చంద్రం నవ్వి "ఎంత స్వార్ధంనీకు? నీకు నేనెందుకు కనిపించాను?" అన్నాడు.
సుజాత మందస్మిత వదనంతో చెప్పసాగింది. 'ఎప్పుడో నన్ను-మురిపించే మెరుపు హృదయక్షేత్రాన మెరిసింది కాబట్టే నా భాగ్యవశాన మీరు కనిపించారు. లేకపోతే ఏనాడైనా ఆత్మహత్య చేసుకునే స్థితి వచ్చేది నాకు. కాని మీరు నన్ను మరీ దగ్గరకు తీసుకోరేం? మనిద్దరి మధ్య వున్న ఈ ఎడతెగని దూరమే నిజమైన ప్రేమకు నిదర్శనమా?"
చంద్రం ఉలికిపడ్డాడు 'లేదు. ఆ ఎడతెగని దూరం పిరికితనానికి ప్రతిబింబం. ఈ భూమ్మీద చాలా రకాల ప్రేమలున్నాయి. దూరంగా వున్నప్పుడు తహతహలాడి, దగ్గరగా చేరినప్పుడు చికాకులాంటిది పడటం, దగ్గరగా వున్నప్పుడు స్వచ్చమైన అనుభూతి పొంది, దూరంలో ముభావంగా వుండటం, రెండు స్థితుల్లోకూడా కమనీయమైన అనురాగ స్రవంతి ప్రవాహింపచేయటం.....వీటిల్లో దేన్నీ నిజమైన ప్రేమకాదని త్రోసివేయటం. ఇహ నేను మూడో కోవకు చెందినవాడ్నని ణ ఉద్దేశం. పిరికితనం, సిగ్గు నాకు మొదటినుంచీ అలవాటు లేదు. ఏ పురుషుడి జీవితమైనా రాణించేది స్త్రీ ప్రభావం వల్లనే ఒకడి ప్రకాశానికీ, పతనానికీ కారణం అజ్ఞాతంగా ఆడదే. అతను నిరర్ధకుడైనట్లయితే ఆరాధనా శూన్యమైన జీవితం గడిపినవాడై ఉండాలి. ఇహ....మన ఇద్దరి మధ్యా వున్న విశేషానికి కారణం విను. నీమీద జానకిరాం అధికారం కలిగి వుండటమే. అతని గిరినుండి నువ్వు బయట పడనంతకాలం నాకు స్వేచ్చ వుండదు' అన్నాడు.
సుజాత గగుర్పాటుతో అతని మాటలు వింది. అది అతను కల్పించిన అధికారం. నేనిచ్చింది కాదు' అన్నది.
"పర్యవసానం మాత్రం అతనికి నువ్వు ఎదురాడలేవు. నిన్ను నేను చేపట్టటానికి ప్రపంచంలో అతనే పెద్ద అభ్యంతరం" అన్నాడు.
"జానకిరాం దేవుడా?" అంది సుజాత.
"అతని మొహం అతన్ని నాలుగు తన్ని నిన్ను నాతో తీసుకుపోగలను. కాని అలా జరిగితే కొద్ది రోజుల్లోనే నేను నీ ప్రేమకు దూరమౌతాను."
"అది మీకు ఎలా తెలుసు?" అనడిగింది సుజాత నవ్వుతూ కుతూహలంగా.
"అట్లా ఊహించటం నాకు తెలుసు అంతే."
సుజాత నవ్వటం ఆపి 'ఎన్ని రోజులని యిలా సందిగ్ధంలో బాధపడతాను? ఇవాళ అతన్తో చెబుతాను' అంది.
"అతను ఒప్పుకోకపోతే?"
"అది అతనికి చాతగానట్లు చెయ్యగలను."
"రైట్ పద ఇద్దరం ఒడ్డుకు ఈదుతున్నాం" అని చంద్రం లేచి నిలబడి ఆమెకు చెయ్యి అందిచ్చాడు. సుజాత అతని చెయ్యిపట్టుకుని లేచి నిల్చుంది. ఆ సమయానికి అటుపోతున్న ఓ యువకుడు యీ దృశ్యంచూసి చకితుడై నిలబడిపోయాడు.
"ప్రభాకరం!" అంది సుజాత కంపిత స్వరంతో.
"నీ సహనటుడు" అన్నాడు చంద్రం.
"అతను చూశాడు" అంది సుజాత.
"ఏం చూస్తే?"
సుజాత జవాబు చెప్పలేదు. ప్రభాకరం నిల్చుని వున్నవైపు దృష్టి సారించింది. అతను మెల్లిగా కదిలి వెళ్ళిపోతున్నాడు.
"అతని కళ్ళలో అగ్ని శిఖలు కురిశాయా?" అనుకుంది సుజాత నడుస్తూ.
"లేక విషాద స్రవంతులు కదిలినవా?"
"ఏం చూస్తే?" అన్నాడు మెల్లగా చంద్రం మళ్ళీ.
"చాలా వుంది. చాలావుంది" అనుకుంది సుజాత. ప్రభాకరం తనను గురించి ఎన్నోసార్లు ఆలోచించి వుండవచ్చు. పాపం అతను. తను తిరస్కరించింది. ఏంచేస్తుంది అంతకంటే?
