తల్లి ఏదో సంగతి మనస్సులో పెట్టుకుని బాధపడుతోందని సరోజిని గ్రహించింది. తనకు తెలియని రహస్యాలు తల్లిదగ్గర ఎలా దాగాయి? ఆమె ఆశ్చర్యచకితురాలయింది. తల్లి తప్పకుండా ఏదో దాస్తుంది. చెప్పమని బ్రతిమాలుకుందామనుకుంది. కాని ఆమె బాధపడుతుందేమో ఆమె ఏమీ కనిపెట్టనట్లు ఉదాసీనంగా "నేనేమీ ఆశలు పెట్టుకుని జీవించటంలేదమ్మా ఎప్పుడో నిశ్చయానికి వచ్చాను. కానీ...కలతమ్మా-కొన్నాళ్ళపాటు వుంటుంది" అంది.
తల్లి గుండె కలుక్కుమంది. కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. "పిచ్చి తల్లీ, చిట్టితల్లీ" అని కూతుర్ని దగ్గరగా లాక్కుంది.
తల్లి కౌగిట్లో సరోజిని పిట్టలా ఒదిగి అలా దుఃఖంతో కాసేపు మౌనంగా నిలబడింది. తరువాత మృదువుగా విడిపించుకుని స్నానానికి వెళ్ళిపోయింది.
రాధమ్మగారు మ్లానవదనంతో అలానే నిలబడింది. "ఎట్లా చెప్పను? ఈ విషయం నీకు ఎట్లా చెప్పను?" అని గింజుకుపోయింది.
* * *
ఆ ఊళ్ళో నదిలేదు. బ్రహ్మాండమైన చెరువుంది. సాధారణంగా అందులో నీళ్ళు నిండేవుంటాయి. ఇప్పుడా చెరువుగట్టు వెంబడే నడుస్తోంది సరోజిని చెల్లెల్ని వెంటబెట్టుకుని. అట్లతద్దినాడు రాత్రి గోరింటాకు పెట్టుకుని చీకటితో లేచి స్నేహితురాళ్ళందరూ యీ చెరువులోకి వచ్చిపడి ఆ నీటిలో గోరింటాకు కడిగేసుకునేవారు. అలా కడుక్కోవాలట. మరి నదిలేదుగా. ఈ చెరువే శరణ్యం. ఉదయ సూర్యుని కిరణాల వెలుగులో చేతులు ఎంత ఎర్రగా పండాయో అని చిత్రంగా చూసుకునేవాళ్ళు. తరువాత ఉయ్యాల. ఆకాశమంత ఎత్తున ఇప్పుడా సరదాలన్నీ పోయినాయి. అసలు ఎవరున్నారు గనుక? తనకైతే పదిహేడేళ్ళు వచ్చినా పెళ్లికాలేదు కానీ, చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుని కాపరాలకు వెళ్ళి పోయారు. పిల్లల్నికూడా ఎత్తుకున్నారు. తరువాత మళ్ళీ కలుసుకుంటారో లేహో ఎప్పుడైనా అసలు పూర్వస్మృతులు వుంటాయో వుండవో చెప్పటం కష్టం. ఆమె మనసు కల్లోలితమైంది. చిత్రమైన జీవితాలు! అవును, చిత్రంగా వుండటం జీవితానికి సహజమే.
మాఘమాసం అది. ఊరికి ఎనిమిది మైళ్ళదూరంలో సముద్రానికి కొందరు చీకటితోనే బళ్లమీద స్నానానికి పోయి వస్తున్నారు. ఏదో తెలియని కోలాహలం, ఉత్సాహం తాండవిస్తోంది.
సరోజిని గుడికి పోయేసరికి పూజారి అప్పుడే తలుపులు తెరుస్తున్నాడు. అప్పటికీ ఒకరిద్దరు మనుషులు అక్కడికి వచ్చి చేరారు. దేముడి దర్శనం చేసుకుని, కుంకుమ తీసుకుని, చెల్లెలు చెయ్యి పట్టుకుని బయటకు వస్తోండగా స్నేహితురాలు విమల ఎదురుగా వచ్చింది.
