Previous Page Next Page 
మంచు పర్వతం పేజి 48

   

      బయట పెద్దగా వర్షం పడుతోంది. కిటికీ పక్కగా విరబూసిన నందివర్ధనం మీద నీతి చుక్కలు కిందకి వెన్నెల బిందువుల్లా జారుతున్నాయి. పక్కనే అరటి ఆకులమీద నీళ్ళు జరీదారాల్లా జాలువారుతున్నాయి. కిటికీ పక్కనే కూర్చుని ఆ మొక్కలను గమనిస్తోంది భార్గవి. గాలి విసురుకు అప్పుడప్పుడు వర్షం నీరు లోపలకు కారుతోంది. అయినా ఆమె కదల్లేదు.
   
    భార్గవి కెందుకో చిన్నతనం గుర్తొచ్చింది. వర్డ్స్ వర్త్ గుర్తొచ్చాడు. "ఓ అడవి పువ్వు... గాలికి ఎగురుతూ, గుండె లోతుల్లో వున్న కన్నీటిని పైకి చిమ్మే ఆలోచనలను నాలో రేకెత్తిస్తుంది. దాంతో ఓ కావ్యం రాయగలను" అంటాడో చోట అదే భావంతో 'లూసిగ్రే' వ్రాశాడు. "ఈ రోజు నాగుండెలోకి చొచ్చుకుపోయి శోధిస్తే ఏమని వ్రాస్తాడు? నా బాధను, అర్ధం చేసుకోగలడా? నా ఆలోచనా విధానాన్ని మెచ్చుకుంటాడా? అనుమానమే -" అనుకున్నది భార్గవి.
   
    దూరంనుంచి ఒక పాట.
   
    "మాతృత్వం లోనే వుంది ఆడజన్మ సార్ధకం అమ్మా అనిపించుకొనుటె స్త్రీ జాతికి గౌరవం" మగవాడి స్వరంలో ట్రాన్సిష్టరులోంచి పాట వినిపిస్తోంది. మహిళ లెందుకు యిలాంటి పాటల్ని నిరసించరు? బ్యాన్ చేయమని అడగరు? పిల్లల్ని కననంత మాత్రాన అది స్త్రీ జన్మ కాదనే హక్కు ఎవరికుంది? మరి ఇప్పుడు లోపం శ్రీరామ్ లోనే వుందని డాక్టర్లు నిర్దారించారు.
   
    ఈ సమాజపు రీతులు ఎంత గమ్మత్తుగా వుంటాయి?
   
    మరి సోకాల్డ్ మాతృత్వం కోసం తను ఇంకో పురుషుడిని కలిసినా ఆర్టిఫిషియల్ ఇన్ సెమినేషన్ కోరినా ఈ సమాజం ఏమంటుంది? "బరి తెగించింది" అని తిడుతుందా?
   
    అయినా తన భర్తని దారిలోకి తీసుకురావటానికి తనెన్ని విధాల ప్రయత్నించింది!! ఉపవాసాలు చేసింది. ఏడ్చింది, కోపంతో బెదిరించింది. ఒక వేశ్య విటుల్ని ఆకర్షించడానికి చేసే ప్రయత్నాల్నీ చేసింది. భర్తని దారిలో పెట్టుకున్నందుకు అందరూ పొగుడుతారు. కానీ తనమీద తనకు అసహ్యం వేస్తూంది. ఇంతేనా దాంపత్యం అంటే? ఎడ్జెస్ట్ అవటం... పరస్పర మెచ్చుకోళ్ళు- లేదా తిట్టుకోవటాలు - మారటాలు-మార్చుకోవటాలు.
   
    ఒకర్నొకరు అర్ధం చేసుకుంటూ- ఒకరి ఆశయాలు ఒకరు గౌరవిస్తూ దాంపత్యం చేయడం ఈ రోజుల్లో సాధ్యమేనా? ఎవరి ఆనందాన్ని వాళ్ళు పొందే అవకాశం వున్నప్పుడు ఎదుటి వాళ్ళని త్యాగం చెయ్యమనడం ఎంతవరకు సమంజసం? లేక త్యాగంలోనే ఆనందం వుందా స్త్రీకి.
   
