Previous Page Next Page 
ప్రేమికారాణి పేజి 50

    "ఆమె గురించి మాట్లాడాలన్నా, ఆలోచించాలన్నా నాకు చెప్పాలేనంత అసహ్యం. దయచేసి, ఆసంగతి పొడిగించవద్దు." ప్రేమీ కొంచెం కటు స్వరంతో అంది.

    "నేను రావడమే అందుకోసమైనప్పుడు మాట్లాడకుండా ఎలా ఉంటాను?"

    "ఎంత మాట్లాడినా, ఏం మాట్లాడినా ప్రయోజనం లేనప్పుడు మాట్లాడి ఏం చేస్తారు?"

    "ప్రయోజనం ఉండదని నే ననుకోవడం లేదు. ఉంటుందనే నా ఆశ!"

    "దూతల్ని అవమానించకూడదని మనలో ఒక నీతి వుంది. లేకపోతేనా..."

    "గడపలో అడుగుపెట్టీ పెట్టకముందే గెట్ వుట్ చేసేవారు!" విశాల్ స్నిగ్ధంగా నవ్వాడు "ఫరవాలేదు. అవమానించండి! కాని, నన్ను మాట్లాడనివ్వండి చాలు."

    "ఆ విషయం గుర్తువస్తే నా గుండె ఎలా భగ భగ లాడుతుందో మీరు చూడగలిగితే మీరు ఏం మాట్లాడడానికీ సాహసించేవారు కాదు."

    "నా దగ్గర సాహసం తక్కువ లేదు."

    "చెడిపోయిన మీ అత్త తరపున వకాల్తా పుచ్చుకొని ఇంత దూరం వచ్చారంటే మీకెంత సాహసముందో నేను ఊహించగలను లెండి."

    "ఆమెను చెడిపోయిన మనిషిగా లెక్కవేస్తే నేను ఒప్పుకోను. మీరు నాటకంలో భరతుడు వేసినట్టున్నారు కదూ? భరతుడు తన తల్లిని చెడిపోయిన మనిషిగా అనుకొన్నాడా? మునికులం అనుకొందా? భర్తచేత అవమానింపబడిన స్త్రీగా ఆమె తనవారి ఊరడింపు పొందింది. దురదృష్టవశాత్తూ ఈ సమాజం ఆ మునికులం కాదు. గీతా ఆంటీని గుండెలో దాచుకోలేదు. కాని, జరిగినా వంచన, అన్యాయం ఇద్దరిదీ ఒక్కటే."

    "ఆమెను శకుంతలతో పోల్చి ఆ పాత్ర నెందుకు చిన్న బుచ్చుతారు? విశ్వామిత్రుడిని కవ్వించిన దేవవేశ్య మేనక అంటే సరిపోతుంది. తన కామఫలాన్ని అడవిలో పారేసి తనలోకం చక్కా పోతుంది మేనక. ఈమె కామఫలాన్ని మేడమీదినుండి పారేసి తన ఊరు చక్కాపోయి మరొకన్ని పెళ్ళాడి పతివ్రత అయింది."

    "ఆమె బిడ్డను ప్రసవించి పారేయడం నీచమైన విషయమే. ఆ సంఘటన ఆధారంగా  మొత్తం ఆమె జీవితాన్నే నీచంగా చిత్రించడం భావ్యమా? వయసు సహజంగా చలించింది. ప్రకృతి సహజంగా బిడ్డను కన్నది. సమాజపు కట్టుబాట్లకు భయపడి బిడ్డను పారేసుకొంది. ఆమె జీవితంలో పొందిన అవమానానికీ, దుఃఖానికీ జాలిపడాలిగాని అసహ్యించుకోవాల్సింది ఏముంది?"

    "ఏమీ లేకపోతే నన్ను తన కూతురిగా పరిచయం చేసుకోవచ్చుగా? తల్లీబిడ్డలమన్న సత్యం రహస్యంగా దాచడమెందుకు?"