సరోజిని సంభ్రమంతో "ఎప్పుడొచ్చావ్ విమలా?" అని పలకరించింది చెయ్యి పట్టుకుని.
విమల, తన సహజమైన సన్నని కంఠంతో "రెండు రోజులైంది వచ్చినరూ" అంది.
"ఒసేవ్ పెళ్ళవంగానే పాత స్నేహితుల్ని అంత మరచిపోవాలిటే? రెండు రోజులైతే మా ఇంటికి రాకుండా...అవునులేవే నీకు మేము కనిపిస్తామా? ఆఫీసరుగారి భార్యవాయె" అన్నది సరోజిని నిష్టూరంగా.
సిగ్గుతో విమల చెక్కిళ్ళు గులాము చల్లినట్లుగా అయినాయి. "అదికాదే. ఈ రెండురోజులూ మా అమ్మ నన్ను ఎక్కడకూ కదలనివ్వలేదు. పైగా ఇంటినిండా చుట్టాలు. వీలు చూసుకుని యివాళో రేపో వద్దామనుకుంటున్నా" అంది.
సరోజిని స్నేహితురాలి ముఖంవంక తనివితేరా చూస్తూ "దేనికైనా అదృష్ట ముండొద్దూ?" అంది.
"అదేమిటేవ్?" అంది విమల.
"ఆవేళ నిన్ను చూట్టానికి రాలా ఆ అబ్బాయి. పాపం ఆ అబ్బాయిని గురించి చెబుతున్నాను. ఈ బంగారుతీగెను అతను దక్కించుకోలేకపోయాడే అని..."
సిగ్గుతో విమల ముఖం అరుణరాగరంజితమైంది "పోవే" అంది.
`
సరోజిని స్నేహితురాలి చెయ్యినొక్కి "మధ్యాహ్నం మా ఇంటికి రావే విమలా" అంది.
ఆ అమ్మాయి కొంచెం ఆలోచించి "ఇవాళ కాదు రేపు వస్తాను. అవును గానీ నీకెప్పుడు రక్షాబంధం" అంటూ నవ్వింది.
సరోజిని కొంచెం ఆశ్చర్యపడి "ఓహో! చాలా మాటలు చేర్చావే! అవునులే ఆఫీసరుగారి....నిజమే అది రక్షాబంధమే. రేపు వచ్చినప్పుడు చెబుతాను" అని ఆమె చెయ్యి విడిచిపెట్టి "పదవే సీతా!" అని బయలుదేరింది.
"ఇంటికేనా అక్కా!" అనడిగింది సీత గుడి బయటకు వచ్చాక.
"కాదు అటు" అంటూ ఆమె చేయెత్తి దక్షిణ దిశవైపు చూపించింది. అటు ఓ ఫర్లాంగు నడిస్తే ఇహ ఊరులేదు. అంతా యిసుకబయలు. అంతూ పొంతూలేని ఎడారిప్రదేశం అక్కడికిపోతే ఏ దిగంతాలకవతలనో వున్నట్లుంటుంది. చాలా రోజులైంది సరోజిని ఆ చాయలకు పోయి. ఇవాళ చెల్లెల్ని తీసుకుని, అక్కడికి చేరుకుంది.
సూర్యుడు కొంచెం పైకి ఎగబ్రాకాడు. అరుణకిరణాలు వాళ్ళిద్దరి లేత శరీరాలకు చురుగ్గా తాకుతున్నాయి. ఎటుచూసినా మనిషి జాడలేదు. ఆ యిసుకలో కాళ్ళు కాల్తున్నాయి.
"సీతా! నేను పరుగెత్తుతాను-నన్ను అందుకుంటావూ?"
"ఓ!"
సరోజిని పరుగెత్తసాగింది. లేడిలా ఛంగుఛంగున ఎగురుతూ రివ్వున పరుగెత్తసాగింది. ఆమెలో ఎందుకో ఉత్సాహం కట్టలు తెగి ప్రవహిస్తోంది. ఈ పరుగే జీవితానికి లక్ష్యం అయితే?