    ఏది ఏమైనా 'నటన' లేకుండా జీవించగలిగేవారు ధన్యులు. అడ్జస్ట్ మెంటుతో సుఖపడే జెవెఇథమ్ రసదాయకం ఎలా అవుతుంది? ఈ ప్రపంచమే ఓ నాటకరంగం అన్న షేక్ స్పియర్ మాటలు ఎంత అనుభవపూర్వకమైనవో! 'నా పాత్రను నేను సముచితంగా నటించాను' అన్న తృప్తి తప్ప 'నా జీవితాన్ని నేను ఆనందంగా అనుభవించగలిగాను' అన్న సంతృప్తి ఎంతమందిలో కలుగుతుంది?
   
    భార్గవికి అనూరాధ గుర్తొచ్చింది.
   
    'ఎలా వున్నావు అనూ? నీ ఉత్తరంతో నా జీవితాన్ని సరిదిద్దుకున్నాను. కాని నీ గురించి ఏమీ చెయ్యలేకపోతున్నాను' అనుకుంది బాధగా. అనూరాధని చూడాలనిపిస్తోంది. ఆ భావుకత్వం - ఆ లేతదనం ఇంకా వున్నాయా? అనుభవాల కొలిమిలో కాలిపోయినా మనసు అడుగున వుండే వుంటాయి. ఏప్రిల్ మాసం వచ్చింది. వాళ్ళు అనుకున్నరోజు రావటానికి ఇంకా మూడురోజులు టైముంది.
   
                                 6
   
    రైలు సికింద్రాబాద్ స్టేషన్ లో ఆగింది. చాలా ఎగ్జయిటింగ్ గా వుంది భార్గవికి.
   
    ఆటో పబ్లిక్ గార్డెన్ మీదుగా వెళుతుంటే ఆ రోజులు గుర్తొచ్చాయి. నలుగురూ సరదాగా వచ్చి అక్కడ గడుపుతుండేవారు. వైజయంతి ఇల్లు అక్కడకు దగ్గరలోనే వుండేది. టాంక్ బండ్ మీదుగా షికారుగా వెళ్ళేవాళ్ళు. ఆ రోజులు గుర్తొస్తుంటే మళ్ళీ పదిహేనేళ్ళు చిన్న అయిపోతే బావుండుననిపిస్తోంది. ఈ పదిహేనేళ్ళ జీవితంలో ఎన్నో మలుపులు, ఎంతోమంది కొత్త పరిచయస్తులు అయినా ఆనాటి హాస్టల్ జీవితం, ఆ స్నేహితులు జీవితాంతం గుర్తుండే తీపిగురుతులు.
   
    హోటల్లో గది తీసుకున్నారు. శ్రీరామ్ స్నానం చేసి బ్యాంక్ హెడ్డాఫీసుకి పోయాడు. ఇంతదూరం వచ్చింది గాని యిప్పుడు అనూరాధ దగ్గర కెళ్ళాలంటే సందిగ్ధం. కొద్ది రోజులాగితే చాలు అందరితో పాటు కలవవచ్చు. ఇప్పుడే కలిస్తే అప్పుడు ఎగ్జయిట్ మెంట్ వుండదసలు. ఈ ఆలోచన రాగానే మళ్ళీ ఆలోచనలో పడింది. కిందకు వెళ్ళి చుట్టుప్రక్కల షాపులన్నీ తిరిగి చూసింది. మనసు నిలకడగా లేదు. మళ్ళీ వచ్చి ఆపరేటర్ కి రాధ ఆఫీసు పేరు చెప్పి కనెక్షన్ యివ్వమంది. అది రింగయ్యేవరకు మళ్ళీ ఆలోచన, అలజడి రాధ లేకపోతే బావుండును. 'హు' వుండాలి. కనీసం ఫోన్ లోనయినా మాట్లాడాలి.
   
    ఫోన్ రింగయింది. వణుకుతున్న చేతులతో తీసింది.
   
    "ఎవరు కావాలండీ!" అడుగుతున్నారు అవతలివైపు.
   
    "రాధ, అనూరాధ".
   
    "ఒక్కనిముషం".
   
    ఆ ఒక్క నిమిషం ఓ యుగంలా గడిచింది.

    "హలో ఎవరు?" అటువైపు రాధ స్వరం.
   
    పదిహేనేళ్ళ తర్వాత వింటున్నదా స్వరాన్ని ఆమె చెయ్యి కంపించింది.
   
    "ఎవరో చెప్పుకో చూద్దాం!" గంభీరంగా అంది.
   
    "ఎవరు, సునీతా?

