"అలాగా?" ఆశ్చర్యంగా అన్న పరమేశ్వరి లలిత ముభావాన్ని చూసి ఆగిపోయింది. లలిత ప్రసూనను ఉద్దేశించి "సుశీల కూడా నీతో వచ్చేదా?" అంది......
"లేదు-తను సాయంత్రం వేళ......"
ప్రసూన ఆగిపోయింది.....
"నీకూ తెలుసా?"
ప్రసూన తెలుసు నన్నట్టు తల ఊపింది___
"మరి ఎందుకు చెప్పలేదు?"
"ఏమని చెప్పను? ఎవరికి చెప్పను? పైగా ఇంత దారుణం జరుగుతుందని నేను అనుకోలేదు. సుశీల శేఖర్ తో వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న సంగతి కూడా నాకు తెలియదు."
సుశీలను తలచుకుని ప్రసూన కళ్ళు చెమ్మగిల్లాయి...లలిత తట్టుకోలేక చేతులతో ముఖం కప్పుకొని కుమిలి పోయింది.
ప్రసూన దగ్గరగా వెళ్ళి "అమ్మా!" అని ఓదార్చబోయింది. లలిత చటుక్కున ప్రసూన చేతిని తొలగించింది. "నన్ను క్షమించు నేను నిన్ను అభిమానించలేను. నాకు దూరంగానే ఉండు-"
ప్రసూన చాలా బాధ పడింది.....
"నేను చేసిన తప్పు ఏమిటో చెపుతారా?"
"ఒక్కొక్కసారి మనం చెయ్యని తప్పులను కూడా మనం బాధ్యత వహించవలసి వస్తుంది"
"ఏకలవ్యుడికి ద్రోణాచార్యుడిలాగా మీరు నాకు పరోక్షంగా గురువులాంటి వారు. సుశీలకు మీరంటే ఎంతో ఆరాధన చిన్నప్పటినుండీ అమ్మ ఇలా అంది-అమ్మ అలా అంది-అని చెప్పేది-నాకు మీరంటే మొదటనుంచీ అలాంటి ఆరాధనా భావమే కలిగింది. ఒకసారి నేను వంటినిండా నగలు పెట్టుకొని వచ్చాను- సుశీల అమ్మకు ఇలా నగలు పెట్టుకోవటం ఇష్టం లేదు అంది. తర్వాత ఎప్పుడూ నేను వెర్రిగా నగలు పెట్టుకోలేదు "అమ్మ ఎప్పుడూ చదువు కొంటూ ఉంటుంది-" అంది సుశీల. ఆ రోజునుండీ నేను మంచి మంచి పుస్తకాలు చదవటం మొదలుపెట్టాను - అలా అలా నాకు తెలియకుండానే మీ అడుగుజాడలను అనుసరించటం నేర్చుకున్నాను.
లలిత నిట్టూర్చింది......
సుశీలకు తనంటే ఎంతో ఆరాధన-నిజమే కానీ తండ్రి నుండి కొన్ని కొన్ని బలహీనతలు కూడా వచ్చాయి-తండ్రి గారాబం వాటిని మరింత పెంచింది. తను ఏమీ చెయ్యలేని నిస్సహాయురాలైపోయింది - ఒక మంగళ సూత్రం .... ఈ సామాజికాచారం .... స్త్రీని ఎన్ని విధాలుగా బందీని చెయ్యగలదు? "ప్రసూనా! నీలో ఏదో లోపమున్నదని కాదు! కాని" ఆగిపోయింది లలిత.....
"ఎవరి తప్పులకు నన్ను బాధ్యత వహించమంటున్నారు?"
"నీ తల్లిదండ్రుల దోషాలకు-ఈ శాపం నీకు తప్పదు!" రాదమ్మా, హరి, ప్రసూన కళ్ళముందు కదిలారు. అక్కడ ఉండలేక వెళ్ళిపోయింది.
పరమేశ్వరి చాలా నొచ్చుకుంది-
"లలితా! నువ్వుకూడా తల్లిదండ్రులు చదువుసంస్కారము లేని వాళ్ళని అమాయికురాలిని నిరసిస్తున్నావా?"
"నీకు అర్ధం కాదు పరమేశ్వరీ! అర్ధమయ్యేలా నేను వివరించలేను. ఈ విష్యం వదిలెయ్యి."
లలిత ముఖంలో ఆవేదన చూసి పరమేశ్వరి ఇంకేమీ మాట్లాడలేకపోయింది.
ప్రసూనను కలుసుకోవటానికీ ఏదో ఒక వంకతో కూలిపేటకు వస్తున్నాడు మోహన్. ప్రసూనను చూడగానే అతని ముఖం వికసించింది......మోహన్ కనపడగానే ప్రసూన కూడా ఒక్కక్షణం తన చికాకులన్నీ మరిచిపోయింది.
"మీరింక ఇక్కడికి రారేమో అనుకున్నాను."
ప్రసూనతో అన్నాడు మోహన్
"ఏం?"
"మీరు సాంబశివంగారి ఇంట్లోఉన్నారని విన్నాను......"
ఈ విషయంలో సూటిపోటి మాటలు విని ప్రసూన మనసు బండబారి పోయింది......ఎంత చిన్నదయినా సరేసమాజాన్ని ఎదిరించి ఒక పనిచెయ్యటం మాటలు కాదు.....అందులో ఇలాటి వ్యవహారాలను సమాజం అసలు వదిలిపెట్టదు.
"మీరు విన్నది నిజమే"
"అక్కడెందుకున్నారు."
"ఆయన ఉండమన్నారు."
ఆ సమాధానాలు భరించలేకపోయాడు మోహన్.
"ప్రసూనా? నువ్వు అతని దగ్గిర ఉండవలసిన అవసరం లేదు. వచ్చెయ్యి"
"అవసరం ఉందో లేదో మీరు ఎలా చెప్పగలరు?"
"నాకు సహాయం చెయ్యటానికి అక్కడ ఉండక్కర్లేదు"
"అందుకు మాత్రమే నేను అక్కడ ఉండటం లేదు......"
"మరి నిన్ను నిర్భందించే శక్తి ఏమిటో తెలుసుకోవచ్చా?"
"నిర్భంధమా? అలాంటిదేమీ లేదే, నేను నా ఇష్ట ప్రకారమే అక్కడ ఉంటున్నాను."
"ఐ సీ" వెటకారంగా నవ్వాడు మోహన్.
"హమ్మయ్య! అర్ధమయిందా?" నవ్వింది ప్రసూన.