Previous Page Next Page 
నెత్తుటిబొట్టు పేజి 5

    ద్వైతం, అద్వైతం _ ఇవన్నీ మనిషిని గందరగోళంలో పడవేసే విపరీతాలు.

    సత్యాన్ని ఎప్పుడూ అందనంత దూరంలోనే వుంచే అగాధాలు.

    మనిషే దేవుడు  ఆ దేవుడు పురుషుడిలోనూ వున్నాడు _ స్త్రీలోనూ వున్నాడు. ఆ యిద్దరి కలయికే దైవాన్ని ఆరాధించటం.

    మీ సందేహం నాకు తెలుసు. శృంగారం అనేది క్రమబద్దంగా, నియమావళి ప్రకారం, కేవలం దంపతుల మధ్యే _ అక్కడే వారు ఊహించుకున్న అవధుల్ని అందుకుంటూ వుండవచ్చు కదా. స్వేచ్చా ప్రణయంతో అవసరమేమిటని.

    రక్తి అనేది జీవితాంతం మనకి మనం విధించుకున్న హద్దు కారాదు. అనేక నిబంధనలకు లోబడివున్నప్పుడు రక్తిలోంచి ముక్తి ఆవిర్భవించదు. ఒక మనిషి ఇంకో మనిషికి ఎప్పుడూ శాశ్వతం కాడు. ఒక మనసు ఎప్పుడూ ఇంకో మనసుతో అల్లుకుని వుండడం శాసనం అవుతుంది కాని సహజంకాదు. స్వేచ్ఛలేని జీవితం వ్యర్థం. జీవితాన్ని ఆనందమయం చేసుకోవటానికి స్వేచ్చా ప్రణయం ఒక్కటే మార్గం. ఓ మనసు ఒక్కో ఇష్టం పట్ల భీతి లేకుండా మొగ్గుదల చూపిస్తున్నప్పుడల్లా నీలో వున్న ఒక్కోమాలిన్యం తొలగిపోతూ వుంటుంది. ఒకర్ని ఒకరు మోసం చేసుకుంటూ చాటుగా కొనసాగించేది వ్యభిచారం. ధైర్యంగా, అసూయలకి అతీతంగా నిర్వహించేది సృష్టికార్యం.

    ప్రకృతితో ఒక భాగమే స్త్రీ, పురుషుడు కూడా. ప్రకృతి అంత స్వచ్చంగా, రమణీయంగా ఎందుకుంటుంది?

అడవిలో పులులూ, సింహాలూ, మబ్బుల్ని చూసి విహరించే నెమలీ, ఆకాశంలో ఎగిరే పక్షులూ అంత అందంగా ఎందుకుంటాయి? అవి నగ్నంగా, ఏ ముసుగులూ లేకుండా వుండడం చేతనే.

    నగ్నత్వం నైర్మల్యానికి చిహ్నం.

    నగ్నత్వం ! భగవంతుడికి మిమ్మల్ని చేరువగా తీసుకువెడుతుంది.

    నగ్నత్వంతో కూడిన స్వచ్ఛమైన కామక్రీడ మీలో దైవత్వాన్ని ప్రకోపిస్తుంది.

    ఏ పదవులూ, భేషజాలూ, సంపదా ఇవ్వలేని మనశ్శాంతి మీకీ స్వేచ్ఛ ప్రసాదిస్తుంది.

    కాబట్టి నిర్మల స్వభావులారా ! ప్రకృతిలో సహజంగా ఐక్యం కావలసిందిగా మీకు నేను ఉద్భోదిస్తున్నాను.


                 *                 *               *

    రాత్రి రెండు గంటలు దాటింది. ఆశ్రమానికి వచ్చిన చాలామంది పురప్రముఖులు కార్లలో తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు. ఆశ్రమంలో నివశించేవారు తమ కుటీరాల్లోకి వెళ్ళారు.

