ఆడవాళ్ళిద్దరూ కాస్త ఎంగిలిపడి, గదిలో పక్క పక్క మంచాల మీద పడుకున్నారు. తెరిచి ఉన్న కిటికీ గుండా చల్లని శీతల పవనాలు వీస్తున్నాయి. గోడనున్న చిన్న దీపం గాలికి రెపరెపలాడుతూంది.
భారతి కళ్ళు మూసుకుని ఆలోచిస్తూంది.
ఈనాడు జరిగిన సంఘటనలన్నీ ఆమెకు కలగా వింతగా తోచాయి. పదిరోజుల క్రితం వచ్చీరాని డ్రైవింగ్ తో ఆ అబ్బాయి కారులో వచ్చి గలభా చెయ్యటం, తరువాత అప్పుడప్పుడూ తనకతను గుర్తురావటం, ఈ రోజు అతని తండ్రి తనని చూడటానికి రావటం....అంత చెరగని ముద్ర వేసిందా ఏమిటి తను అతని హృదయంలో? అతను తనను చూసింది కాసినే కాసిని క్షణాలు. ఇంతలో ఇది ఎలా సంభవించింది? ఈ సంఘటనకు ఆనందించటానికి బదులు అలజడి పడుతూంది తను. తన జీవితానికి ఈ మచ్చ ఏర్పడకుండా ఉంటే ఈ రాత్రి ఓ మనోహరమయిన రేయిగా పరిణమించి ఉండేది కాదా? అప్పుడు తనకంటే అదృష్టవంతులు ఎవరు ఉండేవారు?
భారతి నిట్టూర్చింది. విధి లిఖితం వేరే అయివుంది. తనవంటి నిర్భాగ్యులు సుఖపడటానికి వీల్లేదు. కాస్త కష్టం వచ్చి అంటుకోనిదే తనలాంటి వాళ్ళ జీవితాలకు సహజత్వం సిద్ధించదు.
ఆలోచిస్తూ భారతి తలత్రిప్పి పిన్నివైపు చూసింది. కళ్ళు మూసుకుని పడుకుని ఉందామె. అప్పుడే నిద్రపట్టిందా పిన్నికి? భారతి ఆలోచనలు రాధమ్మవైపు మళ్ళాయి.
ఈ లోకంలో పిన్నికంటే అభాగ్యులెవరు ఉంటారు? కళ్ళలో నీళ్ళు తిరిగి నట్లయి అప్రయత్నంగా "పిన్నీ!" అంది.
రాధమ్మ కళ్ళు తెరిచి భారతివంక చూస్తూ "ఊఁ" అంది.
నువ్వింకా నిద్రపోలేదా? పోయాననుకున్నాను."
"ఊఁ....హుఁ."
"ఆలోచిస్తున్నావా? నా గురించా? అదేమిటి? నీ కళ్ళు తడిగా ఉన్నట్లున్నాయే నా గురించి బాధ పడుతున్నావా, పిన్నీ?"
"ఊఁ....హుఁ. ఆ....ఓ...." అంది రాధమ్మ భారతిని పడుకోమని సంజ్ఞ చేస్తూ.
"ఉహుఁ. నాకివాళ అప్పుడే నిద్రరాదు. పిన్నీ! ఓ ప్రశ్న అడుగుతాను. జవాబు చెబుతావా?"
రాధమ్మ కళ్ళెగర వేస్తూ ప్రశ్నార్ధకంగా చూసింది.
"నువ్వు పుట్టుకతోనే మూగదానివి. ఆ విషయం దాచిపెట్టి, ఓ పాడు సంబంధం తెచ్చి పెళ్ళిచేసి, గొప్పపని చేశామనుకుని భుజాలెగరేశారు నీ తల్లిదండ్రులు. మనుగడుపులన్నా ముగియకముందే ఆ విషయం రచ్చకెక్కి, నీ జీవితం భగ్గుమంది. పెనిమిటి ముఖమేమిటో సరిగా చూడకుండానే నీ పెండ్లి ముచ్చట తెగ త్రెంపులవగా పుట్టింటికి తిరిగి వచ్చావు. ఈ శోకం భరించలేక నీ తల్లిదండ్రులు మంచమెక్కి క్రమంగా గతించారు. చివరకు నువ్వు ఒంటరిరానిదిగా మిగిలిపోయావు. ఇదంతా గుర్తు వచ్చినప్పుడు నీకేమనిపిస్తుంది?"
