గదిలోకి అడుగు పెట్టేసరికి తండ్రి చేతినుంచి రక్తం కారుతూ కనిపించాడు. తల్లి పిశాచిలా పిస్టల్ అతని గుండెను గురిపెట్టి నిలబడి వుంది.
"అమ్మా! అని అరుస్తూ ముందుకు పరిగెత్తి ఆమెకు అడ్డుగా నిలిచింది.
"నువ్వడ్డులే. ఇవేళ వీడి అంతం చూస్తాను" అంటూ విద్యుల్లతాదేవి కూతుర్ని ఓ తోపు తోయబోయింది.
తేజ తిరగబడింది. తల్లిని గట్టిగా వెనక్కి నెట్టి ఆమె చేతిలోంచి పిస్టల్ లాగేసుకుంది.
ఆమె వెనక్కి తిరిగి చూసేసరికి తండ్రి గదిలో లేడు.
* * *
కాంచన యింటి ముందు గదిలో యోగి మిత్రబృందమంతా సమావేశమై వుంది.
"ప్రతాప్!" అని పిలిచాడు యోగి. "పెళ్ళికి యింకా ఎంత సమయముంది?"
"మూడు గంటలు."
"ప్రోగ్రామేమిటో సరిగ్గా అంచనా వేసుకున్నావా ?"
"మధు కళ్యాణ మండపంలో పెళ్ళి ఎరేంజి చెయ్యబడింది. దయాకరే అన్నీ స్వయంగా చూసుకుంటున్నాడు. ప్రజ్ఞని పెళ్ళికూతురు చెయ్యటం తతంగమంతా దానింట్లోనే జరుగుతుంది. పెళ్ళి యింకో గంట వుందనగా పెళ్ళికూతుర్ని తీసుకురావటానికి కారు పంపిస్తాడు. ఆ కారులో డ్రైవర్ని బయటకు నెట్టి అతని స్థానంలో నేను వెడతాను. ప్రజ్ఞను కారులో ఎక్కించుకుంటాను. సరాసరి యిక్కడకు తీసుకొస్తాను. తర్వాత ..." అంటూ విరగబడినవ్వాడు ప్రతాప్.
తర్వాత ఏం జరుగుతుందో అక్కడున్న ప్రతి ఒక్కరికీ తెలుసు.
* * *
తేజ కారు డ్రైవ్ చేస్తోంది. నుదుట స్వేద బిందువులు అలుముకుని వున్నాయి.
పిస్టల్ పడవేసి వుంచిన హాండ్ బ్యాగ్ ఆమె ప్రక్కనే వుంది.
ఆ సంఘటన జరిగాక గదిలోంచి బయటకు వచ్చి తండ్రి కోసం యిల్లంతా కలయ వెడికింది. ఎక్కడా కనిపించలేదు. తిరుగుతున్నదేకాని ఆమె ఓ రకమైన షాక్ లో వున్నట్లుంది. తానేం చేస్తున్నదో తనకే తెలీని స్థితిలో వుంది.
ఒక్క క్షణం కూడా యింట్లో వుండ బుద్ధి కాలేదు.విసురుగా బయటకు వచ్చి కారులో ఎక్కి బయటకు పరిగెత్తించింది.
టైమెంతయిందో తెలీదు. స్ట్రీట్ లైట్స్ వాటి కర్తవ్యం నిర్వర్తిస్తూ వెలుగుతున్నాయి. ఎటువైపు పోతున్నదో ఆమెకే తెలీడం లేదు.
ఉన్నట్లుండి కారాపమని చేత్తో సౌంజ్ఞ చేస్తూ ఓ యువతి ఎదురుగా రావటం కనిపించింది. తేజ బ్రేక్ మీద కాలు వేసింది.
ఆ యువతి తేజ కూర్చున్న వైపుకు వచ్చి నిలబడింది. ముఖంలో ఆందోళన వ్యక్తమవుతోంది.
"క్షమించాలి. అత్యవసరమైన పని వుండి యిలా చేయాల్సి వచ్చింది" అన్నదా యువతి.
"ఏమిటది ?"
"కొద్ది సేపట్లో పెళ్ళి కాబోతున్న ఓ స్త్రీ జేవితం ఆపదల పాలు కాబోతూంది. వెళ్ళి హెచ్చరించటానికి ఎంత ప్రయత్నిస్తోన్నా వాహన,మేదీ దొరకటం లేదు, రిక్షాలో వెళ్ళటానికి టైము లేదు."
'కొద్ది సేపట్లో పెళ్ళి...' ఆమెకు ప్రజ్ఞ గుర్తుకొచ్చింది. అరె! తన పెళ్ళి విషయమే మరిచిపోయానే అని నాలిక కొరుక్కుంటూ "ఎవరా స్త్రీ?" అన్నదప్రయత్నంగా.
"ప్రజ్ఞ!"
తేజ తేలికపడింది. ఆ యువతి ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తూ "మీరెవరు? ఆమెకూ మీకు సంబంధమేమిటి?" అనడిగింది.
"నా పేరు కాంచన..." అంటూ ఆమె తొందర తొందరగా విషయాన్ని ...తేజ యింకా ఆలస్యం చెయ్యలేదు. "రండి" అని ప్రక్కకు వొంగి అటువైపు డోరు తెరిచింది.
రాఘవమ్మ కొంచెం దూరంలో గుమ్మం దగ్గర నిలబడి కూతురి వంక చూస్తోంది. ఎప్పుడూ నిర్లిప్తతతో నిండి వుండే ఆమె కళ్ళలో చిన్న వెలుగురేఖ కానవస్తోంది.
జానకిరామయ్య వున్నంతలో మంచి బట్టలు వేసుకుని తన గదిలో కూర్చుని ఉబుకుకుని వస్తోన్న దగ్గునాపుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.
బయట కారాగిన శబ్దం వినిపించి ప్రజ్ఞ తలెత్తి చూసింది. ఓ నిమిషము గడిచాక గదిలోకి ప్రవేశిస్తోన్న తేజని చూడగానే కాటుకతో చుట్టుకుని వున్న ఆమె కనులు మరింత విస్ఫారితాలయినాయి.
ప్రజ్ఞ ముఖంలో పొంగి పోతున్న తృప్తినీ, ఆనందాన్నీ తేజ గమనించింది. జరిగిందంతా చెప్పి, ఆమె మనసు పాడుచేయదల్చుకోలేదు.