Previous Page Next Page 
విషవలయం పేజి 4

    "అన్నయ్య యింకో అరగంటలో వస్తాడు. యింట్లోకి కొన్ని వస్తువులు తీసుకురావటానికి వెళ్ళాడు" అంది ఉష.

    "నేను మళ్ళీ వస్తాను లెండి" అని సత్యమూర్తి మొహమాటపడుతూ లేవబోయాడు.

    "ఫర్వాలేదు కూర్చోండి, మీరు వస్తే వుండమని చెప్పాడు అన్నయ్య."

    అతన్ని యిరకాటములో పెట్టినట్లయింది. ఆమె లోపలకు వెళ్ళిపోతుందని ఆశించాడు. కాని యింటికి వచ్చిన అతిధిని వొంటరిగా కూర్చోబెట్టి లోపలకు జారుకోవటము ఆమెకు సభ్యతాగా తోచలేదేమో, అక్కడే నిలబడి ప్రక్కకి చూడసాగింది.

    "మీరు నిలబడే వున్నారు" అన్నాడతను కాసేపు మనసులో తర్జన భర్జనలు చేసి.

    "ఫర్వాలేదు అమ్మాయినే కదండి" అంది ఉష కొద్దిగా నవ్వి, మళ్ళీ కొన్ని నిమిషాలు సందిగ్ధంగా గడిచాయి, ఏం మాట్లాడాలో తోచక.

    "మీరేం చదువుతున్నారు?" అని అడిగాడు మరో ప్రయత్నం చేసి.

    ఈ ప్రశ్నకు ఆమె కొంచెము సిగ్గుపడినట్లు కనిపించింది. "నేనేం చదువుకోలేదండీ. ఫోర్త్ ఫారంలో నాచదువుకి ఉద్వాసన చెప్పాల్సివచ్చింది" అన్నది ఒక నిమిషం తాళి.

    ఆమెను బాధించానేమోనని సత్యమూర్తి చింతపడ సాగాడు.

    ఉష గోడకు ఆనుకుని నిలబడింది. గుండ్రని ఆమె కనులు నేలను చూస్తున్నాయి. చలించే కంఠంతో చెప్పసాగింది.

    "అమ్మ చిన్నప్పుడే పోయింది. అమ్మ ఎలా వుంటుందో కూడా నాకు సరిగ్గా తెలీదు. నాన్నగారు మా యిద్దర్నీ ఎంత ప్రేమతో పెంచారో ఆ భగవంతుడికే తెలుసు. మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు. తల్లీ, తండ్రీ తనే అయినారు. ఇంట్లో వంటపనీ, అదీ చూసుకుని మా కిద్దరికీ అన్నాలుపెట్టి ఆఫీసుకు వెళ్ళేవారు, మళ్ళీ సాయంత్రం వచ్చీరాగానే మా తాపత్రయంతోనే సరిపోయేది. మెల్లిగా యిద్దరం పెరిగి పెద్దవాళ్ళమవుతున్నాం. నాకు ఊహ తెలుస్తోంది. నాన్నగారి ఆరోగ్యం రోజురోజుకు క్షీణించిపోతోంది. సెలవురోజుల్లో ఆయనదగ్గర కూర్చుని వంట చెయ్యటమూ అదీ జాగ్రత్తగా చూసి తెలుసుకున్నాను. అన్నయ్య చదువు విషయంలోనే ఆయన ఎంతో కష్టపడుతున్నారు. నేనూ చదువుకుంటూ యింట్లోపని ముట్టుకోకుండా ఆయన నెత్తిమీద ఎక్కి స్వారీ చెయ్యలేకపోయాను. చదువు మానేసి యింటి పట్టునే వుంటానన్నాను. నాన్నగారు ఒప్పుకోలేదు. నేను మొండికేసాను. నేను చాలా పెంకిదాన్నిలెండి. ఆయనకు అంగీకరించక తప్పలేదు అప్పట్నుంచీ చదువుకి స్వస్తిచెప్పి యింటిలోనే వుండసాగాను. కాని అన్నయ్య చదువు ముగిసి మంచి ఉద్యోగం చేస్తూంటే నాన్నగారు మురిసిపోవటం నేను చూడలేకపోయాను. ఆయన..."

    ఆమె కంఠం వొణికింది...కంటినుండి నీరు జలజలా కారింది.

    సత్యమూర్తి అప్రతిభుడయాడు. అతనికేమీ చేయటానికీ తోచలేదు. "ఏడవకండి" అన్నాడు ఎలాగో.

    ఉష లజ్జితురాలయింది, ముఖం అటుప్రక్కకి త్రిప్పుకుని పమిట చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ వూరుకుంది.

    ప్రసాదరావు సంచినిండా సామానుతో యింటికి చేరేసరికి కుర్చీలో సత్యమూర్తి కూలబడి వుండటం, చెల్లెలు కళ్ళు తుడుచుకుంటూ వుండటం కళ్ళబడింది.

    అతనేమనుకుంటాడోనని సత్యమూర్తి భయపడుతున్నాడు.

    ప్రసాదరావు సంచీ క్రింద పెడుతూ "భలే! ఏం జరిగిందేమిటి? మా చెల్లెలు భావావేసి. దుఃఖాన్ని, సంతోషాన్నీ కూడా కించిత్ అయినా పట్టలేదు" అన్నాడు.

    "పొ అన్నయ్యా! అని ఉష సంచీ తీసుకుని లోపలకు వెళ్ళిపోయింది.

    సత్యమూర్తి "హమ్మయ్య" అని ఊరడిల్లి "అది నిజమే ప్రసాదరావుగారు, అనుకోకుండా ఆమె మీ చరిత్ర చెప్పటం మొదలుపెట్టింది. కళ్ళేమో అశ్రువులతో నిండిపోయాయి. ఏమి చెయ్యటానికీ తోచక నేను నివ్వెరపోయాను" అన్నాడు.

    "మా ఉష చాలా సెన్సిటివ్ అండి మూర్తిగారు. ప్రపంచము కూడా తను వున్నంత సున్నితంగా వుండాలనుకుంటుంది. అది ఎలా సాధ్యం? మాయా మర్మం ఎరుగదు. ఇలాంటి దానికి పెళ్ళి గనుక జరిగితే ఆ క్రొత్త వాతావరణానికి ఎలా తట్టుకుంటుంధో తెలీదు."

    సత్యమూర్తి మెదలకుండా వింటున్నాడు.

    "పైగా చాలా తెలివిగలది. పరిస్థితులు అనుకూలించక చదువలా మధ్యలో ఆగిపోవాల్సి వచ్చిందిగాని లేకపోతే జీనియస్ అయివుండేది."

    "అన్నయ్యా! ఏమిట్రా ఆ భట్రాజు పొగడ్తలు?" అంది లోపలినుంచి వింటూన్న ఉష యింక ఆగలేక.
   

 Previous Page Next Page