Previous Page Next Page 
ఆత్మజ్యోతి పేజి 50

   

      రాధమ్మగారు తడుముకుంటూ 'పురంధరుడి కథ'

    సరోజిని తలుపుకు ఆనుకుని 'అమ్మా! ఎందుకే అబద్దాలు? అరగంట నుంచీ చూస్తున్నాను. ఒక్క కాయితమైనా తిప్పలా నువ్వు' అనేసింది.
   
    రాధమ్మగారు కోపంగా 'అయితే నేను అబద్దం చెబుతున్నానంటావా? చాల్లే సరూ. పెద్దదానివవుతోన్న కొద్దీ మంచి బుద్దులే నేర్చుకుంటున్నావు' అన్నది.
   
    సరోజిని భయపడుతూ 'అది కాదమ్మా నువ్వేదో దాస్తున్నావు నా దగ్గర అంచేత' అంటూ దగ్గరకు వచ్చి చాపమీద కూర్చుని చేత్తో నేలని రాయసాగింది.
   
    రెండుమూడు క్షణాలు మౌనంగా గడిచాయి. అప్పుడు రాధమ్మగారు మృదు కంఠంతో 'సరూ! నీకోసం మీ నాన్నగారు సంబంధాలు చూస్తున్నారు' అంది.
   
    సరోజిని నిర్లిప్తంగా ఊరుకుంది.
   
    "ఏం మాట్లాడవు?"
   
    "నేను పెళ్లి చేసుకోనమ్మా" అంది సరోజిని విరక్తిగా.
   
    "చేసుకోకుండా?"
   
    "ఇలానే బ్రహ్మచారిణిగా వుంటాను"
   
    "లోకం ఆడిపోసుకుంటుంది"
   
    "ఏడిసింది"
   
    "సరూ!" అంది రాధమ్మ కొంచెం పెద్దగా. "నీకు మీ నాన్నగారి శాఖ పోలేదు. పోనీ ఈ విషయం నాకు కొంచెం చెప్పు. బ్రహ్మచారిణిగా వుండి నువ్వు సాధించేదేమిటి?"
   
    సరోజిని ముఖం ప్రక్కకి త్రిప్పుకుని "పెళ్లి చేసుకొని నేను సాధించేదేమైనా వుందా?" అని ప్రశ్నించింది.
   
    ఈ ప్రశ్నకు తల్లి వెనువెంటనే తెల్లబోయినా, చప్పున తెప్పరిల్లి "పెళ్ళి చేసుకున్నందువలన ఏమయినా సాధించినా, సాధించకపోయినా-చేసుకో కపోవటంవలన చాలా నష్టాలున్నాయి" అన్నది.
   
    "నిజమే అని నాకు తెలుసు" అన్నది సాలోచనగా సరోజిని.
   
    "అవన్నీ అనుభవించడానికే నిశ్చయించుకున్నాను."
   
    "నాన్నగారు ఒప్పుకోరు. పట్టుబడతారు."
   
    "పోయి బావిలో దూకుతాను."
   
    రాధమ్మగారి గుండె గుభేలుమంది. కొంపతీసి ఈ పెంకిపిల్ల అన్నంతపనీ చెయ్యదుగదా?
   
    "అమ్మా! ఈ పాడు పెళ్ళివిషయం పోనియ్యిగాని-చెప్పవూ?" అంది సరోజిని గారాబంగా.
   
    "దేన్ని గురించి?"
   
    "నీ ఆరాటానికి కారణం."
   
    రాధమ్మగారు ఆలోచించింది. చెప్పకపోతే ఈ పిల్ల ఊరుకునేటట్లు లేదు. అంతేగాక చెబితే కొంతవరకూ మనస్సు మార్చుకోవచ్చు.
   
    మధ్యాహ్నం మూడు దాటుతోంది. ఇంట్లో ఈ తల్లీకూతుళ్ళు తప్ప ఎవరూ లేరు. గోడమీద కాకి ఒకటే అరిచేస్తోంది. "మా అన్నయ్యా నేనూ ఒక తల్లి పిల్లలం కాదు" అంది రాధమ్మగారు.
   
    "ఏమిటి?" అంది సరోజిని విస్మయపూర్వకంగా.
   
