎక్కడా ఏమీ అట్టహాసాలు లేవు. దగ్గర్లో అనామ లేదు. ఊళ్ళో స్నేహితులు లేరు. వయొలిన్ యిక అందంగా మ్రోగదు. తనింక బొమ్మలు గీయనేలేడు. చీకటి పలుచగా వ్యాపించింది. కిటికీదగ్గర, ఊచలకానుకుని నిలబడి "నేనేం చెయ్యాలి?" అని ప్రశ్నించుకున్నాడు శివనాథరావు.
   
    సరిగ్గా ఓ ఏడాదిక్రిందట తను ఒంటరిగా వున్నప్పుడు అనామతో పరిచయమయింది. సరోజిని వచ్చింది. ఎన్నో మధురమైన అనుభవాలు. కానీ కాలం ఘోషపెట్టి, అందులో శాసించింది. మధురమైనవి మాసిపోయినై చిన్న జీవితం చిరిగిపోయింది.
   
    తను నేడో రేపో డాక్టరవుతాడు. ప్రాక్టీస్ పెడతాడు. కానీ దేనికి ఇదంతా? జీవితం ఇక్కడ ఆగిపోతే వచ్చే నష్టమేమిటి? ఎందుకు ఈ కఠిన శాసనాలు? ఏమలా? తను విధి విహితులకు నిశ్చేష్టుడౌతున్నాడు.
   
    తను ఇక్కడ ఉండలేడు. తన ఆరోగ్యం పాడయింది. అది యిక్కడ బాగుపడదు. ఆరోగ్యం బాగుచేసుకుని సుఖపడాలని కాదు. కానీ ఈ నిస్సత్తువ స్థితిలో, దుఃఖించటానికి కూడా ఓపిక వుండదు. మతి పరమ అర్ధంలేని విషయాన్ని గురించే తేలిగ్గా యోచించటం నేర్చుకుని, అడుగడుక్కి దుర్భర అశాంతుడ్ని చేస్తుంది. ఈ స్థితి తనకప్పుడే అవగతమౌతోంది కూడా.
   
    ఎక్కడికయినా పోయి, వెర్రిగా తిరిగి....ఏమీ లేదు. అంతే తిరగాలి.
   
    ఓ అర్ధరాత్రివేళ శివనాథరావు కన్నుమూశాడు. మెలకువ వచ్చేసరికి శుభ్రంగా తెల్లారిపోయింది. ఎదురుగా సావిత్రి నిలబడి వుంది. 'పిన్నీ' అని శివనాథరావు చెప్పసాగాడు.
   
                             22
       
    "నేను నాటకాల్లోంచి మానేస్తాను" అన్నది సుజాత బీచిలో కూర్చుని ఓ యువకుడితో.
   
    "ఎందుకు?"
   
    "ఆ అన్వేషణలో నాకంతు కనబడటం లేదు."
   
    "నష్టమేమిటి? అంతు తెలియని అన్వేషణే మానవుడిని శిఖరాగ్రాలకు తీసుకెడుతుంది. దాన్ని ఆపకు, నువ్వంత సులభంగా జారిపోకూడదు."
   
    "నాకు నటిగా చచ్చిపోవాలని లేదు" అంది సుజాత విరక్తిగా.

 Previous Page Next Page