Previous Page Next Page 
నెత్తుటిబొట్టు పేజి 4

    అలా బూడిదగా మారటానికి కూడా నోచుకోక, మెడికల్ కాలేజి ఎనాటమీ థియేటర్ లోకి తరలించబడడం కోసం సిద్దం చెయ్యబడుతున్న శవాలూ...

    ఇదే నిమిషంలో...


                                 *               *                * 


    ఆచార్య జగదీష్ తన ఆశ్రమంలో కాన్ఫరెన్స్ హాల్లో ఇంచుమించు వెయ్యిమంది వరకూ సభికులు వింటుండగా ప్రసంగాన్ని కొనసాగిస్తున్నాడు.

    ఆశ్రమమంటే _ అదేదో స్వామీజీలుండే ఆశ్రమం లాంటిదని అనుకోకూడదు. ఇంచుమించు పదెకరాల స్థలంలో అది నిర్మించబడి వుంది, అధునాతనమైన పద్ధతిలో. అందులో పెద్ద పెద్ద భవంతులున్నాయి. పుష్కలంగా కాటేజిలున్నాయి. వాటిలో ఎయిర్ కండీషన్ గదులున్నాయి. టెలివిజన్లున్నాయి. వీడియోలున్నాయి. ఎక్కడ చూసినా సుగంధ పరిమళాలు వెదజల్లుతున్నాయి.


    సభికుల్లో _ అంటే ఆచార్య జగదీష్ భక్తుల్లో అందరూ ధనికవర్గానికి సంబంధించిన వారే వున్నారు. పెద్ద పెద్ద ఆఫీసర్లున్నారు. సమాజంలో గొప్ప గొప్ప హోదాల్లో _ పదవుల్లో వున్న ప్రముఖ వ్యక్తులున్నారు. ఎంతోమంది ఉన్నత కుటుంబాలకు చెందిన స్త్రీలు కూడా వున్నారు.

    ఆచార్య జగదీష్ కు నలభై అయిదు ఏళ్ళుంటాయి. ఆజాను బాహువు. ధృడమైన శరీరం. చాలా హుందాగా, వత్తుగా ముఖం మీదకు విస్తరించివున్న కేశాలు, గడ్డం ఏ మాత్రం పెరిగిలేకుండా, నున్నగా ఆరోగ్యంగా మెరుస్తోన్న చెంపలు.

    ఆయన కళ్ళు చాలా విశాలంగా వుండి, గొప్ప కాంతితో మెరుస్తున్నాయి. పెదవులు ఎర్రగా, చాలా ఆకర్షణీయంగా వున్నాయి. 
 
    ఆయన కంఠస్వరం ఎంతో మృదువుగా, వినేవారి మీద మత్తుమందు చల్లేటట్లుగా వుంది.

    ఉపన్యాసం కొనసాగుతోంది.

    "...జీవితంలో ఎన్నో అనుభవాలు చవిచూశాను. సత్యాన్ని అన్వేషిస్తూ ప్రపంచంలో నేను తిరగని ప్రదేశం లేదు. మనసులోని దుఃఖం, అసంతృప్తి _ వీటిని తొలగించుకోవటానికి, వీటినుంచి విముక్తి పొందటానికి నేను చెయ్యని ప్రయోగం లేదు.

    ఎందుకు మనిషి నిజాన్ని ఛేదించలేకపోతున్నాడో, ఎందుకు అమరుడు కాలేకపోతున్నాడో చివరికి త్రికరణ శుద్ధిగా తెలుసుకోగలిగాను.

    ఆకర్షణ అనేది తప్పనుకుని తనని తాను వంచించుకోవటమే మానవుడి పతనానికి కారణం.

    లైంగిక వాంఛ ప్రకృతిలో ఒక భాగం.

    ఆకలి, దాహం ఎంత సహజమైనవో, లైంగిక వాంఛ కూడా అంతే సహజమైనది.

    మనిషి ఆటవిక దశలో వున్న స్థితి నుంచి నవనాగరిక దశకు ఎదిగే వరకు కూడా ఈ లైంగిక శక్తి వివిధ కోణాల్లో, విభిన్న దృక్పథాల్లో వ్యాప్తి చెందుతూనే వుంది.

    అయితే ఆటవిక దశలో లేని భయం ఇప్పుడున్న నాగరిక మానవుడ్ని పీల్చి పిప్పి చేస్తున్నది.

    మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, చారిత్రక సంఘటనలూ ఇవేవీ కూడా లైంగిక వాంఛని తిరస్కరించడం లేదు.

    బ్రహ్మచర్యమే మోక్షసాధనకు మార్గమని చాటటం లేదు.

    అసలు బ్రహ్మచర్యం ఉత్తమమని ఎక్కడా ఉద్ఘాటించబడి వుండలేదు.

    మన దేవుళ్ళు _ శివుడు, విష్ణువు, బ్రహ్మ _ వీళ్ళంతా సంసార జీవితాల్లోని మాధుర్యాన్ని ఉగ్రాతి ఉగ్రంగా జుర్రుకున్నవారే. వారి శృంగార లీలలు మధురాతి మధురంగా వర్ణించబడినాయి.

    కృష్ణుడి జీవితమంతా రాసలీలలతోనే గడచింది. ఎన్నో వేలమంది గోపికలు, ఎనిమిది మంది భార్యలు... ఆయన పరమాత్ముడు కాదనుకోటానికి ఈ కామక్రీడలు అడ్డువస్తున్నాయా? ఆయన నోట్లోంచి ఊడిపడిన భగవత్ గీతను మనం మహోత్కష్టమైన గ్రంథంగా ఆదరించడం లేదా?

    రామచంద్రుడు _ సీత తనకు దూరమైనప్పుడు ఆమెతో తాను మధుర క్షణాలను తలుచుకుని విరహంతో విలావిల్లాడిపోలేదా ?

    మన మహర్షులు _ విశ్వామిత్రుడు, గౌతముడు, పరశురాముడి తండ్రి అయిన జమదగ్ని, అరుంధతి, అనసూయ _ వీళ్ళంతా శృంగార జీవితం గడిపినవారే.

    వీరంతా మనకి ఆరాధ్యులు కాలేదా ?

    శృంగార జీవితాన్ని వారు పుష్కలంగా అనుభవించటం వల్లే ఇతర సమస్యలనుంచి ఉద్భవించే మాలిన్యాన్ని తుడిచేసుకుని రక్తిలోంచి ముక్తిని సాధించగలిగారు.

    యోగి వేమన అంత వేదాంతి కావటానికి కారణం _ రక్తిలోంచి జనించిన విరక్తి అనుకోవటం పొరపాటు _ రక్తి ప్రసాదించిన అనుభవం.
   
    మనసుని అదిమేసుకోవడం ఆత్మహత్యతో సమానం.

    కామం పవిత్రమైనది. స్త్రీని భోగవస్తువుగా ఉపయోగించుకుంటారనే నానుడి ఓ రకం వికారమైన వాదం. స్త్రీ, పురుషులు ఇరువురూ ఒకరికొకరు భోగవస్తువులు. అనుభవం నేరం కాదు, అదో పవిత్రమైన ప్రకృతికార్యం.

    చాదస్తులూ, పిరికివాళ్ళూ, స్వార్ధపరులూ _ దీనికి రకరకాల రంగులు పూసి వివిధ వ్యాఖ్యానాలు చేసి వేదాంతాన్ని ప్రజలకు అర్ధం కాని అయోమయంగా, ఆచరణ యోగ్యం కాని అసాధ్యంగా తయారు చేశారు.
 

 Previous Page Next Page