గంభీరమైన మనస్సుతో, గంభీరమయిన కంఠంతో, గంభీరమయిన ప్రశ్నే వేసింది భారతి.
అయితే ఆ ప్రశ్న రాధను కదిపినట్లు లేదు. ఒక్క నిమిషం భారతి ముఖంలోకి చూసి పక్కుమని నవ్వేసింది.
"నవ్వకు పిన్నీ. నీకు నిజంగా నవ్వు రావటంలేదు. ఆ విషయం నాకంటే స్పష్టంగా ఎవరూ అర్ధం చేసుకోలేరు. నీవు మాట్లాడలేవు. అందుకని నీమనోగతాభి ప్రాయాలను విడమరిచి చెప్పలేవు. నేనే ప్రశ్నలు వేస్తాను చెప్పు."
రాధమ్మ ముఖంలో నవ్వు మాయమయి రంగులు కూడా మారాయి.
"నీకే అధికారం వుండి, నీ చేతిలో విచ్చుకత్తి వుంటే ఆ కత్తితో ఆ ముదవష్టపు పెనిమిటి గొంతు పర పరా కోయాలనిపించింది కదూ!"
"ఊఁ, ఊఁ!" అని తల అడ్డంగా తిప్పింది రాధమ్మ.
"ఈ ప్రపంచమంటే అసహ్యమేసి. రోతపుట్టి, ఆత్మహత్య చేసుకోవాలని పించింది కదూ?"
రాధమ్మ ముఖంలో భయం కనిపించింది. 'ఎవరికీ చెప్పకూడదనుకున్నాను. నా అంతరంగిక రహస్యాలు ఎందుకు బయటకు లాగటానికి ప్రయత్నిస్తావు నువ్వు? అన్నట్లు జాలిగా చూసి, ఏమో! నాకేమీ తెలియదు అన్నట్లు చేతితో సంజ్ఞ చేసింది.
"దాస్తున్నావు నువ్వు. మనిషివి కాదా? నీకు అనుభూతులు లేవా? ఇలా మొండిగా జీవించటమే సహజత్వమనుకుంటావా?"
భారతి ప్రశ్నలో ఆవేశంపాలూ, చురుకుతనమూ ఎంత ఉన్నాయో అంతకు మించిన పసితనంకూడా వుంది. ఈ దిక్కుమాలిన భారతదేశంలో మనిషి విలువ అనే పదానికి అర్ధమింకా తెలుసుకోలేని యీ అయోమయపు గడ్డమీద సనాతనంగా తీసుకున్నా. అధునాతనంగా తీసుకున్నా, సంప్రదాయబద్ధంగా తీసుకున్నా. ఆర్ధిక పరంగా తీసుకున్నా మనిషి వ్యక్తిత్వాల గురించీ, మానవత్వపు విలువల గురించీ ఆలోచించే స్తోమత ఏదీ? ఆలోచించినా ఆలోచించగలిగే అవకాశాలు ఏవీ? దోమలతో, ఈగలతో, మురికి వీధులలో దుర్గంధ భూయిష్టమయిన పరిపాలనతో నిండి వున్న యీ భూమిమీద మనుషుల మనసులూ ఆ వాతావరణానికి తగినట్లుగానే వికసిస్తున్నాయి.
రాధమ్మ భారతివైపు కొంచెంగా జరిగి, బుగ్గగిల్లి "అవ్వో" అంది. ఇక సంభాషణ చాలుగాని పడుకోమన్నట్లు సంజ్ఞచేస్తూ.
"పో నువ్వు. మీరంతా నిజం చెప్పటానికి నోచుకోని పిరికివాళ్ళు" అని భారతికి కోపం వచ్చి గోడవైపు తిరిగి పడుకుంది.