    "మా అమ్మపేరు రమణమ్మ. మా అమ్మ, అన్నయ్య తల్లీ యిద్దరూ అక్కచెల్లెళ్ళు. మా అమ్మ చిన్నది. అన్నయ్య తల్లి సుందరమ్మగారు పెద్దావిడ. మా అమ్మ పెళ్ళికి పూర్వమే అన్నయ్య పుట్టాడు. పెళ్ళినాటికి మా అమ్మకు పదిహేనేళ్ళు. డబ్బూ, సంప్రదాయం అంతా చూసే సంబంధం నిశ్చయించారు. కానీ వరుడి ఆరోగ్యంగురించి ఎవ్వరూ వాకబుచేయలా. పీటలమీద కూర్చున్నప్పుడు పెళ్లికొడుకు నూట ఆరు డిగ్రీల జ్వరంతో వున్నాడు. మూలుగుతూ, ఎలాగో లేచి మూడు ముళ్ళూ వేశాడు. పెళ్ళిబాజాలు జోరుగా మోగుతున్నాయి. మా అమ్మ తన పెనిమిటివంక కన్నెత్తి చూడనేలేదు. అగ్ని హోత్రంచుట్టూ తిరగటానికి దంపతులిద్దర్నీ లేవమన్నారు. ఇద్దరూ లేచి నిలబడ్డారు. అంతే అదే చివరి నిముషం. పెళ్ళికొడుకు ధభీమని క్రింద పడిపోయాడు. ఏమిటేటంటే ఎవరో నాడి చూసి ప్రాణం పోయిందన్నారు. ఇంకేముందీ? అమ్మజీవితం నాశనమైపోయింది. బావిలో దూకి చావబోతుంటే ఎవరో పట్టుకుని ఆపారు.
   
    "సరే! అమ్మవచ్చి తన అక్కదగ్గరా, బావదగ్గరా వుండసాగింది. అప్పటికే అన్నయ్యకు రెండు మూడేళ్ళున్నాయనుకుంటా. ఒకటి రెండేళ్ళు గడిచిపోయాయి. ఇంటిలో వయస్సులో వున్న పిల్ల తిరుగుతుంటే ఆమె బావకు అంటే అన్నయ్య తండ్రి కన్నమాట కళ్ళుకుట్టాయి. ఆ రోజుల్లో యింటిలో ఆడదాని స్థితిని గురించి నీకు తెలీదు సరూ. అందులో పల్లెటూళ్ళు ఒక్కొక్క యింటిలో యిలాంటి దౌష్ట్యాలు ఎన్నో జరిగిపోతూ ఉండేవి. మొగవాడి దుష్క్రుత్యాలకు హద్దూ పద్దూ వుండేదికాదు. ఒకరోజు - ఇంటిలో ఎవరూ లేనివేళ జూసి మా అమ్మను బలవంతాన పాడుచేశాడు. ఏం చేస్తుంది ఆడది? అతనికి లొంగిపోయినది. ఆయన పెద్దభార్య ఎప్పుడూ జబ్బుగా వుంటూ వుండేది. ఆవిడబదులు మా అమ్మ ఆహుతవుతూ వచ్చింది. చివరకు గర్భం ధరించింది."
   
    "ఇంకేముంది? ఆయన-అంటే మా నాన్న అన్నమాట. యిల్లెగిరిపోయేటట్లు లేచాడు. ఇంటిలోని వంటవాడికీ, అమ్మకూ సంబంధం అంటగట్టాడు. భార్య ఎంత వారిస్తున్నా వినకుండా యిలాంటి కులటను తన యింటిలో ఉంచుకోనని వంటవాడ్ని, ఆమెనూ కలిపి యింటిలోంచి బయటకు వెళ్ళగొట్టాడు. ఎవరున్నారు అమ్మకు పాపం? బంధువులెవరూ స్వీకరించలేదు. వంటవాడు తెగించి తను కాపాడతానని చెప్పి తీసుకుపోయి ఇంటిలో పెట్టుకున్నాడు. నన్ను కనేవరకూ బ్రతికివుండి తరువాత అమ్మ ఉరేసుకుని చచ్చిపోయింది. నన్ను ఆ వంటవాడే పెంచుతూ ఉండేవాడు. తరువాత కొన్నాళ్ళకి గుండెజబ్బుతో నాన్న చచ్చిపోయాడు. మా పెద్దమ్మకు మా అమ్మన్నా, నేనన్నా చాలా అభిమానమట. అందులో భర్తచేసిన దుర్మార్గంగురించి ఆమెకు తెలుసు. వంటవాడికి కబురు పంపించి నన్ను తెచ్చుకొని పెంచసాగింది."
   
