పాపచేసే ప్రతి చిన్న పనీ మెచ్చుకోలుగా చూసేది. "మా పాప క్లాసులో ఫస్టండీ" అని అడిగినవాళ్ళకీ, అడగనివాళ్ళకీ చెప్పేది. ఎవరితో చెప్పినా పాపకబుర్లే చెప్పాలి. సుందరయ్యది మరీ అంత బయట పడిపోయే ప్రేమకాదు. కాని, పాపకంటే ప్రాణప్రదమైన మనిషి మరొకరు లేరతడికి.
అల్లారుముద్దుగా పెంచిన ఆ ఇద్దరినే పోగొట్టుకొంది తను. అమ్మ పోయినప్పుడు ఆ లోటు తీర్చడానికి, ఊరడించడానికి నాన్న ఉన్నాడు. ఇప్పుడెవరున్నారు?
'ఒక్కదాన్నీ ఉండగలను, ఆంటీ!' అని ధైర్యంగా చెప్పిందేకాని, ఆ ఇద్దరూలేని ఇంట్లో ఉండడం ఎంత దుర్భరమో అనుభవంలో తెలుస్తూంది ప్రేమీకి. అడుగడుగునా, అనుక్షణం అమ్మ నాన్న గుర్తు వస్తున్నారు. తనుకూడా పోయాక పాప ఒంటరిదైపోతుందని తండ్రి ఎందుకంతగా అల్లాడిపోయాడో ఇప్పుడర్దమౌతుందా పిల్లకు. ఒంటరితనం అంటే ఏమిటో ఇప్పుడు తెలుస్తున్నట్టుగా ఉంది.
దుఃఖం కదిలి కదిలి వస్తూంటే మోకాళ్ళమధ్య తల ఉంచి ఏడవసాగింది ప్రేమీ.
సరిగా అదే సమయంలో గుమ్మంలోకి వచ్చి నిలబడ్డాడు విశాల్. గుమ్మానికి ఎడంప్రక్కగా సుందరయ్య మంచం వుండేది. అదిప్పుడు లేదు. ఆ ఖాళీస్థలంలో చిన్నగా, అందంగా పెట్టిన ముగ్గుంది. సుందరయ్య తాలూకు మందులుగాని, అతడి మరే వస్తువులుగాని కనిపించలేదు. ఆయన హాస్పిటల్లో చేరి ఉంటాడా? హాస్పిటల్లో చేరితే ఈ అమ్మాయి ఎందుకిలా ఏడుస్తూంది?
"....నాన్నని కూడా నీ దగ్గరికి పిలుచుకొన్నావుకదూ? నీ పాప ఒంటరిదై పోతుందన్న ఆలోచన నీకు రాలేదా? ఎందుకిలా చేశావమ్మా?" ప్రేమీ దుఃఖం ఎక్కువైపోయింది.
"నేను వచ్చినప్పుడు బాగానే ఉన్నారే! నెలకూడా కాలేదు నేను వచ్చి వెళ్ళి. ఇంతలో ఎలా జరిగింది?" విశాల్ కొంచెం విభ్రాంతిగా అడిగాడు.
"ఆయనకు ఆయువు తీరిపోయిందేమో! కూర్చోండి."
విశాల్ కిటికీ దగ్గరగా వేసివున్న కుర్చీని కొంచెం ఇటు త్రిప్పుకొని కూర్చొన్నాడు. ఈ రోజు ఈ అమ్మాయితో మాట్లాడాలనే వచ్చాడు. కాని....కాని, తనకు తోడుగా సుందరయ్యకూడా లేడే? ఈ అమ్మాయితో ఎలా ప్రారంభించాలి విషయం? ఛ! ఇంత భయపడుతున్నాడేమిటి ఈ అమ్మాయికి! ఇలా అయితే తను అత్తకిచ్చిన వాగ్దానం ఏం కాను?
ప్రేమీ పుస్తకాలు, నోట్సులు ఆల్మైరాలో సర్దింది. ఆల్బమ్ కూడా ఉంచబోతుంటే, "ఇలా ఇవ్వండి." అంటూ చెయి జాపాడు విశాల్.