    ఆచార్య జగదీష్ తన ఏకాంత మందిరంలోకి విశ్రమించడానికి వెళ్ళారు.

    అతని విశ్రాంతి మందిరం భూతల స్వర్గాన్ని  మరిపించేటట్లు వున్నది. నేలంతా అడుగు తీసి అడుగువేస్తే ఆరంగుళాల లోతుకి దిగిపోతున్న అనుభూతిని కలిగించే పట్టుతివాసీతో కప్పబడివుంది. వాల్ పేపర్ అంటించి వున్న గోడలకు శృంగార వైభవాన్ని కనులవిందుగా బహిర్గతం చేస్తూ అత్యద్భుతమైన కళావిన్యాసాలతో తైలవర్ణ చిత్రాలు. ఆయన పడుకునే గదిలో ఎక్కడ్నుంచో ఓ మృదు సుగంధం వ్యాపిస్తున్నది. ఆయన విశ్రమించే మంచం ఫ్రాన్స్ దేశం నుంచి బహుమతిగా ఊయబడింది. దాని బాగిశీలు, హొయలు _ చూస్తోంటే వళ్ళు పులకరించేటట్లు వున్నది.

    ఆచార్య జగదీష్ గదిలోకి అడుగుపెట్టి గోడ దగ్గిరకు వెళ్ళి చిన్న మీట నొక్కాడు. గోడలో చిన్న అర తెరచుకున్నది. అందులో నుంచి వజ్రాలు పొదిగిన చిన్న భరిణిలాంటిది బయటకు తీశాడు. మూత తెరచి అందులోంచి ఓ మాత్ర తీసుకుని నోట్లో వేసుకున్నాడు. ప్రక్కనే వున్న ఫ్రిజ్ తీసి _ అందులోంచి బంగారుపాత్ర  ఒకటి తీసి చల్లగా వున్న మంచినీటిని నోట్లో వంపుకున్నాడు. తర్వాత మంచంమీదకు వెళ్ళి పడుకున్నాడు.

    అతను వేసుకున్నది ఎన్కలిన్ టాబ్లెట్. అది ప్రస్తుతానికి ఈ దేశంలో దొరకదు. ఆచార్య జగదీష్ కు దేశదేశాలలో  అత్యంత సంపన్నులైన శిష్యులున్నారు. ఆ టాబ్లెట్స్ సంపాదించడం ఆయనకో సమస్యకాదు.

    టాబ్లెట్ ప్రభావం వల్ల మనసు లోలోపల పొరలు పైకి పొంగి ఎక్కడెక్కడో ఎగబ్రాకసాగాయి.

    కళ్ళు చిత్రమైన నీలకాంతితో మెరవసాగాయి.

    తలుపులు తెరచుకుని ఆషా లోపలికి వచ్చింది. ఆషాకి పాతికేళ్ళుంటాయి. చాలా అందగత్తే. శిల్పసుందరిలాంటి శరీర లావణ్యం, ఎదుటివారి గుండెనూ _ మనసునూ పీల్చి పిప్పి చేసెయ్యగల చూపులు. ఆ ఆశ్రమంలో ఆమె ఆయనకు కుడిభుజంలాంటిది.

    "స్వామీజీ !" అని అరిచింది ఆషా. అందరూ ఆయన్నలాగే సంబోధిస్తారు.

    ఆయన కళ్ళు ఆమె వైపు తిరిగాయి. "ఏమిటి ఆషా !"

    "నిద్రపోతున్నారా?"

    "ఇంకా లేదు."

    "ఫ్రాన్స్ నుంచి ఆరుగురు కొత్త శిష్యులు వచ్చారు. అందరూ ఆడవాళ్ళే. రేపు ప్రొద్దుట మీతో ఇంటర్వ్యూ  కోసం వెయిట్ చేస్తున్నారు.

    "అలాగే" 
 

 Previous Page Next Page