దిగ్బ్రాంతితో వున్నట్లు అందరూ విగ్రహాల్లా వుండిపోయారు.
యోగిలో రక్తం పరవళ్ళు త్రొక్కి ప్రవహిస్తోంది. ఏదో చెయ్యాలి ఏదో చేసి తీరాలి.
ఉన్నట్లుండి అతని పెదవులమీద చిన్న చిరునవ్వు మెదిలింది. ఆమె వెనక తలుపు గడియ మెల్లగా పైకిలేస్తూ వుండటం అతని కళ్ళు పసిగట్టాయి.
తనకు కొద్ది దూరంలో వున్న యోగి మొహంలోని భావాన్ని తనవెనకనే తలుపు తెరుచుకుంటోన్న విషయాన్ని తేజ పసిగట్టింది. ఆమె ఒక్క క్షణం ఆలస్యం చేసినట్లయితే తలుపు తెరుచుకుని లోపలకు వచ్చిన చిన్నారావు బలంగా విసిరిన చేతి దెబ్బకు ఆమె తల పగిలిపోయి వుండేది. వాళ్ళందరిలో చిన్నారావు అతి బలాడ్యుడు. అతని చెయ్యి ఉక్కు కండరాలతో బిగించినట్లు వుంటుంది.
కాని ఆ విషయాన్ని ముందే గమనించిన తేజ మెరుపులా ప్రక్కకు జరిగి, తనమీదకు దూసుకు రాబోతున్న చిన్నారావుని చూసి ముందూ వెనుకా ఆలోచించకుండా పిస్టల్ పేల్చింది. బుల్లెట్ చిన్నారావు చేతిలోంచి దూసుకుపోయి బాధతో గిలగిల్లాడుతూ ఒక ప్రక్కకి గెంతాడు. మరుక్షణంలో తేజ మిగతా వాళ్ళకేసి తిరిగింది. "నేను తెగించి వున్నానన్న సంగతి మర్చిపోకండి. అడుగు కదిలితే గుళ్ళు మీ గుండెల్లోంచి దూసుకుపోతాయి జాగ్రత్త" అని హెచ్చరించింది.
నిమిషాలు గడిచిపోతున్నాయి.
17
పెళ్ళి చాలా నిరాడంబరంగా జరిగిపోయింది. మామూలు వివాహాల్లో జరిగే తతంగం, అట్టహాసాలు, అప్పగింతలూ ఏమీ లేవు. చాలా క్లుప్తంగా ముగిసింది.
ప్రజ్ఞ తల్లిదండ్రులు దగ్గరకొచ్చింది.
"నాన్నా! నాకు సెలవియ్యండి. దూరంగా వెళ్ళిపోతున్నాననుకోకండి. ఎక్కడున్నా మీ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూనే వుంటాను" అన్నది తండ్రి కాళ్ళకు దణ్ణం పెట్టాక.
జానకిరామయ్య మౌనంగా ఆశీర్వదించి కళ్ళొత్తుకుంటున్నాడు.
"అమ్మా!" అంది తల్లి దగ్గరకొచ్చి నిలబడి.
రాఘవమ్మ కూతురి ముఖంలోకి చూసింది. ఒక్క క్షణం...ఒక్క క్షణం మాత్రం యీ అద్భుతమైన స్త్రీ తన కూతురేనా అనిపించింది. అంతలో ఆమె మామూలు మనిషయిపోయింది. ముఖంలో ఏ భావమూ వ్యక్తం కావటం లేదు.
"నువ్వు నా తల్లివి. ఆశీర్వదించమ్మా!" ఆమె పాదాలమీదకు వొంగింది.
దేవుడు, శుభ ముహూర్తాలు, పవిత్ర మంత్రాలు, అక్షింతలు, ఆశీర్వాదాలు...
వీటి ఫలితాలు చూసి చూసి విసిగిపోయి వున్న మనిషి. ఆమె చెయ్యి ప్రజ్ఞ తలమీద కదిలింది. అంతే!
ప్రజ్ఞ అంతకన్నా ఆశించలేదు కూడా. తలిదండ్రుల్ని విడిచిపెట్టి భర్త వెంట వెళ్ళిపోయింది.
* * *
కాంచన గదిలో భయంభయంగా మంచంమీద కూచుని వుంది. యోగి ఆమె దగ్గరకొచ్చాడు.
"కాంచనా! నువ్వు కొన్ని నాటకాల్లో వేశావనీ, ఏ పాత్ర నయినా సహజంగా నటించగలవనీ నాకు తెలుసు. ఈ వ్యవహారంలో ఓ సపోర్టింగ్ క్యారెక్టర్ గా నీ పాత్ర గొప్పగా నిర్వహించావు"
ఆమె బెదిరే కళ్ళతో అతని వంక చూసింది.
"కాంచనా! నేనంటే నీకు నిజంగా భయం వున్నదా?"
అతని మాటల్లో వ్యంగ్యం వున్నా యోగి అంటే కాంచనకు విపరీతమైన భయం. కొందరు వ్యక్తుల్లో వాళ్ళ కళ్ళల్లో, వారి మాటల్లో యితరులకు భయం కలిగించే శక్తి వుంటుంది.
కాంచన జవాబివ్వలేదు. ఆమె శరీరమంతటా చిన్న వణుకు ప్రవహిస్తోంది.
"అంత భయపడి చచ్చేదానివి యింత సాహసకార్యం ఎందుకు చేశావు?"
కాంచన మాట్లాడకుండా బిక్కు బిక్కుమంటూ చూస్తోంది.
"నువ్వు చేసిన పనికి శిక్ష ఏమిటో తెలుసా?" అంటూ ఆమె దగ్గరకు వచ్చాడు.
"ఎవతెని నేను ఓ ఆటబొమ్మగా ఉపయోగించుకుందామనుకున్నానో ఆ మనిషిని యింట్లో వదిన రూపంలో తిరుగుతూ, నా అన్న కౌగిలిలో నలుగుతూ వుంటే అనుక్షణం నలిగి నశించే స్థితిలో నన్ను పెట్టినందుకు శిక్ష ఏమిటో తెలుసా?"
జేబులోంచి చిన్న నైఫ్ తీశాడు. బటన్ నొక్కగానే సర్రున తెరుచుకుంది.
కాంచన మొహం పాలిపోయింది. "వొద్దు" అందామనుకుంది. కాని నోట్లోంచి మాట బయటకు రాలేదు.