ఒక్క క్షణం సందేహించినట్టుగా ఆగి, తరువాత అతడికి అందించింది ఆల్బమ్.
"సుస్తీ చేసిపోయారా ఆయన?"
"ఉన్న సుస్తీయే. దగ్గు బాగా ఎక్కువైంది. కాని, చనిపోతాడని మాత్రం అనుకోలేదు. మాట్లాడుతూ, మాట్లాడుతూనే చనిపోయాడు." ఆ రాత్రి ఆయన ఎంత ఆయాసపడిందీ, టీ తయారు చేసుకొచ్చేలోపలే ఆయన మృత్యుముఖంలో ఎలా ఉందీ-చెప్పింది.
"ఆయన మీ విషయంలో ఏం ఊహించి భయపడ్డారో అది యదార్ధమైందన్నమాట."
"వంటరిదాన్నీ, అనాధనూ కావడం సంగతేనా మీరంటున్నది? ఈ ప్రపంచంలో ఇక మనుషులే లేరా? నాన్న అనవసరంగా భయపడ్డాడు. అనవసరంగా మిమ్మల్ని రంగంలోకి లాక్కువచ్చాడు. పేపరులో ఆ ప్రకటన నాకు తెలియకుండా చేశాడు. తెలిస్తే ఎంతమాత్రం పేపరుకి ఆ ప్రకటన ఇవ్వనిచ్చేదాన్ని కాదు."
"ఆయన చేసింది ముందు చూపుతో చేసిన పని. అనవసరమనినే ననుకోవడం లేదు."
"ఎంత ముందుకు, ముందు ముందుకు దృష్టి సారించిచూసినా మీతో నాకు అవసరం కనిపించడం లేదు. పైగా నాలో మండే ద్వేషానికి ఆజ్యం పోసినట్టుగా అవుతుంది మీ జోక్యం." నిర్మొహమాటంగా అనేసి అన్నాక నాలిక కరుచుకొంది. నాన్న చివరి కోరిక, ఇతడొస్తే అవమానించకూడదని ఉందికదూ? 'పాపా! నువ్వు కొంచెం సహనం తెచ్చుకోవాలమ్మా!' అని నాన్న తరుచూ అనేవాడు. సహనం అనేది తనకు ఎప్పటికైనా వస్తుందా?
విశాల్ ముఖం కొంచెం మ్లానమైంది. ఇంత నిర్మొహమాటంగా, నిక్ఖచ్చిగా మాట్లాడే పిల్లతో మాట్లాడి ఎలా గెలవాలి? ఏం చేస్తే ఈ అమ్మాయి నోటికి బంధం వేయగలడు?
"మిమ్మల్ని పెంచిన వాళ్ళిద్దరూ ఈ ప్రపంచంనుండి వెళ్ళి పోయారు. ఇంకా ఇక్కడ మీకు మిగిలి ఉన్న బంధం ఏమిటి?"
"పెంచిన వాళ్ళు, కన్నవాళ్ళు వీళ్ళతో తప్ప ఇంకెవరితో బంధం ఏర్పడదా మనిషికి?"
"ఏర్పడుతుంది_ మనసిచ్చిన మనిషితో. ఏర్పడుతుంది_మనుషులే కాదు, పక్షులతో, పువ్వులతో, జంతువులతో, నేలతో, నింగితో, ప్రాణం లేని గోడలతో, పరిసరాలతో కాని, ఈ బంధాలన్నిటినీ మించినది రక్తసంబంధం. దాని చేత కట్టుబడని మనిషి ఉండడంటాను ఆమె మీ పట్ల ఒకనాడు చేసిన పని అంటారా, పరిస్థితులు మనిషిచేత ఎంత కిరాతకమైనా చేయిస్తాయి! చివరికి ఆ మనిషికి పరితాపం, పరివర్తనా ఎలాగూ తప్పవు. మా గీతా ఆంటీ మీ విషయంలో ఎంత కుమిలిపోతూందో, మిమ్మల్ని ఎలా కలవరిస్తుందో, ఆమె హృదయ ఘోష వివరించాలంటే నాకు మాటలు చాలవు."