    "అన్నయ్య నాకంటే మూడునాలుగేళ్ళు పెద్ద. పల్లెటూళ్ళో వుంటే తెలిసిన వాళ్ళంతా కాకుల్లా పొడుస్తున్నారని మాతోపాటూ బెజవాడకొచ్చి కాపురం పెట్టింది పెద్దమ్మ. ఇద్దర్ని సమానమైన వాత్సల్యంతో పెంచేది. మేము కొంచెం కొంచెం పెరిగి పెద్దవాళ్ళమౌతున్నాము. నాకు అప్పుడప్పుడే ఊహ తెలుస్తుంది. ఒకరోజున దూరపుబంధువు ఒకావిడవచ్చి అన్నయ్యా నేను అప్పుడే బయట నుండి వస్తుంటే నన్ను చూపించి "ఇది ఆ వంటవాడి కూతురేనా?" అనడిగింది. మేమిద్దరం నిర్ఘాంతపోయాం. అప్పటివరకూ నాకు ఈ రహస్యం గురించి ఏమీ తెలీదు. ఆమెనే తల్లి అనుకుంటున్నాను. పెద్దమ్మకు చాలా కోపం వచ్చి వచ్చిన చుట్టాన్ని తిట్టి బయటకు గెంటేసింది. నేను చాలా చాటుగా పెద్దమ్మదగ్గరకు పోయి అసలు విషయం చెప్పమని ఏడిచాను, మొత్తుకున్నాను. చివరికి విధిలేక ఆమె మా ఇద్దరికి తండ్రి ఒకరేనని, తల్లులు మాత్రం వేరనీ కథంతా చెప్పుకొచ్చింది. ఈ విషయం మరచిపొమ్మని నన్ను బ్రతిమాలింది."

    "అయితే ఒక విచిత్రం జరిగింది. అన్నయ్య తల్లితో దీన్నిగురించి ఏమీ ప్రస్తావించలదు. ఆ చుట్టం అన్నమాటే వాడి మనసులో గాఢంగా నాటుకుపోయింది. అప్పట్నుంచీ నన్ను దూరం దూరంగా ఉంచసాగాడు. చాలాసార్లు వాడు పొరబడుతున్నాడనీ, అసలు విషయం చెబుదామనీ కొట్టుకుపోయేదాన్ని, కానీ ఎట్లా చెబుతాను ఈ విషయం నా అంతట నేనే ప్రస్తావన లేకుండా. నోటిదాకా వచ్చిన మాటను కష్టపడి ఆపేసేదాన్ని. పెద్దమ్మకు అన్నయ్య అనుమానం గురించి చెప్పాలని వుండేది గాని-ఏమయినా అనుకుంటుందేమో నని నాలో నేను మ్రింగి సహించేశాను."
   
    "అలాగే పెరిగి పెద్దవాళ్ళయిపోయాము. నేను క్రమంగా నా జన్మ రహస్యాన్ని గురించి ఆలోచించటం మరిచిపోయాను. అన్నయ్యకు పెద్దమ్మ అంటే చాలా భయం, భక్తి. ఆమె నన్ను ఎంతో ప్రేమిస్తూండటం బట్టి, నాకు మరీ అంతదూరం కాలేకపోయాడు. నాముందు బహిరంగంగా ఆ విషయమూ వ్యక్తం చేయలేదు. నాకు పెళ్ళీడు వచ్చిందని పెద్దమ్మ నాకు సంబంధాలు వెదకసాగింది. కాని ఆ కట్టుకథ సంఘంలో వ్యాప్తి చెంది వుండటంచేత, నాకు ఆమె హోదాకు తగిన వరుడ్ని తీసుకురాలేకపోయింది. చివరకు ఈ పల్లెటూరి సంబంధం చూసి పెళ్ళి చేసేసింది. కొన్నాళ్ళకు పెద్దమ్మ చచ్చిపోయింది."
   
    "చాలాకాలం కలిసిమెలిసి ఉడటంహేత అన్నయ్యకు నేనంటే కొంత అభిమానం లేకపోలేదు. నేను యిక్కడ్నుంచి అక్కడకు పోయినప్పుడు బాగానే చూసేవాడు. కాని వాడిలో ఈ అహం, మూఢనమ్మకం పేరుకుని పోయి వున్నాయని మొన్నవాడు నా ఉత్తరానికి జవాబు వ్రాసేవరకూ తెలియదు!"

 Previous Page Next Page