Previous Page Next Page 
విషవలయం పేజి 5

    "ఆ విషయం బయటికివచ్చి చెప్పకూడదూ ఉషా! నాకేమన్నా భట్రాజు పని చేతవచ్చా?"

    "పో అన్నయ్యా నువ్వు"

    తర్వాత సత్యమూర్తి కాసేపు మాట్లాడి యింటికి వచ్చేశాడు, కారణం తెలియని ప్రశాంతత.

    అప్పట్నుంచీ క్రమంగా ఉషతో కూడా అతనికి పరిచయం అధికం కాసాగింది.రెండు మూడు రోజులకోసారి అక్కడకు వెడుతూండేవాడు. ముగ్గురూ కలిసి ఏవో కబుర్లు చెప్పుకుంటూ గడిపేవారు. ఉష నిజంగా తెలివిగలదని గ్రహించాడు సత్యమూర్తి. ఎంత అమాయకత్వమో, అంత పదునైన మనస్తత్వం, కాలాన్ని వృధా పుచ్చదు దొరికినంతవరకు ఏదో ఒక పుస్తకాన్ని చదువుతూ వుటుంది ఆ పుస్తకాన్ని నిశితంగా విమర్శించేది కుట్టుపని నేర్పే స్కూల్ కి వెళ్ళి కుట్టుపని నేర్చుకుంటూ వుండేది ఉష. ప్రతి విషయంలోనూ ఆమెకు అమిత జాగ్రత్త ఒక్కోసారి ముగ్గురూ కలిసి షికారుకి వెళ్ళేవారు. సముద్ర తీరంవైపు వెళ్ళి చీకటిపడేదాకా కబుర్లు చెప్పుకుని వెనక్కి తిరిగి వచ్చేవాళ్ళు.

    సత్యమూర్తి చాలా దుబారా మనిషి అనీ, అనవసరపు ఖర్చులు చాలా చేస్తుంటాడనీ ఉష చాలా తొందరగా కనిపెట్టింది. అతన్ని మందలించటం మొదలుపెట్టింది.

    అది నిజమే, సత్యమూర్తి రూపాయి కాయితాన్ని చిల్లుకానిలా ఖర్చు చేస్తాడు.

    "ఆ ఖర్చుకి ఫలితం, ప్రయోజనం వుండదు. ఏమీ మిగలదు, పైగా సరియైన బట్టలు కొనుక్కోవటం కూడా చేతకాదు. కొనుక్కున్న బట్టల్ని ఎలా కుట్టించుకోవాలో తెలీదు. అతని ఖరీదైన దుస్తుల్ని, అవి కుత్తబడిన పద్దతిని చూసి అతని స్నేహితులు నవ్వుకుంటూ కూడా వుండేవాళ్ళు.

    "బాబోయ్! ఎంత డబ్బు ఖర్చు పెడతారో వృధాగా, మీకు డబ్బు విలువ తెలీదు" అనేది ఉష.

    సత్యమూర్తి నవ్వి వూరుకునేవాడు.

    ఒకసారి అతనికి జ్వరం వచ్చింది. కాలేజి మానేసి గదిలో పడుకున్నాడు. ఒకటి రెండు రోజులు గడిచినా జ్వరం నిమ్మిళించలేదు. ఇంటి యజుమానీ, ఆయన భార్యా తమకు చేతనైన ఉపచారాలు చేస్తున్నారు. సత్యమూర్తి పిరికివాడు, అతనికి సాధారణంగా ఏ జబ్బూ చెయ్యదు చేస్తే హడలు పెట్టి ఎంత హంగామా చేస్తాడో అంతు వుండదు. అతని మూలుగులు పరిస్థితి చూసి యింటివాళ్ళు మరీ గాభరా పడిపోయారు,

    మూడోరోజు అతను ఎన్నాళ్ళకీ రాకుండా వుండేసరికి ప్రసాదరావు అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు. జ్వరం నూటరెండు డిగ్రీలకన్నా ఎక్కువ లేదు. కాని అతను చేసే గోలకు మాత్రం గదిటాపు లేచిపోతోంది.

    ప్రసాదరావుణు చూడగానే అతనికి తన బాధ భరించటం మరీ దుస్తరంగా కనిపించింది.

    "ఏమిటి? ఏం జరిగింది? అలా వున్నారేం!" అని అడిగాడు ప్రసాదరావు పరిస్థితిని చూసి ఆదుర్దాగా.

    నిజంగానే సత్యమూర్తి చాలా నీరసించిపోయి వున్నాడు. ముఖం కళాకాంతులు నశించి పాలిపోయివుంది..."వచ్చారా? మూడు రోజుల్నుంచీ నాకు జ్వరం, మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను" అన్నాడు సత్యమూర్తి ఎంతో బలం వచ్చినట్లు.

    ప్రసాదరావు దగ్గరకు వచ్చి స్నేహితుడి వంటిమీద చెయ్యివేసి చూశాడు, ప్రేమగా నుదురు నిమిరాడు. "నాకు కబురు చెయ్యలేదేం మరి?" అని అడిగాడు బాధగా.

    "చెయ్యాలనే అనుకున్నాను. కాని మా పనిమనిషికి మీ యిల్లు తెలీదు, పాపం యింటివాళ్ళు వచ్చి చూస్తున్నారు."

    ఇప్పుడు సత్యమూర్తికి సంతోషంగా, గర్వంగా వుంది. తనకి భూమ్మీద నిజమైన స్నేహితులు వున్నారు. తన కష్ట సుఖాలపట్ల ఆత్రుత ప్రదర్శిస్తారు.

    ప్రసాదరావు తను చేయగలిగిన సేవ అంతా చేశాడు. అతనికి ధైర్యం చెప్పాడు. బజారుకి వెళ్ళి రొట్టె, పళ్ళూ తీసుకువచ్చాడు.

    మరునాడు ఉష వచ్చింది, సత్యమూర్తి పరిస్థితి చూసి చాలా వ్యాకులపాటు పడింది, స్వయంగా మంచు కలిపి త్రాగించింది.

    ఆమెకదే అతని గదికి మొదటిసారి రావటం. "అన్నయ్య చెప్పాడు మీ యింటి గుర్తు. వాడు ఆఫీసుకి వెళ్ళాలిగా. రావటం పడలేదు. రాత్రి బాగా నిద్రపట్టిందా? మూలుగుతూ కూర్చున్నారా?" అనడిగింది ఆమె నవ్వుతూ.

    అతను సిగ్గుపడిపోయాడు. "నేను కొంచమైనా బాధకు ఓర్చుకో లేనండీ ఉషా. అందుకని నా ప్రవర్తన చిత్రంగా వుంటుంది. మరి నేనేమో ఒంటరివాడ్ని. నాకేదన్నా జరిగితే యీ ఊళ్ళో ఎవరున్నారు?" అన్నాడు పక్కకి చూస్తూ.

    "మేం వున్నాంగా"

    "మరి మీ అన్నయ్య ఆఫీసు పనిమీద తిరుగుతూ వుంటాడు. తీరుబాటు వుండదు. వారేదన్నా..."
   

 Previous Page Next Page