Previous Page Next Page 
నెత్తుటిబొట్టు పేజి 50

    "ప్రజ్ఞా ! పద. నిన్ను  తీసుకొని  వెడదామని వచ్చాను" అంది.

    "మీరా  నాకోసం  యింత  శ్రమపడి..."

    "శ్రమేముంది  ప్రజ్ఞా! పెళ్ళి  కూతురిగా  తయారయిన  నిన్ను కళ్యాణ మండపానికి  స్వయంగా  తీసుకువెడదామన్న  కుతూహలంతో  నేనే  వచ్చాను."

    ప్రజ్ఞ  ఆశ్చర్యంగా  చూసింది. వివాహ వ్యవస్థ  అంటే నమ్మకంలేని  తేజ  తనని వివాహ వేదికమీదకు  తీసుకెళ్ళటానికి  వచ్చింది.

    ఓ చిత్రమైన  అనుభూతితో  ఆమె శరీరం  పులకించి  కళ్ళలో  చిన్న నీటి పొర  క్రమ్మింది.

    తేజ  అందించిన  చెయ్యి  అప్యాయంగా  పట్టుకుని లేచి  నిలబడింది.

    తేజ  రాఘవమ్మ  వంక తిరిగి  "మీరూ, అంకుల్ కూడా  మాతో రండి. ప్లీజ్  త్వరగా  బయల్దేరండి" అన్నది.

    అయిదు  నిమిషాల  తర్వాత  ప్రజ్ఞనూ, ఆమె తల్లిదండ్రుల్నీ ఎక్కించుకుని  తేజ  కారు  బయల్దేరింది.

    ఆమె కారు  సందు మలుపు  తిరిగీ  తిరగ్గానే  ప్రతాప్  డ్రైవ్  చేసుకుంటూ  వచ్చిన  కారు  యింటిముందాగింది.



                  *                  *                 *



    ప్రజ్ఞను  కల్యాణ  మండపం  దగ్గర  దింపి  తేజ  తృప్తిపడి  వూరుకోలేదు. యోగి  ఎలాంటివాడో, అవసరమొస్తే  ఎంతకు  బరితెగించగలడో  కాంచన  ఆమెకు  చెప్పివుంది. ఇప్పుడే  వస్తానని  ప్రజ్ఞకు  చెప్పి మళ్ళీ కారేసుకుని బయల్దేరింది.

    బయట  కారాగిన  చప్పుడు  విని  యోగి తలెత్తి  చూశాడు.

    ప్రతాప్  వచ్చివుంటాడు. ప్రజ్ఞను తీసుకుని. అతని కళ్ళలో  నిషా మరింత  ఎక్కువయింది.

    తలుపులు తెరవబడ్డాయి. లోపలకు  వచ్చింది ప్రతాపే. కాని అతని మొహం  పాలిపోయివుంది. యోగి దగ్గరకెళ్ళి  చెవిలో గుసగుసలాడాడు.

    కళ్ళలోంచి  నిషా  తొలగిపోయి  కోపంతో  మొహం  జేవురించింది. చేతిలోని  గ్లాసు  నేలమీదకు విసిరికొట్టి  లేచి  నిలబడ్డాడు.

    "ఈ పెళ్ళెలా  జరుగుతుందో  చూస్తాను. యోగి  అంటే  ఏమిటో తెలిసినట్లులేదు. పీటలమీద  నుంచి దాని రెక్కలు  విరిచి  యీడ్చుకొస్తాను."

    అదే సమయంలో  గది  తలుపులు  మళ్ళీ  తెరుచుకున్నాయి. తేజ  లోపల  కడుగు పెట్టింది.

    "ఎవరు నువ్వు" అనబోయి  ఆమెను  గుర్తుపట్టి "నువ్వు ధర్మారావు కూతురివి కదూ" అన్నాడు.

    తేజ తల ఊపి  తలుపులు గడియపెట్టింది.

    "ఇక్కడికి  దేనికొచ్చావు?"

    "మీ దుష్ట  పన్నాగం  నుంచి  ప్రజ్ఞను కాపాడటానికి"

    యోగి  విరగబడి  నవ్వాడు. "ఆఫ్ ట్రాల్! ఓ ఆడదానివి, నా నుంచి దాన్ని కాపాడగలవా? నీ అదృష్టవశాత్తు  నీ మీద నా కన్నింకా  పడలేదు. గానీ  లేకపోతే  యీ పాటికి నలిగి ముద్దయిపోయి వుండేదానివి. అడ్డులే" అంటూ  ముందుకు రాబోయాడు.

    "అక్కడే ఆగు" అంది  తేజ  ఖంగుమనే  కంఠంతో. ఆమె చేతిలో  పిస్టల్ నిగనిగ లాడుతూ  మెరుస్తోంది.

    "మీ ఆటలు  సాగటానికి నేనమాయకురాలయిన ప్రజ్ఞను కాను. దేనికయినా  తెగించగల  తేజను. యోగీ! నువ్వెంత  మొండివాడివో  నేనంత కన్నా మొండిదాన్ని. ప్రజ్ఞకు  పెళ్ళి తతంగం  పూర్తయేదాకా  యిక్కడ్నుంచి కదలను. అప్పటిదాకా  మీరు  చెయ్యవలసిందేమిటో  తెలుసా? అడుగు అటూ ఇటూ  కదలకుండా  ఎవరి స్థానాల్లో వాళ్ళలా వుండిపోవాలి. ఏ మాత్రం  తప్పటడుగు  వెయ్యటానికి  ప్రయత్నించినా  బులెట్  మీ గుండెల్లోంచి  దూసుకుపోతుంది  జాగ్రత్త!"

    ఆమె  హెచ్చరికలోని  కాఠిన్యాన్నీ, ఆమె  కళ్ళల్లోని  నిశితత్వాన్నీ  యోగి  గమనించాడు. ఆమె అన్నంత  పనీ  చెయ్యగల  మనిషని  అర్ధమయింది.

    నిమిషాలు  గడిచిపోతున్నాయి.

 

 Previous Page Next Page