ఇద్దరూ కారులో ఎక్కాక 'ఇప్పుడే పోదాం మీ జానకిరాం దగ్గరకు నన్ను పెళ్ళిచేసుకుంటానని అతనికి చెప్పివెయ్యి. నువ్వు కొంచెంకూడా భయపడకు. నువ్వు తీవ్రంగా మాట్లాడగలిగితే జానకిరాం నోట మాట పెగలదు' అన్నాడు చంద్రం స్టార్ట్ చేస్తూ.
సుజాత హృదయంమీద చెయ్యివేసుకుని అదటుని అణచుకునేందుకు ప్రయత్నిస్తూ 'ఈ విపత్తు నేనే తెచ్చుకున్నానా?' అనుకుంది.
* * *
జానకిరాం యింటిలో దీపాలు వెలుగుతున్నాయి. అతను తప్ప యింటిలో యింకెవరూ వుండరని సుజాతకు తెలుసు. చంద్రం కారు కొంచెం దూరంగా ఆపుచేసి దిగాడు. సుజాత దిగింది. అతను సిగరెట్ వెలిగించుకుని "నేను యిక్కడే నిలబడి వుంటాను. వెళ్ళు, కంగారుపడకు సుజాతా" అన్నాడు.
సుజాత గుండె వేగంగా కొట్టుకుంటూంది. రక్తనాళాలన్నీ వేడెక్కినై. ఏదో చెప్పబోయి, ఆ ప్రయత్నం మానుకుని గబగబనడిచి గేటు తీసుకుని లోపలకు వెళ్ళిపోయింది.
గదిలో ఫ్యాన్ తిరుగుతోంది. జానకిరాం ఓ సోఫాలో సిగరెట్ కాలుస్తూ కూర్చున్నాడు. అతని ముఖం మరీ భయంకరంగా వుంది యివాళ. సుజాత తలుపులు త్రోసి గుమ్మంలోనే నిలబడిపోయింది.
జానకిరాం తలత్రిప్పి 'లోపలకు రా సుజాతా' అన్నాడు మామూలుగా.
ఆమె శరీరం వణికిపోసాగింది. పెదాలు బిగబట్టి అలాగే చూస్తూ నిలబడి పోయింది.
జానకిరాం ఆమెవంక ఓ నిముషం నిశితంగా చూసి 'నువ్వు నాతో తీవ్రంగా మాట్లాడదామని వచ్చావా?' అన్నాడు.
ఈ ప్రశ్నకు ఆమె నిరుత్తురాలయింది 'ఊ' అనీ 'ఆ' అనికూడా అనలేక పోయింది.
అతను చిన్నగా నవ్వి 'లోపలకు రా సుజాతా! వచ్చి కూర్చో కాస్త విశ్రాంతి తీసుకుని నీ యిష్టంవచ్చినంత తీవ్రంగా మాట్లాడుదువు గాని అట్టే మొండితనం చెయ్యకు' అన్నాడు.
ఆమె పాలిపోయిన ముఖంతో లోపలకు వచ్చి సోఫాలో కూర్చుంది. తలకూడా ఎత్తలా.
"కులాసాగా ఉన్నావా సుజాతా?"
ఆమె తల ఊపింది.
జానకిరాం సిగరెట్ యాష్ ట్రేలో పడేసి 'నేనో కొత్త నాటకం రాస్తున్నాను సుజాతా చాలా కష్టపడి రాస్తున్నాను. దీనికోసం గట్టి హీరోని వెదుక్కురావాలి. కష్టమైన పని --' అన్నాడు.
ఆమె ఎలా ప్రారంబించడమా అని ఆలోచిస్తుంది.
"నేను నిన్ను చాలాసార్లు కసురుకున్నాను సుజాతా. అదంతా నీమీద కోపంతో మాట్లాడతాను. ఈ నాటకంలో నీకో అద్భుతమైన పాత్ర సృష్టించాను. నిజంగా అపూర్వసృష్టి. నా బంగారుకలలు నీవల్లనే పండాలి......."
"నేను ఓ విషయం మాట్లాడుదామని వచ్చా" నన్నది సుజాత ధైర్యంచేసి తల ఎత్తి.
జానకిరాం హఠాత్తుగా కటువుగా 'నీ ప్రేమకలాపాల గురించేగా? మొదలుపెట్టు' అన్నాడు.
సుజాత ఇహ లాభంలేదనుకొని గుండె చిక్కబట్టుకుని గట్టిగా అన్నది 'అవును నేను ప్రేమించాను. నా ఇష్టం, నాకా స్వాతంత్ర్యం లేదా?'
"లేదు అన్నాడు జానకిరాం.
"ఏమిటి?" అని సుజాత కోపంతో వణికిపోతూ ఎదిరించింది.
జానకిరాం మరో సిగరెట్ అంటించుకుని నిశ్చలంగా 'అవును ప్రేమించటానికి స్వాతంత్ర్యంలేదు. నువ్వు నటించటానికే పుట్టావు. నటనకోసమే నీ జీవితం ధారపొయ్యాలి. మరో ధ్యాస ఉండకూడదు'
"లేదు లేదు ఎందుకోసం నేనలా వుండాలి? ఎవరికోసం నా త్యాగం?"
"నా కోసం."
"మీ కోసం?"
"అవును. నువ్వు నాకోసం, నువ్వు నా దానివి. నా నీడనుంచి దాటిపోకూడదు నువ్వు."
సుజాత కోపోద్రిక్తురాలై లేచి నిల్చుంది "ఎంత అహంభావం నీకు-జానకిరాం? నేను నీకేమౌతాను?"