సీతకు ఆయాసం వస్తోంది. ఎంతదూరం పోయినా అక్క పరుగుని అందుకోవటం కష్టంగావుంది. "అక్కయ్యా! ఆగవే. నేను ఇంక రాలేను" అంది జాలిగొలిపే కంఠంతో. సరోజినికి ఈ మాటలు వినబడలేదు. సీత అలసిపోయిన శరీరంతో ఆగిపోయి "ఆగిపో అక్కయ్యా!" అంటూ అరిచింది కొంచెం గట్టిగా సరోజిని విన్నది. వెంటనే ఆగిపోదామని అనుకుంది కానీ ఆ వేగంతో మరికొంచెం దూరంపోయి హఠాత్తుగా అక్కడున్న పెద్ద గోతిలో పడిపోయింది. సీత ఈ దృశ్యంచూసి కెవ్వున అరుస్తూ పరుగెత్తుతూ ముందుకువచ్చి అంచున నిలిచి "అక్కా!" అని కేక వేసింది ఏడుస్తూ.
ఎందునిమిత్తమో అక్కడంత పెద్ద గొయ్యి త్రవ్వారు. అందులోకి దొర్లుకుంటూ పడిపోయింది సరోజిని. కానీ ఆమెకు దెబ్బ తగల్లేదు లేచి నిల్చుని, తల పైకెత్తిచూసి 'భయపడకు సీతా!' అంది.
"నువ్వు పైకి ఎలా వస్తావ్?" అనడిగింది సీత దీనంగా.
పైకి రావటం కొంచెం కష్టమైన పనే. ఎందుకంటే ఎక్కటానికి ప్రయత్నిస్తే క్రిందకు యిసుక రాలిపోతుంది. కాళ్ళు జారిపోతాయి.
సరోజిని ఆలోచిస్తూ స్తబ్దుగా ఓ నిముషం నిల్చుంది. తను ఎందుకిలా నిల్చుంది? ఎందుకిలా పరుగెత్తింది? ఎందుకిలా పడిపోయింది? ఆమె విచలితురాలయింది.
"త్వరగా పైకి రా అక్కా" అని పిలుస్తోంది.
చాలా కష్టం మీద సరోజిని పైకి ఎక్కివచ్చింది. ఆమె ఒళ్ళంతా ఇసుక అయిపోయింది. చెల్లెల్ని గట్టిగా కౌగలించుకుని 'భయమేసిందా సీతా?' అంది.
సీతకు మాట రాలేదు. అక్కగారి పమిటచెంగుతో కళ్ళు తుడుచుకుంది. 'పద సీతా!' అంది సరోజిని. ఇద్దరూ ఒకరినొకరు కలసి నడవసాగారు.
"అక్కా! ఆ పువ్వులేమిటి?" అనడిగింది సీత. ఒకచోట భూమికి ఒక అడుగు ఎత్తులో మొలిచిన చిన్న మొక్కకు పూచినా పువ్వులవంక చేయెత్తి చూపిస్తూ.
సరోజిని వాటిని నిదానించి చూసింది - అవి 'ఎడారి పువ్వులు' అన్నది విచలిత కంఠంతో.
* * *
మధ్యాహ్నం రాధమ్మగారు భాగవతం పుస్తకం ముందేసుకుని మధ్యగదిలో కూర్చుంది. కానీ ఒక్కపద్యంకూడా ముందుకు సాగటంలా. తన అన్న రాసిన ఉత్తరమే చీటికిమాటికీ గుండెలో మెదుల్తోంది. చదువుకున్నవాడు, ఇన్నాళ్ళబట్టీ బస్తీలో వుంటున్నాడు - ఎప్పుడో జరిగిన విషయాన్ని గురించి యింత సంకుచిత భావాలు కలిగి వుంటాడనుకోలా. అదికూడా తను చేయని తప్పు, ఎప్పుడో కాలగర్భంలో కలసిపోయిన సమాచారం. ఆ ప్రమేయమే గుర్తులేదు తనకు. అది మనసులో ఉంచుకుని, ఈ మతిలేని పట్టింపులతో దారుణంగా ప్రవర్తిస్తున్నాడా అన్నయ్య?
"అమ్మా!" అంది కూతురు గుమ్మంలో నిలబడి.
రాధమ్మగారు పుస్తకంనుంచి తలెత్తి 'ఏం సరూ?' అంది.
"ఏం చదువుతున్నావమ్మా?"