Previous Page Next Page 
ప్రేమికారాణి పేజి 51

    "అజయ్ ని నాలుగు చీవాట్లు వేద్దామని కూడా తీసుకు వచ్చాను. అతడు చేసినా పనేం బాగాలేదు. ఆడదాని ఉసురుపోసుకోవడం, కన్నతల్లిని బాధించడం ఏమైనా మనిషి చేసేపనా? అమ్మగారు చక్కటి నిర్ణయం తీసుకొన్నారు. ఆమెవైపు పోరాడడానికి నేనున్నాను. నాలాంటి వందలాదిమంది ఆమె వెనుక ఉంటారు. ఒక్క ఈ అజయ్ ఏం చేయగలడు?"

    వాళ్ళేవో వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడు కొంటుంటే తనక్కడుండడం సభ్యత కాదనిపించింది విశాల్ కు. వెళ్ళడానికి లేచాడు. "నేను మళ్ళీవస్తాను. నన్ను చూసి మీ ఇంటి తలుపులు మాత్రం మూసేయకండి దయచేసి." అని సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు.

    వెడుతూ వెడుతూ అతడు వదిలిపోయిన మాటలు చిత్రంగా ధ్వనించాయి ఆ యువకులిద్దరికీ.

    "ఎవరీ రాయబారి? ఏమీ ఆకధ?" రామచంద్ర ప్రశ్నించాడు.

    ప్రేమీ క్లుప్తంగా అతడిగురించి తెలిపింది.

    "అయితే నిన్ను గట్టిగానే పట్టుకొందన్న మాట ఆవిడ, తన దగ్గరికి రప్పించుకోవాలని! ఎంతైనా తల్లి మనసు కదా?"

    "ఇప్పుడొచ్చిన ఈ మనిషి ఉత్త నక్షత్రకుడి జాతికి చెందినవాడు. అవమానాన్ని. అపజయాన్ని ఏమీ లెక్కచేయడు. తను చేయదలచుకొన్నది నిర్భయంగా చేసేస్తాడు."

    "అప్పుడే అంత బాగా అర్ధమయ్యాడన్నమాట."

    వాళ్ళ సంభాషణలో కల్పించుకోకుండా ఒక ప్రేక్షకుడిలా శ్రోతలా కూర్చొన్నాడు అజయ్.

    "నువ్వు అమ్మగారింట్లోనే కొన్నాళ్ళపాటు ఉండాల్సింది, ప్రేమికా."

    "ఎందుకు?"

    "ఇక్కడ ఒక్కదానివీ ఎలా ఉంటావు? అమ్మగారు నీకు పరాయిది కాదుకదా? నిన్నుతల్లిలా చూచుకొనే మనిషి ఆమె. 'కొద్దిరోజులు ఇక్కడే ఉండు' అని ఎంత బ్రతిమాలినా 'ఎప్పటికైనా తప్పదుగా' అంటూ వెళ్ళిపోయింది. ఏదైనా ఆపిల్ల మనసుకు తోచాలిగాని ఎవరు చెప్పినా వినదు కదా?' అంటూ బాధపడి పోయారు అమ్మగారు."

    "నాన్న నాకింత గూడు వదిలిపోయాడు తలదాచుకోడానికి. ఇక ఒక్కదాన్ని అవుతానో, అందరిదాన్ని అవుతానో నా తత్వంమీద ఆధారపడుతుంది. ఆంటీ సమాజ కల్యాణం అనే ఒక సేవాకార్యక్రమం రెడీగా ఉంచింది. ఆమె అడుగు జాడలో నడవాలనుకొంటున్నాను. ఆ దారిన నడిచేవాళ్ళు వంటరి వాళ్ళు కారని నా నమ్మకం."

    "అయితే నువ్వు నడిచే దారిగురించి ఒక నిర్ణయానికి వచ్చావన్న మాట. హర్షించే నిర్ణయమే తీసుకొన్నావు."

    "బ్రతికించావ్. పెళ్ళీ సంసారం, పిల్లలు లేకుండా జీవితానికి పరిపూర్ణత ఏదీ అంటూ ఉపన్యాసం ప్రారంభించలేదు."

    "ఆ మాట నిన్నంటే అది నాకూ వర్తిస్తుందికదా? పరిపూర్ణత సంసారంలోనే లేదు. మానవసేవలో కూడా ఉంది అని నమ్మేవాళ్ళలో నేనూ ఒకడిని. కాబట్టే నాజీవితం మానవసేవకు అంకితం చేశాను. ఈ సేవాపధంలో నడవడానికి పురుషుడికి ఎంత అర్హత ఉందో స్త్రీకి అంత అర్హత ఉంది. నిన్ను ఈ విషయంలో ప్రోత్సహిస్తానే తప్ప నిరుత్సాహ పరచను....ఏం, అజయ్? ఒక్కమాట మాట్లాడకుండా మౌనవ్రతం పట్టావేం?"