    "ఇద్దరు మగవాళ్ళతో సంబంధం కలిగిన స్త్రీని చూసి జాలిపడేంతగా ఎదగలేదు ఈ సమాజం!" చిన్న నిట్టూర్పుతో అన్నాడు విశాల్. "మా గీతా ఆంటీ మా మామయ్యకి దేవత. ఆయన భార్యపోయి కుటుంబం అంధకారంలో, దుఃఖంలో కుములుతున్న సమయంలో గీతా ఆంటీ తన సహజమైన కరుణతో, భూదేవతలాంటి ఓరిమితో ఆ ఇంట్లో ఆనందపు జ్యోతి వెలిగించింది. ఆమె అంటే ఆయనకీ కృతజ్ఞతా, గౌరవం! కాని, ఆమె పెళ్ళికి ముందు బిడ్డను కన్నదని తెలిస్తే అవి నిలువకపోవచ్చు. ఆమెను పరిత్యజించనూ వచ్చు. అప్పుడు వాళ్ళ జీవితాలు ఎంత నరకంగా తయారవుతాయో మీరు ఊహించలేనిది కాదు."

    "అవును నరకంగా తయారవుతాయి. పెళ్ళికాకముందు ఆమె ఒక బిడ్డ తల్లి అయిందని తెలిస్తే! అది ఊహించడం పెద్దకష్టంకాదు. కాని, నన్ను పొందాలంటే ఆమె ఏం పోగొట్టుకోడానికైనా సిద్దపడాలి! అప్పుడే కదా ఆమెకు నా మీద ఎంత ప్రేమున్నది తెలిసేది."

    విశాల్ ప్రేమీ ముఖంలోకి చురుగ్గా చూశాడు. ప్రశాంతంగా సాగుతున్న అతడి కంఠస్వరంలో కటుదనం చోటు చేసుకొంది. "అయితే మీరు ఆమె సర్వనాశనాన్ని కోరుకొంటున్నారన్నమాట. ఒక కూతురు తన కన్నతల్లి సర్వనాశనాన్ని కోరుకొంటూంది. ఒక తల్లి బిడ్డను కని సమాజ భయంతో పారేసుకొన్నదానికంటే, ఒక కూతురు తల్లిమీద పగబట్టటం నీచాతినీచంగా కనిపిస్తూంది నాకు."

    ఎవరో రెండు చేతులతో మసి తెచ్చి పులిమినట్టుగా నల్లబడిపోయింది ప్రేమీ ముఖం.

    "నా దగ్గర సాహసం తక్కువ లేదు."

    అవును. అక్షరాలా అది నిజం. అందులో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. ప్రశాంతంగా, మునిలా కనిపించే ఇతడిలో కావలసినంత తీక్షణత కూడా ఉంది. ఎంత సాహసవంతుడు కాకపోతే తన ముఖం మాడిపోయేలా జవాబు చెప్పగలడు? మళ్ళీ నోరెత్తేందుకు కూడా అవకాశం లేదే.

    స్తబ్ధంగా మారిపోయిన వాతావరణాన్ని చెదరగొడుతూ మేఘంలేని ఉరుములా వచ్చి పడ్డారు రామచంద్ర, అజయ్.

    "నాన్నగారు పోయారట. నాకు తెలిసి వారం రోజులైంది. వద్దామంటే ఈ రోజుదాకా వీలుపడలేదు." అంటూనే ప్రశ్నార్ధకంగా గదిలో కనిపించిన క్రొత్తముఖాన్ని చూడసాగాడు రామచంద్ర.

    "ఆయన ఒక రాయబారి. వివరాలు తరువాత చెబుతాను."

    ఆ ఇద్దరి రాకతో సందిగ్ధంలో పడ్డట్టుగా అయ్యాడు విశాల్. ఇక  వెళ్ళిపోతే బాగుంటుందా అనుకొన్నాడు. కాని, వచ్చినపని ఎంతవరకు వచ్చినట్టు? అత్తకి ఏం సమాధానం చెప్పాలి?...వీళ్ళెవరు? ఈమె స్నేహితులా?

    గోడకి ఎత్తి ఉన్న మంచం వాల్చుకు కూర్చొన్నారు ఇద్దరూ.

    రామచంద్ర రావడంలో ఆశ్చర్యం ఏం లేదు. అజయ్ రావడమే ఆశ్చర్యంగా ఉంది ప్రేమీకి. అతడెందుకు వచ్చినట్టు?

    ప్రేమీ కళ్ళలో ఆశ్చర్యం చదివినట్టుగా, "నేనే లాక్కువచ్చాను. తండ్రి పోయిన దుఃఖంతో ఉంటుంది ప్రేమిక. ఆమె దగ్గరికి వెళ్ళాలంటే నా కొక్కడికీ ధైర్యం చాలదు తోడుగా నువ్వూరా అని." అని ఆమె సందేహం తీర్చాడు రామచంద్ర.దుఃఖం నిగ్రహించుకొంటూ నిలబడింది ప్రేమీ.
   

 Previous Page Next Page