"అదా నీ బాధ?" తేలిగ్గా తీసేసింది సుధ. "రవి మామయ్య ఈసారి నీకు స్విమ్మింగ్, సైక్లింగ్ నేర్పుతానన్నాడు. ఇక్కడ మనం డబ్బులు పెట్టినా కొనలేని మీగడ పెరుగులూ, లేత మామిడికాయలూ, తాడి ముంజెలు, కొబ్బరిబోండాలు. మామయ్య నీకోసం తెప్పించి ఇస్తాడు"
మీగడ పెరుగులూ, లేత మామిడికాయలు అనగానే నోరూరింది శిశిర్ కి. ఇక సైకిల్ నేర్చుకోవాలని చాలా రోజులుగా కోరిక ఉంది కొద్దిగా మెత్తబడ్డట్టుగా "అయితే ఒక వారంరోజులకంటే ఎక్కువుండడానికి వీల్లేదు!" అన్నాడు షరతు పెడుతూ.
"సరే! తొందరగానే తిరిగొద్దాంలే!"
కేశంపేట చిన్నపల్లె
సుధ తల్లి గారిల్లు మధ్య తరగతికంటే కొంచెం మెరుగైంది. పెద్ద లోగిలి పుష్కలంగా పాడిపంట సుధ తండ్రి చిన్నప్పుడే పోయాడు. తల్లి మాణిక్యమ్మ ముప్పయ్యేళ్ళకే వైధవ్యాన్ని పొంది ఇంటి బరువు బాధ్యతలను నెత్తికెత్తుకొంది. చిన్న పిల్లలుగా వున్న సుధనీ, ఆమె తమ్ముడినీ సమర్ధవంతంగా పెంచి పెద్దజేసింది సుధని ఓ ఇంటిదాన్ని చేసింది - రవి సుధకంటే చిన్నవాడు. ఇటీవలే డిగ్రీ పూర్తిచేసి ఇంటి దగ్గరచేదోడు వాదోడుగా ఉంటున్నాడు. అతడికీ మధ్యే సంబంధం నిశ్చయమైంది.
విశాలమైన గుమ్మాలతో, పెద్ద పెద్ద స్తంభాలతో ఉన్న మేడ! విశాలమైన హాల్లో ఉయ్యాలబల్ల. శిశిర్ కి ఈ ఉయ్యాలబల్లంటే చాలా ఇష్టం. ఊగిఊగి ఈ బల్లమీదే నిద్రపోతుంటాడు.
కోటగోడలాంటి ఎత్తయిన ప్రహరీగోడ, గేటుకీ ఇంటికి చాలా దూరం. ఇంట్లో రవి మామయ్య, అమ్మ, అమ్మమ్మ, జీతగాళ్ళు... ఇంక ఎవరూ కనిపించరు. శిశిర్ కి ఎప్పుడు వచ్చినా జైల్లోపడ్డట్టుగా, పిచ్చెత్తి నట్లుగా అవుతుంది.
ఈసారి అంతే అయింది. లేత మామిడికాయలు, మీగడ పెరుగుల మోజు రెండురోజులకే తీరిపోయింది.
సైక్లింగ్, స్విమ్మింగ్ నేర్పుతానన్న రవి మామయ్య పెళ్ళిపనులు గొడవలో పడ్డాడు.
"ఊరికి వెళ్ళిపోదాం పద!" అంటూ గొడవ మొదలుపెట్టేశాడు శిశిర్.
"రవి మామయ్య పెళ్ళి కుదిరింది. పెళ్ళయ్యాకే రావడం. రేపో మాపో మీ నాన్నగారు వస్తారు. ఆయనతో పంపిచేస్తాను!" అని చెప్పింది సుధ.
ఈ రోజు మరీ పిచ్చెక్కినట్టుగా అయి గేటు తెరుచుకొని బయటికి వచ్చి నిలబడ్డాడు శిశిర్.
ఎంతో చక్కగా గడిచిపోయిందీ సాయంకాలం.
రెండురోజులు గడిచేసరికి హైద్రాబాద్ వెళ్లే విషయమే మరిచిపోయాడు శిశిర్.
ఆ వీధి పిల్లలతో మంచి స్నేహం ఏర్పడింది. ముఖ్యంగా అపూతో వాళ్ళింట్లో అందరితో చనువుగా మెలగడం అలవాటైంది.
అపూ పూర్తిపేరు అపురూప.
అపురూప కాక ఇంకా ముగ్గురు పిల్లలున్నారు. ముసలామె అపూ నాయనమ్మ. పిల్లలన్నా, కోడలన్నా ఆవిడకి పంచప్రాణాలు. చిన్న పిల్లలతో కోడలికి మడిసాగదని ఆవిడే మడికట్టుకుని వంటచేస్తుంది.
ఆ పిల్లలకీ నాయనమ్మ అంటే చచ్చేంత ప్రేమ. రాత్రిపూట అపు రూపతోపాటు అందరూ ఆవిడ దగ్గరే పడుకొనేవాళ్ళు. ఒకరికాళ్ళు, ఒకరి చేతులు, ఒకరి తల.....ఇలా ఆమెమీద పడితేగాని ఆవిడకి నిద్రపట్టేది కాదు.
మధ్య తరగతి కుటుంబమే అయినా సుఖసంతోషాలకూ, ఆత్మీయతానురాగాలకు కొరత లేనట్టుగా ఉంటారు. ఇల్లెప్పుడూ సందడిగా , మనుషులు ఉత్సాహంగా ఉంటారు.
అపురూపకి, ఆమె స్నేహితులకీ సెలవులే కాబట్టి తెల్లారింది మొదలు చీకటిపడేదాక ఏవేవో ఆటలు ఆడేవాళ్ళు. వెన్నెల రాత్రులయితే వెన్నెల కుప్పలు ఆడేవాళ్ళు.
చీకటిపడ్డాక కూడా అనంతలక్ష్మమ్మ చెప్పే కథలకోసం , సుప్రసన్నాచారి హార్మోనియం వాయిస్తూ పాడే పద్యాలు, పాటలకోసం ఆగి పోయేవాడు శిశిర్.
ఆయన పద్యాలు, పాటలు పాడడమే కాదు, చక్కగా మురళికూడా వాయించేవాడు. నాటకాల్లో ఉపయోగించడానికి మెరుపు కాగితాలతో, పూసలతో కిరీటాలు తయారుచేసేవాడు.
ఆయన తయారుచేసే గదలు, హారాలని తమాషాగా చూసేవాళ్ళు పిల్లలు.
అక్కడే కూర్చుండిపోయి చూస్తుండేవాడు శిశిర్, కళ్ళు ఇంతింత చేసుకొని.
ఆయన కళాపిపాసి మాత్రమేకాదు. పరహితం , పరులసేవ తెలిసినవాడు., జ్వరమనో దగ్గనో వచ్చేవాళ్ళకి మూలికలతో తయారుచేసిన మందులిచ్చేవాడు. అలా ఆయన ఎందరికో వైద్యుడు!
* * *