    "మీరు మాట్లాడేవి నాకు బొత్తిగా అర్ధంకాని విషయాలు. ఏం మాట్లాడను?" నిరాసక్తిగా అన్నాడు అజయ్.

    "నీకు అర్ధమయ్యే విషయాలు ఏమిటి? ఆడపిల్లల్ని తల్లుల్ని చేయడమా?"

    "నేను ఎవరినీ బలవంతంగా తల్లుల్ని చేయలేదు."

    "వాళ్ళ ఇష్టంతోనే తల్లులయ్యారంటావు. నీ బాధ్యతేమీ లేదంటావు. ఛ! ఏం మనిషిని అజయ్? ఇహ నీ వల్ల ఆడపిల్లలు మోసపోకుండా ఉండాలంటే నీ ముఖంమీద ఏసిడ్ పోసి నీ ముఖం ఏ ఆడపిల్లా కన్నెత్తి చూడకుండా చేయాలంటాను. అదే నీకు సరైన శిక్ష. ఆడపిల్లలకు నీ నుండి రక్షణా!"

    అజయ్ ముఖం చిరాకుగా మారిపోయింది. "చేయరాని తప్పు నేనొక్కడినే చేశానన్నట్టు మాట్లాడతారేం అందరూ? స్త్రీ పురుషుల మధ్య ఏర్పడే ఆకర్షణ పెళ్ళి వరకూ పోవాలంటే-ఈ ప్రపంచంలో ఏ భార్యా భర్తతో కాపురం చేయదు. ఏ భర్తా భార్యతో కాపురం. చేయడు. ఎప్పుడూ జంటలు మారుతూనే ఉండాలి. ఈ సమాజంలో ఏ సంసారమూ స్థిరంగా నిలబడలేదు."

    "స్త్రీ పురుషులమధ్య ఆకర్షణ సహజమే కావచ్చు. ప్రతి ఆకర్షణకూ లొంగిపోతే జంతువులకీ, మనుషులకీ తేడా ఏముంటుంది?"

    "జంతువులు ఆకర్షణలో పడతాయని ఏ పండితుడూ ఏ సైంటిస్టూ చెప్పలేదు. వాటికి కామం, ఆకలి తప్ప ఇంకేమీ తెలియవు!"

    "నువ్వు చేస్తున్న పనికి 'ఆకర్షణ' అన్న అందమైన పేరెందుకు పెడతావు? నీదీ పశుకామమే! లేకపోతే, నీ కోరిక తీర్చిన ఆడపిల్లల జీవితాలు ఏమౌతాయన్న ఆలోచన నీకుండదా?....ఇలా ఇల్లువిడిచి బయట ఎన్నాళ్ళుండాలని? అక్కడేమో అమ్మగారు కోడలికి శీమంతపు వేడుకలు ఘనంగా చేయబోతూంది. ఊరి ముత్తయిదువు లందరినీ పేరంటంపిలిచి." చివరిమాట తమాషాకి అన్నట్టుగా నవ్వసాగాడు రామచంద్ర.

    అజయ్ ముఖం ఎర్రబడిపోగా, "ఎవరి వెర్రి వాళ్లకు ఆనందం. శీమంతపు వేడుకలు చేస్తుందో, బారసాల వేడుకలు చేస్తుందో ఆమె ఇష్టం. చివరికి నవ్వులపాలు అయ్యేది ఆమె. నేను మగవాడిని. నేను సిగ్గుపడాల్సింది, తల వంచుకోవాల్సింది ఏమీలేదు ఇందులో." అన్నాడు బింకంగా.

    "నీ ఈ అహంభావమే నీకొకరోజు గుణపాఠం చెబుతుంది. మగవాడి కొకనీతి, ఆడదాని కొకనీతి చెల్లని రోజు తప్పకుండా వస్తుంది. పవిత్రతా, సౌశీల్యం ఒక్క ఆడదానికే ఎందుకుండాలి? మగవాడికి ఎందుకు అక్కర లేదు? మగవాడు వ్యభిచరించి గర్వంగా తలెత్తున తిరగడమేమిటి? ఆడది తప్పుచేస్తే ఆమె తల పాతాళంలోకి క్రుంగిపోయేట్టు చేయడమేమిటి? నీతి అవినీతిలో స్త్రీ పురుషులకి సమానత ఉండే సమాజం మనం ఏర్పరచుకోక తప్పదు! విశృంఖలత స్త్రీకి ఎలా కూడదో, పురుషుడికీ అంతేనని చెప్పే క్రొత్త శాస్త్రాలు రాసుకోవాలి మనం."
 

 Previous Page Next Page