Previous Page Next Page 
నిరాశలో నిండు గుండె పేజి 49

   
    "ఉంటాను సార్!" అప్రయత్నంగా అనేసింది ప్రసూన.....    
    "థాంక్యూ వెరీమచ్! అమ్మాయి! నువ్వున్నావు! నాకు నువ్వున్నావు!"    
    అపురూపమైన పెన్నిధిని తలచుకొని ఆనందిస్తున్నట్లు అన్నాడు సాంబశివం___    
    తన మాటలకు తనే ఆశ్చర్యపోయింది ప్రసూన.    
    ఇదేమిటి? సాంబశివంతో ఉంటానని తను ఎందుకు ఒప్పుకుంది?    
    అతని స్థితి ఎంతో దయనీయంగా ఉంది. అంతమాత్రం చేత తాను దయచూపించాలా? దయచూపించే పరిస్థితేనా ఇది? కాదు. దయలేదు. అంతకు మించిన శక్తి ఏదో తనను కదిలించి వేస్తోంది. కఠినంగా ఉండటం తన వశం కాకుండా చేస్తోంది.    
    "నేను సంపాదించిందంతా సగం సుశీల పేరు మీదనే ఉంచాను. అదంతా శేఖర్ కుటుంబాన్ని విదేశాలకు తరలించటానికి ఉపయోగపడింది. మిగిలింది ఈ ఇల్లు. దీనికి నేను చెప్పించుకున్న మూల్యం ఎంతో తెలుసా? జీవితం! నా జీవితంలో వెలుగు నా సుశీలను నేనే ఆహుతి చేసుకున్నాను. నా సుశీల నాకు మళ్ళీ  వస్తుందా? ఏదైనా ఇస్తాను. ఎంతైనా ఇస్తాను. నా సుశీలను మళ్ళీ నాకిస్తారా ఎవరైనా?"    
    సాంబశివం అలా కుమిలిపోతోంటే చూడలేక పోయింది ప్రసూన. "బాధపడకండి!" అంటూ భుజంమీధ చెయ్యి వేసింది. ఆ చేతిని ఆప్యాయంగా అందుకున్నాడు సాంబశివం.    
    "నన్ను వదలకు ప్రసూనా! ప్లీజ్ నన్ను వదలకు! నేను బ్రతకలేను." అన్నాడు మళ్ళీ ప్రాధేయపడుతూ.    
    "వదలను."
    
                                       22
    

    సాంబశివం ధోరణి పూర్తిగా మారిపోయింది- బయట నలుగురిలో గంభీరంగా నెట్టుకొస్తున్నా లోలోపల అతనెంతగాక్రుంగిపోతున్నాడో అర్ధంచేసుకోగలిగినది ప్రసూనఒకర్తే! ప్రసూన కనిపెట్టి కాఫీ ఫలహారాలిస్తే తీసుకుంటాడు..... విపరీతంగా త్రాగుతాడు. భోజనానికి రమ్మంటే వస్తాడు లేకపోతే అలాగే ఉండిపోతాడు. విపరీతంగా త్రాగుతాడు. ప్రసూన మందలిస్తే కొంచెంసేపు త్రాగకుండా ఉంటాడు. ప్రసూన కాస్త కనుమరుగు కాగానే మరింత తాగుతాడు.    
    తాగినప్పుడు ఏదో ఏదో మాట్లాడుతాడు -    
    "సుశీ! నిన్ను చూసుకొని మురిసిపోయేవాడిని. నీలాంటి కూతురికి తండ్రి కాగలిగిన నా అదృష్టాన్ని తలుచుకుని తలుచుకుని గర్వపడేవాడిని..... 'నేనొక పెద్దయింటికి యజమానిని. లలితలాంటి భార్య, సుశీలలాంటి కూతురు-' అని మనసారా పదే పదే అనుకునేవాణ్ని - నేను సంపాదించి నీకు సర్వసుఖాలు అమర్చాలని అనుకునేవాణ్ని- నువ్వు వెళ్ళి పోయావు- ఏం చెయ్యగలను? ఎలా తెచ్చుకోగలను నేను నిన్ను?"    
    ఇవేమాటలు మళ్ళీ మళ్ళీ-అనే వాడు-తనను ఎవరూ చూడనప్పుడు తలగడలో తల దాచుకుని కుమిలికుమిలి ఏడ్చేవాడు- ప్రసూనతో రోజు కొకసారయినా "నన్ను విడిచి వెళ్ళవుకదూ!" అనేవాడు, దీనాతిదీనంగా- దయనీయంగా .....    
    "వెళ్ళను!" అనేది ప్రసూన కన్నీళ్ళతో.    
    సాంబశివాన్ని చూస్తోంటే తనకు తెలియకుండానే ఎందుకలా కరిగిపోతుందో ప్రసూన అర్ధం చేసుకోలేకపోతోంది- సుశీల చచ్చిపోవటం, లలిత వెళ్ళిపోవటం ..... ప్రసూనను గురించి అందరూ రకరకాలుగా చెప్పుకోసాగారు -- ఎవరు ఏమనుకున్నా సాంబశివాన్ని వదలి రాదలచుకోలేదు ప్రసూన......తను కూడా వచ్చేసిన మరుక్షణం సాంబశివం ఏమయిపోతాడో ఊహించుకో లేకపోతూంది__వారం రోజుల తర్వాత పరమేశ్వరి దగ్గిరకు వచ్చింది ప్రసూన. అక్కడ లలిత కూడా ఉంది-లలితను చూసి ప్రసూన ఎంత ఆశ్చర్యపోయిందో ప్రసూనను చూసి లలిత కూడా అంతే ఆశ్చర్యపోయింది.    
    పరమేశ్వరి ప్రసూనను లలితకు పరిచయం చేసింది. "ఈ అమ్మాయి ప్రసూన నాకు కుడిభుజంలా పనిచేస్తుంది. ఇదివరకు ఇంచుమించు రోజూవచ్చేది. ఈ మధ్యనే వారం రోజులుగా రావటంలేదు. నాకు నచ్చిన వ్యక్తి." లలిత ముభావంగా "నాకు తెలుసు__" అంది.

 Previous Page Next Page