పిన్నికి తన పెనిమిటి ఎప్పుడూ గుర్తురాడా? గుర్తు వస్తే ఎలా వుంటుంది? ఆమె మనస్సులో అతన్ని ప్రేమిస్తుందా? ఆరాధిస్తుందా? ద్వేషిస్తుందా? ఏవగించుకుంటుందా ఏముంది ఆ మనస్సులో? పిన్నికి చదువురాదు. ఇన్ని రోజులు నెలలు, సంవత్సరాలు....ఎలా గడపగలిగింది? ఎట్లా యీడుస్తూంది కాలాన్ని? ఇది నిజంగా చిత్రమే.
తనకు అయిదేళ్ళ వయస్సయినా రాకముందే తల్లి గతించింది. ఇప్పుడు తల్లి రూపం తనకు అంతరంగంలో చిత్రించుకుందామన్నా గుర్తులేదు. తనని పెంచటం ఓ సమస్య అయిన నాన్నకు. పిన్నికి సంప్రాస్తమయిన ఒంటరితనం వరంగా పరిణమించింది. 'నా' అనేవారు లేక అల్లాడుతున్న పిన్నికి యీ ఏర్పాటు సదుపాయంగానే తోచింది. అయిదేళ్ళ తనకు సంరక్షకురాలిగా పనికిమాలిన యౌవనంలో వున్న పిన్ని తమ ఇంట్లో అడుగుపెట్టింది. ఇప్పుడంటే పాడురోగం వచ్చి ఇట్లా అయిపోయాడుగానీ విశాలనేత్రాలతో, స్ఫుటమయిన నాసికతో, వత్తయిన నిగనిగలాడే నల్లని క్రాఫింగ్ తో మంచి అందంగా వుండేవాడు నాన్న. వయస్సులో వున్న స్త్రీని తీసికొచ్చి ఇంట్లో పెట్టుకోవటం ఊళ్ళో పెద్ద గాలిదుమారం రేపింది. ఇది కేవలం ఓ మిషగామిమర్శించి తండ్రి చర్యను గర్హించారు ప్రతివారూ. ఎక్కడ చూసినా గుస గుసలు. పరిక్షంగానే, బహిరంగంగాను విమర్శలు. అప్పట్లో నిప్పులా రాజుకుంది యీ వ్యవహారం ఆ గ్రామంలో.
అయినా తన తండ్రి వీసమెత్తు కూడా చలించలేదు. యీ దుమారాన్ని అణు మాత్రమయినా లెక్కచేయలేదు. అతనిలో రెండు ధర్మాలు నిర్వహిస్తున్న సంతృప్తి కనబడేది. తల్లిని కోల్పోయిన తన కుమార్తెను సంరక్షణ భారం వహించటానికి సరియైన వ్యక్తిని చూశానన్నది ఒకటి. జగత్తులో సర్వాన్నీ కోల్పోయి, దిక్కులేక అల్లాడుతూ మనోవర్తితో కాలం గడుపుతూన్న రాధమ్మకు ఆశ్రయం కలిగించానన్నది రెండవది. రాజుకోవటమైతే చిటపటమంటూ తొందర తొందరిగా రాజుకుంది. అలా రేగిన మంట చల్లారటానికి చాలా రోజులు తీసుకుంది. అయితే తన తండ్రి ఉదాత్తమయిన ప్రవర్తనా, వెదికినా దోషం అంటగట్టటానికి వీలులేని అతని నడవడికా, రాధమ్మతో అతను మెలిగిన విధానమూ అందరికి అచ్చెరువు గొల్పి. అతనిపట్ల సద్పుద్ధితో, సహృదయంతో మెలిగేటట్లుచేసి, ఆవరించిన మాత్సర్యాన్ని అంతరించేటట్లు చేశాయి! తిరిగి ఎప్పటిలా అతడందరికీ సన్నిహితుడై పోయాడు. మాట్లాడటానికి నోచుకోని రాధమ్మ నలుగురి మన్ననాపొంది, గ్రామంలో గౌరవపాత్రురాలు అయింది.
తనకు చిన్నతనమైన బాల్యం నుండి ఆలోచనాజ్ఞానం గల పిల్ల కావటం వల్ల విషయాలన్నీ ఇట్టే గ్రహిస్తూ వచ్చింది. తన తండ్రి పిన్నితో చనువుగా ఉండటం గానీ, పరిహాస ప్రసంగం చేయటంగానీ తను ఎప్పుడూ చూడలేదు వినలేదు.