    "సునీత ఎవరు నీ కాలేజిమేటా?" నవ్వింది.
   
    "ఓ భార్గవీ!" సంభ్రమంగా అంది రాధ.
   
    "భలే గుర్తుపట్టేశావే".
   
    "వెంటనే గుర్తుపట్టలేదు. కానీ ఆ కంఠంలో జీర కనిపెట్టేశా. అది సరే ఎప్పుడొచ్చావ్, ఎక్కడున్నావ్?"
   
    "హోటల్లో - అంతా వివరంగా చెప్తాగానీ, నేను యిప్పుడే నిన్ను చూడాలి. నన్ను రమ్మంటావా, నువ్వు వస్తావా?"
   
    రాధ నవ్వింది. "మనం కలుసుకునే తారీకు ఇంకా రెండు రోజుల ముందుంది".
   
    "నిన్ను ముందు కలుసుకోవాలి. తరువాత అందరం కలుద్దాం-" ఆత్రంగా అంది భార్గవి.
   
    కానీ అనూరాధ వప్పుకోలేదు. ఫోన్ లోనే సంభాషణ సాగింది.
   
    "పిల్లలను తీసుకు రాలేదా?" అట్నుంచి రాధ అడిగింది.
   
    "నాకు పిల్లలు లేరు!" భార్గవి కంఠంలో కాసింత దిగులు.
   
    కొంచెం సేపు నిశ్శబ్దం.
   
    "ఇంకా మీ వారిలో మార్పు రాలేదా అనూ! నాకింత పాఠం చెప్పిన దానివి ఆయనలో మార్పు తేవడానికి ప్రయత్నించలేదా?" భార్గవి అడిగింది.

    "ప్రయత్నం చేశాను. ఫలించలేదంతె. ప్రస్తుతం ఆయన మాతో వుండటం లేదు. ఇంక నన్నేమీ అడక్కు భార్గవీ! నా నోటితో అన్నీ చెప్పలేను. వివరంగా ఉత్తరం వ్రాశాను. మనం కలుసుకున్నప్పుడు కన్నా ఇప్పుడు చాలా సంతోషంగా వున్నాను" అంటూ ఫోన్ పెట్టేసింది.

    భార్గవి అలాగే కూర్చుని ఆలోచనలో పడింది.
   
    ఎందుకు స్త్రీల జీవితాలు యింత దుర్భరంగా తయారవుతున్నాయి? అనుకుంది. రాధ భర్తకంటే ఎక్కువే చదువుకుంది. అతడి కంటే ఎక్కువే సంపాదిస్తోంది. పిల్లల బాధ్యత అంతా తనే తీసుకుంది. ఒక మగాడు, స్త్రీ కలిసి చేయాల్సిన పనులన్నీ  ఒక్కతే చేసుకుంటోంది. అయినా ఆమెకు పదిమందిలో గుర్తింపు లేదు. ఆమెను అంతగా హింసిస్తున్న ఆ భర్తని పట్టుకుని నాలుగు జాడించే వాళ్ళే లేరు. పైగా ఏవైనా లోపాలుంటే స్త్రీనే దోషిగా నిలబెడతారు.
   
    ఆలోచిస్తున్నకొద్దీ భార్గవి మనసు వికలమవుతోంది. రాధతో మాట్లాడక పోయినా బావుండేది. ఆ రోజు మిగతా స్నేహితులతో పాటు ఆమె కథ వినేది.
   
    "నా పని పూర్తయిపోయింది. ఈసారి ప్రమోషన్ తప్పకవస్తుంది. రేపటి ప్రోగ్రాం ఏమిటి?" నవ్వుతూ వచ్చాడు శ్రీరామ్.
   
    "రేపూ, ఎల్లుండీ నేను బిజీ. ఎల్లుండయితే మరీ బిజీ". అంటూ తను కూడా నవ్వింది భార్గవి.
   
    "ఏమిటి రేపటి విశేషం?"

    "రేపేమీ లేదుగానీ- ఎల్లుండి పెద్ద విశేషం వుంది. ఎల్లుండి ఇరవై అయిదో తారీకు. మా పాత స్నేహితురాండ్రని కలుసుకోబోతున్నాను" అంది.
   
    ఆమె అనుకున్నట్టు ఆ విశేషం ఎల్లుండి వరకూ ఆగలేదు. ఆ మరుసటిరోజే జరిగింది.
   
                               *    *    *

 Previous Page Next Page